Thursday, August 24, 2017

సమస్యలు లేని వ్యవస్థ కేసీఆర్ ఆకాంక్ష : వనం జ్వాలా నరసింహారావు

సమస్యలు లేని వ్యవస్థ కేసీఆర్ ఆకాంక్ష
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (23-08-2017)

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరో బృహత్తర కార్యక్రమానికి సిద్దమవుతున్నారు. చారిత్రాత్మకమైన, అత్యవసరమైన భూరికార్డులను సరిచేసే కార్యక్రమమే ఆ కార్యక్రమం. దీనివల్ల భూరికార్డులన్నీ సరవుతాయి. భూవివాదాలనేవి ఎప్పటికీ లేకుండా ఇది చెక్ పెడుతుంది. కిందటిసారి 81 సంవత్సరాల క్రితం భూరికార్డులను సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. నిజాం హయాంలో1936 లో ఇది సాగింది. అంటే అప్పటికి మనకు స్వాతంత్రం కూడా రాలేదు. ప్రస్తుతం చేపడుతున్న రికార్డుల సరిజేత కార్యక్రమంలో 55వేల మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉద్యోగులు పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్న పదివేల 800కు పైగా ఉన్న రెవిన్యూ గ్రామాలలో ఈ ప్రత్యేక సర్వేను నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు సర్వే పూర్తవుతుంది. సమస్యలకు పరిష్కారమూ దొరుకుతుంది. తెలంగాణ నలుచెరగులా చేపట్టే ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది. పార్టీ ఆ హామిని ఇప్పుడు నెరవేర్చే దిశగా అడుగులేస్తుంది.

సర్వే ఎలా చేయాలి... అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మార్గదర్శకత్వాన్ని నిర్దేశించారు. సర్వే, పరిష్కారాల కార్యక్రమం దిగ్విజయం కావడానికి, ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఆయన సూచన చేశారు. భూరికార్డుల సర్వే కోసం వచ్చే సిబ్బందికి సహకరించాలంటూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు దీనికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా బాధ్యత తీసుకోవాలని రైతులను ముఖ్యమంత్రి కోరారు. ప్రతి రైతు తన గ్రామంలో నాయకుడిగా దారి చూపాలన్నారు.

సర్వే కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని సంస్థలను గుర్తించాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తెలపారు. సర్వే ఆఫ్ ఇండీయా వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి అవసరం అని ఆయన అన్నారు. సర్వే ఆఫ్ ఇండీయా అంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత పురాతనమైన శాస్త్రీయ విభాగం. ప్రపంచంలోనే విస్తృతమైన మ్యాపింగ్ సంస్థలలో ఒకటి. మనకు సర్వే కోసం యువకుడు, ఉత్సాహవంతుడైన ఒక ఐఏఎస్ అధికారి కావాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ సర్వే కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించేందుకూ, పర్యావేక్షించేందుకూ యువ ఐఏఎస్ చాలన్నారు. రెవిన్యూ రికార్డులన్నీ, పాస్ బుక్కులు, పహాణీల విధానాన్ని సరలీతరం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

         ఏడాదికి రెండు పంటలకూ ఎకరానికి 8వేల రూపాయల దిగుబడి సహాయంగా రైతుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి వస్తుంది. దీన్ని పక్కాగా అమలు చేయాలంటే క్షుణ్ణమైన భూసర్వే అవసరం. ఏ రైతు పేర ఎంత ఉంది... ఎక్కడ ఉంది అనే అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంత భూమి ఉంది? అదెక్కడ ఉంది? అనే అంశాలపై స్పష్టంగా తెలుసుకోవల్సిన అవసరముందన్నారు. ఏ భూమి ఎవరి పేరున రిజిస్టరై ఉందో కూడా తెలియాలన్నారు. ఏ క్యాటగిరీ కింద ఆయా భూములను చూపించారో తెలుసుకునేందుకు రాష్ట్రంలోని భూముల వివరాలు రూపొందిచాల్సుంది. జాబితా రూపొందించిన అనంతరం , ఎకరానికి 8వేల రూపాయల చొప్పున ఇచ్చే సహాయం అసలు సిసలు లబ్దీదారులకు అందుతుంది. మిగిలిన పథకాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. భూవివాదాలకు ఈ సర్వే చరమగీతం పాడుతుంది. భూ సర్వేలు సుమారు వెయ్యేళ్ళ క్రితం తమిళనాడులో రాజరాజ చోళుని సమయంలో ఆదాయం నిమిత్తం మొట్టమొదటిసారి నిర్వహించారు. ఉత్తర భారతంలో షేర్ షా సూరి, కౌలు భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఒక పద్దతికి శ్రీకారం చుట్టాడు.


బ్రిటన్ హయాంలో సెలం జిల్లాలో రైతార్వీ పరిష్కార సర్వేలను చేపట్టారు. 1793-1798 మధ్యలో మద్రాస్ ప్రెసిడెన్సీ సమయంలో ఈ సర్వే నిర్వహించారు. భూముల హద్దులను నిర్ణయించడం, ఖచ్చితమైన పటాన్ని అన్ని భౌగోళిక గుర్తులతో రూపొందించడం ఈ సర్వే ప్రధానొద్దేశం. భూములు సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంతంలో సర్ సలార్ జంగ్-1 నిర్వహింపజేశారు. తెలంగాణలో అదే మొదటి ప్రయత్నం 1875 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్ మెంట్ ఏర్పాటైంది. భూ ఆదాయాన్ని నిర్ణయించేందుకు ఇందులో ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ పొరంబోకు భూములనూ వృధాగా పడి వున్న స్థలాల సర్వేను ఇందులో చేపట్టలేదు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూములకు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించాలనీ, పహాణీలో 1బి ఫారమ్ అవసరముందా అనే అంశాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి తాజ సర్వేకు దిశానిర్దేశం చేశారు. 81/1/ఎ వంటి భూములు, భూరికార్డులకు కేటాయించిన నెంబర్లతో ఉపయోగమేమిటి? కూడా పరిశీలించాలని సూచించారు.

రైతులకు భూములున్న చోట ప్రత్యేకంగా సర్వే  నెంబర్ ని కేటాయించే అవకాశాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఈ నెంబర్ రైతు పేరు మీదనే ఉండాలన్నారు. ఇద్దరు రైతుల మధ్య భూ విక్రయం చోటు చేసుకుంటే ఆ లావాదేవి కొనుగోలుదారు సర్వే నెంబర్ దానంతటదే బదిలి అయిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల్లోని విధానాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. అధికారుల బృందం ఆయా దేశాలలో పర్యటించి అధ్యయనం చేయాలని కూడా సూచించారు. ఆయా దేశాలలో అమలవుతున్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. న్యూజిల్యాండ్, థాయ్ ల్యాండ్ దేశాలలో భూముల వివరాలు ఖచ్చితంగానూ, వివాదరహితంగానూ నిర్వహిస్తున్నారు. అధికారుల బృందం విదేశాలలో పర్యటించేటప్పుడు రైతు సంఘాలతో కూడా బేటీ కావాలనీ, అభిప్రాయాలను సేకరించాలసీ సీఎం సూచిస్తున్నారు. రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. దీనివల్ల లంచగొండితనానికి, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయం. ఎమ్ఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలోని రెవిన్యూ కోర్టులకు మంగళం పాడాలని సీఎం అభిలాషిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని రెవిన్యూ కోర్టు ఒక్కటే ఉండాలని, మిగిలిన వాటి అవసరం లేకుండా చేయాలని అంటున్నారు. జిల్లా కోర్టుల సత్వరం విశ్వసనీయమైన తీర్పులివ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. 


ఈ మొత్తం వ్యవస్థను సమూళంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చెబుతన్నారు. అవసరమైతే రెవిన్యూ చట్టాలను అటకెక్కించి, కొత్త చట్టాలను రూపొందించాలి. ఈ రకమైన వ్యవహార శైలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. భూ వ్యవస్థను ఏకికృతం చేయాలని సీఎం దృఢ నిశ్చయంతో ఉన్నారు. జిల్లా స్థాయి రిజిస్ర్టార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఎమ్మార్వోలు, ఇతర రెవిన్యూ అధికారులకు, కార్యాలయాలకు ఆధునిక కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, దీన్ని జిల్లా కార్యాలయానికి నేరుగా అనుసంధానించాలని భావిస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో సిద్దమైతే ప్రతి అధికారికీ అవసరమైన సమాచారం 24 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రెవిన్యూ అధికారికీ బాధ్యతలను నిర్దేశించాలనేది కూడా సీఎం ఆలోచన. గ్రామ స్థాయి నుంచే రైతు సంఘాలు, సమన్వయ కమిటీలు ఏర్పడాలని కేసీఆర్ అనుకుంటున్నారు. సర్వే కార్యక్రమం చేపట్టడానికిముందుగానే ఇవి ఏర్పాటు కావాలనేది ఆయన అభిప్రాయం. సమన్వయ కమిటీ సభ్యులను సాధ్యమైనంత త్వరగా నియమించాలని ఆయన సూచిస్తున్నారు. రాష్ర్టంలో 10వేల 800కు పైగా రెవిన్యూ గ్రామాలున్నాయనీవీటిలో సర్వేకు 3700 బృందాలను నియమించాలని సీఎం భావిస్తున్నారు. ఈ బృందాలలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉద్యోగులుంటారు. ప్రతి బృందంలోను 15 మంది ఉంటారు.  వీరికి విఆర్ఓ, ఎమ్మార్వో సర్వేయర్లు సహకరిస్తారు. ప్రతి బృందం మూడు గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుంది. ప్రతి గ్రామంలోనూ సర్వేను 20 రోజుల్లో పూర్తి చేయాల్సుంటుంది. ఈ డిసెంబర్ కు సర్వే మొత్తం పూర్తవ్వాలి. సర్వే సెటిల్ మెంట్ పూర్తయిన తరువాత ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాంప్ లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ బావిస్తున్నారు. ఈ స్టాంప్ లే అవినీతి, వివాదాలకు తావిస్తున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. అవినీతి రహితి వ్యవస్థను ఆవిష్కరించేందుకు రెవిన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి సమస్యలు లేని సమాజాన్ని నెలకొల్పాలన్నది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్ష.

No comments:

Post a Comment