Monday, February 6, 2012

పాలనా రథంలో సరిగమలు-పదనిసలు: వనం జ్వాలా నరసింహారావు


పాలనా రథంలో సరిగమలు-పదనిసలు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధం ప్రకటించారు. సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వ్యవహార ప్రక్రియ కేంద్రంగా మొదలెట్టిన ఐఏఎస్‌ల సమరం దరిమిలా నేరుగా సర్కారుపైనే గురిపెట్టే వరకు పోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో "సెక్షన్ ఆఫీసర్" స్థాయి నుంచి సెక్రటరీమంత్రుల-ముఖ్యమంత్రి(?) వరకు అంతో-ఇంతో అందరూ దంచుకుంటారన్న అర్థం స్ఫురించే రీతిలో మీడియా ముందు ఐఏఎస్‌ల యూనియన్ నాయకులు అక్కసు వెళ్లబుచ్చారు. పైగా ఈ విషయం మీడియాతో సహా అందరికీ తెల్సిందే అన్నట్లు మాట్లాడారు! వారి మాటలను బట్టి, తమలో (అధికారుల) కొందరితో సహా కొందరు అనధికారులు(మంత్రులు) భారీ మొత్తంలో అవినీతికి కారణమై వుండవచ్చనీ, అందరినీ సమ న్యాయంతో శిక్షించాలనీ అర్థం చేసుకోవచ్చు. తప్పు జరిగిన విషయం, పరోక్షంగానైనా నేరంలో పాలు పంచుకున్న విషయం ఒప్పుకున్నందుకు వారిని అభినందించాల్సిందే!

ఐతే, అసలు విషయం ఇంకొంత లోతుగా ఆలోచించాలి. అధికారుల-అనధికారుల మధ్య వుండాల్సిన సంబంధాలు, మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కార్యదర్శి మంత్రికి ఫైలు పంపే విధానం, రొటీనా-ప్రత్యేకత సంతరించుకున్నదా? అన్న అంశాలను కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. సిబిఐ జాయింటు డైరెక్టర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు. పాలనాపరమైన అంశాలలో ఆయనకు అవగాహన లేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. జీవో ఇచ్చిన వాళ్లు దోషా? ఇప్పించిన వాళ్లు దోషా? అన్న మీమాంసలనూ లేవనెత్తారు. తెర వెనుక (ఏం జరిగిందో బయటపెట్టడానికి సిద్ధపడకపోయినా) ఎంతో తతంగం జరిగే ఆస్కారం గురించీ మాట్లాడారు ఐఏఎస్‌లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము ఎలాంటి పరిస్థితులలో "తప్పు" చేశారో చెప్పకనే చెప్పారు పాపం! మంత్రులు తీసుకునే "నిర్ణయాలను" తాము అమలు పరిచే వారమేనని "భాష్యం" చెప్పారు. స్వతంత్రంగా ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకోలేరని మరో కొత్త సంగతిని బయట పెట్టారు. బిజినెస్ రూల్స్ ను, కోడ్ ఆఫ్ కండక్టును, బాధ్యతలను, మంత్రులు-కార్యదర్శులు-ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇంతకూ తమదేమీ తప్పు లేదని, అంతా మంత్రులదే అన్న చందాన మాట్లాడారు. ఎవరు-ఎవరిని-ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ వ్యవహారమంతా అర్థం చేసుకోవడానికి ఐఏఎస్‌ల-మంత్రుల మధ్య ఎలాంటి అవగాహన వుండాలి, ఎవరు-ఎవరికి-ఎంత మేరకు జవాబుదారులు, నిర్ణయాల బాధ్యత సమిష్టి దా? కేవలం జీవోలను జారీ చేసినవారి దేనా? లేదా చివరగా "అప్రూవ్డ్‌" అని సంతకం పెట్టిన మంత్రి-ముఖ్యమంత్రిదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐఏఎస్ అధికారులలో ధిక్కారణ ధోరణి కొంత కనిపించింది. ఐతే, అది ఆయన మీద కాదు. ఆయన మంత్రివర్గ సభ్యులమీద మాత్రమే. అప్పట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీ అన్న చందాన పనిచేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు వారి ఆవేదనకు కారణమనొచ్చు. ఒకానొక సందర్భంలో, శాసనసభ ఆవరణలో, పలువురి సమక్షంలో, ఒక అమాత్యుడు, తన శాఖ కార్యదర్శి-శాఖాధిపతి (ఇద్దరూ ఐఏఎస్ అధికారులే) కుమ్మక్కై తనతో తప్పు చేయించారని బాహాటంగా విమర్శించారు. మరో మంత్రి, తన శాఖలో జరిగిన తప్పంతా అధికారుల మీద తోసేశాడు. ఇలా మంత్రులకు-అధికారులకు సంబంధాలు బెడిసికొట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. అనాదిగా జరుగుతున్నదే.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-అమాత్యులకు మధ్య ఎలాంటి సంబంధాలుండాలనే చర్చ ఏనాడో మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఐనందున, చాలావరకు బ్రిటీషు సాంప్రదాయాలనే పాటిస్తున్నాం, అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి, మనదైన శైలిలో భాష్యం చెప్పుకుంటున్నాం. వారి మధ్య సంబంధాలంటే, ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటించడం కాదు. తమదే సరైందన్న వాదన వినిపించడమూ కాదు. "సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలు" అన్న అంశంపై బ్రిటన్‌లో, 1985 లో, "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" రూపొందించి, వారి మధ్య వుండాల్సిన సంబంధాలను అందులో పొందుపరిచారు. మరో పదేళ్ల తరువాత ఆ మెమొరాండంకు 1995 లో కొన్ని సవరణలు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సమీక్షించడం సబబేమో! మెమొరాండంలో పేర్కొన్నట్లు, మంత్రులు చట్టసభలకు ఎలా జవాబుదారీ అవుతారో, అలానే, సివిల్ సర్వెంట్లు (ఐఏఎస్ అధికారులు) మంత్రులకు జవాబుదారీగా వుండాలి. అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వుండడం అని అర్థం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం అధికారి ప్రధమ కర్తవ్యం. సంబంధిత మంత్రికి అవసరమైన తగు సూచనలిస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాలలో సహకరిస్తూండాలి. తమ ఇష్టా-అయిష్టాలకు అతీతంగా, విధానాల రూపకల్పనలో-నిర్ణయాల అమలులో తోడ్పడుతూ, ఎన్నికలలో చేసిన వాగ్దానాలను వాస్తవం చేయాలి. మంత్రులందరూ విద్యావంతులు కానక్కరలేదు. కేవలం విద్యావంతులు మాత్రమే మంత్రులు కావాలని అనుకోవడమంటే, మంత్రి మండలి మరో "బ్యూరోక్రసీ" అవుతుంది కాని "డెమొక్రసీ" వ్యవస్థ కాదు. మంత్రుల నిర్ణయం కార్యదర్శుల-శాఖాధిపతుల సలహా-సూచనల మేరకే అన్నది అక్షర సత్యం.

ప్రభుత్వమంటే, సమిష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మండలి, దాని అధినేత ముఖ్యమంత్రి. ఏ ఒక్క మంత్రి పొరపాటు చేసినా, బాధ్యత అందరిది అన్న విషయాన్ని మరిచిపోయిన నేటి కాలం మంత్రులు, బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రినీ తప్పుపట్టుతున్నారు. పాలనాపరమైన విధాన నిర్ణయాలలో మంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత వుందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత వుంది. సంబంధిత శాఖ మంత్రికి సివిల్ సర్వెంటు తోడ్పడడమంటే, తనకు తెలిసిన సమస్త సమాచారంతో పాటు, తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా-నిష్పక్షపాతంగా-రాగద్వేషాలకు అతీతంగా, సలహాలు-సూచనలు ఇవ్వాలి. వారిచ్చే సలహా మంత్రి ఆలోచనా ధోరణికి భిన్నమైనదైనా, అనువైన-శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాల్సిందే! సివిల్ సర్వెంట్లు ఉద్దేశపూర్వకంగానో, మరే ఇతర కారణాలవల్లనో, అలా చేయకుండా, వేరే విధంగా చేసి మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసినా, తప్పుదోవపట్టించినా, అది అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇంతా జరిగిన తరువాత, ఇదంతా రికార్డు అయిన తరువాత, మంత్రి తీసుకునే నిర్ణయంపై అధికారికి ఎటువంటి అభిప్రాయభేదాలున్నా, అరమరికలు లేకుండా, చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో , ఆ నిర్ణయాన్ని అమలు చేసితీరాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం స్పష్టంగా చెపుతోంది. ఎమ్మార్ కుంభకోణంలోగాని, జగన్ అక్రమాస్తుల సంపాదన ఆరోపణల విషయంలోగాని, ఓబులాపురం గనుల వ్యవహారంలో కాని, ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న మరే అంశం విషయంలో కాని, అధికారుల-మంత్రుల మధ్య ఇదంతా ఎంతవరకు చోటుచేసుకున్నదనేది బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే, ప్రభుత్వ పనితీరు, పాలనలో సమర్ధత, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహాను ఇచ్చినా, మంత్రులను మభ్య పెట్టినా, మంత్రులకు తెలియకుండా అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేసినా, దాని దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వ పాలనా రధం పైనా, పడుతుంది. పర్యవసానం ఏదైనా తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంట్ల (ఐఏఎస్ అధికారుల) పై రాజకీయ ఒత్తిడుల ప్రభావం కూడా పడవచ్చు. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా వుండే సలహాను మాత్రమే ఇవ్వాలని-అలాంటిదే పొందాలని, సివిల్ సర్వెంట్లపైనా ఒత్తిడులు వచ్చే అవకాశాలు చాలా సార్లు వస్తాయి. బ్రిటన్ లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలలో ఇది అరుదుగా జరగొచ్చు. మన దేశంలో ఇలాంటివి చాలానే. వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా-విరుద్ధంగా, ఐఏఎస్ అధికారులతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు వుంటుందనేది ప్రశ్నార్థకం. మంత్రి ప్రోద్బలం లేకపోయినా అలాంటి తప్పులు అధికారులు చేసే అవకాశాలు లేవా?

ఏదేమైనా ఇటీవలకాలంలో, అఖిల భారత సర్వీసులకు చెందిన "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" అధికారులు కొందరు వివాదాలలో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడడం, బెడిసికొట్టినప్పుడు మంత్రులదే తప్పని వాదించడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక ఎస్. ఆర్. శంకరన్ లాగా పిలిపించుకునే వారిని వేళ్లమీద లెక్కించాల్సి వస్తోంది. కారణం: అత్యంత బాధ్యతతో కూడిన పదవులు అతి పిన్న వయసులోనే చేపట్టి నందువల్ల కావచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సంప్రదాయాలను పాటించకపోవడం కావచ్చు. సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల కావచ్చు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి "ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వ విధి-విధానాల రూపకల్పనలో సహాయపడేందుకు, నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో "ఐఏఎస్" ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో ఆ పనిచేస్తూ వచ్చిన, "ఇండియన్ సివిల్ సర్వీస్" కు విప్లవాత్మకమైన మార్పులు-చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. ఈ సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులు పౌర పరిపాలనలోను, విధానాల రూపకల్పనలోను-నిర్ణయాలలోను, ఆంతరంగిక-విదేశీ సంఘర్షణలను చాకచక్యంగా  అంచనావేసి నివారించడంలోను, కీలక పాత్ర పోషించ దగ్గ వ్యక్తులై వుంటారు. సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు విభిన్న రకాల విద్యలలో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన అభ్యర్ధులను ఒక క్రమ పద్ధతి ప్రకారం, విస్తృతమైన-కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. ఇలా ఎంపికైన వారి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వుంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. దేశ సమగ్రత-సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని సర్దార్ పటేల్ అనేవారు.

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు, పనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభించాలి. కాని, ఇటీవల కాలంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకుంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, మంత్రుల ఆదేశాలకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గణనీయంగా పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయం ప్రజోపయోగం కొరకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు, మంత్రుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం "ఒత్తిడి" కిందకు రాదు. అది సరైన సమయంలో సరైన స్పందన అనాలి. అలా కాకుండా మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలకొరకు తల ఊపితే దాని ఫలితం అనుభవించక తప్పదు. "ఆన్ రికార్డ్" అభ్యంతరం చెప్పాలి. అలా జరిగిందో, లేదో, తెలుసుకునే ప్రయత్నమే సిబిఐ దర్యాప్తు అని భావించాలి. కాకపోతే, సిబిఐ ఎందుకు రాజకీయ నాయకులను విచారించడం లేదో అనేదే అంతుచిక్కని ప్రశ్నదోషులైన వారు రాజకీయ నాయకులైతే తప్పకుండా విచారణ జరగాలు. శిక్షార్హులు కావాలి.

ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తడం ఇదే మొదటి సారి కాదు. లోగడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, దాదాపు ఇంతే మోతాదులో, రాష్ట్రం వేధింపులనుండి రక్షించమని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జనవరి 1989 లో అలనాటి ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, హెచ్ కే బాబు  ఫిర్యాదు చేశారు. కాకపోతే, అప్పట్లో ఫిర్యాదుకు కారణం, ఇప్పటి లాగా సిబిఐ వేధింపులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండే ఏసిబి సంస్థ సుమారు నలభైమంది ఐఏఎస్‍లపై దర్యాప్తు చేపట్టడమే. అప్పట్లో ఐఏఎస్ అధికారులతో కొందరి ఐపిఎస్ అధికారులు కూడా జతగా తమ గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకోవడం విశేషం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం 1989 లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కల్యాణ కృష్ణన్ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. ఆర్. నాయర్‌ను ఢిల్లీకి పిలిపించారు కూడా . ఇప్పుడు కూడా రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగును కలిసి సిబిఐ మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో వుంది. ఏం జరుగనున్న దో వేచి చూడాలి. 

No comments:

Post a Comment