Saturday, December 26, 2020

కాలాన్ని దాటడం ఎవరికికైనా సాధ్యమా? : వనం జ్వాలా నరసింహారావు

 కాలాన్ని దాటడం ఎవరికికైనా సాధ్యమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం (26-12-2020) శనివారం ప్రసారం

రామలక్ష్మణులు జటాయువుకు కర్మలు చేసి, సీతాదేవి లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని నైరుతిమూలగా పోయారు. అడవిలో సీతను వెతకసాగారు. మధ్యలో అడ్డుతగిలిన అయోముఖి అనే రాక్షసిని చంపారు. అలా సీతను వెతుక్కుంటూ పోతుండగా అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించి, ఒక భయంకరాకారం కనిపించింది.

         పర్వతంలాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల-మెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, యోజనం పొడుగు చేతులు కలవాడిని, నోరు తెరిచి తమ దారికి అడ్డంగా వున్న వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు.

         రాక్షసుడిని చూసి అన్నదమ్ములు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వారిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాళ్ళను తన నోట్లో పడేట్లు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దేహంకల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కాని వదలడని లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు, రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడిచేయి నరికాడు. రాముడికి కుడిపక్కన వున్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమ్యాకాశాలు, దిక్కులు దద్దరిల్లేట్లు నేలకొరిగాడు.

         దుఃఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులూ కోల్పోయి వారెవరనీ, ఈ అడవిలో వాళ్లకేమిపని వుందనీ అని ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు, వాళ్ల చరిత్ర చెప్పాడు. తాము ఇక్ష్వాకు వంశంలో పుట్టామనీ, తన అన్న పేరు శ్రీరాముడనీ, తన పేరురు లక్ష్మణుడనీ, దండకారణ్యంలో వున్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయచేసి అన్న రాముడి భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామనీ అన్నాడు. మొండెం మాత్రమే ఆకారంగా వున్న ఆ రాక్షసుడు ఎవరని కూడా అడిగాడు. ఇది విన్న ఆ రాక్షసుడు, తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు లక్ష్మణుడికి.

         “ఓ రాఘవులారా! నా భాగ్యం పండడం మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. వినయం తప్పిన పనులు చేయడం వల్లే నాకిలాంటి వికార స్వరూపం కలిగింది. నేను మొట్టమొదట సుందరాకారం కలిగి, అందగాడినని పెరుతెచ్చుకున్నాను. ఆ గర్వంతో మునులను అరణ్యవాసులను భయపడేట్లు అనేకరకాల దుఃఖపెట్తూ, స్థూలశిరుడు అనే మునిని నింద్య రూపంలో భయపెట్టాను. ఆ ఋషీశ్వరుడు ‘ఓరీ! పాపాత్ముడా! నింద్యమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక!’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్థించగా ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగనరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి, నీ పూర్వ రూపం పొందుతావు అని శలవిచ్చాడు ఆ మునీశ్వరుడు”.

“కబంధ రూపం రావడానికి మరో కారణం వుంది. ఒక సారి బుద్ధిహీనుడనై ఇంద్రుడిని యుద్ధానికి రమ్మని పిలిచాను. ఇంద్రుడు వజ్రాయుధం వేటుతో నా తల, రొమ్ము, కడుపు, తొడలు కుదించుకు పోయేట్లు అణచి వేశాడు. నేనప్పుడు, నాకీ దురవస్థకన్నా మరణమే మేలని చంపమని ప్రార్థించాను. నేనెలా బతకాలయ్యా? అని అడిగితే, ఆమడ పొడుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాటి సహాయంతో ఏనుగులను, పులులను, సింహాలను, ఇతర మృగసమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్లీ నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు”.

“ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ, ఎవరు కనపడ్డా పట్టుకుని, రాముడు చిక్కకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడివి నువ్వే. మీకు నేను సహాయం చేస్తాను. మీ కార్యం సాధించగల స్నేహితుడిని చూపిస్తాను. నన్ను అగ్నితో దహించు” అని అంటాడు కబంధుడు. తన దేహాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి వుంచిన రహస్యమంతా దాచకుండా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయం లోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసినవాడు ఒకడున్నాడనీ, అతడితో ధర్మబద్ధంగా స్నేహం చేయమనీ, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదనీ, అతడు రాముడికి ఉపకారం చేస్తాడనీ చెప్పాడు కబంధుడు.

          కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. రామలక్ష్మణులు చూస్తుండగానే, మండుతున్న ఆ మంటల్లో నుండి బయటకు వచ్చి, ఆకాశానికి ఎగిరిన కబంధుడు, తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు.

         “రామచంద్రా! లోకంలో సంధి, విగ్రహ, యానా, సన, ద్వైదీభావ, సమాశ్రయంలనే ఆరు ఉపాయాలను పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ ఆరింటిలో సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి, నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం, సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరివల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే, ఎలాంటివారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనని చులకన చేస్తాడు కాని, నిండు మనస్సుతో ఆదరించడు”.

         “కాబట్టి నీ స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. సుగ్రీవుడు అనే వానర రాజు, తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని దుఃఖపడుతూ, పంపానది ఒడ్డున వున్న పవిత్ర ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు. ఋజువర్తనం కలవాడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెదకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామా! నువ్వెందుకు దుఃఖపడతావు? ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది కాని, దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా?.

“సుగ్రీవుడు, అన్న వాలికి భయపడి, తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నిటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమ్మీదగల నదులు, నదాలు, కొండలు, అడవులు, వెతికి నీ భార్య ఎక్కడున్నదీ వార్తా తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి, వాడామెను పాతాళంలో దాచినా, మెరువు కొనలో ఉంచినా, రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు”.

          ఇంతదాకా రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహా నిచ్చాడు. ఈ మార్గానికి కిష్కింధ పడమరగా వుంది. కబంధుడు, ఇంకా ఇలా అన్నాడు. పంపా సరస్సు వైపు పొమ్మంటాడు. పంపా సరస్సు గురించి వర్ణించి చెప్పాడు. అక్కడ సమీపంలోనే వుంటున్న శబరికి దర్సనం ఇవ్వమంటాడు. ఆమె రాముడిని దర్శించి స్వర్గం చేరాలనుకుంటున్నదనీ, రాముడి రాక కొరకు వేచి చూస్తున్నదనీ చెప్పాడు. ఇలా చెప్పి కబంధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు పొమ్మని ఆజ్ఞాపించారు. కబంధుడు సంతోషంగా పోయాడు. రామలక్ష్మణులు త్వరగా పడమటి దిశగా పయనమయ్యారు.

          పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు శబరి వుండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. (పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ వుందట. ఈ గుహవాకిట్లో పట్టపగలు ఎండలు మండిపోతున్నప్పటికీ, దుప్పటి కప్పుకునేంత చల్లటి గాలి వీస్తుంది). శబరి వీరిని చూసి చేతులు మోడ్చి, వారిపాదాలను అంటి నమస్కరించి, పాద్యం ఇచ్చి, తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం కావించింది.

“శ్రీరఘురామచంద్రా! నేను శుశ్రూష చేస్తుండే నా గురువులు, మీరు చిత్రకూటానికి వచ్చారనీ, ఇక్కడికి వస్తారనీ, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్లీ జన్మలేని లోకం లభిస్తుందనీ చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా మీ కోసం మంచివి, ఏరి-కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించాను” అని అన్న శబరి మాటలకు ఆమెను చూసి రామచంద్రమూర్తి మతంగాశ్రమం వింతలు చూపించమని అడగ్గా ఆమె అలానే చేసింది. ఆ తరువాత శబరి, “రామా! వినతగినవన్నీ విన్నావు, చూడతగినవన్నీ చూశావు. ఇక నేను నా గురువులున్న చోటుకు పోయి వాళ్ళను దర్శించాలి. నాకు ఆజ్ఞ ఇవ్వు” అంటుంది. ఆ పుణ్యాత్మురాలు చెప్పిన మాటలన్నీ విన్న రామచంద్రుడు ఆమె గురుభక్తికి, దైవభక్తికి మెచ్చి, ఆమె కోరిక ప్రకారం పరమపదాని పొమ్మన్నాడు.

         శబరి పరమపదానికి పోగా, ఏకాగ్రమనస్కుడై, తన తమ్ముడు లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు మతంగముని గురించి చెప్పాడిలా. “ఆహా! ఏమి, ఈ ఋషుల మహిమ? అవి చూస్తూ వుంటే చాలా ఆశ్చర్యంగా వుంది. లక్ష్మణా! ఇక్కడ జింకలు, పులులు, మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు వున్నప్పుడే కాకుండా వాళ్లు పోయిన తరువాత కూడా వాళ్ల తేజస్సు వ్యాపించి ఉన్నందున హింస అనేది కనబడడం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృ తర్పణం చేశాం. ఇది మనకు మేలు చేస్తుంది. లక్ష్మణా! మన కష్టకాలం పోయింది. ఇక సౌఖ్యమే కలుగుతుంది. ఇక్కడికి సుగ్రీవుడు వుండే పర్వతం దగ్గరే. ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం. అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో వుండే ఋశ్యమూకం వున్నది. మనం సుగ్రీవుడిని చూడడానికి పోదాం పద. సీతను వెతికే పని అతడిదే కదా?” అన్న మాటలకు లక్ష్మణుడు తానూ ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్లు పంపాతీరం చేరారు.

         పంపా సరోవరం చూసిన రామలక్ష్మణులు దాని సౌందర్యానికి, వ్రతనిష్ఠ కల మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానందంగా దాన్నే చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో వున్న మతంగు కొలనులో స్నానం చేసి ఆ రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన తీగలతో ప్రకాశించే బొట్టుగు చెట్లు, మాదిఫల వృక్షాలు, గన్నేరులు, మొల్లతీగెలు, మర్రులు, ఏడాకుల అరటులు, మొగలి చెట్లు, ఎర్ర గన్నేరులు, మామిడితోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన  పడుచులాగా వుంది. చిలుకలు, గుడ్డికొంగలు, నెమిళ్ళు లాంటి మనోహరమైన పక్షుల ధ్వనులు వింటూ సంతోషంగా పంప చేరారు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో, “ఈ పంప ఒడ్డున వున్న ఋశ్యమూకపర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడున్నది? శోకతప్తుడినై రాజ్యాన్ని కోల్పోయి, భార్యను పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి మన పనికోసం నువ్వు సుగ్రీవుడిని చూడడానికి వెళ్లు. నేను పోవడం మర్యాద కాదు”. ఇలా లక్ష్మణుడితో చెప్తూ, రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో పంపాతీరాన్ని చూడడానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను చూసిన వారికి ఇన్నాళ్లు కలగని సంతోషం కలిగింది.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment