Sunday, June 10, 2018

హనుమంతుడికి కాకాసుర వృత్తాంతం చెప్పిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమంతుడికి కాకాసుర వృత్తాంతం చెప్పిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (11-06-2018)
హనుమంతుడు వాక్య విశారదుడు. తర్క పండితుడు. అందువల్ల, రామానుగ్రహం కొరకు, తాను చెప్పిన ఉపాయం మంచిదా, లేక, సీత చెప్పిన ఉపాయం మేలా, అని తర్క-యుక్తులతో, ఆలోచిస్తాడు. ఆమె చెప్పిందే బాగుందనుకుని, సీతాదేవిని చూస్తూ, సంతోషంతో, ప్రశస్తమైన మాటలతో, "చారుదర్శనా" అంటూ సంభోధిస్తూ ఇలా చెప్తాడు:

"నువ్వు చెప్పిన మాటలు వింటుంటే, అవి స్త్రీ చెప్పేందుకు మంచి యుక్తమైనవిగనూ, స్త్రీల స్వభావానికీ, సదాచార సంపత్తిగల పతివ్రత నడవడికీ, తగ్గట్లున్నాయని అనిపిస్తోంది. అప్పుడు నీ దుఃఖాన్ని చూడలేక అలా చెప్పాను. అయితే నేను చెప్పినట్లు, ఆడది మగవాడి వీపు పైనెక్కి కూర్చొని రావడం, ఘోర రణంలో ప్రవేశించడం, పతి ఆజ్ఞ లేకుండా స్వతంత్రించి, స్వేచ్ఛగా ప్రవర్తించడం, పతివ్రతకు తగ్గ పనులు కావు. నీవు క్షత్రియకన్యవు. రాముడి భార్యవు. ఘోరారణ్యాలలో తిరిగావు. ఎంతో ధైర్యశాలివి. అయినా, నూరామడల సముద్రాన్ని నా వీపుపైకెక్కి దాటేందుకు ఎప్పుడైతే భయపడ్డావో, అప్పుడే, నీ ఆడతనపు పిరికితనం బయట పడ్డదనుకుని పొరబడ్డాను. నీవు నావెంట రాకపోవటానికి చెప్పిన మరోకారణం, నేను పరపురుషుడిని కావటమే. ఇట్లా అనటానికి రామచంద్రమూర్తి భార్యవైన నీకు మాత్రమే తగిందికాని, వేరెవరైనా స్త్రీలు ఇలాంటి ఆపద్దశలో వుంటే అనగలరా? ఏదో విధంగా తప్పించుకుని పోవాలనుకుంటారు".

"దేవీ! ఇక్కడి సంగతులన్నీ....అంటే, నీవు నా ఎదుట రావణుడికి, రాక్షసస్త్రీలకు, నాకు చెప్పిన మాటలను, రామచంద్రమూర్తికి విన్నవించుకుంటాను. నీ ఏడ్పులు, వురిపోసుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నం కూడా చెప్తాను. నీ కష్టాలను చూసి, రాముడిపైనున్న భక్తితో నా వెంట రమ్మన్నానేకాని, వేరే కారణం లేదు. నన్ను తప్పుగా ఎంచక క్షమించు. సముద్రాన్ని దాటడం మొదటి అసాధ్యం, లంకలో చొరబడడం అంతకంటే అసాధ్యం. ఈ కష్టాలన్నీ ఆలోచించి, నాకు ఆ శక్తి వున్నదికాబట్టి, సాధించగలనన్న ఆశతో, నీ భర్తవద్దకు ఎలాగైనా నిన్ను చేర్చాలన్న సదభిప్రాయంతోనే అలా అన్నాను".

"నాతో నీవు రావడానికి అంగీకరించలేదు కనుక, నేనిక్కడకొచ్చినట్లు, నిన్ను చూసినట్లు, రామచంద్రమూర్తి నమ్మదగ్గ గుర్తేదన్నా ఇవ్వు. లేకపోతే నామాటలు ఆయన నమ్మడేమో! ఉత్తమాటలు నీవు నమ్మవని ఆయన ఉంగరం ఆనవాలుగా తెచ్చాను. అలాగే నీవుకూడా ఆయన్ను నమ్మించే గుర్తు ఏదన్నా ఇవ్వు తల్లీ!" అంటాడు హనుమంతుడు.

ఆంజనేయుడి మాటలు విన్న సీతాదేవి కళ్లనుండి నీరు కారుతుంటే, మెల్లగా హనుమంతుడితో, శ్రీరాముడికి మంచి గుర్తు చెప్తా వినమంటుంది. ఆ విషయాన్ని చెప్తున్నన్నంత సేపూ, ఎక్కువగా, సీత ప్రత్యక్షంగా ఆయనకు చెప్తున్నట్లే, ఆయన్నే సంభోదిస్తుంది. ఒక్కోసారి ఆయన్ను పరోక్షంలో వుంచుకున్నట్లుగా హనుమంతుడిని సంభోదిస్తుంది. మొదట రాముడిని వుద్దేశించి కధచెప్తుందీ విధంగా:

"పూర్వం చిత్రకూటంలోని, మందాకినీ తీరం దగ్గర నివసిస్తున్నప్పుడు, ఓనాడో కాకి, నన్ను మాంసమనుకుని, తనముక్కుతో పొడవగా, ఓ మట్టిపెళ్లను ఆ తుంటరి కాకిమీద విసిరాను. అయినా అదిపోకపోతే, కోపంతో దాన్ని తరిమి కొట్టటానికి, నా ఒడ్డాణం తీసాను. అప్పుడు నాచీరె జారిపోవడం, నీవు నవ్వడం, సిగ్గుతో నేను ఆయాసపడడం జరిగింది. కాకిముక్కుతో గీకిందన్న కోపం, నువ్వు నవ్వడంతో కలిగిన సిగ్గుతో, ప్రయాసపడి వొచ్చి నీ ఒళ్లో చేరాను. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు కారుతుంటే, నీవు నన్ను ఓదార్చలేదా? అట్లా అలసిపోయి, నిద్ర రాగా, నీ తొడమీద పడుకున్నాను. ఆ వెంటనే నేను లేవగా, నాతొడపైన తలవుంచి నీవు పడుకున్నావు".


"రామచంద్రమూర్తీ! నీవు నిదురించగానే, ముందు బాధపెట్టిన కాకే, నాదగ్గరకొచ్చి, నా స్తనాలను గీరి, ముక్కుతో నాకు బాధకలిగేటట్లు పొడిచింది. ఆ గాయం నుండి రక్తంకారి, ఆబొట్లు నిదురిస్తున్న నీపైన పడ్డాయి. ఆ పాపపు పక్షిపెట్టే బాధ సహించలేక, సుఖంగా నిద్రిస్తున్న నాధుడిని, శ్రీకాంతుడిని, శత్రుమర్దనుడిని, నిన్ను లేపాను. అప్పుడు నీవు లేచి, నా స్తనములందున్న గాయాన్ని చూసి, కోపంతో, ఈ పాపం చేసినవాడెవ్వడో చెప్పు, వాడినిప్పుడే రూపుమాపెదనన్నావు. రోషంతో బుసలు కొట్టే ఐదు తలల పాముతో ఆడుకుంటానికి సాహసించిన వాడెవరని అంటూ, నాకెదురుగా వున్న కాకిని నెత్తురుతో తడిసిన గోళ్లతో చూసావు. నీవు  చూడగానే, కాకిరూపంలో వున్న ఇంద్రుడి కొడుకు, గాలిలాగా కొండ దిగి పరుగెత్తసాగాడు".(ఇంద్రుడు అహల్యను చెరచదల్చి, ఒకనాటి రాత్రి, కాకిలాగా కూసాడు. ఇదితెలుసుకున్న గౌతముడు, ఇంద్రుడిపైన కోపించి, అతడికి కాకి రూపమే శాశ్వతంగా వుండాలని శపిస్తాడు. అయితే దేవతలు, ఋషులు, గౌతముడిని ప్రార్థించగా, శాపం ఇంద్రుడి కొడుక్కు తగిలేటట్లూ, రామబాణపీడితుడై, ఆయనవల్ల రక్షించబడి, శాపవిముక్తుడయ్యేటట్లు చేస్తాడు).

శ్రీరాముడిని పరోక్షంగా వుంచుకుని, హనుమంతుడిని సంభోధిస్తూ: "పరుగెడ్తున్న కాకిని చూసి, కోపంతో, దయను వదిలేసి, దర్భాసనంలోని దర్భను తీసి, దాన్నే బ్రహ్మాస్త్రంగా కాకిమీద వేసాడు. (అస్త్రం అంటే మంత్రించి విసిరివేసే ఆయుధం. శస్త్రం అంటే హింసించడానికో, చికిత్సకో ఉద్దేశించబడింది. నియమ నిష్టలుంటేనే అస్త్రం పనిచేస్తుంది. శస్త్రం ఒక పరికరం లాంటిది) ఆ దర్భపోచ ఆకాశంలో పోతున్న కాకిని వెంటాడింది. ఆ కాకి ముల్లోకాలు తిరిగి, ఎంతోమంది శరణు కోరింది. ఇంద్రుడు, బ్రహ్మాది దేవతలు, గొప్ప మహర్షులు, అందరూ దానిని కాపాడలేమని చెప్పారు. వేరేగతిలేక మళ్లీ తిరిగొచ్చి రాముడినే శరణుకోరింది".

"శరణు-శరణని భూమిపై సాగిలబడిన కాకిని చూసి, అది చంపబడాల్సిందే అయినా, దయతల్చి వదిలేసావు. ప్రపంచంలో, ఏ ఒక్కడైనా కాపాడలేకపోయిన ఆ కాకి నీ శరణుజొస్తే, దాన్ని చూసి నీవు, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాదు, ఏమిస్తావని అడిగావు. అది తన కుడి కంటిని తీసుకొమ్మంది. ఆ భయంకర బాణం దాని కుడికన్ను హరించి వేసింది. కాకేమో చావుతప్పి కన్నులొట్టబోగా, రాముడినీ, దశరథుడినీ తలచుకుంటూ, నమస్కరిస్తూ పోయింది".

"నరేంద్రా! నాకు చిన్న బాధకలిగితేనే, ఆ బాధ కలిగించిన కాకిపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించావే! నిన్ను తిరస్కరించి, ఇంతకాలం, ఇంతబాధపెట్తున్న ఈ క్రూరుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇలా చేస్తే, నీవు నరేంద్రుడవెట్లా అవుతావు? నీనరేంద్రత్వానికి హాని రాదా? జగన్నాధా! నీ బలపరాక్రమ సాహసాలెట్టివో, ఎంతటివో నేనెరుగుదును. తెలియబట్టే నీవు నన్ను తప్పక రక్షిస్తావని నమ్మి వున్నాను. అన్ని గుణాలలో దయాగుణమే శ్రేష్టమని నీవు నాతో చెప్పావుకదా! ఆ దయ బాధపడ్తున్న నామీద ఎందుకు చూపడం లేదు? నిన్ను నాథుడిగాగల నేను అనాధలాగా పడి వున్నానే! ఇలా చేయడం నీకు ధర్మమేనా?" అని భావగర్భితమైన వాక్యాలు రాముడిని గురించి అన్న సీత, హనుమంతుడితో, రాముడి ఉపదేశ పాండిత్యం ఆచరించడంలో లేదా? అని అడగమంటుంది. ఇంకా ఇలా అంటుంది:

"హనుమా! సముద్రం లాంటి గాంభీర్యం కలవాడు, ప్రకాశించే పరాక్రమం గలవాడు, శత్రుసంహారంలో సమర్ధుడు, ఇంద్రుడితో సమానమైన రామచంద్ర భూపాలుడు చతుస్సముద్రాలతో నిండిన భూమండలానికి భర్త. ఇలాంటివాడు, అస్త్రవిద్యలో పండితుడు, శ్రేష్టుడు, మంచి బలవంతుడు, మంచి స్వభావం కలవాడూ అయిన రామచంద్రమూర్తికి నామీద కాస్తైనా దయవుంటే, ఎందుకొక్క అస్త్రం సంధించడు? ఉత్తమ దివ్యాస్త్రాలను కలిగి వున్న రాముడు, రాక్షసుల మీద ఎందుకు పదునైన అస్త్రాలు వేయడంలేదు? దేవదానవులు, పన్నగ గంధర్వులు, యుధ్ధభూమిలో ఆయన వంకైనా స్థిరంగా చూడలేరే? ఆట్టివాడు, నామీద ప్రేముంటే, రాక్షసులను చంపడా? దీనికి కారణం ఏమీలేదు....నామీద దయలేకపోవటమే!"

"ఆంజనేయా! రామచంద్రమూర్తి ఉపేక్షచేసినా నన్ను తనతల్లిలాగ చూసుకునే లక్ష్మణుడు, నావలెనే పరతంత్రుడైనా, అన్న అనుమతి తీసుకుని, నన్ను రక్షించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన పగవారిపాలిట యముడే! దోషంకల భార్యలను భర్తలు విడిచిపెట్టవచ్చుగాని, దోషంకలదైనా తల్లిని కొడుకు విడిచి పెట్టవచ్చా? అలాంటిది లక్ష్మణుడు నన్నేల విడిచిపెట్టాడు? అన్నదమ్ములిద్దరూ అగ్ని, వాయువు లాంటివారు. ఎవరూ ఓడించిజాలని సమర్థులు. వారు నన్నుపేక్షించడానికి కొద్దో-గొప్పో నేనుచేసిన దుష్కృతం తప్ప ఇంకే కారణం కనిపించడం లేదు. వాళ్లలో దోషముందని ఎట్లా అనను? వారు సమర్ధులే! నామీద ప్రేమలేనివారు కాదే! కాబట్టి దోషం నాదే! "

ఇలా శోకంతో కూడిన మాటలను, కళ్లల్లో నీరు కారుతుంటే, కలవరపడుతూ, అడుగుతున్న సీతాదేవిని చూసి, ఓదార్పు మాటలతో హనుమంతుడు, సీత కష్ట కాలం పోయిందనీ, దుఃఖం అంతరిస్తుంద, లంకనెప్పుడు భస్మం చేయాల్నా అని రామలక్ష్మణులిద్దరూ ఎదురు చూస్తున్నారనీ అంటాడు. సీతకు ద్రోహం చేసిన రావణుడిని బంధువులతో సహా చంపి శీఘ్రంగా అయోధ్యకు రామచంద్రుడు తీసుకుపోయే సమయం వచ్చింది అంటాడు.

No comments:

Post a Comment