Monday, August 21, 2017

పుష్పక విమానాన్ని చూసిన హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

పుష్పక విమానాన్ని చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (21-08-2017)

ఇలా వీళ్లందరి ఇళ్లల్లో వెతికిన హనుమంతుడు, రావణుడి ఇంట్లో ప్రవేశించే ముందర, పాశాలు, చిల్లకోలలు, కత్తులు, కటార్లు, శూలాలు, చేతుల్లో పట్టుకుని కావలికాస్తున్న స్త్రీలను, ఆ దగ్గర్లోనే నిద్దరపోతున్న వారినీ చూస్తాడు. రకరకాల ఆయుధాలను ధరించి యుద్ధ రహస్యాలను ఎరిగిన రాక్షస మూకల్ని, వేగాతి వేగంగా పోగలిగే ఎరుపు, తెలుపు ఉత్తమ జాతి గుర్రాలను కూడా చూస్తాడు హనుమంతుడు. శత్రువుల ఏనుగులను, సైన్యాలను, నాశనం చేయగల శక్తిమంతమైన ఉత్తమ జాతి ఏనుగులనూ చూస్తాడు. చూడడానికవి ఇంద్రుడి ఐరావతంలా ఆకారపుష్టి కలిగి వున్నాయి. వర్షించే మేఘంలా, సెలయేర్లు పారుతున్న కొండల్లా వున్నదా ఏనుగుల మదం. ఉరిమే మేఘంలా గర్జిస్తూ, ఘీంకరిస్తూ, తమని ఎలాంటి ఏనుగులూ జయించలేవన్న ధీమా కనబరుస్తున్నవవి.

          బంగారు అలంకరణతో, బాలభానుడితో సరితూగే ప్రకాశంతో వుంది రామదూత హనుమంతుడు చూసిన రావణుడి ఇల్లు. రకరకాల పల్లకీలు, చిత్ర-విచిత్రమైన తీగలతో అల్లబడిన ఇళ్లు, క్రీడాగృహాలు, కొయ్యలపై నిర్మించిన మంచెలు (క్రీడించేందుకు), కామాన్ని పురిగొల్పే రతి గృహాలు, పగలు క్రీడించేందుకు అనువైన ఇళ్లు, పెంపుడు నెమళ్లుండేందుకు కట్టే మందిరాలను పోలిన స్థలాలు, ధ్వజదండాలు, నిధుల సమూహాలను కూడా చూస్తాడక్కడ హనుమంతుడు. ధగ-ధగమని ప్రకాశిస్తూ, కైలాసంతో సమానంగా వుందేందీ ప్రదేశమనుకున్టాడు మారుతి. కిరణకాంతులతో ప్రకాశించే సూర్యుడి మాదిరిగా, దేవతా విరోధి తేజంతోనూ, జాతిరత్నాల కాంతులతోనూ రావణుడి గృహం ప్రకాశించింది. మేడలు, మిద్దెలు, గుంపులు-గుంపులుగా వున్న ఇళ్లు, ప్రకాశించే రత్నాలతో తయారైన పాత్రలోని సారాయిని సేవిస్తున్న వారితో నిండిందా ప్రదేశం. బంగారు పానుపులు, మెరిసే బంగారు పాత్రలు, చిలకల్లాంటి ఉత్తమ స్త్రీలు, వారి అందెల ధ్వనులు సమ్మిళితమై, మనోహరంగా, విశాలంగా వున్న అందమైన రావణాసురుడి గృహాన్ని చూస్తాడు హనుమంతుడు.

మనోహర వైడూర్యాలు, బంగారంతో నిర్మించిన ఇళ్లను చూసాడు హనుమంతుడు. ఆప్రక్కనే వున్న, పక్షులు విహరించేలాంటి మెరుపు తీగలను బోలిన ఇళ్ల సమూహాలను, వర్షాకాల మేఘాలను పోలిన వివిధ శాలలను, శంఖాలున్న శాలలను, మేడపైన కట్టిన విశాల భవంతులను కూడా చూసాడు. జాతి రత్నాలతో ప్రకాశిస్తూ, ఇంద్రాదిదేవతలతో పూజించబడుతూ, ఏ విధమైన వాస్తు దోషం లేనటువంటి, భుజబలంతో కుబేరుడిని గెల్చి సంపాదించిన, మయుడనే దానవుడి బుద్ధి చమత్కారాలతో నిర్మించబడిన, రత్న భూషణాలంకార శోభితమైన ఇళ్లనెన్నో చూసుకుంటూ ముందుకు సాగాడు హనుమ. మేఘంలా, బంగారంతో ప్రకాశిస్తూ, రావణాసురుడి బలానికి తగిన, భూమ్మీదెక్కడ దానికి సమానమైనది లేనట్టి, ఆకాశాన్నుండి జారిపడిన స్వర్గాన్ని బోలిన ఆకారంగల పుష్పక విమానాన్ని చూసాడు హనుమంతుడు. విస్తార కాంతిగల అనేక రత్నాలతో పొదగబడి, మనోహర పుష్పాలతో వ్యాపించి, తేనెవలె పుప్పొడితో నిండి, మెరుపులతో కూడిన మేఘంలా, మెరుపు తీగల్లాంటి దేహాలున్న స్త్రీలతో సమానంగా ప్రకాశిస్తున్నదా పుష్పక విమానం. హంసలు మోసే బ్రహ్మ విమానంతో సరితూగేదిగా వున్నదా విమానం. పర్వతాకారంతో, అనేక గైరిక ధాతువులతో కూడి వుందది. నానా వర్ణాలుండే మేఘంలా చిత్రమైన రూపంలో వుందది. ఇది ఆకాశమేమోనన్న భ్రమకలిగిస్తూ, సూర్య-చంద్రుల చిత్రాలున్నాయి దానిపైన. రత్న ఖచితమైన ఆ విమానాన్ని ఆశ్చర్యంగా చూసాడు హనుమంతుడు. (భూమి-పర్వతాల వరుసలు, పర్వతాలు, వృక్ష సమూహాలు, వృక్షాలు, పూలరాసులు, పూలు, ఆకులు నిండి వున్నాయంటే, ఇవన్నీ చిత్రాలని అర్ధం చేసుకోవాలి)

          పూలతో నిండిన నీళ్లు, పక్షుల కిలకిలారావాలతో నిండిన తోటలు, అకరులతోడి కమలాలు, కాంతులు వెదజల్లే గృహాలు, ఆకుపచ్చ పక్షులు, ఉత్తమ జాతి గుర్రాలు, రత్నాలతో తయారైన పాములు, ఒక్కో పక్షి వర్ణనకు తగినట్టు రత్నాలతో చేయబడిన పక్షులు, పుష్పక విమానంలో చిత్రించ బడ్డాయి.


          ఇక చిత్రించబడిన ఆ పక్షులు కామోద్రేకం పెంచేందుకు మన్మధుడికి సహాయపడే విధంగా వున్నాయి. రెక్కల కొనలందు పగడాలతో, బంగారపు కూర్పుతో, ప్రకాశవంతంగా చెక్కబడి వున్నాయి. ఏనుగులు స్వయంగా వాటి తొండాల్లో విచ్చిన కలువ పూలను, నీటినీ తెచ్చి అభిషేకిస్తే, తామరపూలు చేత ధరించిన లక్ష్మీదేవి సౌందర్యంతో సమానంగా పుష్పకవిమాన శిల్పం చేయబడిందట. (ఇలాంటి ఛాయా చిత్రాలు చాలామంది ఇళ్లలో వున్టాయి. ఇవన్నీ ఏనాడో, ఎన్నో ఏళ్ల నాడే, రావణాసుర భవనంలో కూడా అలంకరించబడి వున్నాయని వాల్మీకం చెపుతున్నది) సువాసనలు వెదజల్లే వృక్షమో, వసంత కాలంలో గుహలతో నిండిన పర్వతమో అన్న భావన కలిగే మనోరంజకమైన పుష్పక విమానాన్ని చూసిన హనుమంతుడు దాని రూపకల్పనకు ఆశ్చర్య పడ్డాడు. దాని చుట్టు ఎన్నిసార్లు తిరిగినా హనుమంతుడికి రావణాసురుడు స్త్రీలతో వుండే స్థలం కనిపించ లేదు. ఆ విమానం పరిమితీ అంతు బట్టలేదు. ఆపట్టణంలో ఎంతసేపు తిరిగినా, సమస్త ప్రదేశాలు వెతికినా, ఎన్నెన్నో వింతలు చూసినా, వెతుకుతున్న సీత జాడ తెలియరానందున ఏంచేయాలన్న విచారంలో పడ్డాడు సునేత్రుడైన హనుమంతుడు.

           సూర్యుడు సంచరించే మార్గమే తనకు ప్రధాన లక్ష్యంగా తిరిగే, విశేషంగా ఆకాశంలోనే సంచరించే, భూమ్యాకాశాలలో ఎక్కడైన వుండగలిగే, అసమానమైన పుష్పక విమానాన్ని నిశితంగా చూస్తాడు మళ్లా హనుమంతుడు. పరిమాణంలో విస్తారమైందది. పుష్పకాధారమైన ఇంటి నడిమిభాగంలో దగద్ధగాయమానంగా, బంగారు కాంతిని బోలి ప్రకాశిస్తున్నదది. దేవతల విమానాలలో కొన్ని భూమిపైకి రాలేవు, భూమిపైనున్నవి కొన్ని పైకి పోలేవు. కానీ, ఇది భూమ్యాకాశాలపైన ఎక్కడికైనా పోగలదు. అతిప్రయత్నంతో, అత్యంత నేర్పరితనంతో చేయని భాగమందేదీ లేదు. దేవతా సంబంధమైన మణులు, వజ్రాలు కూర్చబడని భాగమందేదీ లేదు. దాని సౌందర్యం దేవతల విమానాలకు లేనేలేదు. దాంట్లోని ఏ భాగం, ఏ ప్రదేశం చూసినా ఆశ్చర్యం కలుగక మానదు.


          ఘోరతపస్సు చేయడం వల్ల సంక్రమించిన పరాక్రమంతో సంపాదించబడిందా విమానం. హృదయ సమ్మతంగా తిరుగవచ్చా విమానంలో. నివారించనలవి కాని వాయువేగ, మనోవేగం కలదది. స్వర్గాన్ని మైమరిపించే శిఖరాలతో అలరారుతుందది. శరత్కాల చంద్రుడుని పోలివుంది. ఇంపైన కుండలాలతో అలంకరించబడిన ముఖాలున్నాయి దానికి. దేవతల, రాక్షసుల, ఇరువురి ఆకారాలున్నాయి దాని పెద్ద కళ్లల్లో. తిరస్కరించరాని వేలాది భూతసమూహాలు మోస్తున్నారు దానిని. అలాంటి వసంతకాల పుష్పంలాగా వున్న సుందర, పరిమళ, విశ్వకర్మ నిర్మితమైన పుష్పక విమానాన్ని చూసాడు ఆంజనేయుడు తనివితీరా

No comments:

Post a Comment