Saturday, December 19, 2020

కోపం లేని రాముడు సహజ గుణం వదలవచ్చా? : వనం జ్వాలా నరసింహారావు

 కోపం లేని రాముడు సహజ గుణం వదలవచ్చా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం శనివారం (19-12-2020) మధ్యాహ్నం ప్రసారం 

మాయా జింకను రాముడు సంహరించిన తరువాత పర్ణశాలలో లక్ష్మణుడు కూడా లేని సమయం చూసి రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఇక్కడ ఇలా వుంటే,  దండకలో రాముడి సంగతి వేరే విధంగా వుంది. ఆశ్రమానికి రావాలని త్వర-త్వరగా వస్తుంటే, వెనుక పక్క అశుభం సూచిస్తూ నక్క కూత వినిపించింది. కీడు కలుగుతుందని భావించిన రాముడు, రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు. నడుచుకుంటూ వస్తున్న రాముడికి మృగాలు, పక్షులు, కుడి నుండి ఎడమవైపుగా భయంకర ధ్వని చేసుకుంటూ పోవడం జరిగింది. ఇది చూసి, లక్ష్మణుడిని, సీతను గురించి ఆలోచించుకుంటూ ఆలశ్యం చేయకుండా పోసాగాడు రాముడు.

         రాముడు ఆశ్రమాన్ని సమీపించాడు. అక్కడే ముఖం వేలాడవేసుకుని, ఒంటరిగా వస్తున్న తమ్ముడిని చూశాడు. వెంటనే ఏదో కీడు జరిగిందని శంకించాడు. తమ్ముడిని సమీపించి, మొదలు పరుశంగాను, తరువాత మృదువుగాను, ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఎడమకన్ను అదురుతున్నది.  సంతోషం మనస్సులో ఏమాత్రం లేదు. ఆశ్రమంలో సీత లేదు. పగ తీర్చుకోవడానికి రాక్షసులు ఆమెను పట్టుకుని పోయారో లేక వారి బాధ పడలేక ఆమే చనిపోయిందో లేక మనల్ని వెతుక్కుంటూ వచ్చి దారి తెలియక వేరే తోవలో ఎక్కడికైనా పోయిందో?

“లక్ష్మణా! చెప్పు, సీత ప్రాణంతో వుందా? రాక్షసులు మింగారా? ఎత్తుకు పోయారా? మారీచుడి అరుపుకు సీత మోసపోయినా, నువ్వెలా మోసపోయావు? సీత పొమ్మన్నా రక్షించాల్సిన వాడివి అబలను ఒంటరిగా వదలి ఎలా వెళ్లావు? వెళ్లి మనకు కీడు చేసే రాక్షసులకు అవకాశం ఇచ్చావు. రాక్షసులు ఆమెను చంపారో? ఏమో? ఇలా జరగవచ్చని కొంచెమైనా ఆలోచించావా? అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. ఈ గతి నాకు కలగాలని మీకీ బుద్ధి పుట్టించాడు” అని సీతకొరకై రాముడు వెక్కి-వెక్కి ఏడ్చాడు.

         “నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను కాపాడలేక నీకాపని అప్పచెప్పానా? ఆ స్త్రీరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునిగిపోయినట్లు పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ను చూసింది మొదలు నాకేదో భయంగా వుంది లక్ష్మణా. వచ్చినవాడివి సీతను కూడా తీసుకుని రావచ్చుకదా? ఆమె లేకుండా నువ్వు ఒక్కడివే రావడం దూరం నుండే చూసిన నాకు గుండె పగిలింది. ఎడమ భుజం, ఎడమ కన్ను అదిరాయి. కొంప మునిగింది కదా అనుకున్నాను”.

         రామచంద్రమూర్తి తనమీద నింద వేయడంతో, దోషం ఆరోపించడంతో, ఆయన పడుతున్న దుఃఖబాధను గమనించి, ఇంతకు పూర్వమే సీత మాట్లాడిన మాటలకే నొచ్చుకున్న లక్ష్మణుడు మరింత నొచ్చుకుని ఇలా జవాబిచ్చాడు అన్నకు. “అన్నా! ఆ ధ్వని నీ గొంతుక ధ్వని అని మోసపోయి స్వతంత్రించి నాకై నేను రాలేదు. ‘సీతా, లక్ష్మణా, కావరే’ అనే ధ్వని అరణ్యంలో రాగా సీత విని భయపడి నన్ను పొమ్మని, బలవంతపెట్టింది. రాముడికి భయం లేదమ్మా అని ఆమెకు నమ్మకం కలిగేలా ఎంతో చెప్పాను. “రాముడికి తమ్ముడివి కాదు. ఎప్పుడు వీలవుతుందా, ఎప్పుడు సీతను హరిస్తానా? అన్న ఆశతో నా కోసమే నా మగడి వెంట వచ్చావు’ అన్నది. ఈ మాటలు వినగానే నా పెదవులు అదిరాయి. కళ్ళు ఎర్రగా అయ్యాయి. కోపం పట్టలేక, అక్కడ వుండలేక ఆశ్రమం వదిలి వచ్చాను. అన్నా! వున్న విషయం చెప్పాను. “

         లక్ష్మణుడు ఇలా చెప్పడంతో, రాముడు, “నువ్వు సీతను విడిచి రావడం సరైన పనికాదు. ఇప్పుడేమనుకున్నా ఏం ప్రయోజనం? స్త్రీలకు కోపం వస్తే ఏదో అంటారు. అందునా, భర్తకు కీడు కలిగిందని భయంతో, శోకంతో, పీడించబడ్డ వారి విషయం చెప్పాల్నా? ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా సీత కోప్పడ్డదని నువ్వు కూడా కోపంతో నా శౌర్యం, నా శక్తి తెలిసికూడా ఆడదాన్ని ఒంటరిగా అడవుల్లో వదిలి వచ్చావే? ఏమనాలి నిన్ను? నా ఆజ్ఞ జవదాటావుకదా?” అన్నాడు.

         రాముడు తాను చెప్పదలచుకున్న మాటలను లక్ష్మణుడికి చెప్పి, త్వర-త్వరగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తుంటే, ఎడమకన్ను కిందిభాగంలో అదిరింది. కాళ్లు కూలబడ్డాయి. దేహం వణకడం మొదలైంది. తన ఆశ్రమం ప్రవేశించి వెదికిచూసిన రాముడు సీత లేదని నిశ్చయించుకుని, మనసు కలత చెందగా ఆమెను తలచుకుని ఏడ్చాడు.

         సీత ఏమైందోనని రకరకాల ఆలోచించడం మొదలెట్టాడు. “ఎక్కడి పోయి వుంటుంది? నేనేం చేయాలి? ఎక్కడ వెతకాలి? ఎలా వెతకాలి? ఈ పాడు అడవిలో ఎవరిని అడగాలి?” అనుకుంటూ, సీతను వెతికి-వెతికి కళ్ళు వుబ్బేట్లు రామచంద్రమూర్తి ఏడ్చాడు. దుఃఖం ఎక్కువవతుంటే ఎర్రగా అవుతున్న కళ్ళతో, వికారమైన చూపులతో, పిచ్చి పట్టిన వాడిలాగా, మూర్ఖుడిలాగా ఏడ్చాడు. తనకెవరు దిక్కని అనుకున్నాడు. సీతాదేవి దాక్కున్నదేమో అని చెట్టు-చెట్టు దగ్గరకూ పరుగెత్తాడు రాముడు. గుట్ట-గుట్టకూ పరుగెత్తాడు. బాగా ఏడ్చాడు. ఎక్కడ కూడా సీత లేనందున మనసులో తల్లడిల్లుతు మూర్చపడి, లేస్తూ, సొక్కుతూ, ఆరాటపడుతూ, ఆ అడవిలో సీతను వెతికినా ఎక్కడా కనపడలేదామె.

కలతచెందిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమాన పడతాడు. ఒక వనం తరువాత మరో వనంలొ వెతుకుతూ, భ్రమతో, సీతా-సీతా అని పిలుస్తూ వెర్రివాడిలాగా శోకించాడు.  సీతాదేవిని వెతుక్కుంటూ సహించలేని బాధతో వున్న అన్నకు లక్ష్మణుడు హితవాక్యాలను చెప్పాడు. బాధ పడవద్దన్నాడు. కొండలు, గుట్టలు, కోనలు, నదులు, కాన్లు, కొలకులు వెతికి-వెతికి సీతాదేవి జాడ లేకపోయేసరికి దుఃఖం ఎక్కువైంది అన్నదమ్ములకు. వాస్తవానికి సీతాదేవి తన ఎదురుగా లేకపోయినా, మన్మథతాపం వల్ల కళ్లకు కట్టినట్లు దగ్గరే వున్నట్లు భావించిన శ్రీరాముడు, ఆ సీతను గురించి గద్గద స్వరంతో, మాట కూడా సరిగ్గా రాకుండా, తన బాధ ఇలాంటిదని చెప్పనలవి కాకుండా, విచారంతో చాలా-చాలా అన్నాడు, తనలో అనుకున్నాడు. తమ్ముడు లక్ష్మణుడిని అయోధ్యకు పొమ్మన్నాడు.

         ఈ విధంగా రామచంద్రమూర్తి విలపిస్తుంటే లక్ష్మణుడు రాముడిని ఉరట పరచడానికి కాలానుగుణమైన కొన్ని మాటలు చెప్పాడు. “అన్నా! ఏడవవద్దు. సంతాపంతో శుష్కించి విచారించవద్దు. ధైర్యంగా వుండు. శోకంతో కృశించవద్దు. స్త్రీరత్నమైన సీతాదేవిని వెతుకుదాం.”.

స్త్రీపురుషుల సంయోగం వల్ల కలిగిన దేహం భగవంతుడికి లేదు. అయినా విష్ణుమూర్తి ఇతర అవతారాలలాగా కాకుండా రామావతారం దోషరహితమై, చైతన్యం కలదై, నిత్యసుఖ స్వరూపమైన తన శరీరాన్ని ప్రకాశించేట్లు చేసింది. రామచంద్రమూర్తిలో రావణుడికి భగవంతుడనే బుద్ధి లేకుండా చేసి వాడికి మోక్షం లేకుండా చేయడమే రామచంద్రుడి శోకానికి ఫలం అని చెప్పడం జరిగింది. రావణుడి చేత సీతను అపహరించేట్లు చేయడం, వాడి పుణ్యాన్ని నాశనం చేసి, వాడిని తన చేతిలో చంపబడేట్లు చేయడమే. గొప్ప తపస్సు చేసి సంపాదించిన బలం కల రావణుడిని అంతకంటే అధిక తపోబలం లేకుండా చంపడం సాధ్యపడదు. దేవతలు అంతకంటే ఎక్కువ తపస్సు చేయలేరు. కాబట్టి, వాడికి అనుచితమైన అనురాగం సీతమీద కలిగించి, దానివల్ల వాడిని మోహితుడిని చేసి, రావణుడి తపశ్శక్తి నాశనం చేసి, దేవతలా కార్యం సాధించాలని లక్ష్మీదేవితో కలిసి ఆలోచించి సీతతో సహా అవతరించాడు విష్ణువు.

రామచంద్రమూర్తి మాయామానుషవేశాధారి అని అంగీకరించాలి. కర్మబద్ధులై జన్మించిన ప్రాకృత జనులు ఎలా ప్రవర్తించారో ఆయనా అలానే చేశాడు. భార్య మీద ప్రేమగల మనుష్యులు ఆమెను పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తారో రాముడు కూడా అలానే చేశాడు. కన్నీరు కార్చడం. ఏడవడం, సత్యమే కాని అది తామస శోకం వలన కలిగింది కాదు. జయ-విజయులకు మూడో జన్మలోకాని ముక్తిలేదనే విషయం భగవంతుడికి తెలుసు. రావణ-కుంభకర్ణులది రెండవ జన్మే కాబట్టి ముక్తిలేదు. భగవంతుడు రావణుడికి మోక్షం లేకుండా చేయడానికి వాడికి దుర్బుద్ధి పుట్టించి వాడితో ఒక అకార్యం చేయించి అది నెపంగా వాడిని వధించాడు. లోక శిక్షకోసం వచ్చినవాడు కదా భగవంతుడు.

అడవి మృగాలను చూసి రాముడు, “వీటికి సీత పోయిన జాడ తెలుసేమో?” అని అంటూ కన్నీరు కార్చుకుంటూ వాటిని అడుగుతాడిలా. “మృగాలూ...సీత జాడ మీకు తెలియునా?” అని. అవి చివాలున లేచి, దక్షిణ దిక్కుగా పయనమై తలలు పైకి ఎత్తుకుని రామలక్ష్మణుల ముఖాలు చూసుకుంటూ పరుగెత్తాయి. అప్పుడు లక్ష్మణుడు వాటి అభిప్రాయం అర్థం చేసుకుని అన్నతో దక్షిణ దిక్కుగా (ఆకాశ మార్గాన రావణుడు పోయిన మార్గం)సీతను వెతకడానికి పోదాం అన్నాడు. అలాగే పోసాగారు ఇరువురూ. రాముడు భయపడుతూ అటూ-ఇటూ తిరుగుతూ సీతను వెతుకుతూ వుండగా, ఆమె పాదాల చిన్న ముద్రలు, అ అపాదాల వెంటే పోయిన పెద్ద-పెద్ద రాక్షస పాదాల ముద్రలు, విరిగిపడిన ధనుస్సు, రథం, అమ్ములపొది, అక్కడక్కడా పడి వుండడం గమనించాడు. అవి చూసి తొట్రుపడుతూ రాముడు లక్ష్మణుడితో ఇవి రాక్షసులవేమో అన్నాడు.  

          రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: “ఇక్కడ విషయం ఆలోచించి చూస్తుంటే ఎవడో రాక్షసుడు అడవిలో నా భార్యను అపహరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే, బలిష్టుడైన రాక్షసుడే విరోధ బుద్ధితో నాకు అపకారం చేయాలనుకుని సీతను అపహరించాడని అర్థమవుతున్నది. కాబట్టి మనకు రాక్షసులతో ప్రాణాంతకమైన విరోధం కలిగింది అనడం నిశ్చయం. రాక్షసులు సీతను అపహరించి ఎక్కడైనా దాచిపెట్టయినా వుండాలి, లేదా, ఆమె చచ్చిపోయైనా వుండాలి, లేదా, రాక్షసులు ఆమెను తినైనా వుండాలి. వీటిల్లో ఏదో ఒకటి నిజం. రాక్షసులీవిధంగా సీతను బక్షిస్తుంటే, ధర్మఫలదాతలైన దేవతలైనా అక్కరకు వచ్చినప్పుడు ఆడుకుందాం అనుకోలేదు కదా? కాబట్టి వీళ్లూ నాకపకారం చేసినవారే! రాక్షసులు, భూత సమూహాలు, ఇక నా పౌరుష గుణాన్ని చవిచూసి ఎలాంటి పాట్లు పడనున్నారో చూస్తుండు”. రాక్షసులలో, పిశాచాల్లో, యక్షుల్లో, గంధర్వుల్లో, భూజనుల్లో ఒక్కడైనా సుఖపడుతాడేమో చూడు....ఈ క్షణంలోనే నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తా చూడు. మూడులోకాలు బాధపడేట్లు చేస్తాను. నాసీతకు ఏబాధ లేకుండా దేవతలు నాకు సమర్పించారా, సరి. లేదా, ప్రసిద్ధమై వ్యర్థం కాని నా పరాక్రమాన్ని ఏడుస్తూ చూస్తారు. నాకు ప్రియమైన సీతను మంచితనంగా తెచ్చి దేవతలు-ఇతరులు ఇవ్వకపోతే, లక్ష్మణా! ముల్లోకాలు ఏవిధంగా రూపంలేకుండా నాశనం అవుతాయో చూస్తుండు”.

         అని చెక్కిళ్లు అడురుతుంటే, భయంకరమైన కోపంతో, ఎర్రటి కళ్ళతో రాముడు తన పెద్ద విల్లుని చీతిలోకి తీసుకుని, చక్కటి బాణాన్ని అల్లెతాటిలో సంధించి, ప్రళయకాలాగ్ని లాగా మండిపడసాగాడు రాముడు. ఎప్పుడూ కోపం తెచ్చుకొని రాముడిని చూసి లక్ష్మణుడు పెదవులు ఎండిపోతుంటే, ముఖం వెల-వెలపోతుంటే, ఆయనతో ఇలా అన్నాడు.

“అన్నా! నువ్వు సర్వదా జగాలకు మేలుచేయడానికి ఇష్టపడే వాడివే. కోపం లేనివాడివే. మృదుస్వభావుడివే. ఇలాంటి నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకుని నీ సహజగుణం వదలవచ్చా? ఇది నీకు ధర్మమా?  ఎవడో ఒక్కడు చేసిన నేరాన్ని కనిపెట్టే శక్తిలేక లోకాన్నంతా నాశనం చేయడం న్యాయమా? విరిగిన ఈ రథం ఎవరిదో, ఎందుకు ఎవరివల్ల విరిగిందో అనే విషయం మనం విచారించి తెలుసుకోవాలి. విరిగిన గుర్రపు గిట్టలను, దొరలిన చక్రాల కమ్మలను, నేలబడ్డ నెత్తురు బొట్లను, పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒకడివే అనిపిస్తున్నది”.

“నువ్వు ఆలోచించకుండా ఎవడో ఒకడి కోసమని లోకమంతా నాశనం చేయడం మంచిదా? ఎవడో ఒకడు అపరాధం చేస్తే దాన్ని లోకమంతా ఒప్పుకున్నాడని భావించి, ఆ లోకమంతా వధ్యమని నువ్వు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే, తమ రక్షణ కోరే సర్వభూతాలను రక్షించగలవాడివి నువ్వు ఒక్కడివే కాని వేరొకడు లేడు. నేను నీకు తోడురాగా తపస్వుల సహాయంతో సీతను అన్నిచోట్లా వెతుకుదాం. మనం చేయాల్సినదంతా చేసిన తరువాత. అప్పటికీ దేవతలు మంచితనంగా సీతను సమర్పించకపోతే, అప్పుడు ఏది ఉచితమో ఆ పని చేద్దాం. నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి” అని అంటాడు లక్ష్మణుడు రాముడితో. అన్నను శాంతపరిచాడు అప్పటికే.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment