Saturday, October 12, 2019

మన పీవీపై నిందలు : వనం జ్వాలా నరసింహారావు


మన పీవీపై నిందలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (13-10-2019)
భారత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, అధికారాల రీత్యా రాష్ట్రపతి స్థానం కంటే బలీయమైన ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, అందునా తెలంగాణ వాడు, స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు మరణించి పదిహేను సంవత్సరాలు నిండాయి. మరణానికి ముందు-ప్రధానిగా పదవీ విరమణ చేసిన తర్వాత, సుమారు ఎనిమిది సంవత్సరాలు, ఆయనను ఎన్ని విధాల కష్టపెట్టడానికి వీలుందో, అన్ని రకాలైన ఇబ్బందులకు గురిచేసింది అలనాటి భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మారి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయే ప్రభుత్వం, ఎన్డీయే కంటే అధికంగా, మరణించిన ఆయన ఆత్మకు క్షోభ కలిగించింది.

యావత్ ప్రపంచం ఎంతో ఉన్నతుడుగా ఇప్పటికీ కీర్తిస్తున్న అసామాన్య రాజనీతి-ఆర్ధిక వేత్తకు సముచిత స్థానం ఆయన సొంత దేశంలోనే, సొంత రాష్ట్రంలోనే, ఆయన జన్మించిన గడ్డలోనే, దొరకనందుకు బహుశా అందరికంటే ఎక్కువగా లోలోన బాధపడిన వ్యక్తి, ఆయన రాజకీయాల్లోకి తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనవచ్చేమో! కాకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత, అధికారికంగా ఆయన వర్ధంతి, జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని తెరాస ప్రభుత్వం చేసి చూపెట్టింది.

సరిగ్గా పంతొమ్మిది సంవత్సరాల క్రితం అక్టోబర్ 13, 2000-సోమవారం నాడు ఏ దినపత్రిక చూసినా, ఏ టెలివిజన్ చానల్‌లో వార్తలు విన్నా, కనిపించిందీ, వినిపించిందీ మాజీ ప్రధాని (స్వర్గీయ) పి.వి.నరసింహారావుకు విధించిన జైలుశక్ష గురించిన సమాచారమే. "చెరసాలకు మాజీ ప్రధాని", "అవినీతికి అర దండాలు", "ఆర్ధిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు", అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు శీర్షికలు పెట్టారు. అలాగే, అదే అర్ధం వచ్చే రీతిలో పలు ఆంగ్ల, హిందీ దినపత్రికలు కూడా శీర్షికలు పెట్టాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కి విశ్వవ్యాప్త మన్ననలందుకున్న ఓ మహనీయుడి పరిస్థితి కడు దయనీయంగా మారి, కనీసం పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన పేరుండ కూడదని క్షణాల్లో అప్పటి (తెలుగుదేశం) ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఆ పరిస్థితికి జాలిపడాలా?  సానుభూతి చూపాలా?.

ఆ తర్వాత ఏమైందన్న సంగతి పక్కన పెడితే, పి.వి.నరసింహారావు తప్పు చేశాడా లేదా అన్న విషయం కన్నా, ఆయన చేసినట్లు తీర్పిచ్చిన ఘోర తప్పిదానికి, ఆయనకు విధించిన "శిక్షనుంచి  మినహాయింపు కానీ, కనికరాన్ని కాని, పొందేందుకు అనర్హుడు" అని ఆ శిక్షను విధించిన న్యాయమూర్తి అజిత్ బరిహోక్ భావించారంటే ఆ కేసు పూర్వాపరాలు న్యాయమూర్తిపై తిరుగులేని ప్రభావాన్ని చూపాయనుకోవాలి. గుడ్డిలో మెల్లలా, కనికరాన్ని పొందడానికి కూడా అనర్హుడని భావించ దగ్గ పీవీ పైన తీర్పిచ్చిన న్యాయమూర్తి అజిత్ బరిహోక్ ఆఖరి క్షణంలో, "నువ్వు గింజంత" కనికరం చూపించారు. శిక్షను మూడేళ్లకు పరిమితం చేయడంతో పాటు, పీవీని తక్షణం జైల్‌లోకి తోసి వేయకుండా అవకాశం కల్పించి, బెయిల్ పొంది, హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకునే వీలు, పోనీ, "శిక్షనుంచి తాత్కాలిక మినహాయింపు" కలిగించారు! ఆయన సెషన్సు కోర్టే ఆ బెయిలును మంజూరు చేసి కొంత ఊరట కలిగించారు.

ఐదేళ్ల పదవీకాలం ముగిసాక పీవీపైన అనేక అవినీతి ఆరోపణలు మోపింది అలనాటి ఎన్డీయే ప్రభుత్వం. పదవి నుండి దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగి పోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో, పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ చేశారాయన మీద. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ పీవీని దోషిగా పేర్కొన్నారు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రిగా  పీవీ చరిత్ర పుటల్లోకెక్కారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుభాయి పాఠక్ కేసుల్లోను పీవీ నిర్దోషిగా ఉన్నత న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆరోపణలు కూడా నిరాధారాలని తేలింది. అయితే ఆయనకు జరగాల్సిన అన్యాయం జరిగింది. మచ్చ మిగిలిందా, చెరిగి పోయిందా అనే విషయాన్ని భావితరాల వారికే వదులుదాం.

          న్యాయస్థానా పూర్వరంగంలోకి పోతే, 1993 జూలై 28న పి.వి. ప్రభుత్వంపై పలు ప్రతిపక్షాలు సమైక్యంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.  సిపిఎం ప్రతిపాదించిన ఆ తీర్మానానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 265 ఓట్లు లభించడంతో 14 ఓట్ల స్వల్ప తేడాతో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై విజయం సాధించింది. ఇరవై మంది సభ్యులు గల అజిత్ వర్గం జనతాదళ్ పార్టీ నుంచి ఏడుగురు చీలిపోయి, పీవీకి మద్దతివ్వడంతో ప్రభుత్వం నెగ్గింది. దానికి అదనంగా, జార్ఖండ్ ప్రాంతానికి స్వయం నిర్ణయాధికారం కలిగించే దిశగా ప్రభుత్వం చేపట్టనున్న చర్యలకు సంబంధించి, (మరుసటి రోజు) తీర్మానానికి సమాధానమిచ్చేటప్పుడు ప్రకటన చేస్తానని, పీవీ హామీ ఇచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా లోని నలుగురు సభ్యుల మద్దతు కూడగట్టుకున్నారు. వీరితో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు, కేరళ కాంగ్రెస్, ఎస్.ఎస్.పి, ఎం.పి.ఐ, ఇండిపెండెంట్లకు చెందిన ఒక్కొక్కరు కూడా  పీవీకి మద్దతిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ 25 నెలల కాలంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన మూడో అవిశ్వాస తీర్మానం గండం నుంచి అలా గట్టెక్కింది ప్రభుత్వం. 


జెఎంఎం నలుగురు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ రోజున పీవీ ప్రభుత్వం గెలిచేదే. అయితే పర్యవసానం వేరే విధంగా మారిపోయింది.  మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించి, రక్షించడానికి జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న అభియోగం ఆయనపై మోపారు. ఆయన వద్ద వారు ముడుపులు తీసుకున్న విషయం రుజువైందని తేల్చి పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పిచ్చింది. 18 పేజీల తీర్పులో, న్యాయమూర్తి అజిత్ బరిహోక్ కఠిన పదజాలాన్ని వాడి, పీవీ నరసింహారావు చర్య భారత రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమనీ, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. "నిర్ణయం తీసుకోక పోవడమే సరైన నిర్ణయం" అని భావించే పీవీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గడానికి ముడుపులివ్వాలన్న నిర్ణయం తీసుకున్నడనడంలో వాస్తవం లేదనాలి.

         అయిదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి, పలువురికి పంచిపెట్టిన మేథావి, కాకలు తేరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా, చిరునవ్వు వీడని ధీశాలి, ముఖంలో తీర్పు వెలువడిన కొన్ని సెకన్లు మాత్రమే ఆందోళన కనిపించిందనీ, అయితే వెనువెంటనే నిలదొక్కుకుని మామూలుగా మారారనీ, ఆయన్నప్పుడు చూసిన సన్నిహితులు అన్నారు.

         నరసింహారావు నేరం చేశారో లేదో తర్వాత వెలువడిన తుది కోర్టు తీర్పులే తేల్చాయి.  ఏ ఒక్క దాంట్లో కూడా ఆయన్ని నేరస్తుడని తేల్చలేదు.  ఆయితే ఆయన చేసిన పొరపాట్లు అనేకం.  ఆ పొరపాట్లమూలాన్నే రాజకీయంగా ఆయన సహచరులు, సన్నిహితులు, ఆయన్ను హిమాలయాలపైనున్న ములగచెట్టు ఎక్కించి ఏనాడో శిక్ష విధించారు.  ఆలోచనల్లో, అమల్లో విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడే వ్యక్తి, అపర చాణుక్యుడుగా అందరూ స్తుతించన వ్యక్తి, ఆర్ధిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర  ఆర్ధిక నిపుణులనుండి ప్రశంసలందుకున్న వ్యక్తి చేసిన పెద్ద పొరపాటు బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా ఐదేళ్లు పాటు కలిగించడం, విశ్వాసఘాతకులకు వందేళ్ళ చరిత్రను అంకితం చేయడమే.

         ఇదిలా వుండగా ఇది జరిగిన కొన్నేళ్ళకు, సుమారు అయిదారేళ్ళ క్రితం మరోమారు పీవీ మీద బురదచల్లే కార్యక్రమానికి కొందరు ప్రబుద్ధులు శ్రీకారం చుట్టారు. ఆయన సొంత పార్టీ రాజకీయ ప్రత్యర్థి అర్జున్ సింగ్, పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ ఆ మహానీయుడిమీద అనేక నిందలు మోపారు. పీవీ అంటే సోనియాకు కోపమని వారు తమ పుస్తకాల్లో ప్రస్తావించారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత సమయంలో పీవీ ఒక గదిలో కూచుని తలుపులు వేసుకున్నారని, తాను ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో లేరని సమాచారం వచ్చిందని అర్జున్ సింగ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. పీవీని తాను ఒకరోజు ముందరే కూల్చివేత జరగనున్నట్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదని అర్జున్ సింగ్ వాదన. మొత్తం మీద పీవీకి కమ్యూనల్ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసాడు అర్జున్ సింగ్. ఇక కులదీప్ నయ్యర్ పుస్తకంలో కూడా పీవీ మీద ఆరోపణలు చేయడం జరిగింది. బాబ్రీ మస్జీద్ కూల్చి వేతకు పీవీ మౌనంగా అంగీకరించారని ఆయన ఆరోపణ. మొత్తం మీద బాబ్రీ మస్జీద్ విషయంలో పీవీ నిష్క్రియగా కూర్చున్నరనేది వారి ఆరోపణ.

         కరసేవకులు మస్జీదును కూల్చడం మొదలు పెట్టగానే పీవీ పూజలో కూర్చున్నారని, చిట్టచివరి రాయిని తొలగించిన తరువాతే ఆయన పూజ నుండి లేచారనీ, పూజ జరుగుతుండగా పీవీ అనుచరుడు ఒకరు వచ్చి ఆయన చెవిలో మస్జీద్ కూల్చివేత అయిపోయిందని చెప్పారని కులదీప్ నయ్యర్ తన పుస్తకంలో రాశారు. అర్జున్ సింగ్, కులదీప్ నయ్యర్ చేసిన ఆరోపణలను పీవీ హయాంలో న్యాయశాఖ కార్యదర్శిగా పని చేసి ఆయనకు రాజ్యంగ పరమైన అనేక విషయాల్లో నిర్మోహమాటమైన సూచనలిచ్చిన పీసీ రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుడిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ ఈ ఆరోపణలను అప్పట్లోనే పత్రికా ముఖంగా ఖండించారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత సమయంలో అలనాడు జరిగిన వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత సమయంలో పీవీ పూజ గదిలో ఉన్నారన్న ఆరోపణ చాలా హాస్యాస్పదమైనదని వీరు పేర్కొన్నారు. అసలు పీవీ గృహంలో పూజా మందిరమే లేదని వారు చెప్పారు. కూల్చివేత జరిగిన నాడు రోజంతా పీవీ ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతూనే వున్నారట. పీవీని అప్రతిష్టపాలు చేయడం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ, ప్రధానిగా పదవి అధిష్టించి నప్పుడూ నిరంతరం కొనసాగింది.      

తొలి దక్షిణాది వ్యక్రిగా ప్రధాని పీఠాన్ని అందుకొని, అందులో ఐదేళ్లపాటు కొనసాగడం ఎంతోమందికి నచ్చలేదు.  నెహ్రూ కుటుంబానికి చెందనవాడు, దక్షినాదివాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం కొందరి దృష్టిలో పనికరానివాడు, మెజార్టీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టిన వాడు కావడంతో ఆయన్ను దెబ్బతీసే ప్రయత్నం 1991లోనే మొదలయిందంటే అతిశయోక్తి కాదేమో!

భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాదివారు, దక్షిణాదివారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, ఉన్నతోన్నతమైన పీవీలాంటి వ్యక్తిని అధ‍ఃపాతాళినికి తొక్కేదాకా ప్రయత్నాలు చేయడమే!  ఉన్నత న్యాయస్థానాలు పీవీని నిర్దోషిగా తేల్చినా ఆయన మీద పడ్డ చెడ్డ మచ్చ పూర్తిగా మాసిపోయిందనలేము. 

1 comment:

  1. ఇంతకీ ఆర్టీసీ బస్సులు ఎప్పుడు కదులుతాయి అది చెప్పు జ్వాలా. పీవీ నరసింహారావు గురించి ఇప్పుడు అవసరమా.

    ReplyDelete