Saturday, February 4, 2012

ఎమ్మార్లోు రాజకీయ హస్తం లేదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (04-02-2012)
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర రాజకీయాలకన్నా రంజుగా, పసందుగా, రసకందాయంలో సాగుతోంది సిబిఐ దర్యాప్తు. ఇలా రాయడమంటే సిబిఐని తప్పుపడుతున్నట్లు అర్థం తీస్తే అది వేరే సంగతి. గాలి జనార్దనరెడ్డి ఓబులాపురం గనుల అక్రమాలతో, ఎమ్మార్ కుంభకోణంతో, జగన్ అక్రమాస్తుల ఆర్జన నేరారోపణతో, వైఎస్ విజయమ్మ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుపై వేసిన పిటీషన్‌తో, సిబిఐకి చేతి నిండా పని దొరికిందనాలి. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవడంతో, న్యాయస్థానాల జోక్యంతో ఈ మూడు కేసులు సిబిఐ చేపట్టాల్సి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతున్న విధానం, ముద్దాయిలుగా ఇంతవరకు నిర్ధారించిన వారిని విచారించిన తీరు, అరెస్టుల తతంగం, సాక్షులుగా కొందరిని పిలిచి విచారించిన వైనం, వారిలో ఒకరిద్దరిని నిందితులుగా దరిమిలా పేర్కొన్న వ్యవహారం, ఒక కేసుతో సంబంధం వుందనుకున్నవారిని మరో కేసులో సాక్షిగానో-భవిష్యత్ ముద్దాయిగానో విచారించిన తీరు నిశితంగా పరిశీలించిన వారికి కొంత గందరగోళంగా కనిపించినా, విషయం మాత్రం అంతో-ఇంతో అవగతమవుతోందనే అనుకోవాలి. ఒక కేసుతో మరో దానికి "ముందు-వెనుకల అనుబంధాన్ని" అన్ని కేసుల పరిపూర్ణ దర్యాప్తు చివరలో నిర్ధారించే దిశగా విచారణ సాగుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గాలి కేసులో సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. ఎమ్మార్ కేసులో ముద్దాయిగానో-సాక్షిగానో పిలిచిన వారిలో జగన్ సన్నిహితుడు సునీల్ కుమార్ రెడ్డి వున్నారు. ఎమ్మార్‍లో సాక్షిగా పిలిచిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముద్దాయిని చేశారు. స్టయిలిష్ హోం అధినేతను అప్రూవర్‌గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మార్ కేసులో చంద్రబాబును ఎందుకు ముద్దాయిని చేయడం లేదని ప్రశ్నిస్తున్న నేపధ్యంలో ఆయనపైనే మరో ఫిర్యాదు చోటుచేసుకుంది. చివరకు కనీసం కొందరన్నా ఒకదానికంటే ఎక్కువ కేసులలో ముద్దాయిలు కాక తప్పదేమో!.
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన ఒకటి-రెండు సంఘటనలు ప్రసార-మాధ్యమాలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్ విజయమ్మ ఫలానా న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు నాయుడుపై ఆమె వేసిన పిటీషన్ విచారణకు రాకుండా కోరిన వ్యవహారం. అలానే ప్రధాన మంత్రికి ఆమె రాసిన లేఖ. ఇంకోటి ఎమ్మార్ చార్జ్ షీట్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ముద్దాయిలుగా పేర్కొనడం. మరో అంశం, ఒక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, పలువురు మాజీ-తాజా ఐఏఎస్ అధికారులను ఏదో ఒక కేసులో సాక్షులుగా (ప్రస్తుతానికి) విచారణకు పిలవడం. ఇదంతా చూస్తున్న కొందరు అధికారులు, తాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేశామా? ఒత్తిడులకు లొంగి చేయరాని పని చేశామా? తప్పు చేయకపోయినా తమను ఇరికించే ప్రయత్నం జరుగుతోందా? ఇలా సాగితే తమ పరువు-ప్రతిష్టలు ఏం కావాలి? అన్న మీమాంసలో పడిపోయారు. ఎమ్మార్ కేసులో ఇరికిన (పోనీ ఇరికించిన) ఎల్వీ సుబ్రహ్మణ్యం తానే తప్పు చేయలేదనీ, ఏదన్నా అర-కొర జరుగుతే ఆ చిన్న తప్పును భూతద్దంలో చూపే ప్రయత్నం సిబిఐ చేస్తోందనీ, సాక్షిగా తనను పిలిచి ముద్దాయిగా చేసారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాస్తవానికి నీతి-నిజాయితీ పరుడైన అధికారిగా, ఏ ఫైలునైనా క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోని అధికారిగా, సమర్ధత-దక్షత గల అధికారిగా, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పేరుంది. ఆయన చేసింది నేరమే అయితే, ఆ నేరం వెనుకనున్న వ్యక్తుల సంగతేంటి? అన్న ప్రశ్నలనూ వేస్తున్నారు చాలామంది. కనీసం ఒక్కరన్నా-ఒక్కరు రాజకీయ నాయకుల పేర్లు ముద్దాయిల జాబితాలో లేకుండా ఎమ్మార్ కుంభకోణం కేసులో చార్జ్ షీట్ దాఖలైందంటే వింతగానే వుంది. ముద్దాయిలుగా పేర్కొన్న వారందరికీ శిక్షలు పడాలని లేదు. కాకపోతే, న్యాయస్థానంలో శిక్ష పడాలంటే, ముద్దాయిల జాబితాలో పేరుండి తీరాల్సిందే కదా! ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు ఇంతవరకు లేదంటే, ఎమ్మార్ కేసులో శిక్షార్హుడైన రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేదనేగా అర్థం? ఇదెక్కడి న్యాయం? ఇది ముద్దాయిలతో దోబూచులాటకాదా?
ఈ నేపధ్యంలో జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటీషన్‌పై విచారించిన సుప్ర్రేం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. టు. జి స్పెక్ట్రం కేసులో లైసెన్సులను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక విధంగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఖంగు తినిపించిందనవచ్చు. లైసెన్సుల జారీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ ఎల్‌ అనే స్వచ్ఛంద సంస్థ, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో హోం మంత్రి చిదంబరంను కూడా సహ నిందితుడిని చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ పై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు గురువారం ట్రయల్‌ కోర్టుకే వదిలేస్తూ, విషయంపై ట్రయల్‌ కోర్టు రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా వుండగా, తీర్పు ప్రధానిని లేదా 2008లో లైసెన్సుల జారీ జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇప్పటి హోమ్‌ శాఖ మంత్రి పి చిదంబరాన్ని అభిశంసించడమే అవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. ఇంత పెద్ద కుంభకోణంలో అధికారులను, ప్రత్యక్షంగా ఒకరిద్దరు మంత్రులను, పరోక్షంగా ప్రధానమంత్రిని తప్పుబట్టగా లేంది, మన రాష్ట్రంలో జరుగుతున్న అలాంటి వ్యవహారాలలో, కనీసం ఒక్క రాజకీయ నాయకుడినైనా తప్పుబట్టక పోవడం హాస్యాస్పదం.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబిఐ-ఆవిర్భావం, 1941లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన "స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్" తో ఆరంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యతలను పరిమితం చేసింది ప్రభుత్వం. దరిమిలా, యుద్ధం ముగిసిన తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946 లో, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. క్రమేపీ, దాని పరిధిని యూనియన్ టెరిటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరింపచేయడం జరిగింది. ఏప్రిల్ 1963 లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చడం జరిగింది. అలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం, కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దానికి అప్పజెప్పిన బాధ్యత. క్రమేపీ, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బాంకుల జాతీయ కరణ తరువాత ఆ సిబ్బందినీ సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం.
సిబిఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఆయన సుదీర్ఘ నేతృత్వంలో, ఇంతింతై-వటుడింతై అన్న చందాన, నేటి ఈ స్థితికి చేరడానికి అన్ని విధాల పటిష్టమైన పునాదులు వేశారాయన. సిబిఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్ధతను-దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు సిబిఐ నుంచి ఆశిస్తారని, వారి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత దానిపై వుందని కొహిలి అనేవారు. చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా, కష్టపడి పనిచేయాల్సిన విద్యుక్త ధర్మం కూడా అందులో పనిచేసే అధికారులపైనుందని ఆయన అభిప్రాయపడ్డారు. "లాయల్టీ టు డ్యూటీ" ని ఆయన ప్రబోధించారు. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయనేది వేరే సంగతి. కాకపోతే, దీనిని మించిన చిత్తశుద్ధి గల దర్యాప్తు సంస్థలు మరేవీ లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయరామారావు ఒకరు. 
1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. సిబిఐ వ్యవహరిస్తున్న నిష్పాక్షిక ధోరణిని, నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిని మరింత విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద కార్యకలాపాల లాంటి విషయాలలో కూడా సిబిఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది. వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు కూడా సిబిఐకి దర్యాప్తు అప్పచెప్తే స్థాయికి దాని పనితీరుకు గుర్తింపు వచ్చింది. ఈ నేపధ్యంలో 1987 లో సిబిఐ లో రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. అలా పరిధి మరింత విస్తరించసాగింది. కాకపోతే, ఏ రాష్ట్రంలోనైనా, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా వుండాలి. సుప్రీం కోర్టులకు, హైకోర్టులకు ఆ నిబంధన వర్తించదు, ఏ రాష్ట్రంలోనైనా, ఏ విషయంలోనైనా సిబిఐతో దర్యాప్తుకు కోర్టులు ఆదేశించవచ్చు. ఇప్పుడదే జరిగింది.
ఇదీ సిబిఐ నేపధ్యం. ఇలాంటి నేపధ్యం వున్న సంస్థ ఎవరికీ , ఏ విషయంలోనూ అన్యాయం చేయదన్న నమ్మకం, అటు ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఇంతవరకూ కలిగిస్తూ వస్తుంది. మరి అలాంటప్పుడు, వైఎస్ విజయమ్మ ఎందుకలా ప్రధానికి వుత్తరం రాయాలి? రాసినందుకు తప్పు ఆమెదా? ఆ అవకాశం ఇచ్చిన సిబిఐ దా? జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న దర్యాప్తును ఆమె తన వుత్తరంలో ఒక "రాజకీయ క్రీడ" గా పోల్చారు. తన తనయుడిని ఏదో ఒక తీరుగా అభాసుపాలు చేయడానికి, కేసుల్లో ఇరికించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించిందామె. అవన్నీ ఉద్దేశపూర్వకంగానే సిబిఐ చేస్తోందంటున్నారు. జగన్ కేంద్రంలోనూ-రాష్ట్రంలోనూ ఎన్నడూ మంత్రిగా పనిచేయకపోయినా ఆయనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును ఎందుకు విచారించడం లేదన్న వాదనలనూ ఆమె లేవనెత్తారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్ అధికారులలో అలజడి మొదలైంది. తమను అధికారులు పావులుగా వాడుకొని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిలో కొందరు కలిసి చర్చించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏదేమైనా, ఇంతవరకు నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకున్న సిబిఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవాలి. అది చేస్తున్న దర్యాప్తు ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో వ్యతిరేకంగా కాదని, బహుళ ప్రయోజనాలను, ప్రజాహితాన్ని కోరి మాత్రమే అది దర్యాప్తు చేస్తుందని, దోషులు ఎంత పెద్ద వారైనా పట్టించి కోర్టు బోనులో నిలబెట్టుతామని నమ్మకం కలిగించాలి.

No comments:

Post a Comment