Sunday, February 26, 2012

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్: వనం జ్వాలా నరసింహారావు


బహుముఖ క్రియాత్మక వ్యూహంతో 
గిరిజనుల సమస్యలకు సూచనలిచ్చిన 
ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్
          
              ఒకనాటి నిజాం హైదరాబాద్ రాష్ట్రం-ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లోని, ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మర్లవాయి గ్రామంలో అనేక సంవత్సరాలు నివసించిన ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్ జ్ఞాపకార్థం, అక్కడి గిరిజన సాంప్రదాయాల ప్రకారం, అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఆయన కుమారుడు నికోలస్, మనుమడు హేమెన్‍డార్ఫ్ జూనియర్, ఆ గ్రామానికి వచ్చారని పత్రికలలో వార్తలొచ్చాయి. సతీమణి ఎలిజబెత్‌తో కల్సి హేమెన్‍డార్ఫ్ ఆ  ప్రాంతానికి నిజాం రాష్ట్ర "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడుగా, 1941 లో అడుగుపెట్టి, అక్కడే ఒక గుడిసెలో సంవత్సరాల తరబడి వుండిపోయారు. భార్య మరణానంతరం లండన్ వెళ్లి అక్కడే మరణించారు. బహుశా హేమెన్‍డార్ఫ్ స్థాయిలో రాష్ట్ర గిరిజన సమస్యలపై అధ్యయనం చేసి సూచనలిచ్చిన వారు ఎవరూలేరంటే అతిశయోక్తి కాదు.

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్, ఆస్ట్రియా దేశంలో, సంపన్నుల కుటుంబంలో జన్మించినప్పటికీ, యవ్వనంలో అడుగుపెట్తూనే, రబీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం పట్ల ఆకర్షితుడై, భారతీయ సంస్కృతీ-సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. వియన్నాలో మానవ పరిణామ శాస్తాన్ని, పురావస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. నాగా హిల్స్ లో నివసిసించే గిరిజన సామాజిక వ్యవస్థ స్థితిగతులపై పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు. సమకాలీన మానవ పరిణామ శాస్త్రజ్ఞులతో పరిచయాలు పెంపొందించుకోవడానికి హేమెన్‍డార్ఫ్ లండన్ నగరానికి వెళ్లారు. 1936 లో నాగాలాండుకు వచ్చి అక్కడి గిరిజనుల భాష నేర్చుకున్నారు. కొంతకాలం నీఫా-ఈశాన్య సరిహద్దు భారత ప్రాంతానికి వెళ్ళి, నిజాం ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసేందుకు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయన గిరిజన సమస్యలపై తీసుకున్న చొరవ వల్ల, నాటి నిజాం ప్రభుత్వం హేమెన్‍డార్ఫ్ ను రాష్ట్ర గిరిజన, వెనుకబడిన వర్గాల "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడిగా ఎంపిక చేసేందుకు దోహదపడింది. వారి సమస్యలలో ప్రధానమైంది భూమి సమస్య.

దలైలామాతో వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్


సలహాదారుడి పాత్రను పోషించుకుంటూ, అనేక ప్రదేశాలలో గిరిజన విద్యా సంస్థలను నెలకొల్పడం, వినూత్నమైన పథకాలను వారి సంక్షేమం కొరకు రూపొందించడం, వాళ్ల సంస్కృతీ-సంప్రదాయాలను పరిరక్షించడం లాంటి కార్యక్రమాలను కూడా హేమెన్‍డార్ఫ్ చేపట్టడం జరిగింది. 1953 లో నేపాల్ దేశానికి వెళ్లి అక్కడి గిరిజనుల సమస్యలపైనా అధ్యయనం చేశారు. భారతదేశంలోని గిరిజనులపై అధ్యయనం చేయాలన్న ఆయన ఆసక్తి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరడానికి దారితీసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నివసించే వారితో సహజీవనం చేస్తూ, వారి జీవన స్థితిగతులపై పరిశోధనలు జరిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే గోండుల, చెంచుల, రెడ్డిల మీద అధ్యయనం హేమెన్‍డార్ఫ్ కు ప్రధాన అంశంగా మారింది. ఆయన ప్రయాణం చేసిన గిరిజన ప్రాంతాలు చాలావరకు అంతకు ముందు ఎవరూ వెళ్లనివే! సమాంతరంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని కూడా కొంతకాలం చేశారు. మానవ జాతి శాస్త్రంపైపది "ఏక విషయక రచన" లు చేశారు. వాటిలో ప్రధానమైనవి చెంచుల మీద, గిరిజన రెడ్డిల మీద, గోండుల మీద, నేపాల్ గిరిజనుల మీద, నాగాల మీద ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు. మానవజాతి శాస్త్రంపై ఏకంగా సుమారు 3650 పేజీల అధ్యయన గ్రంధం రాశారు. వృద్ధాప్యంలో మానవ పరిణామ శాస్త్రంలో అధ్యాపకుడిగా లండన్‌లో ఉద్యోగం చేస్తూ, భార్య మరణానంతరం 1987 లో అనారోగ్యానికి గురై, కోలుకోలేక, చివరకు జూన్ 11, 1995 న ఆయన 85 వ ఏట లండన్‌లో మరణించారు.

హేమెన్‍డార్ఫ్ చొరవతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్ర (యాంథ్రపోలొజీ) విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖలోనే ఆయన ఆచార్యుడుగా పనిచేసేవారు. ఆ శాఖలో మొదటి బాచ్ విధ్య్రార్థిగా చదివిన వరంగల్ జిల్లా వాసి పి. కమలా మనోహర రావు, దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రప్రధమ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ఆరంభించడానికి కూడా హేమెన్‍డార్ఫ్ కారకులు. ఆ శాఖలో ట్రయినీ నిర్వాహకుడుగా పనిచేసేందుకు కమలా మనోహర్ రావును ఎంపిక చేశారు హేమెన్‍డార్ఫ్. 1985 లో రాష్ట్ర ప్రభుత్వం పాలనా సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు "రుస్తుంజీ అసోసియేట్స్" ను కన్సల్టెంటులుగా నియమించింది. ప్రప్రధమ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా 1966 లో ఆ శాఖ ఏర్పడినప్పుడు బాధ్యతలు స్వీకరించి, 1975 లో పదవీ విరమణ చేసిందాకా ఆ శాఖలోనే పనిచేసిన పి. కమలా మనోహర రావును గిరిజన సంక్షేమానికి సంబంధించినంతవరకు సంస్కరణల విషయంలో సూచనలిచ్చేందుకు రుస్తుంజీ నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజన సంక్షేమ పాలనా విధానాన్ని క్రమబద్ధం చేయడానికి హేమెన్‍డార్ఫ్ శిష్యుడు కమలా మనోహర రావు "ఏక గవాక్ష పద్ధతి" ని సూచించారు. దాంతో పాటు వికేంద్రీకరణ దిశగా బహుముఖ క్రియాత్మక వ్యూహాన్ని కూడా సూచించారు. ఆ నివేదిక పలువురి ప్రశంసలను అందుకుంది. హేమెన్‍డార్ఫ్ తన లెటర్ హెడ్ మీద, స్వదస్తూరీతో, కమలా మనోహర రావుకు నివేదిక విషయంలో తన అభిప్రాయాలను తెలియచేస్తూ, ఒక సుదీర్ఘమైన వుత్తరం రాశారు. ఆ లేఖ రాసిన తేదీ 11-12-1985. అప్పట్లో ఆయన ఆఫ్రికా-ఆసియా దేశాల లండన్ అధ్యయన సంస్థలో పనిచేస్తున్నారు. కాకపోతే వుత్తరం రాసింది హైదరాబాద్ "రాక్ కాజిల్" హోటెల్ లో వున్నప్పుడు. ఆ నివేదిక తయారుచేసినందుకు కమలా మనోహర రావును అభినందించారాయన. గిరిజన ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించి కమలా మనోహర రావు చేసిన విశ్లేషణలను హేమెన్‍డార్ఫ్ పొగిడారు. ఆ నివేదికలో గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్ట్ అధికారి ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా వుంది. కలెక్టర్‌తో సమానమైన అధికారిక హోదాకల ప్రాజెక్ట్ అధికారి నియామకం ఆవశ్యకతను హేమెన్‍డార్ఫ్ గట్టిగా సమర్థించారు. గిరిజన సహకార సంస్థ పనితీరుకు సంబంధించి, స్వతంత్ర ప్రతిపత్తిగల గిరిజన సాంస్కృతిక పరిశోధనా శిక్షణా సంస్థ ఏర్పాటు గురించి, సచివాలయ స్థాయిలో షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవహారంలో పాలనాపరమైన మార్పుల గురించి ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ హేమెన్‍డార్ఫ్ అభినందనలందుకున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల విభాగాన్ని పటిష్టం చేయడానికి హేమెన్‍డార్ఫ్ తన శిష్యుడు, కమలా మనోహర రావును ఎంపిక చేసుకున్నారు. ఆ కలయిక ఫలితంగానే, వరంగల్ జిల్లాలో, "హైదరాబాద్ గిరిజన ప్రాంతాల నియంత్రణ చట్టం 1949" అమలుకు నోచుకుంది. దరిమిలా హేమెన్‍డార్ఫ్ సూచనతో, వారిరువురి కృషి ఫలితంగా, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్‌గా కమలా మనోహర రావును ఎంపిక చేసింది ప్రభుత్వం. 

గిరిజనులను "ఆది వాసీలు" గా సంబోధించడానికి కారణం, ఆది నుంచీ భారతావనిలో నివసిస్తున్నవారు వారేనని. ఆంగ్లంలో ఆదివాసీలనే, "ఎబ్ ఒరిజినల్స్" గా, హిల్ ట్రయిబ్స్" గా,  "ఫారెస్ట్ ట్రయిబ్స్" గా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రాధమిక దశలో అసలైన గిరిజనులు గుట్టలపైన, అడవుల్లోను, గుహలలోను, చెట్ల నీడలలోను నివసించేవారు. నాగరిక ప్రజలను చూడగానే వారిలో ఏదో భయం వేసేది. సాధారణంగా నీటి వసతి సహజసిద్ధంగా లభించే ప్రాంతాలనే వారు తమ నివాసాలుగా ఎంచుకునేవారు. ఒక ఆవాస స్థలమంతా కలిసి పది-పదిహేను గుడిసెల కంటే ఎక్కువ వుండకపోయేది. ఆ గుడిసెలకు కిటికీల లాంటివి కాని, తలుపుల లాంటివి కాని వుండకపోయేది. మట్టితో- వెదురు కర్రలతో తయారైన గుడిసెలోనే వారి నివాసం. ఇక వారి ఇంటి పేర్లు ఒక జంతువు పేరుకు సంబంధించి కాని, ఒక చెట్టుకు సంబంధించి కాని వుండేవి. ఇప్పటికీ ఇంకా అలానే వున్నాయనవచ్చు. ఉదాహరణకు "నక్కల", "మామిడి", "గుర్రం", "పాముల" లాంటి ఇంటి పేర్లతోనే వారిని సంబోధించేవారు.

ప్రభుత్వాలెన్ని మారినా గిరిజన సమస్యలు ఎప్పటికప్పుడు తెరమీదకొస్తూనే వుంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి వున్నప్పుడు, అప్పటి బ్రిటీష్ పాలన, గిరిజనులను జనజీవన స్రవంతిలో కలుపుతూ, మిగతా వారి మాదిరిగానే ఒకే గొడుగు కిందకు తెచ్చింది. కాకపోతే కొన్ని రాయితీలు కలిగించింది. ఒక రకమైన నిర్దిష్ట జాతికి-భాషకు చెందిన సామాజిక వర్గంగా ఆదివాసీలకు పూర్తి రక్షణలు కలిగిస్తూ, ఏజెన్సీ వ్యవస్థను 1839 చట్టం ద్వారా వలస పాలన ప్రవేశ పెట్టింది . అలా మొదలైంది గిరిజన సంక్షేమం. అయినా ఆదిలో ఎలా వుందో ఇంకా అలానే వున్నాయి వారి జీవన స్థితిగతులు.

ఈ నేపధ్యంలో, ఏ ప్రాంతంలోనైతే హేమెన్‍డార్ఫ్  ఆయన సతీమణి ఎలిజబెత్‌తో కలిసి, గిరిజనుల సంక్షేమం కొరకు ఏళ్ల తరబడి కృషి చేశారో, అవే పరిసరాలలో, వారిద్దరినీ శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు జ్ఞాపక చిహ్నాలను ఏర్పాటుచేయడం అభినందించాల్సిన విషయం. హేమెన్‍డార్ఫ్  భార్య ఎలిజబెత్ మరణానంతరం (హైదరాబాద్ లో) ఆమెను మర్లవాయి గ్రామంలోనే సమాధి చేసారు. అప్పుడక్కడ లేని హేమెన్‍డార్ఫ్, తనకూ ఆమె పక్కనే సమాధి కావాలన్న కోరికను వ్యక్త పరిచారు. ఆయన కోరినట్లు గానే అక్కడి గిరిజనులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లా ఆ ప్రాంతానికి ఆయన కుమారుడు నికోలాస్, మనుమడు జూనియర్ హేమెన్‍డార్ఫ్ వచ్చి వారికి నివాళులర్పించడం విశేషం. End

1 comment:

  1. ఢార్ఫ్ గురించి చాలా సమాచారమిచ్చారు. బాగుంది. నా బ్లాగులో డార్ఫ్ ను గురించిన చిన్న ముచ్చటొకటి వ్రాసేను. చూడండి. www.apuroopam.blogspot.com

    ReplyDelete