Sunday, July 2, 2017

లంకానగరాన్ని తేరిపార చూసిన హనుమంతుడు .....ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?:వనం జ్వాలానరసింహారావు

లంకానగరాన్ని తేరిపార చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ 
ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (02-07-2017)

          సురస పోయినతర్వాత అలక్ష్యం చేయరాని సముద్రాన్ని వదిలి, గరుడ వేగంతో, ఆకాశానికి లంఘించి భయంకరంగా, హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. (అంటే సురసతో జరిగిన సంభాషణంతా నీటిమట్టానికి పైనే జరిగిందని అర్ధమౌతుంది)

          దొంతర, దొంతరలుగా కమ్ముకున్న మబ్బులు, పరుగెట్తున్న పక్షులు, తుంబురుడులాంటి సంగీత విద్యానిపుణులు, కాంతివంతమైన ఇంద్ర ధనస్సు, పెద్దపులి, సింహం, ఏనుగులు వాహనంగా కలవారు, గొప్ప విమానాలు, వజ్రాలు, పిడుగుల రాపిడితో పుట్టిన మంటలు, స్వర్గానికి వెళ్తున్న పుణ్యాత్ములు, దేవతలు భుజించే అన్నాన్ని తీసుకెళ్తున్న అగ్నిహోత్రుడు, చంద్ర-సూర్యది గ్రహాలు, చుక్కలు, అశ్వినీ మొదలైన నక్షత్రాలు, దేవ ఋషులు, దేవతలు, ఆకాశమార్గాన సంచరించే ఇతరులు, నాగులు, యక్షులు, దేవ గంధర్వులు, కిన్నరుల కలయికతో కూడిన బ్రహ్మ నిర్మిత ఆకాశమార్గాన, సూర్య-చంద్రులు పయనించే దారిని (ఖగోళ రహస్య సంచారమార్గం) కూడా దాటుకుంటూ ఏ ఆధారం లేకుండా దూసుకుపోతున్నాడు ఆంజనేయుడు.

          వేగంతో అతిశయించి పోతున్న హనుమంతుడిని చూసి, "సింహిక"అనే రాక్షసి తన సహజమైన పాపపు బుధ్ధితో ఆలోచించి, ఆహా...పుణ్యాత్మురాలనైనానను కుంటుంది. ఆహారం దొరకక ఎన్నోరోజులైన ఆ రాక్షసికి ఏదో వింత జంతువు దొరికి, ఆకలి తీర్చనున్న భావన కల్గి, హనుమంతుడి నీడను తన ఆకారంతో పట్టుకుంటుంది. ఎదురుగాలి తగిలిన పడవలాగా అయిందప్పుడు హనుమంతుడికి. వేగం తగ్గింది. దుఃఖం కూడా కలిగింది. నాలుగు దిక్కులు పరికించి చూడగా  ఓ భూతం సముద్రం నుండి లేవడం గమనించాడు. సముద్రంలో సరీగ్గా ఇదే చోట్లో, తన నీడను పట్టుకోబోయే అంగారక గ్రహం వున్నదని సుగ్రీవుడు తనకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు బుధ్ధిమంతుడైన హనుమంతుడు. కోపం వస్తుంది. వెంటనే భయంకరమైన కొండలాగా, వానాకాలపు మబ్బువలె, శరీరాన్ని ఎత్తుగా, వెడల్పుగా పెంచుతాడు. అది చూసిన రాక్షసి పాతాళ గుహవంటి భయంకరమైన తన నోరు తెర్చి, మేఘం లాగా గర్జించి, సునాయాసంగా ఆంజనేయుడిని తినేద్దామని ముందుకొచ్చింది. అప్పుడాంజనేయుడు దాని శరీరాన్ని, విప్పిన నోటిని, మర్మ స్థానాలను, పరిశీలించసాగాడు. (ఈ విధంగా ప్రాణస్థానాలను పరిశీలించడం ఎందుకంటే, ఎక్కడ దెబ్బ తీస్తే అది వెంటనే చస్తుందో తెలుసుకునేందుకే)

          ఇలా పరిశీలించిన వెంటనే అదను చూసి, వజ్రం లాంటి దేహమున్న హనుమంతుడు, శరీరాన్ని చిన్నదిగా చేసి, దాని నోట్లో దూరాడు. దేవతలది చూసి ఆందోళన చెందారు. వారలా భయపడ్తుండగా, దాని పేగులను మొలకల్లాంటి తనగోళ్లతో అతివేగంగా, అతితొందరగా, ఆరాక్షసి భరించలేని రీతిలో, నోరు మూసేలోపల, చీల్చి బయటకు దూకాడు మహావీరుడు ఆంజనేయుడు. (ఈ సింహిక అనే హింసిక జలాంతర్గామి లాంటిది. సముద్రంలో వుండి కాపలా కాస్తున్నది కాబట్టే, చుట్టూ సముద్రం ఆవరించి వున్న తన లంకా నగరానికి ఎవ్వరూ ప్రవేశించజాలరనే విశ్వాసం రావణుడికుంది)


          ఎదుటి వారిని దిగ్భ్రాంతి చెందేటట్లు చేసే ధైర్యం, బుధ్ధి, చమత్కారం, దృష్టిబలంతో ఆరాక్షసి గర్వభంగం చేసి తన పూర్వాకారానికి వచ్చి, యదావిధిగా ప్రయాణం కొనసాగించాడు హనుమంతుడు. మర్మస్థానాలు తెగిన రాక్షసి సముద్రంలో పడి చచ్చింది. దేవతలు యధాప్రకారం హనుమంతుడిని పొగడ్తూ: "నీవు చేసిన పని ఇతరులకు అసాధ్యం. తలపెట్టిన పనిని సాధించేందుకు త్వరగా వెళ్లు. నీకు మేలు కలుగుతుంది. ఏపని ఎట్లా చేస్తే జరుగుతుందోనని ఆలోచించేందుకు అవసరమైన బుధ్ధి, చమత్కారం, సామర్ధ్యం, ఎదుటివారి రహస్యం తెలుసుకోగల శక్తి వున్నవారికి అసాధ్యమనేది లేదు" అంటారు. (ఈరాక్షసి, "సింహిక" లేక "అంగారక" చరిత్ర ముముక్షువునకు దుష్టగ్రహ భూతాలవల్ల, దుష్ట జనులవల్ల కలిగే బాధలను సూచిస్తున్నది. ఇట్టి విరోధభావంగల వారిపై దయ, గౌరవం చూపాల్సిన పనిలేదు. వారిని చంపడమే సరైన చర్య)

దేవతలంటున్న మాటలను ఆలకిస్తూనే తనువచ్చిన పని పూర్తి చేసుకోపోయే ఉపాయాన్ని ఆలోచిస్తూ. ఆకాశాన్నుండి కిందకు దిగే ప్రయత్నం చేసాడు హనుమంతుడు. గరుత్మంతుడు నేలపైకి వాలేవిధంగా దిగసాగాడు. దిగుతూ, పెద్ద-పెద్ద చెట్లతో, ఎంతో విశాలంగా వున్న, తను దిగాల్సిన తీరాన్ని దగ్గరనుండి చూస్తాడు. ఆ ప్రదేశాన్ని, అతి మనోహర ద్వీపమందున్న మలయ పర్వతాన్ని, దగ్గరున్న చెట్ల సమూహాన్ని, సముద్రాన్ని, దాని ఒడ్డును, నది-సముద్రం కలిసే చోటును, పరికించి చూసాడు హనుమంతుడు.

          (మలయ పర్వతమనే ఓపర్వతం లంకలో కూడా వుంది. నదులొచ్చి సముద్రంలో కలిసినట్లుగానే సీతాదేవి భర్తను కలవబోతున్న విషయం సూచించబడిందిక్కడ. హనుమంతుడికిక్కడ ముత్తైదువుల ముఖదర్శనం అయిందని కూడా వర్ణించబడింది. ఇది శుభశకునాన్ని సూచిస్తుంది.

          సముద్రానికి ఆవలి ఒడ్డున-ఈవలి ఒడ్డున మలయపర్వతాలున్నట్లు చెప్పడం వలన, ఒకానొక రోజుల్లో, లంక దక్షిణ హిందుస్థానం ఒకేభాగంలో వుండి, మధ్యలో సముద్రం లేకపోయివుండవచ్చునన్న అభిప్రాయం వుండేది)

          ఆ క్షణంలో, ఆకాశాన్నే మింగే ప్రయత్నంలో వున్న చందాన కనిపిస్తున్న తన శరీరాన్ని, దాని అభివృధ్ధిని చూసుకుంటూ, ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఇంత పెద్ద శరీరంతో కనిపిస్తున్న తనను ఒక వింత జంతువుగా రాక్షసులు భావించి వేడుకగా తన చుట్టూ తిరుగుతారేమోనన్న అనుమానం కలుగుతుంది. అప్పుడు తానెట్లు సీతాన్వేషణ చేయగలడు? ఆని ప్రశ్నించుకుంటాడు హనుమంతుడు. కొండంత శరీరాన్ని తక్షణమే చిన్నదిగా చేస్తాడు.

          ఆరడుగుల పొడగుండే శరీరమే "నేను" అన్న అజ్ఞాని ఆత్మలక్షణం తెల్సుకొని, ఈ దేహం "నేను" కాను, నేను కేవలం అణువంతవాడినేనని, తన యదార్ధ స్వరూపజ్ఞానంలో నిల్చినట్లుగానూ, వామనావతారంలో బలిచక్రవర్తిని అణగదొక్కి విష్ణుమూర్తి తిరిగి తన స్వరూపాన్ని గ్రహించినట్లుగానూ, హనుమంతుడు తన నిజస్వరూపాన్ని పొందాడు.


          అనేకానేక రూపాలను ధరించే హనుమంతుడు, సముద్రపు ఆవలి ఒడ్డున వున్న మనోహరమైన మంచు శిఖరప్రదేశాల కొనను చూసి, ఒడ్డుకు దూకి, త్రికూటపర్వతం మీదినుంచి దేవేంద్రుడి పట్టణంతో సరితూగే వనసమూహాలతో ప్రకాశిస్తున్న లంకానగరాన్ని తేరిపార చూసాడు.

No comments:

Post a Comment