Sunday, July 9, 2017

ఆకాశాన వున్న స్వర్గంలాగా కనిపించిన లంక ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

ఆకాశాన వున్న స్వర్గంలాగా కనిపించిన లంక 
ఆంధ్రవాల్మీకి వాసుదాసు 
సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (10-07-2017)

ఇతరులకెవరికీ దాటేందుకు సాధ్యపడని సముద్రాన్ని సులభంగా, అవలీలగా దాటి, త్రికూటపర్వత శిఖరమందున్న లంకను చూసిన తర్వాతనే హనుమంతుడి మనస్సు కుదుటపడింది. (హనుమంతుడు సముద్రాన్ని ఆకాశమార్గాన్నే లంఘించాడని రామాయణంలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ఎగురలేదు.... ఈదిపోయాడు, అని వాదించే వారు కూడా వున్నారు). బహిరంగంగా తనుతిరిగితే రాక్షసులు చూస్తారేమోనన్న అనుమానంతో, ఉద్యాన వనంలోని చెట్ల చాటున తిరుగుతున్న ఆంజనేయుడిపై వృక్షాలు జల-జలా పూలు రాల్చాయి. ఆ పూల వాసనలను తన మీదుగా వ్యాపింపచేస్తూ హనుమంతుడు ఆపాదమస్తకం పూలతో నిండిపోయాడు (ఇక్కడ పుష్పాభిషేకం శుభసూచకమని అర్ధమవుతోంది). ఈ విధంగా నూరుయోజనాల సముద్రపు నిడివిని, ఎక్కడా మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, ఓ నిట్టూర్పైనా విడువకుండా, వేగంగా, హనుమంతుడు దాటడం విశేషం.

           (హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాడని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, ఇప్పుడు సముద్రమంత వెడల్పు లేదుకదా?...రావణాసురుడి లంక ఇదేనా?....అని కొందరు సందేహపడుతుంటారు. అయితే, కొన్ని బౌధ్ధ ప్రామాణిక గ్రంథాలను చదివినవారికి ఈ అనుమానం నివృత్తి చేసుకునే ఆధారాలు లభ్యమవుతాయి. ఇంద్రజిత్ హోమం చేసిన "నికుంభిల", సీతాదేవిని వున్చిన "అశోకవనం" ఇప్పటికీ వున్నాయక్కడ. అక్కడ సీతాదేవి పూజించబడుతున్నదనీ, "రావణకోట" అనే స్థలం కూడా వున్నదనీ, స్పష్టమవుతున్నది. దీన్నిబట్టి సింహళద్వీపమే ఈనాటి శ్రీలంక, ఒకనాటి లంక. అయితే, ఇప్పుడు సింహళద్వీపానికీ, మనదేశానికీ, మధ్యవున్న సముద్రం వెడల్పు అరవై మైళ్లే. నూరుయోజనాలకు, అరవై మైళ్లకు ఎంతోవ్యత్యాసముందని అనుకోవడం సహజం కదా. ఇకపోతే యోజనం కొలత, ఇంత అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎనిమిది మైళ్లని కొందరు, రెండున్నర మైళ్లని కొందరు లెక్కలు చెప్తారు. అదే విధంగా "ఆమడ", "క్రోసు"ల విషయంలో కూడా స్పష్టత లేదు. ఇప్పటిమైలు (1760 గజాలు) పూర్వంలేదు. కావున యోజనం అంటే, ఖచ్చితంగా ఇన్ని మైళ్లని నిర్ధారించలేం . అంతే కాకుండా ఇప్పుడు సముద్రం అరవై మైళ్లే అయినప్పటికీ, రామాయణ కాలంలో, ఎక్కువై వుండవచ్చు. సముద్ర భాగమ్ విశేషంగా పూడిపోయి క్రమేపీ నేలగా మారిందని శాస్త్రవేత్తలు వ్రాసి వున్నారు....వ్రాస్తున్నారు కూడా. ఇప్పటి రఘునాధ పురానికి దక్షిణ భాగమంతా పూర్వం సముద్రంగా వుండేది. అదే విధంగా, పురాణాలలో చెప్పిన దాన్ని బట్టి, ఇప్పటి తిరువాన్‍కూర్ పూర్వం సముద్రంలో మునిగుండేదట. అలాంటప్పుడు నేటి తిరునల్‍వెళ్లి సముద్రంలో మునిగి వుండవచ్చుకదా! రామాయణంలో చెప్పబడ్డ "త్రికూటం", "లంబపర్వతం", "సువేల" అనేవి లంకకు దక్షిణ భాగాన వున్నవేకాని, ఉత్తర భాగంలో లేవు. కాబట్టి ఇప్పటి లంకలోని ఉత్తర భాగం కూడా సముద్రంలో మునిగే వుండాలి. లేదా హనుమంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి అక్కడకైనా పోయుండాలి. ఈ పర్వతం చుట్టూ సముద్రమున్నదన్నాడుకాని, గ్రామాలున్నట్లు వాల్మీకి చెప్పలేదు. "సువేల" అన్న పదమే సముద్ర తీరమన్న అర్ధాన్ని చెప్తోంది. లంకలోని ఇప్పటి ఉత్తర రేవుకు, త్రికూటానికి, మధ్య దూరం, నూరు మైళ్లకు పైనే వుంది. కాబట్టి హనుమంతుడు దాటింది రెండొందల ఏభై మైళ్లని తేలుతున్నది. అంటే నూరుయోజనాలు రెండొందల ఏభై మైళ్లకు సమానం కావచ్చు)

           అలుపూ, సొలుపూ లేకుండా, ఎన్ని ఆమడల దూరాన్నైనా దాటగల సత్తా నాకుండగా, నూరు యోజనాలొక లెక్కా! అనుకుంటూ, పరిమళించే తోటలను, నిర్మలమైన పచ్చిక బయళ్లను, చిన్న చిన్న గుట్టలను, పరికిస్తూ హనుమంతుడు కొండ పైనుండి చూస్తాడు. గాలికి కదుల్తున్న రెమ్మలు, కొనకొమ్మలు, వాటిపైనున్న పక్షుల సమూహాలున్న చెట్లను చూసాడు హనుమంతుడు. హంసలు, కన్నెలేళ్లు, తామర, కలువ పూలున్న దిగుడుబావులు, క్రీడాస్థలాలు, మడుగులు, పూచే, కాచే చెట్లు, కమలములతో నిండిన అగడ్తలను కూడా చూసాడు హనుమంతుడు.


          సీతను దొంగిలించి తెచ్చిన రావణాసురుడు, ఆమెకు కాపలాగా విల్లు, బాణాలు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతుండే రాక్షస శ్రేష్ఠులుండే సమస్త ప్రదేశాలు కనిపించాయి ఆఝనేయుడికి. బంగారు మయమైన ప్రాకారాలూ, తెల్లని పెద్ద వీధులు, వందలాది అగడ్తలు, వాటిపైనున్న ధ్వజాలు, బంగారు తీగెల తోరణాలతో శోభాయమానంగా వున్న లంకను కొండ శిఖరాన్నుంచే చూసిన హనుమంతుడికది ఆకాశాన వున్న స్వర్గంలాగా గోచరించింది. (అయోధ్యకు "సాకేత"మనే పేరు, లంకకు "సింహళ"మనే పేరు ఇటీవల వచ్చినవే కాని పురాతన కాలంలో లేవు. సింహళం, సిలోన్, శ్రీలంక అయిన కారణం కూడా చెప్పారు చరిత్రకారులు).

లంకను చూసిన హనుమంతుడికది, ఆకాశంలో వ్రేలాడు తున్నట్లుగానూ, అవలీలగా ఎగిరిపోయేదానిలాగానూ, రావణుడి కాపలాదారుల రక్షణ కింద లోపరహితమైన కోటలున్న గొప్ప పట్టణం మాదిరిగానూ కనిపించింది. లంకను మొట్టమొదట విశ్వకర్మ నిర్మించాడు. కుబేరుడికి తొలుత స్థానమైంది. అంద-చందాలలో ఈవిధంగా ఉండవచ్చేమోనని ఉహించనలవికానిది. కోటగోడనే మొల, దాన్ని చుట్టి వున్న అగడ్తల నీళ్లనే చీర, శూలాలు, శతఘ్నులనే కొప్పు, అట్టములనే శిరోభూషణాలతో లంకానగరం స్త్రీలాగా వుంది హనుమంతుడి కళ్లకు.


          విశ్వకర్మ నిర్మితమై పాములతో నిండిన భోగవతి (పాతాళంలోని సర్పాల ముఖ్య పట్టణం) లాగా రాక్షసులతో నిండి, ఉత్తర ద్వారం కైలాస పర్వతం లాగా ఆకాశాన్ని తాకే ఎత్తైన ఇండ్లు కలిగి, భయంకరాకార రాక్షస సేనల గుంపుల కాపలా కిందున్న లంకా నగరాన్ని, దానికి అగడ్తగా చుట్టూ వున్న సముద్రాన్నీ చూసి ఆశ్చర్య పోయాడు హనుమంతుడు. దేవతలను జయించిన రావణాసురుడి పరాక్రమం ఇంతా అనుకుంటాడు. ఈ లంకకు వానరులు ఏవిధంగా రాగలరని, ఇంత సముద్రాన్ని అందరూ ఎట్లా దాటగలరని, ఒకవేళ నిర్బంధంగా రాగలిగినా, వారి ప్రయాణం వ్యర్ధమై తిరిగి పోవాలేమోనని, తనలో తను అనుకుంటాడు హనుమంతుడు

No comments:

Post a Comment