నెల్లూరు జిల్లా బెజవాడ గోపాలరెడ్డి నుంచి అదే జిల్లాకు చెందిన ఆనం నారాయణరెడ్డి వరకు
వనం జ్వాలా నరసింహారావు
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపధ్యంలో, ఆదాయ వనరులు అంతగా ఆశాజనకంగా లేని తరుణంలో, "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపధ్యం" లో, "వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్న తరుణం" లో, ఆటుపోటులకు ఎదురు నిల్చి-సాహసోపేతంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లే లక్షా నలబై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించడంతో పాటు వ్యయాన్ని కూడా లక్షకోట్లు మార్కు దాటినట్లు ప్రకటించడం విశేషం. ప్రణాళికేతర వ్యయం రు. 91 లక్షల కోట్లుగా, ప్రణాళిక వ్యయం రు. 54 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి "పేపర్ లెస్ బడ్జెట్‌ను" ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆనం రామనారాయణరెడ్డికి దక్కింది. ఉపాధి కల్పనకు, రాజీవ్ విద్యా ఉపాధి మిషన్‌కు, రాజీవ్ యువ కిరణాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏటేటా సాగుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి (త్ర) పఠనకు ఏబైఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర వుంది.
బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకూ: 1955-56 నాటి బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగం నుంచి 2012-2013 ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగం వరకు, ఆసక్తికరంగా పరిశీలించుకుంటూ-పరిశోధించుకుంటూ పోతే, అర్థశాస్త్రంలో-సామాజిక-రాజకీయ శాస్త్రాలలో ఎంతో మంది డాక్టరేట్లు పొందే అవకాశం వుంది.
ఏక కాలంలో, జరిగిపోయిన సంవత్సరం ఆదాయ వనరులను సమీక్షించుకుంటూ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ-వ్యయ అంచనాలతో మొదలవుతుంది బడ్జెట్ ప్రసంగ ఉత్సవాల సంరంభం. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులకు సంబంధించిన గణాంక వివరాలే బడ్జెట్. సంక్షిప్త బడ్జెట్, అర్థశాస్త్ర పరిశీలన, సంవత్సర వార్షిక ప్రణాళిక, శాఖలవారీ వివరాలు, బడ్జెట్ విశ్లేషణ, ఇలా ఎంతో సమాచారాన్ని ఒకప్పుడు పుస్తకాల ద్వారా, ఇప్పుడు పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా, తయారుచేసి, సంబంధిత లెక్కలను బహిర్గతం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే, బడ్జెట్‌ను ప్రవేశపెట్తూ, ఆర్థిక మంత్రి చేసే ప్రసంగం మరో ఎత్తు. ఒక్కో ఆర్థిక మంత్రి, ఒక్కో రకంగా, తనదైన విశిష్ట శైలిలో, సభ్యులను-ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే పలువురిని ఆకట్టుకునే రీతిలో, బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసుకుంటారు. ఆయన ప్రసంగాన్ని, ఆ సమయంలో ఆయన ప్రదర్శించే మానరిజమ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారెందరో. ఆర్థిక మంత్ర(త్రి) పఠనంలో, శ్లోకాలలోని బీజాక్షరాలలా, ప్రతి ఒక్క వాక్యానికి, బలీయమైన అర్థం-కారణం వుంటుంది. ఒక్కో సారి భావగర్భితంగా, నిగూఢంగా, స్పటికంలా కఠినంగా వుంటాయి మాటలు.
బెజవాడ గోపాలరెడ్డి జులై 8, 1955న చేసిన తన తొలి బడ్జెట్ ప్రసంగంలో నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తెచ్చారు. పంచవర్ష ప్రణాళికల ప్రస్తావన తెచ్చి, దేశ చరిత్రలో అవి ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాయన్నారు. మార్చ్ 2, 1956 న చేసిన ఆ తరువాతి ప్రసంగంలో "విశాలాంధ్ర" గురించి ప్రస్తావించారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనతా ఆయనదే. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన వ్యయాన్ని చూపించి, భావితరాల వారిపై రుణభారం మోపడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ఆనాడన్న మాటలు నేటికీ వరాల మూటలు. ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు. రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?ఎనిమిదవ సారి, ఆర్థిక మంత్రిగా చివరిసారి, (మద్రాస్ శాసన సభలో నాలుగు సార్లు, ఆంధ్రలో రెండు సార్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు సార్లు) 1958-59 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 26, 1958 న బడ్జెట్ ప్రసంగం చేశారు బెజవాడ గోపాలరెడ్డి. అదే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రప్రధమ మిగులు బడ్జెట్. ఇక ఆ తరువాత "కాసు పర్వం" మొదలైంది. "పరిమిత రెవెన్యూ ఆదాయంతో, మితిమీరిన ప్రభుత్వ రుణభారంతో, బంగారు భవిష్యత్‌పై ఊహాగానాలతో" రాబోయే ఏడాది గురించి మూడు ముక్కలతో కాసు బ్రహ్మానందరెడ్డి 1959-60 సంవత్సరపు ఆర్థిక మంత్ర పఠనం మొదలైంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, పిడతల రంగారెడ్డి లాంటి ఉద్దండ పిండాలు కూడా అదే తరహాలో ప్రసంగాలు తమదైన శైలిలో చేశారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.
ఇంతకీ ఏమిటీ బడ్జెట్? ఇది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమేనా? ఇతరులకు దాని విషయంలో-వివరాలు తెలుసుకోవడంలో ఏ అవసరం లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ అపోహలే. బ్రిటన్ ఆర్థిక మంత్రిని "ఛాన్సలర్ ఆఫ్ ద ఎక్స్ చెక్కర్" అని సంబోధిస్తారు. ఆయన ప్రతి ఏడాది, రాబోయే ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అవసరాలు, ఆదాయ-వనరుల వివరాలున్న కాగితాలను "చిన్న తోలు సంచీ” లో వేసుకుని, పార్లమెంటుకు వెళ్లే ఆచారం అనాదిగా జరుగుతోంది. ఫ్రెంచ్ భాషలో బడ్జెట్ అంటే "చిన్న సంచీ" అని అర్థం అంటారు కొందరు. మనది బ్రిటీష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వం. వాస్తవానికి చాలా విషయాలలో, బ్రిటీష్ కాలం నాటికీ, నేటికీ, బడ్జెట్ స్వరూప-స్వభావాలలో విప్లవాత్మకమైన మార్పులు అంతగా లేవంటారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబునాయుడు కాలంలో "జీరో బేస్డ్ బడ్జెట్" అని పిలిచినా, ఇప్పుడు "పేపర్ లెస్" అని పిలిచినా, బడ్జెట్ స్వరూపం మాత్రం, తెలుగు దేశమైనా-కాంగ్రెస్ పార్టీ ఐనా, రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడడం తప్పనిసరి అని భావించక తప్పదు. ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి? కేంద్రం విడుదల చేసే నిధులకు, మాచింగ్ గ్రాంట్‌లకు ఒక తీరు-తెన్ను అనేది వుందా? ఏ రంగానికి-ఎప్పుడు-ఎందుకు-ఎంత మేరకు నిధుల కేటాయింపులు పెంచాలి, లేదా, తగ్గించాలి అన్న విషయం గురించి సవివరమైన అధ్యయనం వుందా? వాస్తవ పరిస్థితులకు, ఎన్నికలలో చేసిన వాగ్దానాలకు, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు, బడ్జెట్ అంచనాలకు-ఏడాది చివరలో జరిగిన వ్యయానికి పొంతన అనేది వుంటుందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. ఐనా, ఏటా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ ఆర్థిక శాఖామాత్యుడు, బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఆగదు. బడ్జెట్ బాగా లేదని ప్రతిపక్షాల విమర్శలు, బాగుందని స్వపక్షాల పొగడ్తలు ఎప్పుడూ పరిపాటే. పన్నులు విధించని ప్రభుత్వం వుండదు. వేసినందుకు విమర్శించని ప్రతిపక్షమూ వుండదు. చివరకు, ఇవన్నీ ఒక పక్కకు పోయి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కే, శాసన సభ ఆమోదం లభించడం ఖాయం. ఇటీవలి కాలంలో చర్చ జరగకుండానే "గిలెటిన్" పద్ధతిన సభ ఆమోదం లభిస్తోంది.
ఈ నేపధ్యంలో, బడ్జెట్ స్వరూప-స్వభావాలు, పుట్టు-పూర్వోత్తరాలు, పూర్వా-పరాలు, తెల్సుకోవడం అవసరం. భారత రాజ్యాంగంలోని 266(3) ప్రకరణ, ప్రభుత్వ వ్యయంపై అటు లోక్ సభ-ఇటు శాసన సభల ఆధిపత్యాన్ని-నియంత్రణను స్పష్టం చేస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నియమ-నిబంధనల సంపుటి (మాన్యువల్) లోని మూడు భాగాలు స్థూలంగా ఈ విషయాలను తెలియచేస్తాయి. మొదటి భాగంలో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనేది, రెండులో వివిధ పత్రాలను క్షేత్ర స్థాయి నుండి సచివాలయం వరకు తెప్పించుకునే విధానం, మూడులో అనుబంధాలకు సంబంధించిన సమాచారం వుంటుంది. ప్రభుత్వ ఖాతాలకు చెందిన పద్దులు ఎలా వుండాలి? ఖాతా పద్దు-శీర్షిక (హెడ్ ఆఫ్ అకౌంట్) అంటే ఏమిటి? మేజర్-మైనర్ హెడ్ అంటే ఏమిటి? అనే అంశాలు కూడా వుంటాయి. బడ్జెట్ మాన్యువల్ లోని నియమాలను "పేరాలు" అని పిలుస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన మరి కొన్ని వివరాలు అకౌంట్స్ కోడ్‌లోను, ఫైనాన్షియల్ కోడ్‌లోను వుంటాయి.
ప్రభుత్వం అంటే అతిపెద్ద వ్యవస్థ. అందులో వివిధ శాఖలు, ఉప శాఖలు, వందల-వేల సంఖ్యలో కార్యాలయాలు, వీటి ద్వారా ప్రజలకు చేరాల్సిన లక్షలాది పనులు వుంటాయి. వీటన్నిటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు, వనరుల సేకరణ జరగాలి. అందుకే బడ్జెట్‌ను, "వార్షిక ఆర్థిక వివరణ", "వార్షిక విత్త వివరణ" గా పిలుస్తారు. వివిధ శాఖల అవసరాల మేరకు, ఆయా శాఖాధిపతుల సూచన మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తప్పనిసరి. బడ్జెట్‌ను మూడు రకాలుగా విభజించుతారు. "సంచిత నిధి", "ఆకస్మిక వ్యయ నిధి", "ప్రభుత్వ ఖాతా" అని వీటిని అంటారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరే నిధులు-వనరులు, పన్నుల రూపేణా వచ్చే ఆదాయం, పన్నుల రూపేణా కాకుండా వచ్చే ఆదాయం, రుణ సేకరణ నిధులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం లాంటివి "సంచిత నిధి" కిందకు వస్తాయి. ఒక శాఖ నుంచి వచ్చే నిధులు-వనరులు ఆ శాఖకే ఖర్చు చేయాలని నియమం లేదు. ఐన వసూల్లన్నీ సంచిత నిధి కిందకు జమ అవుతాయి. అలా సమకూరిన నిధులను బయటకు తీసి ఖర్చు చేయాలంటే శాసన సభ ఆమోదం కావాలి. కొన్ని సందర్భాలలో, కొన్ని పథకాలను, అత్యవసరంగా రూపొందించి అమలు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కాని, బడ్జెట్లకు శాసనసభ ఆమోదం పొందిన తరువాత కానీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగని పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఇందుకొరకు రాజ్యాంగపరంగా కలిగించిన వెసులుబాటునే "ఆకస్మిక వ్యయ నిధి" అంటారు. ఇదొక రకమైన శాశ్వత అడ్వాన్స్. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే "కార్పస్" లాంటిది. పథకాల అమలుకు దీని నుండి తీసుకుని, ఆ తరువాత అనుబంధ బడ్జెట్‌లో మంజూరు చేయించుకుంటుంది ప్రభుత్వం. వాడుకున్న మొత్తాన్ని తిరిగి అందులో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక రకమైన బాంక్ లాంటిది. బాంకర్‍గా కొన్ని లావాదేవీలుంటాయి. ఉద్యోగుల భవిష్యత్ నిధికి, భీమా ప్రీమియంకు, కాంట్రాక్టర్ల నుండి సేకరించాల్సిన డిపాజిట్ల వంటివి "ప్రభుత్వ ఖాతా" లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఏదో ఒక రోజున ఆ డబ్బును తిరిగి వాపస్ చేయాల్సి వుంటుంది. అందుకే దీనిని వేరే ఖాతాగా చూపించడం జరుగుతుంది.
సంచిత నిధిలో మూడు ఖాతాలుంటాయి. రెవెన్యూ, మూల ధనం, రుణ ఖాతాలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ నిర్వహణ కయ్యే ఖర్చులన్నీ రెవెన్యూ ఖాతా నుంచి చేస్తారు. భవనాల, రహదారుల నిర్మాణానికి, ప్రాజెక్టుల-ఇతర రకాల ప్రజల మేలుకోరి చేసే పనులకొరకు కావాల్సిన పెట్టుబడులను మూల ధనం ఖాతాలోకి చేర్చుతారు. గత సంవత్సరం రెవెన్యూ ఖాతాలోకి రావాల్సినవి మరుసటి సంవత్సరం వస్తే అవీ మూల ధనం ఖాతాలోకే పోతాయి. రుణ ఖాతాలోకి చేసిన అప్పులు, విడుదల చేసిన రుణాలు వస్తాయి. స్థానిక సంస్థలకు, రైతులకు ప్రభుత్వం విడుదల చేసే రుణాలన్నీ రికవరీ వివరాలతో సహా రుణ ఖాతా లోకి చేరతాయి. ప్రభుత్వానికి చెందిన ఆదాయ-వ్యయాలన్నీ ఈ మూడు విభాగాల్లోనే వుంటాయి. బడ్జెట్ పరంగా "సెక్టోరియల్ క్లాసిఫికేషన్" (వర్గీకరణ) పేరుతో ప్రభుత్వ శాఖలను నాలుగు తరగతులుగా విభజించుతారు. అవి: సాధారణ సేవల శాఖలు, సాంఘిక-సామాజిక సేవల శాఖలు, ఆర్థిక సేవల శాఖలు, ఆర్థిక సహాయక సేవల శాఖలు. ఈ సేవలన్నీ ఖాతాలలో పద్దుల రూపేణా చూపించడానికి మరో రకమైన విభజన వుంటుంది. వివిధ రకాలైన పద్దులను "మేజర్, మైనర్" హెడ్‌లుగా పిలుస్తారు. బడ్జెట్ పరిభాషలో వీటిని "ఏడంచెల" విభజన అంటారు. మొదటి అంచెలో ఏ శాఖ ఏ విభాగం కిందకు వస్తుందో నిర్ణయిస్తారు. ఆ శాఖకు ఒక నంబరు కేటాయిస్తారు. తదుపరి మిగిలిన ఐదు శాఖలను ప్రధాన పద్దు, అనుబంధ ప్రధాన పద్దు, చిన్న పద్దు, సవివరమైన పద్దులుగా పిలుస్తారు. కొత్తగా అనుబంధ సవివరణ పద్దును కూడా చేర్చారు. ఉదాహరణకు రెవెన్యూ ఖాతా పద్దులకు 1-1999 నంబర్లుంటాయి. ఒక్క హెడ్ ఆఫ్ అకౌంట్-ఖాతా పద్దు తెలుస్తే మిగిలినవన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విభజన మన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. అఖిల భారత స్థాయిలో అన్ని చోట్ల ఒకే రకంగా, యూనిఫాంగా వుంటాయి.
బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటారు. బడ్జెట్ సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన మొత్తాన్ని అదే సంవత్సరం ఖర్చు చేయాలి. చేయక పోతే మురిగి పోతుంది. ప్రతి శాఖ మంత్రి తన శాఖ నిర్వహణకు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసన సభను కోరడాన్నే "డిమాండు" అంటారు. శాసన సభ ఆ డిమాండును ఆమోదించిన తరువాత దాన్ని "గ్రాంట్" అంటారు. ఇలా అన్ని శాఖల గ్రాంటులు కలిపి, బడ్జెట్ సమావేశాల చివరలో "ద్రవ్య వినియోగ బిల్లు" (అప్రోప్రియేషన్ బిల్) ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతారు. సభ ఆమోదం పొందిన దాన్ని "అప్రోప్రియేషన్ యాక్ట్" అంటారు. ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం-అధికారం శాసనసభ్యులకు వుంది. బడ్జెట్‍పై చర్చ ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. ప్రారంభమైనా చర్చ పూర్తిగా కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకమే! చివరకు డిమాండ్లన్నీ ఎప్పటిమాదిరిగా గిలెటెన్ అయ్యే ప్రమాదమే ఎక్కువా కనిపిస్తోంది!
ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదం లభించినా "బడ్జెట్‌లో" చూపించింది ఖర్చు చేయరని, ఖర్చు చేసింది బడ్జెట్‌లో చూపించరని (What is budgeted is not spent and what is spent is not budgeted!) ఆర్థిక నిపుణులు అంటుంటారు. End
No comments:
Post a Comment