Tuesday, October 15, 2019

ఆర్టీసీ సమ్మె అసంబద్ధం, బాధ్యతా రాహిత్యం : వనం జ్వాలా నరసింహారావు


ఆర్టీసీ సమ్మె అసంబద్ధం, బాధ్యతా రాహిత్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (16-10-2019)
సుమారు కోటి మంది ప్రజలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు సంబంధాలున్నాయి. ఇంకా పూర్వచరిత్రలోకి పోతే, 1932లో నిజాం స్టేట్ రైల్వే లో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో “నిజాం రాష్ట్ర రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్” (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) పేరుతో రోడ్డు రవాణా శాఖను ఏర్పాటు చేశారు. దరిమిలా దాన్ని నవంబర్ 1,1951 న హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేశారు. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. అప్పట్లో సంస్థ 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది. అలాంటి సంస్థ అంచలంచెలుగా ఎదుగుతూ ఇటీవల యూనియన్ల పిలుపు మేరకు కార్మికులు సమ్మెకు దిగేనాటికి సుమారు 50,000 మంది సిబ్బంది వుండే స్థాయికి ఎదిగింది. ఈ ఎదుగలతో పాటే, యూనియన్ల ప్రత్యక్ష-పరోక్ష పాత్ర పుణ్యమా అని సాలీనా రు. 1200 కోట్ల నష్టాలకు, అదనంగా రు. 5000 కోట్ల అప్పుల తిరోగమనానికి కూడా చేరుకుంది.  

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద నిర్ణయం తీసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం చరిపిన చర్చలను బేఖాతర్ చేస్తూ, ఇంకా సంప్రదింపులు అసంపూర్తిగా వున్న సమయంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మెచేయడానికి నిర్ణయించుకోవడం సబబు కాదు. ఆర్టీసీ పీకల్లోకి కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయి, ఇబ్బందుల్లో వున్న సమయంలో, సంస్థకు ఆదాయం వచ్చే బతుకమ్మ, దసరా పండుగల ప్రయాణీకుల రద్దీ సమయంలో అత్యంత బాధ్యతా రహితంగా సమ్మెకు దిగడానికి పూర్తి బాధ్యత వారిదే. ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో సమ్మెకు దిగడం అసమంజసం, అసంబద్ధం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఆర్టీసీ యూనియన్లు అస్తవ్యస్తమైన డిమాండ్లతో సమ్మె చేస్తామని అనడం దురదృష్టం. సమ్మెకు పోయి కార్మికుల గొంతు కోసేదానికంటే సంస్థను ఎలా బలో పేతం చేసుకోవాలో యూనియన్ నాయకులు ఆలోచించాలి. గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మకం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి.

సర్వీస్ కండీషన్లకు సంబంధించిన విషయంలో సమ్మె నోటీసు ఇవ్వడం వుంటుంది కాని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించి సమ్మె నోటీసు ఇవ్వడం, చేయడం అసంబద్ధమైన చర్య. విలీనం గురించి అఖిల పక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎం అధికారంలో వున్ననాడు, పశ్చిమ బెంగాల్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? పోనీ కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అలా అడగడం సబబు కాదు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ కూడా అసంబద్ధమే. అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికమని పలువురి భావన. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు వుందా అనేది అనుమానమే. మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే, మేథావిగా పేరుపొందిన ‘లోక్ సత్తా’ జయప్రకాశ్ నారాయణ లాంటివారు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్న డిమాండ్ అర్థరహితం అన్నారు.

దేశ చరిత్రలో ఏరాష్ట్రంలోనూ పెంచని విధంగా గతంలో ఒకసారి ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచి, ఆ తరువాత 16% ఐఆర్ పెంచి, సంస్థను లాభాలలో నడిపించమని సూచించినప్పటికి ఏమాత్రం ఫలితం కనిపించలేదు. ఆర్టీసీ ఉద్యోగులతో ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమావేశం జరిపినపుడు కేవలం పదిశాతం డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తుండేవి. ఏళ్లు గడిచినా ఆ విషయంలో ఏ మార్పూ రాకపోవడం వాళ్ల అలసత్వానికి ఒక ఉదాహరణ.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పోరేషన్లను ఎత్తివేయడమో, నామ మాత్రంగా నడపడమో, లేదా పునర్వవస్థీకరించడమో జరిగింది. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 7, ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయి. ఇదే పద్దతి తెలంగాణలో కూడా అవలంబించాల్సిన పరిస్థితులు రావడం శ్రేయస్కరం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రయివేట్ ట్రావెల్ ఏజెన్సీలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని, బస్సులు కొని, లాభాల్లో నడుపుతూ, బ్యాంకు రుణాలను కూడా తీరుస్తుండగా, యూనియన్ల అలసత్వం వలన ఆర్టీసీ నష్టాల్లో పోవడం సమంజసం కాదు కదా. దాన్ని సమీక్ష చేసుకుని ఎలా లాభాల బాట పట్టాలో వాళ్లు ఆలోచన చేయాల్నా? సమ్మెలకు దిగాల్నా?.

వాస్తవానికి ఆర్టీసీలో సమ్మె చేయడం నిషేధం. అలా నిషేధించినా కొందరు తమ స్వలాభం కోసం సమ్మెకు దిగడం, వేలాది కార్మికులను సమ్మెకు దించడం, వారిని ఉద్యోగాలు పోగొట్టుకునేలా చేయడంలోని ఔచిత్యాన్ని ఆర్టీసీ యూనియన్లు ఆలోచించాలి. యూనియన్ నాయకులు తమ తెలివితక్కువ తనంతో, తొందరపాటు చర్యతో, మొత్తం ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారేమో అని ఆత్మ విమర్శా చేసుకోవాలి. నాయకుల మాట విని అమాయక కార్మికులు కూడా మోసపోతున్నారు, ఆత్మహత్యలకు కూడా దిగుతున్నారు.

ఈ నేపధ్యంలో, సమ్మె పూర్వాపరాలను క్షుణ్ణంగా, సుదీర్ఘంగా పలుమార్లు సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ప్రకటించారు. ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ మొదటి తేదీన జరిగిన మంత్రిమడలి సమావేశంలో, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఫలుదఫాలుగా ఈ కమిటీ ఆర్టీసీ యూనియన్లతో చర్చించింది. చర్చలు, సంప్రదింపులు ఇంకా అసంపూర్తిగా వుండగానే కార్మికులు సమ్మెకు దిగారు.


అదేరోజు సీఎం సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 5, 2019 శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం తన కృత నిశ్చయాన్ని వెల్లడి చేసింది.

గడువు పూర్తి అయ్యేలోపల, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ప్రకటించిన ప్రభుత్వం, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని తెలియచేసింది. అద్దె పద్ధతిన, రూట్ పర్మిట్లు ఇచ్చి స్టేజ్ కారేజ్ పద్ధతిన బస్సులు నడపడానికి, కొత్త సిబ్బంది నియామకం చేపట్టడానికి, నియామక ప్రక్రియ మొదలు పెట్టడానికి నిర్ణయం జరిగింది. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ వున్నారు.

ఇదిలా వుండగా, ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ, ముఖ్యమంత్రి మళ్లీ-మళ్లీ స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అనీ, తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామనీ సీఎం కేసీఆర్ అన్నారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశారు. ఆ ప్రతిపాదనలను అక్టోబర్ 7, 2019 న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం: ఆర్టీసీలో నడుపుతున్న 10,400 బస్సులను భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని వుంచడం కూడా ఆర్టీసీ డిపోలలోనే. మరో 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రయివేటువి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలో కూడా నడపాలి. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి. వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచడం జరగాలి. ఇప్పటికీ 21%  అద్దెబస్సులను ఆర్టీసీ నడుపున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే.

ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఎవరు ఎవర్నీ డిస్మిస్ చేయలేదు. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారు. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తికి వారు స్పందించలేదు. యూనియన్ నాయకుల మాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. తమంతట తాముగా విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం పలుమార్లన్నారు.

ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలనీ, దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలనీ, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలనీ,  బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలనీ, అధికారులు రేయింబవళ్లు పనిచేసి, వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలనీ సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవి అమలవుతున్నాయి. ఇక అలాంటప్పుడు సమ్మె చేస్తున్న వారి అవసరం ఏ మాత్రం వుండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదు.

ఒక్కసారి సమ్మెల నేపధ్యం, అవి విఫలమైన వ్యవహారం గమనిస్తే, ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు 17 లక్షల మంది పాల్గొన్న రైల్వే సమ్మె 20 రోజులపాటు కొనసాగి వందల మంది జైలు పాలయ్యారు. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. చివరకు జరిగిందేమితి? సమ్మె ఆగిపోయింది.....ఉద్యోగం నుండి తొలగించిన వారెవరినీ తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. జయలిత హయాంలో, సమ్మె చేసిన లక్షా డెబ్బై వేలమంది ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటి పర్యాయం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు డాక్టర్లు డెబ్బై రోజులకు పైగా సమ్మె చేసి, చివరకు వారంతట వారే సమ్మెను ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ కొన్ని సమ్మెకు సంబంధించిన ఉదాహరణలు మాత్రమే.  

కారణాలేమైనా, ఆర్టీసీ సమ్మెతో ఇప్పటికే సంస్థ నష్ట పోయింది. సమ్మెకు దిగిన కార్మికులూ నష్టపోతున్నారు. ప్రజలూ కష్ట పడ్డారు. ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతున్నారు. సమ్మె చేస్తున్న వారు ఎంత తొందరగా ఇది గ్రహిస్తే అంత మంచిది. ఎంత తొందరగా సమ్మె విరమించుకుంటే అంత మంచిది. 

4 comments:

 1. Lopsided article. Please see nageshwar interview mahanews about RTC.

  When JP criticized government you people abused him. Now he is right because he supports your view.

  Public Transport is government responsibility.

  People are suffering because of your egos.

  Shame on you you can't buy new buses for RTC whereas demolish robust buildings and waste money on new secretariat construction. Please do some soul searching.

  ReplyDelete
 2. ఆర్టీసి ని ప్రైవేటీకరిస్తామంటే దానికి వ్యతిరేకంగా సమ్మె చేసే హక్కు ఆర్టీసి ఉద్యోగులకు ఉండొచ్చు.కాని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిరవధిక సమ్మె చేయడం కరెక్ట్ కాదు.

  ReplyDelete
 3. వనం గారు, మీ వ్రాతల గురించి public అభిప్రాయం ఎలా ఉందో ఈ క్రింది లింకులో చూడండి. మీ వ్రాతల గురించి కాస్త ఆలోచించుకోరాదూ?

  "సీఎం ఎంగిలి సిగరెట్లను ఏరేసే వ్యక్తి"


  ReplyDelete