Sunday, December 27, 2009

అమెరికా ఆరోగ్య సంస్కరణల చట్టం-భారతీయుడి అభిప్రాయం

ఈ కింది ఇంటర్నెట్ లింకులలో అమెరికా ఆరోగ్య సంస్కరణలకు సంబంధించిన ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఒకటి సుజనరంజనిలోను, మరొకటి ఆంధ్ర జ్యోతిలోను ప్రచురించబడినవి. పూర్తి ఆర్టికల్ కింద వుంది:

http://siliconandhra.org/nextgen/sujanaranjani/dec2009/healthcare.html
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/20edit3

Text:

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన హెల్త్ కేర్ సంస్కరణల బిల్లుకు, స్వపక్షంనుండి-ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం పొందేందుకు అధ్యక్షుడు బారక్ ఒబామా చేయని ప్రయత్నం లేదు. పాలకపక్ష డెమొక్రాట్లకు చెందినవారు 258 మంది వున్నప్పటికీ, మొత్తం 177 రిపబ్లికన్లతో సహా పలువురు డెమొక్రాట్లు బహిరంగంగానే బిల్లును వ్యతిరేకిస్తుండడంతో, తన అధికారిక-వ్యక్తిగత పలుకుబడినంతా పణంగా పెట్టి, వ్యతిరేక లాబీ ప్రయత్నాలకు గండి కొట్టాడు బారక్ ఒబామా. ఎట్టకేలకు నవంబర్ 7, 2009 న అమెరికా దిగువసభలో జరిగిన ఓటింగ్ లో, బిల్లుకు అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 215 ఓట్లు రావడంతో, బొటాబొటి ఆధిక్యంతో బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఇక సెనేట్ ఆమోదం పొందాల్సి వుంది.

ఒబామా ఎంత ప్రయత్నం చేసినా, పాలక పక్షానికి 258 మంది సభ్యులున్నప్పటికీ, వచ్చిన ఓట్లు 220 మాత్రమే. 39 మంది డెమొక్రాట్లు వ్యతిరేకంగా ఓటువేయగా, గుడ్డిలో మెల్లలాగా, ప్రతిపక్షానికి చెందిన ఒకే ఒక్క రిపబ్లికన్ బిల్లుకు అనుకూలంగా ఓటువేశాడు.భవిష్యత్ లో తమ ఆదాయవ్యయాలపైనా, ఆరోగ్యపరమైన సమస్యలపైనా హెల్త్ కేర్ చట్టం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనన్న విషయంలో చాలామంది అమెరికన్లు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. చట్ట రూపంలో అమల్లోకి రానున్న బిల్లుకు మద్దతుగా-వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. పతాక శీర్షికలతో దినపత్రికలు రోజుకొక విధంగా బిల్లులోని అంశాలను ప్రచురిస్తుండడంతో, గందరగోళ పరిస్థితులు నెలకొని, చివరకు ఏవిధంగా అది అమలులోకిరానున్నదోనని భావిస్తున్న పలువురు, తమ అభిప్రాయాన్ని అప్పటిదాకా వెల్లడించలేక పోతున్నామంటున్నారు.అమెరికాలోని ప్రింట్-ఎలెక్ట్రానిక్ మీడియాలో గత నెల రోజులుగా దీనికిసంబందించిన వార్తలకే ప్రాముఖ్యం ఇస్తున్నారు.

బిల్లు చట్ట రూపేణా చేసే సమయం దగ్గర పడే కొద్దీ, అధ్యక్షుడు ఒబామా ప్రతిపాదించిన బిల్లులోని పలు అంశాలను, రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యో, లాబీ వర్గాలవారి ప్రయత్నాలవల్లో, తొలగించే పరిస్తితులొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ల, ఆసుపత్రి వర్గాల, భీమా కంపెనీల,ఇతర బలీయమైన ఒత్తిడివర్గాలప్రయత్నాలు చాలావరకు ఫలించాయని, ఫలితంగా, ఒబామా తలపెట్టిన విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన ప్రాధాన్యతాంశాలకు సవరణలొచ్చాయని కూడా అనుకుంటున్నారు. సెనేట్ ముందుకొచ్చి, దాని ఆమోదం పొందేనాటికి సంస్కరణల మౌలిక స్వరూపమే మారినా ఆశ్చర్య పడక్కరలేదుఏదేమైనా, ఎవరెన్ని అంటున్నా-అనుకుంటున్నా, అధ్యక్షుడు ఒబామా మాత్రం, తాను ప్రతిపాదించిన దేశవ్యాప్త ఆరోగ్య పరిరక్షణ సంస్కరణలకు అసాధారణమైన ఏకాభిప్రాయం లభిస్తున్నదన్న విశ్వాసంతో వున్నాడు. నవంబర్ 7, 2009న, చట్టసభలో చారిత్రాత్మక ఓటింగ్ జరుగనున్న నేపధ్యంలో,సంప్రదాయాలకు అతీతంగా రెండు రోజుల ముందు, శ్వేత సౌధంలో బహిరంగంగా ప్రజల మద్దతు కోరుతూ వారి ముందుకు వచ్చాడు ఒబామా.

సంస్కరణలకు మద్దతు పలుకుతున్న అమెరికన్ మెడికల్ అసోసియేషన్, సీనియర్ అడ్వొకసీ వర్గాలలాంటి బలీయమైన అమెరికా సంస్థల వాదనలకు ప్రసార మాధ్యమాల ప్రాచుర్యం లభించేలా చర్యలు చేపట్టాడు. గతంలో వ్యతిరేకించిన కొన్ని వర్గాలు, డాక్టర్లు, వైద్యరంగ నిపుణులు తన సంస్కరణలకు బహిరంగ మద్దతివ్వడమంటే, హెల్త్ కేర్ బిల్లు చట్టం కావడానికి అడ్డంకులు తొలిగినట్లేనని అత్యంత విశ్వాసంతో చెప్పాడు."అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఫర్ అమెరికా యాక్ట్" అన్న పేరుతో అమల్లోకి రానున్న ఒబామా తలపెట్టిన ఆరోగ్య సంస్కరణల ముఖ్యోద్దేశం, రాబోయే రోజుల్లో అమెరికన్లందరికీ ఎప్పటికంటే తక్కువ ఖర్చుతో, అందుబాటులో-నాణ్యమైన-మెరుగైన వైద్య సదుపాయం కలిగించడమే. ఇంతవరకు ఆరోగ్య భీమా సౌకర్యం వున్నవారికి అదనపు రక్షణలు కలిగించేందుకు, భీమా సౌకర్యానికి నోచుకోనివారికి భవిష్యత్ లో కలిగించేందుకు, అమెరికా వాసులందరికీ-అమెరికా వ్యాపారసంస్థలన్నింటికీ-అమెరికా ప్రభుత్వానికీ, వైద్య-ఆరోగ్యపరమైన వ్యయాన్ని తగ్గించేందుకు వుద్దేశించిందీ చట్టం. భీమా తీసుకునే ముందర వున్న ఆరోగ్యసమస్యలకు కూడా కవరేజ్ సౌకర్యం కలిగించింది చట్టం. గతంలో లాగా, భీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా, ఎటువంటి ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యకైనా భీమా వర్తించేలా చట్టంలో నిబంధన విధించబడింది. భీమా పరిధిలోకి రాని వ్యయంకూడా తగ్గనున్నది. వ్యాధినిరోధక ఆరోగ్య రక్షణ చర్యలకు అదనపు భారం లేకుండా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించనున్నాయి. భీమా సౌకర్యానికి నోచుకోనివారికి, సరసమైన-అందుబాటు ధరల్లో కొత్తగా ఏర్పాటుచేయనున్న ప్రభుత్వరంగ భీమా విపణి (ఇన్సూరెన్స్ మార్కెట్) ద్వారా లాభం చేకూరనున్నది.

ఒక్కమాటలో చెప్పాలంటే, 1500 పేజీలకు పైగా వున్న సుదీర్ఘమైన ఆరోగ్య సంస్కరణల బిల్లు చట్టమై, ఒబామా అనుకున్నది అనుకున్నట్లే జరుగుతే, ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. అయితే, ఒత్తిళ్లకు-ఆటుపోట్లకు ఆలవాలమైన అమెరికా రాజకీయ-మతాధిక్య నేపధ్యంలో అదెంతవరకు సాధ్యపడుతుందో వేచిచూడాల్సిందే.

అమెరికాలోని ఆసుపత్రులు పనిచేసే విధానం విచిత్రంగా వుంటుందనాలి. ఒకవైపు మెరుగైన సేవలు అందిస్తూనే, మరోపక్క ఎవరికీ అర్థంగాని రీతిలో వ్యవహరిస్తుంటాయవి. నడక దూరంలో వున్న ఒకే రకమైన రెండు ఆసుపత్రుల్లో, ఒకే రకమైన ఆరోగ్యసమస్యకు, భిన్నమైన ధరలుంటాయి. ఇంకో వింత విషయం, ఒకే ఆసుపత్రిలో, ఒకే జబ్బుకు, ఏ ఇద్దరికీ ఒకే మోతాదులో పీజు వసూలుచేయరు. మెనూ వెల్లడించని హోటల్లో, దాని యజమాని ఏది చేస్తే అదే తిని, వాడు అడిగిన ధరే చెల్లించి, మన కడుపు నింపుకున్నట్లుగా వుంటాయి అమెరికా ఆసుపత్రులు. చికిత్సకు ఆసుపత్రికెళ్లిన రోగికైనా-రోగి సంబంధీకులకైనా, దేనికెంత వసూలుచేస్తున్నారో తెలుసుకోవాల్సిన ఆసక్తి వుండదు. అడిగినా వాళ్లు చెప్పరు. అసలా ఫీజు విషయం ఇచ్చేవాడు ఆలోచించడు-కారణం, చెల్లించేది భీమా సంస్థ కాబట్టి. అయితే భీమా సంస్థ తనకోసం ఇస్తున్న ఫీజు తన సంపాదనలోదేనని ఆలోచించడు. మొట్ట మొదటిసారి, ఈ సమస్యపై కూడా దృష్టి సారించింది అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన హెల్త్ కేర్ బిల్లులో. భవిష్యత్ లో ఆసుపత్రిలో వున్న సౌకర్యాలు, ధరలు, మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేందుకు వచ్చిన అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేయాలి.

అమెరికాలో, గత ఇరవై సంవత్సరాలలో వైద్య-ఆరోగ్య ఖర్చులు, రెట్టింపయ్యాయని, దేశ ఆర్థిక వ్యయంలో సుమారు 16% పెరిగాయని నిపుణుల అంచనా. విపరీతంగా పెరిగిన భీమా ప్రీమియానికి అదనంగా పన్నుల భారం విధించితేనే, ప్రస్తుతం భీమా సౌకర్యానికి నోచుకోని లక్షలాది మంది అమెరికన్లకు, అందుబాటులో వైద్య సదుపాయం లబించేందుకు వీలుంటుంది. ఇలా విధించడానికి ఒబామా ప్రభుత్వం సూచించిన ప్రణాళికకు సంబంధించి, పాలక డెమాక్రాట్లకు-రిపబ్లికన్లకు ఒకవైపు, ఎగువ-దిగువ సభలకు మరోవైపు, తీవ్ర అభిప్రాయ భేదాలొచ్చాయి. చట్టసభల ఆమోదంకొరకు ఎదురుచూస్తున్న హెల్త్ కేర్ బిల్లులో, 2013 సంవత్సరంనుండి వ్యక్తిగత భీమాకు 8000 డాలర్లు, కుటుంబ భీమాకు 21000 డాలర్ల భీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రతిపాదనుంది. ప్రీమియం వ్యక్తులు చెల్లించినా, వారు పనిచేస్తున్న వ్యాపార సంస్థలు చెల్లించినా, అది అదనపు భారమవుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారంటున్నారు. అయితే ఇలా అదనంగా సేకరించిన నిధులను భీమా సౌకర్యానికి నోచుకోని-నోచుకోలేని లక్షలాది మంది తక్కువ ఆదాయంవున్నవారికి, సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుందని బిల్లును సమర్ధిస్తున్నవారంటున్నారు.

ఈ నేపధ్యంలో, ఒకే ఒక్క రిపబ్లికన్ సెనేటర్, తనవోటును బిల్లుకు అనుకూలంగా వేయడంతో, అక్టోబర్ 13 న, సెనేట్ ఆర్థిక కమిటీ అమోదం లభించింది. చారిత్రాత్మక ఆరోగ్య సంస్కరణల దిశగా, సెనేట్ ఆర్థిక కమిటీ ఆమోదం "ఒక మైలురాయి “గా వర్ణించాడు ఒబామా.సెనేట్ లో బిల్లుకు అనుకూలంగా ఓటువేసిన రిపబ్లికన్ సెనేటర్, ప్రభుత్వ ఆధ్వర్యంలో భీమా సౌకర్యం కలిగించాలన్న ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకు కొందరు డెమాక్రాట్ల మద్దతు లభించగా, మరికొందరు వ్యతిరేకించారు. సెనేట్ కమిటీ ఆమోదం లభించిననాటినుండి, అంతవరకు మౌనం పాటించిన భీమా సంస్థలు, పలుకుబడి కలిగిన వైద్యులు, ఆసుపత్రి యజమానులు బిల్లుకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆరంభించారు. బిల్లువల్ల ప్రీమియం ఖర్చులు పెరిగి, వైద్యానికయ్యే వ్యయం విపరీతంగా పెరుగుతుందని ప్రకటనలివ్వడం ప్రారంభించారు. భవిష్యత్ లో మెడికేర్ విధానంవల్ల తమ ఆదాయం పడిపోతుందని భావించిన హృద్రోగ నిపుణులు అధ్యక్షుడు ఒబామాకు బహిరంగ లేఖ రాసి, అనతికాలంలో, ఆయన అమలుచేయనున్న సంస్కరణల వల్ల, తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని బెదిరించారు. ఇవేమీ పట్టించుకోకుండా, అధ్యక్షుడు ఒబామా, భీమా కంపెనీలపైనా, బిల్లును వ్యతిరేకిస్తున్న వారిపైనా, తీవ్రమైన విమర్శలు చేశాడు. అనైతిక ప్రకటనలిచ్చి సంస్కరణలను నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటూ, భీమా సంస్థల ప్రధాన ధ్యేయం సంపాదనేనని విమర్శించాడు.

అసలింతకీ, అధ్యక్షుడు ఒబామా తీసుకొస్తున్న సంస్కరణల్లో, ఇరవైనాలుగు గంటల వైద్య సౌకర్యం అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ వుండేందుకు అవసరమైన నిబంధనలున్నాయా అనేది ప్రశ్నార్థకం. అమెరికాలో వుంటున్న ఎవరికైనా సరే అన్నివేళలా వైద్య సౌకర్యం లభిస్తుందా? ఎక్కువ ఆదాయం వున్న వారికైనా-తక్కువ వున్న వారికైనా, ఏ వయసు వారికైనా, స్త్రీ-పురుష భేదం లేకుండా, జన్మతః అమెరికన్ అయినా-కాకున్నా, అమెరికాలో వుద్యోగంచేస్తున్న ఇతరదేశస్తుల తల్లిదండ్రులకైనా, ఎవరికైనా సౌకర్యం సమానంగా వుండడానికి వీలుకలిపించబడిందా? అవసరానికి వైద్య సదుపాయం అందుబాటులో వుండదనేది ఇక్కడ చాలామంది భావన-ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న పలువురు భారతీయుల భావన.

పది సంవత్సరాల క్రితం నాకెదురైన అమెరికా ఆసుపత్రుల-వైద్య సౌకర్యాల అనుభవం ఎప్పటికీ గుర్తుంటుంది.పదేళ్లక్రితం అమెరికాలో పనిచేస్తున్న మా అమ్మాయి సిన్సినాటిలోని బెతెస్డా నార్త్ ఆసుపత్రిలో ఆగస్ట్ 4, 1999న ప్రసవించింది. ఆసుపత్రిలో లభించిన సమస్త సౌకర్యాలు చూసింతర్వాత అమెరికాలో వైద్య సౌకర్యాలు అంత గొప్పగా వుంటాయా అనిపించింది. ఆసుపత్రినుండి డిస్చార్జ్ అయిన తర్వాత, బాబు పుట్టిన ఐదో రోజున వాడికి పచ్చకామెర్లున్న అనుమానం కలిగి, చంటిపిల్లల డాక్టర్ ను సంప్రదించడం జరిగింది. ఆయన సూచన మేరకు రక్తపరీక్ష చేయించడం కూడా జరిగింది. జాండిస్ వున్నదనడానికి కారణమైన ఇన్ఫెక్షన్ వుందని కూడా నిర్ధారణ జరిగింది. అయితే భీమా సంస్థ అనుమతి లభించనందున, చంటివాడిని ఆసుపత్రిలో చేర్పించడానికి డాక్టర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించేందుకు అయ్యే ఖర్చుకన్నా, బాబుకు ఇంట్లోనే చేయిస్తే తక్కువవుతుందని, ఆ భీమా సంస్థ భావించడంతో, సరైన వైద్య సౌకర్యం లభించడానికి ఒకరోజుకుపైగా ఆలశ్యమైంది. జాండిస్ పెరిగింది. ఇంట్లోనూ వైద్యం జరగలేదు. చివరకు విశ్వప్రయత్నం చేసింతర్వాత, మర్నాడు ఆసుపత్రికి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. అక్కడకూడా చేర్పించడానికి సవాలక్ష అర్థంలేని ప్రశ్నలు వేశారు. అందులో హాస్యాస్పదమైనవి పదే-పదే అడిగిన "ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆ ది చైల్డ్". కాకపోతే అడ్మిట్ చేసుకున్న తర్వాత అత్యంత మెరుగైన వైద్యం చేసి బాగయిన తర్వాత ఇంటికి పంపించారు. దీనంతకీ కారణం, అమెరికాలో ఎంత చిన్నదైనా-పెద్దదైనా వైద్య సదుపాయం కావాలంటే, భీమాకంపెనీవారి దయా దాక్షిణ్యాలుండాల్సిందే.

అమెరికా తలపెట్టిన సంస్కరణల్లో ఎంతసేపూ ఏ ఆదాయవర్గాలవారు ఎంత భరించాలన్న అంశానికే అధిక ప్రాధాన్యతనిచ్చారుగాని, ఎంతమందికి అవసరమైనప్పుడు, వారనుకున్న వైద్య సేవలు అందుబాటులో వుండాలి అన్న అంశానికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. డాక్టర్ ను ఒకసారి నిర్ణయించుకొని భీమా కంపెనీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే, ఇక వాడి ఇష్టాఇష్టా లపైనే మన భవిష్యత్ ఆధారపడి వుంది. లాబ్ టెస్ట్ లు చేయించుకోవాలన్నా- చేయించుకున్న వాటి ఫలితాలు తెలుసుకోవాలన్నా మనచేతిలోలేదు. ఆరోగ్యసమస్య వచ్చినప్పుడు కటిక బీదవాడైనా సరైన వైద్యసౌకర్యం-తనకిష్టమైన వైద్యుడి ద్వారా కోరుకుంటాడు గాని, ఖర్చుకు వెనుకాడడు. అసలు అమెరికాలో అనుకున్న మరుక్షణం డాక్టర్ సహాయం అందుతుందాననేది అనుమానమే. అత్యవసర స్థితిలో వేరే సంగతి. అయితే ప్రతి దానికీ డబ్బుకు-భీమాకు లంకె.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో అమలవుతున్న మూడు రకాల ఆరోగ్య వైద్య సదుపాయాలు బహుశా ప్రపంచంలోని పలుదేశాలకు మార్గదర్శికం కాదగినవనవచ్చేమో. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతోనూ-రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్న నిధులతోనూ "రాజీవ్ ఆరోగ్యశ్రీ" గొడుగు కింద అమలవుతున్న ఈ మూడు పథకాలు రాష్ట్రంలో నివసిస్తున్నవారికే కాకుండా, ప్రవాస ఆంధ్రులకు కూడా ఎనలేని ధైర్యాన్ని సమకూరుస్తున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగ రీత్యా విదేశాల్లో వుంటున్న పలువురు ప్రవాస ఆంధ్రులకు ఒకప్పుడు వారి వైద్య-ఆరోగ్య సదుపాయాలపట్ల ఆందోళన వుండేది. చేస్తున్న ఉద్యోగానికి శలవుపెట్టి హటాత్తుగా దేశానికి తల్లిదండ్రులకొరకు రావాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందిలేదు. మున్నూట అరవై అయిదు రోజులు-ఇరవైనాలుగు గంటలూ, మారుమూల వున్న కుగ్రామానికి సైతం, ఎలాంటి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్తితి వచ్చినా, పూర్తి ఉచితంగా-ఫోన్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 108 అంబులెన్స్ ఇంటి ముందుకొచ్చి- దారిపొడుగూతా అత్యవసర వైద్య సదుపాయం అందిస్తూ సమీప ఆసుపత్రికి చేరుస్తుంది. అలా చేర్పించిన ఆసుపత్రిలో-ప్రయివేట్ దైనా సరే, 24 గంటలపాటు, పూర్తి ఉచిత వైద్య సహాయం దొరుకుతుంది. దీని కయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య సేవలకొరకు ఏ ఆసుపత్రికిపోవాలనేది పేషంట్ ఇష్టప్రకారం జరుగుతుంది. నిర్వహణను ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఈ.ఎమ్.ఆర్.ఐ అనే సంస్థకు అప్ప చెప్పింది ప్రభుత్వం. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను, ఏరియా ఆసుపత్రులను అభివృద్ధి పరిచింది ప్రభుత్వం. ప్రయివేట్ ఆసుపత్రులతోనూ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని ఉచితంగా 24 గంటలపాటు రోగికి చికిత్స అందించే ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

108 అంబులెన్స్ అత్యవసర ఆరోగ్య సహాయ సేవల కదనంగా 104 ఆరోగ్య సేవలను కూడా ప్రవేశపెట్టి, ఆ సేవల పరిధిని విస్తృతపరుచుకుంటూ, మరిన్ని ఆరోగ్య- వైద్య రంగ సేవలను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అమలు పరుస్తోంది ప్రభుత్వం. వాటిలో ముఖ్యమైంది ‘నిర్దిష్ట దిన సంచార ఆరోగ్య సేవల’ పేరుతో ఏర్పాటు చేసిన అధునాతన అంబులెన్సులు. మూడు కిలో మీటర్ల దూరంలో ఏ రకమైన ఆరోగ్య కేంద్రానికీ నోచుకోని 1500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి, నెల కోమారు, ఎంపిక చేసిన నిర్దిష్ట దినాన, సంచార ఆరోగ్య సేవలందించే అంబులెన్స్ వచ్చి నాలుగు గంటల పాటు సేవలందిస్తుంది. ప్రతి అంబులెన్స్ లో ఫార్మసిస్టులు, లాబ్‌టెక్నిషియన్లతో పాటు అవసరమైన వైద్య పరికరాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, పౌష్టికాహార లోపాల పరీక్షలు, రక్త-మూత్ర పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, ఏ మందులు వాడాలో సూచనలివ్వడం జరుగుతుంది. గర్భిణీస్ర్తీల ప్రసవతేదీ నిర్ధారణ, చక్కెర- రక్తపోటు వ్యాధుల నిర్ధారణ చేయడమూ జరుగుతుంది. టెలీమెడిసిన్ పద్ధతిననుసరించి మారుమూల కుగ్రామంలో వున్న పేషంట్ కు కూడా తక్షణ వైద్య సలహాలనందించి, ఏ మందులు వాడాలో కూడా సూచించబడుతుంది ఈ సేవలకింద.

‘రాజీవ్‌ఆరోగ్యశ్రీ’ కింద పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న మరో అతిముఖ్యమెంది ‘ఆరోగ్యశ్రీ- సామాజిక ఆరోగ్య బీమా పథకం’. ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల తోడ్పాటుతో అమలవుతున్న ఈ పథకం దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల పాలిటి పెన్నిధి. ‘ఆరోగ్య బీమా’ పథకం ద్వారా ఏరకమైన వ్యాధికైనా చికిత్స చేయించుకునేందుకు అవసరమైన వ్యయాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన బీమా సౌకర్యం కింద ప్రభు త్వమే భరిస్తుంది. ‘ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్‌ ట్రస్ట్’ కింద అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మంది మందికి శస్త్ర చికిత్సలు ఉచితంగా వివిధ ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రుల్లో జరిగాయి.

బహుశా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న ఈ మూడు పథకాలు అమెరికాకు కూడా వినూత్నమైన మార్గదర్శకాలే. ఏదెలా వున్నా, ఒబామా ప్రతిపాదించి అమల్లోకి తేదల్చుకున్న వైద్య-ఆరోగ్య సంస్కరణలవల్ల, భవిష్యత్ లో అందరికీ అందుబాటులో, అసలు సిసలైన ఆరోగ్య-వైద్య సేవలు లభించనున్నాయని పలువురు భావిస్తున్నారు. ప్రతినిధుల సభ ఆమోదం లభించిన హెల్త్ కేర్ బిల్లుకు త్వరలో సెనేట్ ఆమోదం కూడా లభిస్తే మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ఆశించుదాం. ఎల్లలెరుగని ప్రపంచాన్ని స్థాపించాలని కలలుకన్న మార్క్స్ స్వప్న సౌధాలకు బీటలు పడి, సామ్యవాదంనుండి సామ్రాజ్యవాదం దిక్కుగా మారబోతున్న సమయంలో, అతిపెద్ద ధన స్వామ్య దేశంలో, సామ్యవాద సిద్ధాంతాల అమలుకు ఆరోగ్య సంస్కరణల ద్వారా అంతో-కొంతో అంకురార్పణ జరగడం విప్లవాత్మకమే.

No comments:

Post a Comment