Friday, February 17, 2012

అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?: వనం జ్వాలా నరసింహారావు


అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?


రాష్ట్ర శాసనసభలో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు. అది ఆయన ఒక్కడి తప్పు కాదు. ఆ పాపం ఆనాటి నుంచీ నేటిదాకా కొనసాగిస్తున్న గత ప్రభుత్వాలది కూడా. ఏళ్ల తరబడి పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వ రధ సారధులది, ఆ ప్రభుత్వాలలో పని చేసి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆయన పూర్వీకులది, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రుల అడుగు జాడలలో నడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులదీ కూడా! ఏదేమైనా కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొంత అభినందించాల్సిందే.
కిరణ్ సర్కారు మానస పుత్రికలైన మూడు పథకాలు... యువజనులకు ఉపాధి సంక్షేమం, మహిళల కోసం స్త్రీ నిధి, రైతుల కోసం వడ్డీలేని రుణాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ద్వారా సాధికారత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి-ఆనం రామనారాయణ రెడ్డిలు రాష్ట్ర బడ్జెట్‌ను సమ్మోహనాస్త్రంగా ప్రయోగించారు. ఎన్నికల నాటికి వైఎస్‌ను మరిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. "యువజనులు, స్త్రీలు, రైతులు" లక్ష్యంగా తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది అన్న ముద్ర పడే విధంగా జాగ్రత్త పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో పాటు నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొంత మేరకు కొనసాగిస్తూనే, యువజనులు, రైతులు, మహిళలను ఆకట్టుకునే కొత్త పథకాలపై దృష్టిపెట్టారు. అలానే "రాజీవ్ యువ కిరణాల" కు పెద్ద పీట వేశారు. లక్షకు పైగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అంటే చెప్పింది చెయ్యబోతున్నారన్న మాట. మహిళలకు పావలా వడ్డీని కూడా తీసివేసి "వడ్డీ లేని రుణాలు" ఇస్తామంటూ ప్రకటించారు. స్వయం సహాయ బృందాల సభ్యులు, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకునే లక్ష రూపాయల లోపు రుణానికి జీరో వడ్డీ అని, రైతులు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం తెచ్చుకోవచ్చని, దానికి అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ అంకెల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూపాయికే కిలో బియ్యం పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీని పెంచారు. స్కాలర్‌షిప్‌‍లకు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్‌కు, బీసీ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి, విద్య, వైద్యం, గృహ నిర్మాణంకు కేటాయింపులు కొద్ది మొత్తాలనుంచి, భారీ మొత్తాలకు పెంచడం జరిగింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు "ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి" ని మరింత బలోపేతం చేశారు. ఇంతకీ ఈ కేటాయింపులలో వాస్తవికత ఎంత? బడ్జెట్‌లో కేటాయించిందే సంబంధిత శాఖలకు ఖర్చు చేస్తారా? కేటాయించని వాటి కింద అసలు ఖర్చే కాదా? అన్న ప్రశ్నలకు మళ్లీ వచ్చే ఏడాదే సమాధానం దొరకాలి. ఉదాహరణకు గత ఏడాది జలయజ్ఞంకు కేటాయించిన నిధులలో మూడు వంతులు మాత్రమే వినియోగించడం జరిగింది. మిగాతావి మురిగిపోయినట్లే కదా? అలా ఎందుకు జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో, నీటి పారుదల రంగానికి, పాఠశాల విద్యకు అధికంగా కేటాయింపులు జరిగాయనేది వాస్తవం. అవి ఖర్చు చేస్తే మంచిదే!
ఇలా కేటాయింపులు చేయడం, రాజకీయాలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతలను నిర్ధారించడం, బడ్జెట్‌లో రాజకీయ ఉపన్యాసాలు చేయడం, ఆనవాయితీగా వస్తున్నదే. ఈ విషయంలో తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఒకరికంటే మరొకరు మిన్న అని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2001-2002 ఆర్థిక సంవత్సరానికి నాటి తెలుగుదేశం హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, విజన్ 2020 భవిష్యత్ దర్శిని లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపమే ఆ సంవత్సరపు బడ్జెట్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళిక అంచనా తొమ్మిదివేల కోట్ల రూపాయల లోపే! కాకపోతే అప్పటికే రుణభారం సుమారు ఏబై వేల కోట్ల రూపాయలకు చేరుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే వున్న ఆ రుణ భారం దిన-దినాభివృద్ధి చెంది, నేటికి తీర్చలేని స్థితికి చేరుకుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఇదే! దీనికి ఏ ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు-రాదు.
మన రాష్ట్రంలో శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సుమారు అరవై ఏళ్ల చరిత్ర-నేపధ్యం వుంది. 1955-56 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకు, 57 పర్యాయాలు పలువురు ఆర్థిక మంత్రులు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వారిలో రోశయ్య లాంటి కొందరు రికార్డు స్థాయిలో పదమూడు సంవత్సరాలు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వారు ఎనిమిది సంవత్సరాలు (మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత వుంది. జులై 8, 1955 న బెజవాడ గోపాలరెడ్డి మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, రెవెన్యూ ఆదాయం కేవలం రు. 2, 198 లక్షలుగా, రెవెన్యూ వ్యయం రు.  2, 564 లక్షలుగా, రెవెన్యూ లోటు రు. 366 లక్షలుగా, నికర లోటు రు.  434 లక్షలుగా చూపించారు. ఇప్పటి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్లకు, లక్ష కోట్ల వ్యయానికి, నాటి బడ్జెట్లకు పోలికే లేదు! అలానే ఆయన, మరుసటి సంవత్సరం రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తూ చేసిన ప్రసంగం నేటికీ స్ఫూర్తిదాయకమే. దానిని ఎరలా తీసుకున్నా వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం వుంది. మార్చ్ 2, 1956 నాటి ఆ బడ్జెట్ ఉపన్యాసంలో, విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చారు బెజవాడ గోపాలరెడ్డి. విశాలాంధ్ర ఏర్పడితే అదే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న చివరి బడ్జెట్ ప్రసంగం అని ప్రారంభించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపు దిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్రాల పునర్విభజన నివేదికపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని సభ్యులకు తెలియచేశారాయన. అలానే, తెలుగు మాట్లాడే వారందరికీ, ఒకే రాష్ట్రం వుంటే బాగుంటుందన్న విషయాన్నీ, వుండాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేసారు (ఆయన భావాలతో నేను ఏకీభవిస్తున్నట్లు అర్థం కాదు). తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్దండ కవులైన అల్లసాని పెద్దన్న, బమ్మెర పోతన్న, రామరాజ భూషణుడు, తిక్కన సోమయాజిల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ మహానుభావులు నడిచిన నేలలో నివసించే తెలుగు వారందరూ, వారి అడుగుజాడలలో ఐకమత్యంతో మెలుగుతారన్న విశ్వాసాన్ని బెజవాడ గోపాలరెడ్డి వెల్లడించారు. విశాలాంధ్ర స్థాపనకు కష్టాలు భరించాల్సి వుంటుందనీ, తరువాత బాధ్యతలు పెరుగుతాయనీ, ప్రజలు సర్దుబాటు ధోరణిలో మసలుకుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన హెచ్చరించారా నాడే!
అంతటితో తన బాధ్యత తీరిందనుకోలేదు బెజవాడ గోపాలరెడ్డిగారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను జులై 3, 1957 న రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా తన బడ్జెట్ ప్రసంగం వుంటుందని మొదలే విశదపర్చారాయన ఆనాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించి, దానిపైన శాసనసభ, పత్రికారంగం, దేశ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన ఖర్చును చూపడం ఆయన ఆనాడే వ్యతిరేకించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికో, విద్యుత్ ఉత్పాదన కొరకో, అప్పులు చేస్తే పరవాలేదని, శాంతిభద్రతలకు-ఆరోగ్య విద్యా సదుపాయాలకు-కమ్యూనికేషన్స్ రంగానికి, ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసి ఆ ఖర్చును భావితరాల వారిని భరించమనడం కన్నా, మనమే ఆ బరువు మోయడం సమంజసమని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం, ఫలితాలు ఇప్పుడు అనుభవించి, భారాన్ని కొడుకులకు, మనుమలకు, ముని మనుమలకు అందచేయడం తప్పుడు విధానమని. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కాని, రిజర్వ్ బాంకును కాని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని మొత్తానికి-మొత్తం నెత్తిన వేసుకోమనడం సరైంది కాదని కూడా ఆయన ఆనాడే సూచించారు. ఇక్కడో చక్కటి మాట చెప్పారు. రాష్ట్రాలలో అమలు కావాల్సింది, ఇక్కడి ప్రభుత్వాలు అమలుపర్చే కేంద్ర ప్రణాళిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాలతో-నిధులతో-ఆర్థిక సహాయంతో అమలు పరిచే రాష్ట్ర ప్రణాళిక అని స్పష్టం చేసారు. మన ఆర్థిక వనరులతో, మన పన్నుల విధానంతో, పొదుపు చర్యలతో, స్వయంగా రుణాలు సమకూర్చుకోవడంతో, కేంద్ర ప్రభుత్వ సహాయానికి అదనంగా ప్రణాళికను రూపొందించుకోవాలని బెజవాడ గోపాలరెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.
 రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన విశాలాంధ్ర విషయం కాని, తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?
ఈ నేపధ్యంలో అల నాడు తన జిల్లాకే చెందిన బెజవాడ గోపాలరెడ్డి బడ్జెట్ ప్రసంగాల స్ఫూర్తిని, ప్రవేశ పెట్టిన తీరును, ఈ నాటి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతవరకు అనుకరించారనేది నిర్ణయించాల్సింది పాఠకులే! 

No comments:

Post a Comment