Sunday, August 27, 2017

ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? ....... రావణుడి అంతఃపురాన్ని పరిశీలించిన హనుమంతుడు : వనం జ్వాలానరసింహారావు

ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
రావణుడి అంతఃపురాన్ని పరిశీలించిన హనుమంతుడు
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (28-08-2017)

పుష్పక విమానం మధ్యలో, అర్ధ యోజనం వెడల్పు, యోజనం పొడవున్న రావణుడి ఇంటిని చూసి, అందులోకి పోయి, అక్కడ సీతాదేవి కనపడుతుందేమోనని వెతకసాగాడు హనుమంతుడు. మేడలనేకం వున్న రావణుడి నగరంలోని బలవంతులైన రాక్షసుల ఇళ్లలోనూ, రావణుడుంటున్న ఇంటిలోనూ, తనకార్యక్రమాన్ని కొనసాగించాడు మారుతి.

         ఆ ఇంట్లో మూడు-నాలుగు కొమ్ములున్న ఏనుగులు, దూరం-దూరంగా కట్టబడి వున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఆయుధాలెత్తి నిలబడ్డ యోధులు కాపలాకాస్తున్నారా ఇంటిని. రావణుడి భార్యలతో-వాడపహరించుకుని వచ్చిన స్త్రీలతో, రాచకన్నెలతో నిండి వున్నదా ఇల్లు. తిమింగలాలు, మొసళ్లు, పొడుగాటి చేపలు, ఇతర జలచరాలతో కలతచెంది అల్లకల్లోలమైన సముద్రంలా వుందా ఇంటి ప్రదేశం. కుబేరుడి సంపద, ఇంద్రుడి ఐశ్వర్యం, దిక్పాలకులందరి లక్ష్మి ఆ ఇంట్లోనూ, వాడి బంధువుల ఇండ్లలోనూ వుంది. ఇవన్నీ గమనించాడు హనుమంతుడు.

         అలాంటి అందాల మేడల మధ్యలో వున్న పుష్పక విమానానికి గతచరిత్ర ఎంతో వుంది. విశ్వకర్మ బ్రహ్మదేవుడి కొరకు రత్నాలతో పొదిగి ఆకాశంలో నిర్మించాడు దానిని మొదట. తనను సేవించిన కుబేరుడికిచ్చాడు బ్రహ్మ కొంతకాలం తర్వాత. కుబేరుడిని యుద్ధంలో గెల్చి, రావణుడు లాక్కున్నాడు దాన్ని. కృత్రిమ జింకల్లాంటి బొమ్మలతో అలంకరించబడిందా విమానం. బంగారపు కంబాలున్నాయి. ధగ-ధగ కాంతులు విరజిమ్ముతూంది. మేరునగమంత ఎత్తుగా వుంది. ఆకాశాన్ని రాసుకుంటూ, మిట్టమధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తున్నది. బంగారపు మెట్లు, అరుగులు, కిటికీలున్నాయి. నీలాలు, పగడాలు, మంచి ముత్యాలతో చెక్కబడిందది. అట్టి హంగులున్న విమాన ప్రదేశం పైకెక్కాడు హనుమంతుడు. (ఎంతమంది ఎక్కినా మరొకరికి స్థానంకూడా కలిగి వుండటాన్ని పుష్పక విమానంతో పోలుస్తుంటాం మనం. కానీ ఆంధ్ర వాల్మీకి అలా చెప్పలేదు-వాల్మీకి అలా అనలేదు. ఇది గమనార్హం.)

         ఆ సమయమ్లో అప్పచ్చులు, పాకాలు, పులిహోర, దధ్యోదనము, కేసరీబాత్, వాంగీబాత్ లాంటి వంటకాల కమ్మని వాసనలు హనుమంతుడిని సంతోషపెట్తూ, తనను బంధువులా రావణాసురుడు తింటానికి రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. ఆవాసన జాడపట్టుకుని పోసాగాడు హనుమంతుడు. పోతూ గమనించాడెన్నో దృశ్యాలను. మనోహర రత్న సోపానాలున్న, బంగారు కిటికీలున్న, దంతపు బొమ్మలున్న, పగడాలు, ముత్యాలు, బంగారం, వెండి కలయికల పటుత్వంతో తీర్చిన స్తంబాలున్న, ఆకాశానికెగురగల చిత్రాలు దిద్దిన కంబళ్లున్న, ఇంపు-సొంపైన పొడవాటి సున్దరీమణిలాన్టి-రావణుడి ప్రియభార్య కాగల లక్శణాలున్నటువన్టి, ఇన్టిని చూస్తాడు హనుమన్తుడు. కమ్మని సువాసనలు వ్యాపిన్చి-పక్శుల ధ్వనులు మిన్నుముట్టుతున్డగా-మెత్తని పరుపులు కాంతులీనుతుండగా, రావణాసురుడు తిరిగే ఆ ఇల్లు, సాంబ్రాణి-అగరు వత్తుల పొగలతో, ధూమ్రవర్ణంతో అలరారింది.


         రావణాసురుడి రక్షణలో వున్న ఆ ఇల్లు, ఇంపైన ధ్వనులతో వీనులకు-రూపాలతో కళ్లకు-త్రాగటానికి ఇంపైన వాటితో చర్మానికి-వాసనలతో ముక్కుకు-నోరూరిస్తూ నాలుకకు తృప్తినిచ్చాయి హనుమంతుడికి. ఈ పంచేంద్రియ సుఖాలు తల్లివలె తృప్తినిచ్చాయి హనుమంతుడికి. (భార్య వల్ల కలిగే సుఖాలు "తల్లివలె" అనడంలో అర్ధం, హనుమంతుడి జితేంద్రియత్వాన్ని గురించి చెప్పడమే).

         (పైవర్ణనంతా కవి చేస్తూ, ముత్యాల గురించిన వివరణ ఇస్తారు కవి. ముత్యాలు: మేఘాలలో-పాముపడగలలో - వెదుళ్ళలో - చేపల్లో - ఏనుగుకుంభాల్లో - చెరకుల్లో-శంఖాల్లో - పంది కోరల్లో - ముత్యపు చిప్పల్లో, పుట్తాయట. మేఘాల్లో పుట్టేవి మానవులకు లభించవు. పాముపడగలోని ముత్యం గురివింద గింజ వన్నెలో వుంటుంది. వెదురులో పుట్టేది మినుప గింజంత పరిమాణంలో నక్షత్ర కాంతికలిగి స్త్రీ వశీకరణకు వుపయోగపడ్తుంది. చేపతలపై వుండే ముత్యం తెల్లగా-మల్లెపువ్వులా వుంటుంది. ఏనుగు కుంభంలో దొరికేది వుసిరి కాయంత వుంటుంది. చెరకులో లభ్యమయ్యేది ప్రేంకణపు పూవు చాయలో వుంటుంది. పంది కొమ్ములోది రేగిపండంత ఆకారంలో, కుంకుమ ఛాయలో వుంటుంది. వెదురు ముత్యాలు కోడిగుడ్డంత వుంటాయి. ఇవి మంత సాధకులకు లభిస్తాయి. స్వాతివాన చినుకులు ముత్యపు చిప్పల్లో పడితే మంచి ముత్యాలవుతాయి. పూర్వకాలంలో నానా దేశాలవారు వీటి వ్యాపారం కొరకు మనదేశానికి వచ్చేవారు. వీటిలో, ఆణి-సుతారము-సుపాణి అనేవి మంచి జాతి ముత్యాలు).

         రావణుడి ఇల్లు, పుణ్యాత్ములు వెళ్లే సామన్య దేవలోకమా? ముఖ్య దేవతలైన ముప్పై ముగ్గురుండే స్థలమా? ఇంద్రుడే వుంటున్న ఇల్లా? బ్రహ్మ లోకమా? అన్న ఆలోచనలో పడ్తాడు హనుమంతుడు. సర్వస్వాన్ని ఓడిపోయిన నేర్పరి జూదగాడు ఇకచేసేందుకు ఏమీలేక-దిక్కుతోచక-కదలక, మెదలక వుండేలాంటి బంగారు దీపాలున్నాయి ఆ ఇంటిలో. ప్రపంచంలో ఎక్కడా సరితూగని ప్రకాశవంతమైన మణులతో చేసిన దీపాలను-సెమ్మెలను చూసాడక్కడ. దీపాల కాంతి-రావణుడి దేహకాంతి-వాడు ధరించిన బంగారపు సొమ్ముల కాంతి, కలవడంతో ఆ శాల మండుతున్నట్లు వెలుగుతోంది. ఆ విశేషం చూసి హనుమంతుడు, ఔరా! అని తనలో మెచ్చుకుంటాడు.


  నానావిధాలుగా ప్రకాశించే చీరెలు-హారాలు ధరించి, తాగి-తందనాలాడుతూ, మత్తుగా నిద్రపోతున్న విలాసవంతులైన స్త్రీలను హనుమంతుడు చూసాడక్కడ. అరమోడ్పు కళ్లతో-అందమైన దంతాలతో, విస్తారమైన పద్మాల వాసన కలిగిన ముఖాలతో వున్న, పద్మినీ జాతి స్త్రీలను చూసాడక్కడ హనుమంతుడు. వారి కళ్లు ఉదయాన వికసించి, రాత్రి తమంతట-తామే ముడుచుకునిపోయే తామరపూలవలె సంతోషాన్ని కలిగించాయి. తుమ్మెదలు వీరి చుట్టూ తిరుగుతుండడం వల్ల, వీరి ముఖాలు తామరరేకులను పోలి వున్నాయనవచ్చు. సుందరమైన చల్లదనం, సువాసన, మనోజమైన ఆకారమున్న వారి ముఖాలు నిజంగా పద్మాలేననుకుంటాడు హనుమంతుడు.

No comments:

Post a Comment