Monday, August 7, 2017

రావణాసురుడి అంతఃపురాన్ని చూసిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

రావణాసురుడి అంతఃపురాన్ని చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (08-08-2017)

ఇంటింటికి పోతూ, పలురూపాలతో, అసమాన సౌందర్యంతో అలరారుతున్న ఇళ్లను కన్నులపండుగగా తిలకించాడు వాయుపుత్రుడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి ఆపట్టణంలో వర్ణనాతీతమైన పలురకాల ధ్వనులు వినిపిస్తాయి. ఆ ధ్వనులేమిటంటే.....స్వర్గంలోని దేవతా స్త్రీలలాగా లంకలో, "రొమ్ము, కంఠం, శిరం" లో పుట్టిన మనోహర, మంద్ర, మద్యమ తారలనే స్వరాల రాక్షస స్త్రీలు పూర్ణ మదంతో ఆసక్తిగా చేస్తున్న గానధ్వనులు.....మనోహర రత్నాలు చెక్కబడ్డ రాక్షస స్త్రీల వడ్డాణాలలోని చిరుగజ్జెల ధ్వనులు.....అందెల ఝళం-ఝ్హళ ధ్వనులు.....అందెలు, మెట్టెలు, పాముజీలున్న కాలి ఆభరణాలు మెట్లకు తగులుతున్నప్పుడు కలిగే ధ్వనులు.....వీరులు భయంకరంగా సింహనాదం చేస్తున్న ధ్వనులు.....శూరులు భుజాలు తట్టుకున్నప్పుడు పుట్టిన ధ్వనులు.....జపాలు చేస్తున్నవారి ధ్వనులు.....మాంత్రికుల ధ్వనులు.....ఇలా పలు రకాల, రకరకాల ధ్వనులు.

          ఈ ధ్వనులకు తోడు, వేదాధ్యయనం చేసేవారిని, రాక్షస వందిమాగధులను, రాచబాటల నడుమ నిల్చున్న గుంపులను, వేగులను, గర్జించే రాక్షసులను, దీక్షక్శలో వున్నవారిని, జడలు పెంచుకుని తిరుగుతున్నవారిని, బోడితలల రాక్షసులను, ఎద్దుచర్మాలు ధరించిన వారిని, దర్భ పిడికిళ్లు, అగ్నికుండాలు ఆయుధాలుగా కలవారిని, సమ్మెటలు, ఇనుప గుళ్లు ధరించిన వారిని, ఒంటికన్ను, ఒంటిచెవి, వేళ్లాడే పొట్టలు, రొమ్ములు కలవారిని కూడా చూసాడు హనుమంతుడు. మిట్టపళ్లున్నవారిని, పెద్ద విల్లంబులు ధరించిన వారిని, పొట్టివారిని, వంకర నోటివారిని, బాకులు, రోకళ్లు, గుదియలు, ఇనుపముళ్ల గదలు ఆయుధాలుగ వున్నవారిని, కవచాలు తొడుక్కున్నవారిని, స్థూలకాయులు కానివారిని, కృశించని దేహాలున్నవారిని, మరీ పొడగరి కానివారిని, మరీ పొట్టి కాని వారిని, మరీ పచ్చని శరీరం లేనివారిని, కారునలుపు లేనివారిని, అంతగా గూనిలేనివారిని, వికార రూపాలున్నవారిని, సుందరులను, సుకాంతున్తులను, అనేక రకాలవారినికూడా హనుమంతుడు చూసాడు. వలలు, పాశాలు చేతుల్లో వున్నవారిని, గంధం అతిగా పూసుకున్నవారిని, పూలదండలు వేసుకున్నవారిని, విలువ కట్టలేని ఆభరణాలతో అలంకరించుకున్నవారిని, ఇష్టమొచ్చిన రీతిగా తిరిగే వారిని, రకరకాలుగా అలంకరించుకున్న వారిని, భయంకర బలవంతులను, ములికైన ఆయుధాలు ధరించిన వారిని, వజ్రాయుధం లాంటి ఆయుధాలు పట్టుకుని తిరిగేవారినీ చూసాడు హనుమంతుడు. వీరికి తోడుగా రావణాసురుడి ఇంటి ముందు, ఆయన ఆజ్ఞానుసారం కాపలాకాస్తున్న ఆయన మూలబలగాన్నీ చూసాడు హనుమంతుడు.

అక్కడే  చూసాడు రావణాసురుడి అంతఃపురాన్ని కూడ హనుమంతుడు. వర్ణనాతీతంగా వుందది. స్వర్గంతో సరిసమానమైన మనోహరధ్వనులు వినిపిస్తున్నాయక్కడ. గుర్రాల సకిలింపులూ, మనోహర భూషణ ధ్వనులూ వినిపించాయి. విమానం, పల్లకి, మదించిన ఏనుగులు, పక్షుల గుంపులు, జింకల్లాంటి వాటితో అందంగా కనిపిస్తూ, బలవంతులైన యుధ్ధభటుల రక్షణలో వుందా అంతఃపురం. బంగారం, ఇతర రత్నాలతో ప్రకాశిస్తున్న ప్రాకారంతో, విలువైన ముత్యాలు, రత్నాలతో అలంకరించబడిన లోగిలితో, అగరు చెక్కల కమ్మని వాసనలతో కూడి వున్న రావణాసురుడి అంతఃపురాన్నిచూసాడు హనుమంతుడు.


ఇంతవరకు పట్టణంలో సంచరించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురాన్ని బయటనుండే చూసి, ఆ తర్వాత లోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు శుధ్ధ త్రయోదశీ తిధి. సుమారు తొమ్మిదిన్నర గంటల ఆసమయంలో చంద్రుడు ఆకాశం మధ్యలో వెన్నెల కురిపిస్తున్నాడు ప్రకాశవంతంగా. హనుమంతుడు చూసిన ఆనాటి చంద్రుడు.....వినోదకరమైన వెన్నెల కాంతులను విరజిమ్ముతూ, అందమైన ఎడ్ల గుంపులో ఆబోతులా తిరుగుతూ, ప్రపంచమంతా తన చల్లటి కాంతిని వ్యాపింప చేస్తూ, జనాల మనస్సుల్లో సుఖపడ్తున్నామన్న ఆలోచన కలుగ చేస్తూ, ఉప్పొంగిన సముద్రుడి నృత్యాన్ని తలపిస్తూ, ఆబాలగోపాలానికి దుఃఖ నాశనం చేస్తున్నట్లున్నాడు.

భూమ్మీదున్న మందర పర్వతపు కాంతి, సాయం సమయంలో సముద్రంలో వున్న కాంతి, సరస్సులందలి తామరపూల కాంతిని పోలిన కాంతే చంద్రుడిలో వుందప్పుడు. వెండి పంజరంలోని హంసలా, మందర పర్వత గుహలోని సింహంలా, ఏనుగెక్కిన వీరుడిలా ఆకాశంలో వున్న చంద్రుడు, మనోహరంగా, అందమైన స్త్రీ ముఖంలా కనిపించాడు. వాడికొమ్ముల బలిష్టమైన ఎద్దులా, బంగారు కొమ్ముల ఏనుగులా, ఎత్తైన శిఖరమున్న తెల్లటి కొండలా వున్న చంద్రుడు ఆసమయంలో పరిపూర్ణ శృంగుడై(నిండిన కొమ్ములు) లోకాలకు ఇంపైన కాంతినిస్తూ ప్రకాశించాడు. (పాడ్యమి-విదియ-తదియలలో కనిపిన్చినట్లు చంద్రుడి కొనలు, త్రయోదశినాడు కనిపించవు. పూర్ణబింబానికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఊత్తర శృంగమని, దక్షిణ శృంగమని చంద్రుడి కొనలకు పేర్లు. ఆరాత్రి ఆశృంగాలు లేవు)

నశించిన మంచు తుంపరల్లా మాలిన్యరహితుడిగా, బృహస్పతి కాంతినే తన కాంతితో కప్పేసినవాడిగా, ఆశ్చర్యకరమైన కాంతికి ఆశ్రయమై నిర్మలాంకమున్నవాడిగా, అమిత కాంతితో వున్నాడప్పుడు చంద్రుడు. (ఈవర్ణనతో మన్చుకాలం వెళ్లిపోయి ఫాల్గుణ మధ్యంలో వున్నట్లు విశదమవుతున్నది. సూర్యకిరణాల సంబంధమున్నందువల్ల తానువెలుగుతూ చీకటిని తొలగిస్తున్నాడని కూడా తెలుసుకోవాలి. సూర్యకాంతి అద్దంపై పడితే ఎలా ప్రతిబింబిస్తుందో, అలానే జలమైన చంద్రుడిపై పడ్డ సూర్యకాంతి కూడా ప్రకాశిస్తున్నదన్న అర్ధం స్ఫురిస్తుంది)

          విశాలమైన బండరాతిపై కూర్చున్న సింహమా? భీకర సంగ్రామంలో  విజృంభించిన మత్తగజమా? రాజ్యం లభించిన రాజా? అనుకునేటట్లు, హంసలాగా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. అంత నిర్మలంగా వున్ది చంద్ర బింబమప్పుడు. త్రయోదశి నాటి ప్రదోష కాలంలో ప్రకాశిస్తున్న చంద్రుడి వల్ల చీకటి పటాపంచలయింది. రాక్షసులు, మాంసం తినే మృగాల సంచారం మొదలయింది. స్త్రీ-పురుషుల మదనతాపం, ప్రణయకోపం పెరిగింది. అలా తన తేజస్సుతో స్వర్గలోక సంతోషంతో సమానమైన ఆనందాన్ని కలిగించింది చంద్రబింబమప్పుడు.


సరిగ్గా ఆసమయంలో వినవచ్చాయి కమ్మని వీణానాదాలు. కనిపించారు....శృంగార చేష్టల స్త్రీలు....నిద్రాతిశయంతో భర్తల వెనుకబడడం....హింసకలవాటుపడ్డ మాంసభక్షకులు క్రూరమైన పనులు చేయసాగారు. భర్తలను విడిచి వున్న స్త్రీలు విరహతాపంతో బాధపడ్డారు. మద్యపానంతో శరీరాన్ని మరిచి ఏంచేస్తున్నారో తెలియని రాక్షసులుండే ఇళ్ల సముదాయాన్ని కనుగొంటాడు మారుతి. End

No comments:

Post a Comment