Sunday, July 23, 2017

"ప్రదోష” కాలంలో లంకలో ప్రవేశించేంచిన హనుమంతుడు..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?:వనం జ్వాలానరసింహారావు

"ప్రదోష” కాలంలో లంకలో 
ప్రవేశించేంచిన హనుమంతుడు

ఆంధ్రవాల్మీకి వాసుదాసు 
సుందరకాండ ఎందుకు చదవాలి?

వనం జ్వాలానరసింహారావు

సూర్య దినపత్రిక (24-07-2017)

          తూర్పు తిరిగి సూర్యుడికి నమస్కరించి హనుమంతుడు లంక దాటేందుకు ప్రయత్నించాడు మొదట్లో. అంటే ఆయన బయలుదేరినప్పుడు ఉదయం ఏడెనిమిది గంటల సమయమై వుండాలి. తీరందిగి కొండెక్కి ఎంతోసేపు ఆలోచన చేసినప్పటికీ, ఇంకా పొద్దుగుంక లేదని చెప్పడమంటే, తీరందిగేటప్పటికి నాలుగు గంటలై వుండాలి. ఉదయం ఎనిమిది గంటలకు బయల్దేరి, సాయంత్రం నాలుగు గంటలకు తీరం దిగాడంటే, ఎనిమిది గంటల్లో సముద్రాన్ని దాటుండాలి. దీంట్లో ఓ గంట కాలం విఘ్నాలతో వ్యర్ధమై వుండొచ్చు. ఏడు గంటల కాలంలో రెండొందల ఏభై మైళ్లు ప్రయాణం చేసాడన్నమాట. అంటే సగటున గంటకు ముఫ్పై ఆరు మైళ్లు పోయుండాలి. ఇదేం గొప్పకాదు. ఎందుకంటే తిరుగు ప్రయాణం ఒక్క గంట లోనే పూర్తిచేస్తాడు

          సూర్యుడు అస్తమించగానే, పిల్లి ఆకారంతో, "ప్రదోష"  కాలంలో, లంకలో ప్రవేశించేందుకు, కొండ దిగి నడిచి రాకుండా, అక్కడి నుండే ఒక్క గంతేసాడు హనుమంతుడు (భోజనం, మైధునం, ప్రయాణం, తలంటు, హరిదర్శనం, ఇతర శుభ కార్యాలు ప్రదోష వేళ చేయకూడదు. అయినా హనుమంతుడు అందుకు పూనుకున్నాడు. ఎందుకీ పని చేసాడన్న అనుమానం రావచ్చు. అర్చకులను, పరిచారకులను, వైశ్ణవులను, జ్ఞానులనుసన్యాసులను, దాసీ-దాసులను, ప్రదోషం బాధించదు. హనుమంతుడు జ్ఞానీ, వైష్ణవుడూ, రామదాసూ, కాబట్టి, స్వామి కార్యంలో ఆయనకు ప్రదోష బాధ కలుగదు).

          మేడల వరుసలతో ప్రకాశిస్తున్న నాల్గు చదరాల దారులను, బంగారం, వెండి స్తంబాలతో ప్రకాశిస్తూ బంగారు కిటికీలున్న ఏడెనిమిదంతస్థుల మేడలను, గంధర్వ నగరాలను పోలివున్న మేడలతో స్ఫటికాలు పరువబడ్డ రాక్షసుల ఇండ్లను, వాటిలోని బంగారం, వైడూర్యాలు, ముత్యాలు, పగడాలతో కూడిన అలంకరణను, ఆ ఇండ్ల వరుసను, వాటి రక్షణకై నియమించబడిన, శ్లాఘించదగిన కఠిన రాక్షసులను లంకా నగరం ప్రవేశిస్తూనే చూసాడు హనుమంతుడు. ఇలా వుంటుందీ లంకని ఆలోచనకైనా రాని దీన్ని రావణ రక్షణలో వుండగా సాధించడమంటే మాటలా? ఇది సాధ్యమయ్యేదిగాలేదని వ్యాకుల పడికూడా సీతాదేవి ఇందులో వున్నది కనుక, ఆమెను తాను దర్శించాలన్న కోరికతో సంతోషించాడు హనుమంతుడు.

          చంద్రుడాసమయంలో (లోగడ సముద్రుడు, మైనాకుడు, సూర్యుడు లాగా) హనుమంతుడికి తోడ్పడడానికి వచ్చాడా అన్నట్లు, భూమ్యాకాశాలను తన కాంతితో కప్పేస్తూ, చుక్కల నడుమ చక్కగా కనిపించాడు. ఆరోజు ఫాల్గుణ శుధ్ధ త్రయోదశీ తిధి. రాత్రి ఏడున్నర గంటల కాలం (ఆశ్వయుజ శుధ్ధ త్రయోదశీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో చంద్రుడిని చూస్తూ పై వ్యాఖ్య రాయబడింది.  అప్పుడు చంద్ర బింబం నిర్మలంగానూ, వెన్నెల శుబ్రంగానూ వుంది). శంఖం, పాలు, తామరతూడు వంటి తెల్లని కాంతిగలవాడై మనోహర రూపాన ప్రకాశిస్తూ కనిపిస్తున్న చంద్రుడిని, తామర కొలనులోని నీట్లో ఆడుతున్న హంసలాగా సంతోషంతో చూసాడు హనుమంతుడు.

          వరుస ఉద్యానవనాలతో, రమ్యమైన నీటితో, శరత్కాల మేఘాల్లాంటి తెల్లటి ఇండ్లతో, సముద్ర ఘోషకు సమానమైన చప్పుళ్లతో, ఇంపైన వాకిళ్లు, తోరణాలతో, మెల్లగా వీస్తున్న పిల్లగాలులతో, బంగారువన్నె ఇంటి ప్రహరీ గోడలతో, మంటపాలతో అలరారుతూ, చిరుగజ్జెల సవ్వడితో కీర్తికెక్కిన అమరావతీ, భొగవతీ నగరాలను మరిపించే లంకాపురిని ప్రవేశించడానికి లంబ పర్వతంపైనుండి దిగుతాడు హనుమంతుడు. ఆయన దిగిన లంబ పర్వతమప్పుడు చీకట్లో వేలాడే పర్వతంలాగా వుంది. ఆలకాపురితో సమానంగా, చక్కటి పోషణలో వుంటూ, బలీయమైన సేనల గుంపులతో, మెరుపులతో నిండిన మేఘంలాగా, ఎంతో చిత్ర, విచిత్రంగా వుందే ఈ లంకానగరం! అనుకుంటాడు హనుమంతుడు.


          ఇంద్రుడి పట్టణమైన "వస్వౌకసార"ను, యముడి పట్టణమైన  "సమ్యమని"ని, వరుణుడి పట్టణమైన "సుఖ"ను, సోముని పట్టణమైన "విభావతి"ని, పవమానసుతుడు జ్ఞప్తికి తెచ్చుకున్నడు, లంకానగర సౌందర్యాన్ని చూసి. ఇట్లా మనసులో అనుకుంటూ, ప్రాకార సమీపాన్నుండి లంకానగరాన్నొక్కసారి తేరిపార చూస్తాడు హనుమంతుడు. బంగారు తలుపులు, వైడూర్యపు అరుగులు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో కట్టబడిన నేలలు, బంగారపు తొడుగులతో వున్న ఇళ్లు, శుభ్రంగా వున్న సోపానాలు, ఆకాశానికి ఎగురుతున్నారా అనిపించే బలవంతులు, హంసలు, నెమళ్లు కలిసి చేస్తే వచ్చే ధ్వనితో నిండిన ఆకాశం కనిపిస్తాయి హనుమంతుడికి. ఇంద్రుడి పురమనదగి, మనోహరమైన ఆరావణుడి పట్టణాన్ని, దాని గొప్పతనాన్ని తిలకించి, ఎంతో సంతోషంతో దాన్ని గురించి మరీ, మరీ అనుకుంటాడు మనస్సులో హనుమంతుడు.

          ఒరనిండా, చేతిలో, కత్తులుంచుకుని తిరిగే సైనికుల రక్షణలో వున్న ఈపట్టణాన్ని బలంతో గెలవడం ఎవరికీ సాధ్యం కాదేమో ననుకుంటాడు హనుమంతుడు. అయితే, అంగదుడు, ద్వివిదుడు, సుగ్రీవుడు, మైందుడుసుషేణుడు, రుక్షుడు, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు మాత్రం లంకలో ప్రవేశించ గలరనుకుంటాడు. (మొదట్లో లంకను చూసినప్పుడు నలుగురు మాత్రమే లోనికి రాగలరనుకుంటాడు. ఇప్పుడు ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచాడు. కార్యభారం తెలియని మూర్ఖులు, మొదట్లో తమను, తమవారిని, ఎక్కువగా అంచనా వేసుకుంటారు. చివరకు వెల్లికిలా పడ్తారు. ఆలోచనాపరులు, బుధ్ధిమంతులు, కార్యభారం తెలుసుకుని, ఇది మనం చేయలేస్తామా? మనవల్ల జరుగుతుందా? అని తొలుత జంకుతారు. ఎట్లాగూ ఈపని నెరవేర్చక తప్పదుకదా! అని, కొంచం, కొంచం చేయడం మొదలెట్టి, క్రమంగా ధైర్యం తెచ్చుకుంటారు. కార్యాన్ని సాధిస్తారు. ఇన్ని ఆలోచనలు చేసినప్పటికీ, తానొక్కడే రాక్షసులను జయించి, లంకను కాల్చి వచ్చాడు గదా హనుమంతుడు)


         ఈప్రకారం, లంకలోకి రాగల బలవంతులగు వానరులను లెక్కపెట్టి, రామలక్ష్మణుల బలపరాక్రమాలను ఆలోచించి, భయపడాల్సిన పనిలేదు, వారు వస్తే విజయం కలుగుతుందని సంతోషపడ్తాడు, (రామలక్ష్మణులు కూడా ఇక్కడ ఏమీచేయలేరని మొదట్లో అధైర్యం పొందినా ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటాడు). ఇలా ఆలోచిస్తూ మరీ, మరీ సమీపంలోకి పోతాడు హనుమంతున్తుడు. పోతున్న అతడికి, రావణుడి పట్టణం, మణులనే దుస్తులు కప్పుకొన్నట్లుగా, పశువుల కొట్టంలాంటి శిరోభూషణాలు కలదిగా, యంత్రశాలను పోలిన స్తనాలున్నట్లుగా, అలంకరించుకున్న స్త్రీ లాగా కనిపిన్చింది. (లంకా నగరాన్ని స్త్రీలాగా వర్ణించడమంటే లంకాధి దేవత రాక సూచించడమే). ఆయన ఇలా లంకను గురించి అనుకుంటుండగానే లంక స్త్రీగా రానే వచ్చింది.

No comments:

Post a Comment