Monday, July 17, 2017

జిల్లా కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ లు : వనం జ్వాలా నరసింహారావు

జిల్లా కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-07-2017)

తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటై, రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 31 జిల్లాలున్నాయి. ఇన్ని జిల్లాల ఏర్పాటు ఒక విధంగా చెప్పుకోవాలంటే విప్లవాత్మకమైన ఒక భారీ పాలనా సంస్కరణ. కొత్త-చిన్న జిల్లాల ఏర్పాటుతో అతి పిన్న వయసులోనే చాలామంది ఐఏఎస్ అధికారులకి కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగింది. చాలామంది తమకప్పచెప్పిన బాధ్యతలను, బాధ్యతాయుతంగానే నేరవేరుస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపొతే అక్కడా-ఇక్కడా బహుశా అనుకున్న స్థాయిలో, ఆశించిన ఫలితాలు రావడంలేదా అన్న అనుమానం కూడా ఒక్కోసారి కలుగుతోంది. వీటిలో నిజా-నిజాలు ఏ మేరకో బేరీజువేసుకోవాల్సిన అవసరమైతే వుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష-సర్వే చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది. విధి నిర్వహణలో ఏ మేరకు చిత్తశుద్ధి, నిబద్ధత కనపరుస్తున్నారో కూడా నిర్ధారించాల్సిన అవసరం వుంది. సామాజిక స్థితిగతులు, రాజకీయ ఎత్తుగడలపై కొంతమంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు అవగాహన అంత ఎక్కువగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజం కావచ్చు-కాకపోవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే కొందరు పొంద గలగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొన నందువల్లనో, అనుకోనివి కొన్ని జరుగుతుండవచ్చు.  

"భారత ఉక్కు వ్యవస్థ" గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, ఐఏఎస్-"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్”, భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి వరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ, ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా,  పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన-కఠినమైన రాత-మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ  వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదేవరికీ. భారతదేశ భవిష్యత్ ఈ వ్యవస్తపైనే ఆధారపడి వుందని అనేవారు సర్దార్ పటేల్.

ఏడాది పాటు ముస్సోరీలో, మరో ఏడాది వారికి కేటాయించిన రాష్ట్రాలలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ అనంతరం, ఒక సబ్ డివిజన్ లో, సబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి కావి చూసే అవకాశం అలా లభిస్తుంది మొదటిసారిగా వారికి. దాంతో పాటే ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్-కలెక్టర్ తరువాత జాయింట్ కలెక్టర్ గా, సమగ్ర గిరిజనాభి వృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, అ తరువాత సుమారు ఏడెనిమిది సంవత్సరాలకు జిల్లా కలెక్టర్  గా నియామకం జరుగుతుంది.  తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరగడం వల్ల, నాలుగైదు ఏళ్ల సర్వీసున్నవారికి కూడా కలెక్టర్ గా పనిచేసే అవకాశo లభించింది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు.

అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్" గా పనిచేయడమే! ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన  బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా సహజంగా తప్పులు దొర్లడం సహజం.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి శాఖాధిపతులుగా నో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగానో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు వారి-వారి సామర్థ్యాన్ని, చాక చక్యాన్ని, పలుకుబడిని బట్టి. జిల్లా కలెక్టర్లుగా పని చేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరి కొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి.


ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత అటు తరువాత సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో చదువులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ తర్వాత అంత, లేదా, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో, కేంద్ర కాబినెట్ కార్యదర్శిగానో, కేంద్ర సర్వీసులలో హోం, విదేశాoగ శాఖ కార్యదర్శిగానో  నియామకం కావడం. ఆ అవకాశo అతికొద్ది మందికి మాత్రమె దక్కుతుంది.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న బాధ్యతల దృష్ట్యా, ఈ వ్యవస్థలో కొంత మార్పు తేవడం అవసరం. గ్రామీణ అవసరాల మీద పట్టున్న కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమిస్తే బాగుంటుందేమో అని కొందరు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్తాయిలో తుచ తప్పకుండా చేయాలంటే కొందరు సీనియర్లను జిల్లాలకు పంపడం మంచిదేమో! తప్పదేమో!

రాష్ట్రంలోని కనీసం మూడోవంతు జిల్లా కలెక్టర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారులనే నియమిస్తే మంచిదేమో!. వారి పాలనానుభువం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగించబడటంతో పాటు అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకొనే అవకాశం వీరికి మరో మారు లభిస్తుందిగ్రామీణ భారతాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాంటివి ఇప్పుడు లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయాలిరాష్ట్రానికి, ప్రజా సమస్యలకు, గ్రామస్థాయి పధకాల అమలుకు దూరంగా పనిచేస్తున్న అధికారులను సీనియారిటీ పేరుమీదనో, ’మరే కారణంగానోఅత్యున్నతమైన పదవులకు ఎంపిక చేయడం సమంజసం కాదు. సీనియర్ ఐఏఎస్ కలెక్టర్ల మార్గదర్సకత్వంలో జూనియర్లు పనిచేసే అవకాశం ఇచ్సినట్లవుతుంది.

ఇదిలా వుంటే, సివిల్ సర్వెంట్లకు-మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ కూడా వుంది.  మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ.  బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం.  ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం.  మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మంత్రులు చట్టసభలకు జవాబుదారీ అయినట్లే, సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి.  మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.  తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం.  ప్రభుత్వాలు మారినా వారి ఈ కర్తవ్యం మారదుఅధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి-వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలితమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమల్లో ప్రభుత్వానికి అండదండగా ఉండాలి.

ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి.  దాని అధినేత ముఖ్యమంత్రి.  సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది.  పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి.  తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి.  మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి

          సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది.  ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు.  అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం పెరుగుతాయి.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.


          ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి, వారి అనుభవాన్ని గ్రామీణాభివృద్ధికి, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు, పటిష్టమైన పాలనా వ్యవస్త రూపుదిద్దుకునేందుకు చర్యలు చేపట్టితే మంచిదేమో! END

No comments:

Post a Comment