Friday, December 11, 2020

మారీచ మాయా జింకను చూసి భ్రమించిన సీతాదేవి : వనం జ్వాలా నరసింహారావు

 మారీచ మాయా జింకను చూసి భ్రమించిన సీతాదేవి

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (12-12-2020) ప్రసారం

రావణాసురుడి అజ్ఞానుసారం, ఆయనకు భయపడి, మారీచుడు రావణుడితో కలిసి పంచవటి సమీపానికి వచ్చాడు. వచ్చి,  నిమిషంలో శ్రేష్టమైన జింకలాగా ఆ అరణ్యంలో తిరుగుతూ, రాముడి తపోవనం సమీపించాడు. జానకీదేవిని మోసగించడానికి ఆ రాక్షసుడు జింక వేషంలో సమయం కోసం వేచి చూడసాగాడు. పూలు కోయడానికి బయటకు వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. ఆ వింత జింకను ప్రేమతో చూసింది సీత. ఆ వింత జింకను చూసి, భర్త రామచంద్రుడిని, మరది లక్ష్మణుడిని రమ్మని పిలిచింది. దాన్ని చూసిన లక్ష్మణుడికి సందేహం కలిగింది. మారీచుడనే రాక్షసుడికి ఇలాంటి ఆకారంలో తిరుగుతూ మునులను, వేటకై వచ్చే రాజులను వధించే అలవాటుందని, యోగశక్తిగల ఆ రాక్షసుడే తన అద్భుత యోగ శక్తితో జింకలాగా తిరుగుతున్నాడని, ఇది నిజమైన జింక కాదని అంటాడు.

         ఆయన మాటలకు అడ్డుతగిలి, భర్త దగ్గరికి పోయి, సీత ఇలా అంటుంది. “ప్రాణేశ్వరా! ఈ జింక మీదా ఆశ కలిగింది. ఆడుకోవడానికి ఇది కావాలి. ఈ మృగం ప్రాణంతో దొరికితే అంతకంటే కావాల్సింది ఏమిటి? ఒకవేళ ఇది ప్రాణాలతో దొరక్కపోయినా, దీని చర్మమైనా నాకు ఆనందం కలిగిస్తుంది. లేపచ్చికతో చేయబడిన దర్భాసనం మీద దీన్ని పరచుకుని నీతో కూర్చోవాలని అనుకుంటున్నాను.” అంటుంది. సీతాదేవి మాటలకు శ్రీరామచంద్రుడు, ఆ జింకను చూసి సంతోషించాడు.

         సీతాదేవి కోరిన విధంగా జింకను పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్నాడిలా: “లక్ష్మణా! ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? మనం కూడా ఇలాంటి సౌందర్యంకల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతొ కలిసి కూర్చోవాలని ఆశపడుతున్నది. ఇది రాక్షస మాయామృగం. జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి. వీడు వాతాపి అంతటి వాడే! అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో, వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి, వీడూ చావాల్సిన వాడే. నేను వేటకోసం పోతాను. నువ్వు ధృడ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షసమాయ అయితే చంపుతాను. లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీట్లో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణా! సీతాదేవిని చూస్తుండు జాగ్రత్తగా”.

         శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీటి వుంది. ఆయన భ్రమ పడడమే కాకుండా, లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే, ఉన్నచోటే వుండి బాణ ప్రయోగం చేయవచ్చుకదా? జింక వెంట పోవాల్సిన పని లేదు. అది నిజమైన జింకే అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్త్రీ అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా? బంగారు జింక లోకంలో వుండదని తెలియదా? పరమ భక్తికల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి వుండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీతి బలపడుతున్నది.

         పరమార్థం విచారిస్తే, మనుష్యులకు కోరికలు కోరే స్వాతంత్ర్యం వుంది. దాన్ని నెరవేర్చే భారం భగవంతుడి మీద వుంది. ఎవరే కోరికలు గట్టిగా కోరినా భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడు. కాని దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరేవారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరేవారికి కలిగేది చెడు ఫలమే! ప్రకృతి విషయమైన కోరికలు కోరేవారందరికీ సీతాదేవికి పట్టిన గతే పట్తుంది. మారీచుడి మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే! సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశపడినట్లు మనం కూడా చిత్ర-విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమ పడుతున్నాం. ఇవి సత్యం కావు. క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాలవల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నేరవేర్చినట్లే మనకోరికనూ నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం.

         విల్లు, బాకు, అంబుల పొదులు ధరించి శ్రీరాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెంటనే బయల్దేరాడు. రాముడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడని నిర్ణయించుకున్న మాయామృగం పారిపోతే రావణుడు చంపుతాడని భయపడింది. రాముడికి కనిపించీ-కనిపించకుండా తిరగసాగింది. కాసేపు దగ్గరికి, కాసేపు దూరంగా, కాసేపు పచ్చిక మేస్తూ, కాసేపు వినోదంగా తిరుగుతూ, రామచంద్రమూర్తికి కనిపించేది. శ్రీరాముడు విల్లు ఎక్కు పెట్టగానే, దూరంగా పరుగేత్తేది. భయపడుతున్నట్లు నటించి ఆకాశంలో గంతులు పెడ్తూ ఆడేది. రామచంద్రుడు కోపగించుకుని దీన్ని చంపాలని నిర్ణయించుకుని, సూర్యకాంతిగల బ్రహ్మాస్త్రాన్ని సంధించి, ఆ మృగ రూపంలో వున్న రాక్షసుడికి గురి చూసి కొట్టాడు.

         శ్రీరాముడు వేసిన బాణం జింక రూపంలో వున్న రాక్షసుడి శరీరంలో దూరడంతో ఆ రాక్షసుడు భయంకరమైన ధ్వనితో ఎగిరి పడ్డాడు. తన మాయా శరీరం వదలిన మారీచుడు రాముడి గొంతును అనుకరిస్తూ “హా! సీతా! హా! లక్ష్మణా!” అని అరిచి జింక రూపం వదలి నిజరూపం దాల్చి  భూమ్మీద పడి ప్రాణాలను విడిచాడు. అలా పడిపోయిన రాక్షసుడిని చూసిన రాముడికి లక్ష్మణుడి మాటలు స్మరణకొచ్చాయి. సీత మీద మనస్సు పోయింది. లక్ష్మణుడు చెప్పినట్లు ఇది మారీచుడి మాయేనని నిశ్చయించాడు. తన బాణంతో చచ్చినవాడు మారీచుడే అని అనుకున్నాడు. తన గొంతుతో “హా! సీతా! హా! లక్ష్మణా!” అని అరచినది విని సీతాలక్ష్మణులు ఏమని అనుకున్నారో అని ఆలోచిస్తూ, భయంతో, శీఘ్రంగా ఆశ్రమానికి బయల్దేరాడు.

ఆశ్రమంలో వున్న సీత తన భర్త గొంతుతో “హా! సీతా! హా! లక్ష్మణా!” అని దుఃఖంతో వినిపించగా లక్ష్మణుడిని చూసి, “అయ్యో లక్ష్మణా! ఇదేం విపరీతం? రామచంద్రుడిని చూడడానికి త్వరగా పరుగెత్తు. రామచంద్రమూర్తి ఒంటరిగా వున్నాడు. ఎక్కడ ఎవరి చేతులకు చిక్కాడో, లేక, మరేమైనా ఆపద కలిగిందో? మీ అన్న అరుస్తున్నాడు. త్వరగా ఆయనను కాపాడడానికి పోవయ్యా” అని అనింది. లక్ష్మణుడు సీతను కాపాడమని తనకు అన్న చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని సీత చెప్పినట్లు పోకుండా అక్కడే నిలిచి వున్నాడు. అది చూసి సీత లక్ష్మణుడితో కోపంగా మాట్లాడింది. పద్నాలుగువేల మంది యోధులను ఒక్కడే తన కళ్ళ ఎదుటే చంపగా చూసినప్పటికీ, ఆయనకు ఏదో ఆపద కలిగిందని అనుకోవడం కర్మబలిష్టమే! లక్ష్మణుడితో కోపంగా, నిష్టూరంగా మాట్లాడింది. దుర్భాషలాడింది. వంచకుడా అన్నది. దుష్టకామం కలవాడన్నది. స్నేహితుడి వేషం వేసుకుని తిరుగుతున్న గొప్ప శత్రువు అన్నది. తన మీద వున్న మోహంతో తన్ను చేపట్టాలని అక్కడికి పోవడానికి ఒక్క అడుగైనా వేయడం లేదు అని నిందించింది. 

         సీతాదేవి తనను నిష్టూరాలు ఆడుతూ అంటున్న మాటలకు లక్ష్మణుడు ఎన్నో విధాలుగా జవాబు చెప్పాడు. భయపడవద్దన్నాడు. ఆమె భర్తను యుద్ధంలో దేవతలు, మనుష్యులు, యక్షులు, సర్పాల రాక్షసులు, పిశాచాల నాయకులు, లేదా ఇంకెవరైనా నిలిచి పోరాడగలరా? అన్నాడు. ఆమె నోట వచ్చిన మాటలు అనతగ్గవి కాదన్నాడు. ఒంటరిగా సీతను విడిచి పోనన్నాడు. మనం విన్నది రామచంద్రమూర్తి గొంతు కాదు. ఏ మాయలమారో అలా గొంతు మార్చి అరిచాడు. ఆ మారీచ రాక్షసుడే అలా స్వరం ఇంద్రజాలంలా అనుకరించాడు అని కూడా చెప్పాడు. నిజం చెప్తున్న ఆయన్ను సీత మళ్లీ-మళ్లీ చాలా కఠినంగా నిందించింది.

         సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమెలాంటి ఉత్తమురాలు ఏ లోకంలోనూ లేదు. అలాంటిది లక్ష్మణుడి తత్వం తెల్సి కూడా ఇలా మాట్లాడవచ్చా? స్త్రీ ఎప్పుడైనా స్త్రీనే. స్త్రీ స్వభావం బొత్తిగా లేని స్త్రీ వుండదు. వారికి కోపం వస్తే, అనరాని మాటలు, చేయరాని పనులు వుండవు. ఇక లక్ష్మణుడు నిష్కారణంగా భరతుడిని అనరాని మాటలన్నందుకు ఇది పర్యవసానం. నిష్కారణంగా సీతతో పడరాని మాటలు పడ్డాడు.

         ఇక అవతారం విషయం ఆలోచిస్తే వాస్తవం తెలుసుకోవచ్చు. సీత పుట్టింది లంకను చెరచడానికే. సమూలంగా రావణుడిని చంపడానికే ఆమె పుట్టింది. వేదవతి లాగే అన్నది కదా? ఆ కార్యాన్ని సీత చేయాల్సి వుంది. దానికొరకై లంకకు వెళ్ళాలి. రామలక్ష్మణులు తన దగ్గర వుంటే, రావణుడు రాలేడు. కాబట్టి మాయా మృగం నెపంతో రాముడిని మంచిమాటలు చెప్పి దూరంగా పంపింది. లక్ష్మణుడు అలా పోయేవాడు కాదు. రామాజ్ఞను కూడా ఉల్లంఘించి పోయేంత పని చేస్తేనే కాని ఆయన పోడు. ఇట్లా నిందలు వేస్తేనే ఆయన పోతాడు. ఇలా కార్యసాధన మార్గం ఆలోచించి, పంపడానికి సిద్ధమైంది కాని జ్ఞాన హీనగా, దుష్టురాలిగా మాట్లాడ లేదు. 

వినడానికి కూడా యోగ్యంకాని మాటలను జానకి లాంటిది పలకగా, లక్ష్మణుడు రెండు చేతులు జోడించి సీతవైపు తిరిగి, ఆమెకు బదులు చెప్పడానికి తన మనస్సు అంగీకరించడం లేదంటాడు. “న్యాయం చెప్పేవాడినైన నేను న్యాయం పలుకుతుంటే, నీ దుష్టవాక్యాలను ఈ వనదేవతలందరూ వివరంగా సాక్షులై విందురుగాక. చీ! సహజంగా స్త్రీత్వమే పాపాత్మకం. కోపస్వభావంగలదానా! పెద్దవాడు తండ్రితో సమానమైన అన్న ఆజ్ఞ పాలిస్తున్న నన్ను ఈ విధంగా సందేహించినందున నువ్వు ఇప్పుడే పాడైపో. అబలా! ఇప్పుడే పోతాను రాముడున్న దగ్గరికి. ఇప్పుడు నీకు స్వస్తి కలుగుకాక. వనదేవతలు రక్షించెదరుగాక. నాకు చెడు సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. రామచంద్రుడితో తిరిగి వచ్చిన తరువాత నిన్ను చూడగలనో? లేదో?

ఇలా ఎప్పుడైతే లక్ష్మణుడు అన్నాడో, జానకి కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ, కర్ణశూలాల లాంటి మాటలన్నది. “నేను విషం తిని చస్తాను. గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకుంటాను. మంటల్లో పడి చస్తాను. ఇతరులను కాలి వేలితోనైనా తాకుతానా?” అని అంటూ గట్టిగా ఏడుస్తూ, రెండు చేతులతో దబ-దబా అని కడుపుమీద కొట్టుకుంది. లక్ష్మణుడు ఓదార్చినా వినలేదు, ఆగలేదు. ఆ తరువాత లక్ష్మణుడు ఇంకా ఇక్కడే వుంటే ఏమవుతుందోనని భయపడి, సీతకు నమస్కారం చేసి, రుజుత్వమే మేలని భావించి, రాముడి దగ్గరకు పోయాడు.

         లక్ష్మణుడు అలా వెళ్లిపోగానే అవకాశం దొరికిందని రావణుడు సీతను చేరదల్చుకున్నాడు. సన్న్యాసి వేషం వేసుకుని, సన్న కాషాయ వస్త్రం కట్టుకుని, ఎడమ భుజం మీద త్రిదండం పట్టుకుని, చేత కమండలం వుంచుకుని, గొడుగు పట్టుకుని, శిఖ కలిగి, పావుకోళ్లు తొడుక్కుని, అన్నదమ్ములిద్దరూ లేకపోవడంతో సీతదగ్గరకు పోయాడు రావణుడు. వాడికి భయపడి చెట్ల ఆకులూ కదలలేదు. గాలి ఆగిపోయింది. వేగంగా పారే గోదావరినది వాడి భయంతో మెల్లమెల్లగా నడిచింది. దుష్టుడైన రావణుడు మగడు సమీపంలో లేడని వ్యధపడుతున్న సీతను సమీపించబోయాడు. ఆవేశించిన కామంతో, మోసబుద్ధితో, వేదఘోష చేస్తూ, సీతదగ్గరకు పోయి సవినయంగా ఆమెతో ఇలా అన్నాడు.

         సుందరీ! నీ వయస్సు, నీ సౌకుమార్యం, నీ చక్కదనం, ఆలోచించగా నువ్వు వంటరిదానివై ఈ అడవిలో వుండడం నాకు వెర్రి కలిగిస్తున్నది. సింహాలు, కోతులు, చిరుతపులులు, ఎలుగులు, పెద్దగద్దలు, విస్తారంగా ఇక్కడ తిరుగుతున్నాయే? నువ్వెలా భయం లేకుండా ఇక్కడ వున్నావు? నీ భర్త ఎవడు? ఇక్కడ ఎందుకు వున్నావు? ఇది రాక్షసుల గుంపులు తిరిగే స్థలం” అని రావణుడు అడిగాడు. బ్రాహ్మణ సన్న్యాసి వేషం వేసుకున్న వాడిని సీతాదేవి శీఘ్రంగా, యతులను పూజించే విధంగా పూజచేసి సత్కరించింది.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment