Sunday, October 6, 2019

సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పిన కబంధుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-81 : వనం జ్వాలా నరసింహారావు


సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పిన కబంధుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-81
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (06-10-2019)
          కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. అతడి శరీరాన్ని ఒక బిలంలో తోసి, ఎండు కట్టెలను పేర్చి, మండే కొరివి ఆ కట్టెల్లో వుంచి, అగ్నిని పురిగొల్పాడు. కొవ్వుతో నిండి, మాంసం ముద్దలాగా వున్న ఆ దేహాన్ని అగ్నిహోత్రుడు వేగంగా కాల్చకుండా మెల్లగా కాల్చసాగాడు. ఇంతలో రామలక్ష్మణులు చూస్తుండగానే, మండుతున్న ఆ మంటల్లో నుండి నిర్మలమైన వస్త్రాలు ధరించి, తళ- తళలాడే సొమ్ములు అలంకరించుకుని, ఆకాశానికి ఎగిరిన కబంధుడు, తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు.

         “రామచంద్రా! లోకంలో సంధి, విగ్రహ, యానా, సన, ద్వైదీభావ, సమాశ్రయంలనే ఆరు ఉపాయాలను రాజులైన వారు పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ ఆరింటిలో సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. విరోధి ఉనికి తెలిస్తేనే కదా, యుద్ధానికి సన్నద్ధం కావడం జరిగేది. కాబట్టి సంధి విషయం ఒకటే ఆలోచించాల్సి వుంటుంది. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి, నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం, సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరివల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే, ఎలాంటివారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనని చులకన చేస్తాడు కాని, నిండు మనస్సుతో ఆదరించడు. ఇప్పుడు మీ అన్నదమ్ములు ఇద్దరూ సమర్థులే అయినా, నీ భార్య కొరకై నీకు కష్టదశ ప్రాప్తించింది. నీ కొరకై నీ తమ్ముడు కష్టదశలో వున్నాడు”.

         “కాబట్టి నీ స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. అలా జరగకపోతే నీ పని అయ్యేట్లు నాకు అనిపించడం లేదు. అలాంటివారు ఎవరైనా వున్నారా అని అడుగుతావేమో? సుగ్రీవుడు అనే వానర రాజు, తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని దుఃఖపడుతూ, పంపానది ఒడ్డున వున్న పవిత్ర ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు. ఋజువర్తనం కలవాడు. సత్యం చెప్తాడు. బుద్ధి సంపదకలవాడు. ధైర్యవంతుడు. శౌర్యంలో ప్రసిద్ధుడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెదకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామా! నువ్వెందుకు దుఃఖపడతావు? ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది కాని, దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా?.

“నిర్మలమైన మనస్సు కలవాడా! నువ్వు అక్కడికి ఇప్పుడే శీఘ్రంగా వెళ్లు. సుగ్రీవుడితో స్నేహం చేయి. వాడు మహాబలవంతుడు. శ్రేష్టమైన గుణాలు కలవాడు. మోసబుద్ధిలేకుండా, వీడొక కోతి...వీడేమి చేయగలడని అలక్ష్యం చేయకుండా అగ్నిసాక్షిగా వానర రాజుతో స్నేహం చేయి. వాడు మిక్కిలి పరాక్రమవంతుడు. ఎవరైనా తనకు సహాయపడతాడా అని వెతుకుతున్నాడు. మీకు ఆయన మేలే చేస్తాడు. నువ్వు చేసిన మేలు ఆయన మరవడు. వానరులందరికీ అతడు ప్రభువు. కోరిన రూపం ధరించగలడు. అతడి కోరిక నెరవేర్చే శక్తి మీకుంది. ఆయన కోరిక మీరు వెంటనే నేరవేర్చినా, లేకున్నా, మీ పని అతడు చేస్తాడు”.

“సుగ్రీవుడు ఋక్షరాజుడు స్త్రీగా వున్న సమయంలో ఆమె శరీరంలో సూర్యుడికి జన్మించాడు. పంపానదీ తీరంలో అన్న వాలికి భయపడి తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నిటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమ్మీదగల నదులు, నదాలు, కొండలు, అడవులు, వెతికి నీ భార్య ఎక్కడున్నదీ వార్తా తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి, వాడామెను పాతాళంలో దాచినా, మేరువు కొనలో ఉంచినా, రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు”.

No comments:

Post a Comment