Friday, October 11, 2019

మల్లికార్జునరావు గారి ఇంట్లో అద్దెకు..... ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపకాలు ..... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-10 : వనం జ్వాలా నరసింహారావు


మల్లికార్జునరావు గారి ఇంట్లో అద్దెకు.....
ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపకాలు
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-10
వనం జ్వాలా నరసింహారావు
బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగంలో చేరిన వెంటనే కాపురం హైదరాబాద్ కు మార్చాం. అశోక్ నగర్ బ్రిడ్జ్ పక్కనున్న పీపుల్స్ హై స్కూల్ దాటిన తరువాత, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టడీస్ వున్న గల్లీలోకి పోయి కుడివైపు తిరిగితే వున్నా మూడో ఇంట్లో అద్దెకు చేరాం. అది భండారు మల్లికార్జున రావు గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక పక్క ఒక గది, వంట ఇల్లు కలిపి నెలకు 90 రూపాయల అద్దె కుదుర్చుకున్నాం. అందులోనే కరెంట్, నీళ్ల బిల్లు కూడా కలిసి వుండేది. ఇప్పుడు ఆ ఇంటిని ఫ్లాట్స్ గా మార్చేశారు. మల్లికార్జున రావు గారు, ఆయన భార్య రామసీతమ్మ గారు, పిల్లలు నాగేశ్వర రావు, భాస్కర్ రావు, డాక్టర్ లక్ష్మణ్ రావు, లక్ష్మి, డాక్టర్ సరస్వతి, అంతా చాలా కలుపుగోలు మనుషులు. మల్లికార్జున రావు గారు సుమారు 86 ఏళ్ల వయసులో 2012 లో చనిపోయారు. ఆయన భార్య  రామసీతమ్మ గారు ఇటీవలే మూడేళ్ల క్రితం తన 81 వ సంవత్సరంలో 2016 లో చనిపియారు. మా పిల్లలను ఒక దాన్ని జిలేబీ అని, మరో దాన్ని గులాబ్ జాం అనీ పిలుస్తూ ముద్దు చేసేవారు దంపతులిద్దరూ.

   మల్లికార్జున రావు గారి ఇంట్లో సొంత మనుషుల్లాగా తిరిగేవాళ్ళం. మాతో పాటే మా ఆవిడ తమ్ముడు ఏవీజీ కుమార్ అలియాస్ వెంకన్న వుండేవాడు. భద్రాచలంలో పనిచేస్తున్న మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే ఆ రెండు గదుల ఇంట్లోనే మాతో పాటు సర్దుకు పోయేవాడు. అప్పటికి నాకు ఇద్దరు ఆడ పిల్లలు బుంటి (ప్రేమ మాలిని), కిన్నెర, ఇంకా ఆదిత్య పుట్టలేదు. ఆ ఇంట్లో దాదాపు ఏడెనిమిది నెలలు వున్నాం. అప్పట్లో స్కూల్ కు సెలవులు ఇవ్వగానే వుంటున్న ఇల్లు ఖాళీ చేసి ఖమ్మం వెళ్లిపోయే వాళ్లం. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సెలవులు దాదాపు రెండు నెలలు కావడం, రెండోది ఆ రెండు నెలల ఖర్చు తప్పించుకోవడం. ఖమ్మం దగ్గరలోనే వున్న మా గ్రామం వనం వారి క్రుష్ణాపురంలో సెలవులు గడిపేవాళ్ళం. అలాగే, మా వూరికి ఆరేడు మైళ్ల దూరంలో వున్న మా మామగారి వూరు వల్లభికి కొన్నాళ్లు పోయేవాళ్ళం. అప్పట్లో మా వూళ్ళో విద్యుత్ సరఫరా లేకపోయినా కిరోసిన్ లాంతర్ల వెలుతురులోనే రాత్రుళ్ళు గడిపేవాళ్ళం.

నేను ఉద్యోగంలో చేరిన సంవత్సరం స్కూల్ కు వేసవి సెలవులు ఇవ్వడానికి ముందర హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత మా జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు. వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాద రావు, నేను కలిసి ఖమ్మం రికాబ్ బజార్ స్కూల్లో చదువుకున్నాం. వెంగళరావు జిల్లాపరిషత్ అధ్యక్షుడిగా వున్నప్పుడు వాళ్లింటికి నా చిన్నతనంలో తరచు వెళ్లేవాడిని. 10 డిసెంబర్, 1973 నుండి 6 మార్చి 1978 వరకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాడు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.

ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు 1975 వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభోగంగా జరిగాయి. ఆ ఏడు ఉగాది నాడు (ఏప్రియల్ 12) మొదలైన మహాసభలు ఏడురోజులపాటు జరిగి, ఏప్రియల్ 18 న ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులు, సాహీతీ-సాంస్కృతిక ఉద్దండ పిండాలు, కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు, అవధానులు, మేధావులు, శాస్త్రవేత్తలు.....ఇలా, వీరూ-వారూ అనే భేదం లేకుండా, "కాకతీయ నగర్" గా నామకరణం చేయబడ్డ లాల్ బహదూర్ స్టేడియంలోని ఒకే వేదికపై సమావేశమై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు భాషలోని తీయందనాన్ని, గొప్పతనాన్ని తనివితీరా ఆస్వాదించారు.

ఏడురోజుల పాటు జరిగిన ఆ భాషోత్సవాలలో ప్రతిదినం లక్ష మందికిపైగా ప్రేక్షకులు పాల్గొన్నారని అంచనా. అనునిత్యం సెమినార్లు-గోష్ఠులు జరిగిన ప్రదేశాన్ని "నాగార్జున పీఠం" గా పిలిచారు. 1500 మందికి పైగా పాల్గొన్న ఈ గోష్ఠుల్లో, మొత్తం 28 అంశాలపైన, సుమారు 100 కు పైగా శాస్త్రీయ పేపర్లను సభ ముందుంచడం విశేషం. కాకతీయనగర్ లోని "శ్రీకృష్ణ దేవరాయనగర్" వేదికమీద సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నాటకం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్రకథల్లాంటి వందకుపైగా కార్యక్రమాలకు అది వేదికైంది. ఔత్సాహిక కళాకారులెందరో వీటిలో పాలుపంచుకున్నారు. "శాతవాహన నగర్" ప్రదేశంలో "తరతరాల తెలుగు జాతి" పేరుతో రెండున్నర వేల తెలుగుజాతి చరిత్రా విశేషాలతో కూడిన కళాత్మక ప్రదర్శన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయిల్ పెయింటింగ్స్, ఫొటోలు, ఛార్టులు, బొమ్మలు లాంటివి ప్రదర్శించారు.

మహాసభలకు దేశ-దేశాలనుండి, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 5000 మందికి పైగా  ప్రతినిధులు హాజరయ్యారు. సభలు ప్రారంభమైన మొదటి రోజున చార్మీనార్ నుండి సభావేదిక వద్దకు ఊరేగింపుగా నాలుగైదు గంటల పాటు నడిచి వేలాదిమంది చేరుకున్నారు. ఊరేగింపుకు సీఎం జలగం వెంగళ రావు నాయకత్వం వహించారు. "మా తెలుగుతల్లికి మల్లెపూదండ..." పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారిలో నేనూ ఒకడిని. మహాకవి శ్రీ శ్రీ తెలుగు మహాసభలను విమర్శిస్తూ పోటీ మహాసభలు పెట్టడం, అరెస్టు కావడం, అప్పటి సీఎం చొరవతో విడుదల కావడం నాకు ఇంకా గుర్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ ల మధ్య ఎంతోకాలంగా వున్న వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం కూడా సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు.

అన్నింటికన్నా నాకు ఇంకా బాగా గుర్తుంది అప్పటికి పట్టుమని పాతికేళ్లన్నా నిండని నరాల రామిరెడ్డి అష్ఠావధానం. ఆ అవధానంలో మరీ గుర్తుంది ఆయన పూరించిన ఒక పద్యం. "బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్, అమ్మాయి" లను కలుపుతూ, చెడు అర్థం రాకుండా పద్యం చెప్పమని కోరారొక ప్రేక్షకుడు. దానికి జవాబుగా అవధాని పద్యాన్ని ఇలా "మత్తేభం" వృత్తంలో చెప్పారు:

"అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాందీ కృత శ్యామతా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమౌ
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్"

ప్రేక్షకుల్లో ఒక్క సారి నవ్వులు విరజిల్లాయి. ఇలాంటి సాహిత్య ప్రక్రియలెన్నో జరిగాయప్పుడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే!

తెలుగు మహాసభలు ముగిసిన కొద్ది రోజులకు హయ్యర్ సెకండరీ స్కూలుకు వేసంగి సెలవులు ఇవ్వడంతో ఖమ్మం, దాని సమీపంలో మ వూరికి వెళ్లాను. అప్పటికే మా ఆవిడ కడుపులో మాకు పుట్టబోయే కుమారుడు ఆదిత్య జొరబడ్డాడు.  

No comments:

Post a Comment