Monday, August 21, 2017

కొత్త భూసంస్కరణలకు నాంది : వనం జ్వాలా నరసింహారావు

కొత్త భూసంస్కరణలకు నాంది
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (22-08-2017)

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ  సర్వే చేయించాలనీ, తద్వారా భూముల రికార్డులను సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, దీనికొరకు సుమారు 3700 బృందాలను ఏర్పాటు చేయాలనీ, ఒక్కో బృందానికి 15 మంది చొప్పున సుమారు 55,000 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించాలనీ, ఈ ప్రక్రియంతా మూడు-నాలుగు నెలల్లో పూర్తి చేసి, ఒక విప్లవాత్మకమైన పాలనా సంస్కరణకు నాంది పలకాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో అనాదిగా తెలంగాణ గ్రామాలలో అనుసరిస్తూ వస్తున్న గ్రామీణ వ్యవస్థ ఎలాంటిదో, ఆ అనుభవంతో భవిష్యత్ లో ఏం చేయవచ్చో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 83 సంవత్సరాల ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు రచించిన అముద్రిత కరదీపిక “గ్రామాయణం” ఈ విషయాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వివరాలను ఆవిష్కరిస్తుంది.

గ్రామాలు మన దేశ చరిత్రలో అంతర్భాగాలు.  ప్రతీ గ్రామం ఒక రిపబ్లిక్. గ్రామంలో తలెత్తే అన్ని సమస్యలనూ గ్రామస్థులే పరిష్కరించుకునేవారు. బహుశా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గ్రామ పెద్ద-కుల పెద్దల పెత్తనం కొంతమేరకు వుందనే అనాలి. ఆంగ్లేయులు కూడా గ్రామాలలో వచ్చే ఆదాయం మీద కన్నేశారు కాని గ్రామ కట్టుబాట్ల జోలికి పోలేదు. గ్రామానికీ-మరో గ్రామానికీ మధ్య పోలిమేరలే తప్ప సరిహద్దులుందేవి కాదు. 19వ శతాబ్దం వరకు వ్యవసాయ భూములకు కూడా హద్దులుందేవి కాదు. ముఘల్ చక్రవర్తుల అక్బర్, షేర్షాలు వ్యవసాయ భూముల కొలతలు ప్రారంభించారే కాని శాశ్వతం చేయలేదు. వ్యవసాయం చేసేవారు తమ అధీనంలో వున్న భూమికి ప్రభుత్వానికి శిస్తు చెల్లించేవారు.

19వ శతాబ్దం మధ్యకాలం దాకా తెలంగాణ జిల్లాలలో ఒక నిర్దుష్టమైన పాలనా వ్యవస్థ లేదనే అనాలి. గ్రామాలలో మాత్రం అనాదిగా వస్తున్న సాంప్రదాయాలనే కొనసాగించేవారు. “కరణం” భూమి లెక్కలు, “మునసబు” శాంతిభద్రతలు చూసుకునేవారు. అలాగే గ్రామీణ జీవనంలో “పటేలు” అని పిలిపించుకోవడం ఆనవాయితీ అయింది. దొరగారు, దొరవారు అన్న పదాలు ప్రభుత్వం పక్షాన శిస్తు వసూలు చేసే అధికారులను సంబోధించేవారు. ఈ దొరలు క్రమేపీ తమ నివాసాన్ని హైదరాబాద్ కు మార్చుకుని, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తూ, తమ ఏజెంట్ల ద్వారా పెత్తందారీ పద్ధతిలో గ్రామాలలో శిస్తులు వసూలు చేసేవారు. దొరకన్నా దొర తొత్తులకే అధిక ప్రాధాన్యం వుండేది.

కాకతీయుల పాలన దాకా గ్రామ లెక్కలు, శిస్తు వసూళ్లు జైనులు చేసేవారు. జైన కరణాలు గణపతి దేవ రాజును ఇబ్బంది పెట్టడంతో ఆయన బ్రాహ్మణులలో ఒక ఆరువేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ కరణాలుగా తయారుచేశారు. వీరికే దరిమిలా “ఆరువేల నియోగులు” అన్న పేరు వచ్చింది. గ్రామ ఆదాయ-వ్యయ లెక్కలు వీరు చూసేవారు. మరో ప్రాధాన్యతా కులానికి చెందినవారిని పటేలు లేదా మునసబుగా నియమించేది ప్రభుత్వం. కరణం, మునసబులకు జీతాలుండేవి కాదు. ప్రభుత్వానికి చెందే శిస్తు నుంచి కొంత తమకు కేటాయించుకునేవారు. పోలీసు చర్య జరిగేదాకా ఇలాంటి వ్యవస్థే కొనసాగింది.

1853 లో మొదటి సాలార్జంగ్ ను అప్పటి నిజాం తన ప్రధానిగా నియమించుకున్నాడు. ఆయన 30 సంవత్సరాల పాటు ముగ్గురు నిజాంల దగ్గర పనిచేశాడు. ఆయన చేపట్టిన పాలనా సంస్కరణలు నిజాం రాజ్యాన్ని అభివృద్ధి పధంలో నడిపించింది. ఆయన ప్రారంభించిన “జిల్లా బందీ” విధానం ఇప్పటికీ ఒక విధంగా కొనసాగుతున్నదనాలి. దీని ద్వారా సాలార్జంగ్ అప్పటిదాకా అధికారం చెలాయిస్తున్న జాగీర్దారుల, పాయగాల, మఖ్తేదారుల పెత్తనాన్ని క్రమబద్ధీకరించాడు. సమర్థులైన ఇద్దరు నిజాం ప్రభుత్వ రెవెన్యూ అధికారులను బొంబాయి పంపి, వారి అధ్యయనం ఆధారంగా, నిజాం రాజ్యంలోని గ్రామాలలో వున్న భూములను సర్వే చేయించి, క్రమబద్ధమైన రికార్డులను మొదటిసారిగా రూపొందించాడు. తిరిగి 1936 లో మూడవ సాలార్జంగ్ సర్వే చేయించేంతవరకు ఇవే లెక్కలుండేవి. ఇంతకు ముందు ఇలాంటి సర్వే ఎప్పుడూ చేయలేదు. సర్వే చేయడానికి పూర్వం ఎవరు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్న వివరాలు గ్రామాధికారికి తప్ప ఎవరికీ తెలియదు. రైతులు వ్యవసాయం చేసే భూములకు నిర్దుష్టమైన రికార్డులు, సరిహద్దులు లేవు. ఆ విధంగా “పట్టాదారు” భూములు అనే పదం సాలార్జంగ్ సర్వే-సెటిల్మెంట్ ద్వారా స్థిరపడింది మొదటిసారి.

సాలార్జంగ్ సంస్కరణల్లో భాగంగా గ్రామాలకు సంబంధించి “గిర్దావర్” అనే అధికారిని నియమించింది ప్రభుత్వం. అనాది కాలం నుండి గ్రామాలలో ముగ్గురు అధికారులుండేవారు. ఒకరు “పట్వారి”, మరొకరు “మాలీ పటేల్”, ఇంకొకరు “పోలీస్ పటేల్”. వీరికి సహాయం చేయడానికి “షేఖ్ సింధీ” వుండేవాడు. చెరువుల్లో నీటిని నియంత్రించడానికి “నీరడి” వుండేవాడు. వీరెవరికీ ప్రభుత్వ జీతాలుండేవి కాదు. అందుకే వీరిని “నీం సర్కారీ” అని పిలిచేవారు. భూమి శిస్తు నుంచి “స్కేల్” ప్రకారం కొంత పైకం లభించేది. ఈ వ్యవస్థ 1956 లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కొనసాగింది.


 సాలార్జంగ్ చేయించిన సర్వే తరువాత, వ్యవసాయ భూముల సారాన్ని బట్టి అణాల లెక్కల్లో “ఆనావారి” రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. వీటినే “సేత్వార్” అని కూడా పిలిచేవారు. గ్రామాల్లోని రైతుల భూముల కొరకు “నక్షా” (పటం) ను శాశ్వత ప్రాతిపదికగా వుండే విధంగా సిల్కు గుడ్డ మీద నల్ల సిరాతో గీసి ఏర్పాటు చేశారు. ఇవి ఈ నాటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. వీటి ఆధారంగానే వివిధ సందర్భాలలో భూములను బేరీజు వేసుకునేవారు. ప్రతి గ్రామానికీ “గ్రామకంటం” కింద కొంత భూమిని కేటాయించారు. పశువుల దాణా కోసం విస్తీర్ణంలో నాలుగో వంతు భూమిని “బంచరాయి” గా ఏర్పాటు చేశారు. ఎందుకూ పనికిరాని భూములను “పోరంబోకు” భూములన్నారు. రైతుల భూముల్లో వున్న రాళ్లు, గుంటలు, వ్యవసాయానికి పనికి రాని స్థలాన్ని “పూట్ కరాబ్” అని పేర్కొని దానికి శిస్తును రద్దు చేశారు. అయితే, అప్పట్లో రైతుల భూములకు మాత్రం రికార్డులను వుంచి, ప్రభుత్వ భూములకు ఎలాంటి రికార్డులను ప్రతిపాదించలేదు. హైదరాబాద్ నగరం చుట్టూ వున్న భూములను తనకే కేటాయించుకున్నాడు నిజాం. వీటినే “సర్ఫేఖాస్” భూములని పిలుస్తారు. ఇవి “జిల్లా అత్రాఫ్ బల్దా” గా రికార్డుల్లో నమోదైంది.

సర్వే-సెటిల్మెంట్ తర్వాత రికార్డులను కాపాడే బాధ్యత పట్వారీకి అప్పచెప్పారు. శిస్తు వసూలుకు మాలీ పటేల్, శాంతి భద్రతలకు పోలీస్ పటేల్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పోలీస్ పటేల్ ప్రతివారం సమీపంలోని పోలీస్ స్టేషన్ కు “రోజునాంచా” సమర్పించేవాడు. గ్రామంలోని జనన మరణాల లెక్క, రహదారీ చిట్టీలు లాంటివి ఆయనే రాసేవాడు. శిస్తు వసూలు జాబితాను పట్వారీ తయారుచేసి, మాలీపటేల్ కు ఇచ్చేవాడు. గ్రామ సేవకు ఉపయోగపడే షేఖ్ సింధీకి, నీరడికి ఇనాం భూములుండేవి. వాటికి శిస్తు కట్టక్కరలేదు. గ్రామాధికారులకు “వతన్ దార్లు” అనే పేరుండేది. వీరంతా గ్రామస్తులకు, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వుండేవారు.

పంచాయితీరాజ్ వ్యవస్థ వచ్చేంతవరకు గ్రామాలలో అధికారమంతా పటేల్, పట్వారీలదే. షేఖ్ సింధీకి చేతిలో పొడుగాటి కర్ర, దానికి ఒక బల్లెం లాంటి ఇనుప మేకు వుండేది. ఇది అతడు ప్రభుత్వ అధికారి అని గుర్తింపుగా అనుకోవాలి. నీరడి గ్రామాలలోని చెరువులో ఎంత నీరుందో అనే విషయం తెలుసుకోవడానికి పట్వారీకి సహాయ పడేవాడు. పట్వారీ తహసీల్దారు కార్యాలయానికి తెలియచేయడానికి తయారు చేసే “బారిష్ తఖ్తా” లో చెరువులో కొత్తగా ఎంత నీరు, ఎప్పుడు చేరింది అన్న వివరాలుందేవి. అనావృష్టి, అతివృష్టి కారణాన పంటలు పండకపోతే పట్వారీ నివేదిక ఆధారంగా “జమాబందీ” జరిగినప్పుడు శిస్తు మాఫీ చేయబడేది. అలాగే చెరువులో నీళ్లు వున్నప్పుడు, రెండవ పంటకు నీరు ఇవ్వాలా-వద్దా? అనే విషయం “తహబందీ” ద్వారా నిర్ణయించేవారు. పంటల విషయంలో నీటి ఆధారిత పంటలను “ఆబీ”, “తాబీ” అని పిలిచేవారు. మెత్త పంటలను “ఖరీఫ్”, “రబ్బీ” అని పిలిచేవారు. ఇదంతా కూడా గ్రామంలోని పట్వారీ, గ్రామ రైతులు, గిర్దావర్ సమక్షంలో రాత పూర్వకంగా తీర్మానాలు చేసేవారు.

గ్రామంలోని భూములను “తరీ”, “ఖుష్కీ” అని పిలిచేవారు. వ్యవసాయం ఆరంభం కాగానే, తరీ-ఖుష్కీ భూముల్లో పంట వేసిందీ-లేనిదీ రికార్డు చేయడానికి గ్రామ పట్వారీ, “చారుమాహి”, “హస్త్ మాయి” తనఖీల పేరుతో భూముల చుట్టూ తిరిగి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసేవాడు. వ్యవసాయ భూముల యాజమాన్య వివరాలు, శిస్తు వివరాలు రికార్డు చేయడం పట్వారీ ప్రధాన బాధ్యత. ఆయన తయారుచేసిన రికార్డులే ప్రభుత్వానికి ఆధారం. సాలార్జంగ్ సంస్కరణల్లో భాగంగా భూములను కొలిపించి, ఒక విధంగా చెప్పాలంటే, ఈ నాటి కంప్యూటర్ వ్యవస్థకు అనుకూలంగా రికార్డులు తయారు చేయించారు. కాకాపోతే అవిప్పుడు రకరకాల కారణాల వల్ల మరో సర్వే-సెటిల్మెంటు చేయించాల్సిన పరిస్థితులకు దారితీశాయి. అలనాటి సర్వే నంబర్లు కూడా ఇప్పుడు పనికొచ్చే విధంగా లేవు.

అప్పట్లో సర్వే జరిగాక ప్రతీ రైతు వ్యవసాయం చేసుకునే భూమి వివరాలన్నీ ఒక శాశ్వత రిజిస్టర్ గా వ్యవస్థీకరించారు. దాన్నే “సేత్వార్” అని పిలుస్తున్నాం. ప్రతి భూ కమతానికి నంబర్లు ఇచ్చారు. వాటినే సర్వేనంబర్లు అంటున్నాం. వీటి ఆధారంగా ప్రతి సంవత్సరం పట్వారీ రెండు ముఖ్యమైన రిజిస్టర్లు రాసేవాడు. ఒకటి “పహాణీ”, మరొకటి “చౌఫస్లా”. వీటిని రాసి ప్రతి పేజీమీద చివర్లో తహసీల్ ముద్ర వేయించేవాడు. పహణీలో ప్రతి పేజీకీ పది సర్వే నంబర్ల వివరాలు మాత్రమే రాయాలి. అందులో: సర్వే నంబర్, విస్తీర్ణం, వర్గీకరణ, దున్నేవారెవరు?, వేసిన పంట లాంటివి వుంటాయి. పంటల ఇన్స్పెక్షన్ వివరాలను పహాణీలోనే పట్వారీ, గిర్దావర్ రాసేవారు. వీటి ఆధారంగా జమాబందీలో శిస్తు నిర్ణయించేవారు. డిసెంబర్ నెలనుండి భూమి శిస్తు వసూలు మొదలయ్యేది. శిస్తు చెల్లించినందుకు రశీదుగా “పావుతీ బహీ” అన్న అధికారిక పుస్తకంలో నమోదు చేసేవారు. దీన్ని రైతులు భద్రంగా దాచుకునేవారు. గ్రామంలోని రికార్డులు తయారు చేయడానికి ఆంగ్ల సంవత్సరం కానీ, తెలుగు పంచాంగ సంవత్సరం కానీ అనుసరించకుండా, పర్షియన్ సంవత్సరాన్ని “ఫసలీ” గా ప్రాతిపదిక చేశారు. ఇప్పటికీ వీఆర్వోలు ఇస్తూన శిస్తు రశీదుల్లో “ఫసలీ” అనే వుండడం గమనించాల్సిన విషయం.

“పహాణీ” అనేది ఒక రకమైన ప్రాధమిక హక్కు పత్రం. శిస్తు వసూలుకు ప్రాతిపదిక అయిన రికార్డు. పట్వారీ నాలుగు నెలలకు చేసే తనిఖీని “చారుమాహీ” తనిఖీ అనేవారు. ఆ తరువాత చేసే దానిని “హస్త్ మాయి” అనేవారు. తనిఖీల పర్యవేక్షకుడు గిర్దావర్. జమాబందీ నిర్ణయం ప్రకారం శిస్తు నిర్ణయం జరిగేది. పట్టేదారు చనిపోయినప్పుడు వారసత్వ మార్పిడి కూడా జమాబందీలో అంతర్భాగమే. జమాబందీ ఆధారంగా “పైసల్ పట్టీ” తయారయ్యేది. ప్రతీ సంవత్సరం దసరానాడు పట్వారీ రెవెన్యూ రికార్డులను ఆరంభించడానికి పూజలు చేసేవాడు. రికార్డులు భద్రపరిచే వస్త్రం చేనేతది.

కాలక్రమంలో వతన్ దారీ వ్యవస్థ రద్దయింది. నూతన అధికారగణం ఏర్పాటైంది. గ్రామ రికార్డుల్లో అనేకమైన లోటుపాట్లు చోటు చేసుకోసాగాయి. రైతులకు-గ్రామాదికారులకు మధ్య అగాధం ఏర్పడింది. గ్రామాల్లో ఎవరి భూమి ఎంతో, అనే వివరాలు సరిగ్గా చెప్పే నాధుడు లేడు.


ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్తున్న చారిత్రాత్మక సర్వే-సెటిల్మెంట్ సాలార్జంగ్ సంస్కరణలకంటే మిన్నగా వుండాలి. గ్రామ వ్యవసాయ-వ్యవసాయేతర భూముల రికార్డులన్నీ పూర్తిగా ప్రక్షాళన జరిగి, శాశ్వతంగా, రైతు ప్రాతిపదికన సర్వే నంబర్లుండే విధానానికి శ్రీకారం చుట్టబడి, భవిష్యత్ లో ఏ విధమైన తగాదాలకు ఆస్కారం లేకుండా వుండాలి. వతన్ దారీ విధానం రద్దు దరిమిలా అస్తవ్యస్తమైన గ్రామీణ పాలనా వ్యవస్థ పటిష్టం కావాలి. కేసీఆర్ చేపట్తున్న సర్వే-సెటిల్మెంట్ మరో భూసంస్కరణలకు నాంది కావడంలో సందేహం లేదు.  

No comments:

Post a Comment