Wednesday, February 1, 2012

“సహ చట్టం” కమీషనర్ల ఎంపికలో "సంభావనా విధానం": వనం జ్వాలా నరసింహారావు


 వనం జ్వాలా నరసింహారావు

సమాచార హక్కు చట్టాన్ని అక్షరాలా తు. చ. తప్పకుండా అమలు పరచడానికి, హైకోర్టు ఆదేశాలమీద, ఎట్టకేలకు, ఎనిమిది మంది కమీషనర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన త్రి సభ్య సంఘం ఎంపికచేసింది. ఇంకా మరొకరికి అవకాశం వుంది. ఎవరికోసం దీనిని ప్రస్తుతానికి ఖాళీగా వుంచారో, ఎప్పుడు భర్తీ చేస్తారో, అసలు చేయరో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. (లాంఛనంగా గవర్నర్ ఆమోదముద్ర పడింది?). అంటే, ఈ ఎనిమిది మంది కమీషనర్లు, ఐదు సంవత్సరాల పాటు-లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసొచ్చేంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగి బాధ్యతలను నిర్వహించుతారు. కమీషనర్లను ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు భేటీ అయి "ఏకగ్రీవం" గా వారిని ఎంపిక చేశారన్న వార్తలు ఎంతవరకు వాస్తవమోకాని, ఇంతవరకు ప్రతిపక్షనేత నుంచి, ఎలాంటి విమర్శలు అధికారికంగా మాత్రం వెలువడలేదు.

ఈ ఎనిమిదిని మందిని, ఎంతవరకు-ఏ మేరకు, సమాచార హక్కు చట్టంలో సూచించిన విధి-విధానాలకు అనుగుణంగా ఎంపిక చేశారనే విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాలకు అనుగుణంగా, "సంభావనా విధానానికి", "పోషక విధానానికి" (అమెరికా దేశంలోని "స్పాయిల్స్ పద్ధతి") నూటికి నూరుపాళ్లు సరిపడే పద్ధతిలో మాత్రం ఎంపికచేసారనడంలో అతిశయోక్తి లేదు. అలానే వివిధ రంగాలకు చెందిన వారూ వున్నారన్న అర్థం స్ఫురించే రీతిలో జరిగిందీ ఎంపిక! అధికారులుగా పనిచేసిన వారు, అనధికారులుగా ముద్ర పడినవారు, సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లు అంతో-ఇంతో గుర్తింపు తెచ్చుకున్న వారు, వ్యవసాయ రంగంలో పేరు గడించినట్లు చెప్పుకో వీలున్న వారు, పాత్రికేయులు; కాపు, మాల, రెడ్డి, బీసీ, మాదిగ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు; ....ఇలా రకరకాలుగా చెప్పుకోదగ్గ విధంగా సవివరంగా-సముచితంగానే ఎంపిక జరిగింది!. రాజకీయాలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే విధంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంభావనా విధానానికి, పోషక విధానానికి అద్దం పట్టే దిగా వుందీ ఎంపిక. ఇక సమాచార హక్కు చట్టం అమలు ఆ భగవంతుడికే తెలియాలి. వ్యక్తులుగా ఎవరి మీద సంధించిన విమర్శ ఇది కాకపోయినా, ఆయా రంగాలలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులనే ఎంపిక చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందే ప్రభుత్వం అన్న ఆరోపణ మాత్రం చేయకుండా వుండడం కష్టమే. ఏదేమైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకిష్టులైన వారిని ఎంపిక చేసుకోవడానికి, తనను ధిక్కరిస్తుండే ఉప ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షనేతను, ఒప్పించ గలగడం అభినందించాల్సిన విషయమే. 

మెరికా దేశ రాజకీయాలలో అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయిక-చట్టబద్ధ విధానాలలో "స్పాయిల్స్ సిస్టం" అత్యంత ప్రాధాన్యమైంది. దీన్నే అక్కడ "సంభావనా విధానం" గా, "పోషక విధానం" గా (పాట్రనేజ్ సిస్టం) పిలుస్తారు. ఈ విధానం ప్రకారం, అధ్యక్ష-ఇతర ఎన్నికలలో గెలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికలలో వారి విజయానికి కృషిచేసిన తమ పార్టీకి చెందిన ఓటర్లలో కొందరికి, వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నియమిస్తారు. ఒక్కోసారి తమకు వ్యతిరేకంగా పనిచేసినా, తమతో పోటీ చేసి ఓడిపోయినా, తమ-తమ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‍లో పనిచేస్తారన్న నమ్మకంతో, పదవులను కట్టబెడతారు. ఇలా పదవులను తమ వారికి కట్టబెట్టడంలో "మెరిట్" విధానానికి స్వస్తి పలకడం, తమకు అనుకూలురని భావించినవారికి మాత్రమే ఒక "బహుమానం" గా, ఇవ్వడం సాంప్రదాయం. ఇది అక్కడ అందరూ చేస్తుండే పనే. ఏ పార్టీ కూడా దీనిని ఆక్షేపించదు. "స్పాయిల్స్" అంటే "దోపిడీ ధనం" అని అర్థం. "గెలిచిన వాడిదే ఓడిపోయిన శత్రువుకు చెందిన దోపిడీ ధనం"  అని ఈ విధానానికి నిర్వచనం చెప్తూ, 1828 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి జాక్సన్ విజయాన్ని పురస్కరించుకుని నాటి న్యూయార్క్ సెనేటర్ విలియం మెర్సీ వ్యాఖ్యానించారు. వారసత్వ పరంపరగా అధికారంలోకి వచ్చే ఆటవిక జాతుల, రక-రకాల నియంతృత్వ పోకడల ప్రభుత్వాలున్న దేశాలలో కూడా ఈ విధానం అమలులో వుంది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదెందుకు అమల్లో వుందో అర్థంకాదు. అమెరికాలో అమల్లో వున్న ఈ పోషక విధానం, కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా, అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరిగింది సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా ఎంపిక చేసిన వారి విషయంలో.

సామాన్యుల, ఆ మాటకొస్తే, అసామాన్యుల చేతికి సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది. 2005 లో భారత పార్లమెంటు తెచ్చిన ఈ చట్టం అమలులో కొన్ని అవకతవకలున్నా, కొన్ని రాష్ట్రాలలో కొంత నిర్లిప్తత వున్నా, దేశవ్యాప్తంగా దాని పనితీరు గమనిస్తే, అంత నిరాశాజనకంగా అనిపించదనే అనాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడి కీ, "పబ్లిక్ అథారిటీ" గా నిర్వచించిన ప్రతి సంస్థ-వ్యవస్థ నుండి, ఆచరణాత్మకంగా-అనుభవ పూర్వంగా, తమకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్నైనా, ఒక క్రమపద్ధతి ప్రకారం రాబట్టుకొనే హక్కు కలిగించిందీ చట్టం. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు వీలు కలిగించిందీ చట్టం. సమాచార హక్కు చట్టం అమలును సులభతరం చేయడానికి నిర్దేశించిన అనేక విధై విధానాలలో అత్యంత ప్రాముఖ్యమైంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో "సమాచార కమీషన్ల" ఏర్పాటు. వాటితో నిబద్ధతతో పని చేయించడానికి పది మందికి మించకుండా సమాచార కమీషనర్ల-ఒక ప్రధాన సమాచార కమీషనర్ నియామకం. చట్టంలో పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటో, సమాచారం అంటే ఏమిటో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రజాస్వామ్య-లౌకిక-సామ్యవాద-సార్వభౌమాధికార గణతంత్ర దేశంలో ఇవన్నీ పది కాలాల పాటు మనుగడ సాగించడానికి, భారత పౌరుడికి, తాను కోరుకున్న ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తేవాలన్న ఆకాంక్షే సహ చట్టం తేవడానికి కారణం. అవినీతి తొలగాలంటే, పాలితులకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన అందివ్వాలంటే, సహ చట్టం, త్రి కరణ శుద్ధిగా అమలు కావాలి. ఈ నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, సహ చట్టం రాక ముందు-వచ్చిన తరువాత ప్రభుత్వేతర పరంగా గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, ప్రభుత్వ పరంగా, కుంటి నడక నడుస్తుందనడంలో సందేహం లేదు. అల నాడు దివంగత ముఖ్యమంత్రి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా, రాజకీయాలతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధం వున్న మరో ఇద్దరిని కమీషనర్లుగా, ఒక యువ పాత్రికేయుడిని ఇంకో కమీషనర్‌గా నియమించింది. వారి పని తీరు గురించి ఎవరి విశ్లేషణ వారే చేసుకోవచ్చు. మొత్తం మీద అంతో-ఇంతో సహ చట్టం అమలు మాత్రం జరిగిందనాలి.

రాజశేఖర రెడ్డి నియమించిన వారి పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, బాధ్యతాయుతమైన పదవిలో వున్న మరో ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆయనకు తోడుగా మరెవ్వరినీ నియమించక పోవడంతో గత కొద్ది కాలంగా కుంటి నడక నడుస్తున్న కమీషన్‌కు పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్‌ అధికారిని, మరో రిటైర్డ్ ఐపిఎస్‌ అధికారిని, అంతంత మాత్రంగా అతి కొద్ది సర్క్యులేషన్‍తో నడుస్తున్న ఒక దినపత్రిక సంపాదకుడిని, ఒక న్యాయవాదిని, (రాజకీయ) సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూన్న మరొకరిని, మరో (రాజకీయ) న్యాయవాదిని,  (రాజకీయాలలో వున్న) రిటైర్డ్ సివిల్‌ జడ్జిని,  విద్యావేత్తగా పిలిపించుకుంటున్న ఇంకొకరిని, పదవిలో వున్న ఒక ఐపిఎస్‌ అధికారిని  కమిషనర్లుగా నియమించారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా వీరందరూ పలుకుబడి కలిగిన వారే. కాని, సమాచారహక్కు చట్టం ఇలాంటి వారిని ఎంపిక చేయమని చెప్పలేదే! మరెందుకిలా జరిగింది? అందుకే దీనిని "అమెరికా తరహా స్పాయిల్స్ సిస్టం" అనాలి.

ఇంతకూ సహ చట్టం ఈ విషయంలో ఏం చెప్తోంది? మొదటిది: కేంద్రంలోను, రాష్ట్రాలలోను సమాచార కమీషన్ల ఏర్పాటు జరగాలి. రెండోది: ఆయా స్థాయిలలో ఒక ప్రధాన కమీషనర్‌ను, పది మందికి మించకుండా కమీషనర్లను నియమించాలి. మూడోది: ఈ సమాచార కమీషన్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. మరే ప్రభుత్వ సంస్థ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలను-నిర్దేశాలను పాటించాల్సిన అవసరం లేదు. నాలుగోది: ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వారే కమీషనర్ల పదవులకు అర్హులు. అదనంగా, న్యాయ శాస్త్రంలో, విజ్ఞాన-సాంకేతిక శాస్త్రాలలోసామాజిక రంగంలో, యాజమాన్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో, మాస్ మీడియా రంగంలో, పరిపాలనా రంగంలో, గవర్నెన్సులో నిష్ణాతులై వుండాలి. ఆయా రంగాలలో కేవలం "ప్రవేశం" కాకుండా, "ప్రావీణ్యం" వుండి తీరాలి. ప్రసిద్ధి చెందిన వారై వుండాలి. పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులై వుండరాదు. ఏ "రాజకీయ పార్టీతో ను" సంబంధం వుండకూడదు.
అలాంటప్పుడు కేవలం ఒక పునరావాస కేంద్రంగా, ఏదో ఇతర నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టినట్లుగా, సమాచార హక్కు చట్టంతో ఎలాంటి సంబంధం ఎన్నడూ ఏ విధంగా లేనటువంటివారిని, పదవీ విరమణ చేసిన వారిని, చేయడానికి సిద్ధంగా వున్న వారిని, రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం వున్న వారిని, రక-రకాల ఒత్తిడులకు లొంగి ఇలా సమాచార కమీషనర్లను నియమించడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే ఎలా ప్రతి పక్ష నాయకుడు అంగీకరించాడు? విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎంతో రసాభాస చేసిన గవర్నర్ ఆమోద ముద్ర  ఎలా వేశారు? End
(Added on 22-02-2012: (ఎనిమిదిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వనట్లు వుండగా, వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబుల ఎంపిక విషయంలో గవర్నర్ అభ్యంతర పెట్టలేదు. సమాచార కమిషన్‌లో పార్టీలతో సంబంధం ఉన్న వారికి చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు). 

1 comment:

  1. సహా చట్టం గురించి ఏమాత్రం తెలిసి ఉండ కూడదు.... అనే ప్రధాన అర్హతతో ఎంపిక జరిగింది . ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి పరస్పర సహా కారం తో నియామకాలు జరిపారు. సహా చట్టానికి ఇంతకు మించి ఇంకేం సహకారం కావాలి .

    ReplyDelete