"రమణీయ"-కమనీయ సిద్ధాంత గ్రంథం
ప్రపంచంలో ఎవరైనా సరే, తనకు తెలిసిన-తెలుసుకున్న-తెలుసుకోవాలనుకున్న పలు ఆసక్తికరమైన విశేషాలను పరిచయమున్న పది మందికి చెప్పి తృప్తి పడతారు. కొందరా విశేషాలనే పుస్తకరూపంగా ప్రచురించి, పరిచయం లేని మరో పదిమంది సహృదయులకు కూడా చేరేలా చేసి, వారి మెప్పునో-సూచనాత్మకమైన విమర్శలనో పొంది మరింత తృప్తి పడతారు. కాకపోతే, ఎంత విస్తృతంగా విషయ సేకరణ చేసి పరిశోధన చేసినా, దానికి, ఏదో ఒక విశ్వవిద్యాలయం వారి గుర్తింపు లభించకపోతే, కొంత వెలితిగానే వుంటుందనాలి. అయితే, ఇటీవలకాలంలో వెలుగు చూస్తున్న పలు పరిశోధనాత్మక గ్రంథాలు, అవి రాసినవారు తమ పేరు చివర పీ.హెచ్.డి అన్న అక్షరాలను తగిలించుకునేందుకు పరిమిత పోయి, సంబంధిత విషయాల్లో ఆసక్తి గల వారికి, అంతగా ఉపయోగపడుతున్నట్లు లేవన్న విమర్శలొస్తున్నాయి. అలాంటి విమర్శలకు అతీతంగా, తెలుగు సాహిత్యంలోని పద్య ప్రసూనాల మీద పరిశోధించి, వెయ్యేళ్ల పద్య చరిత్ర పొదుపుకున్న సాహిత్య ప్రక్రియలో భాగంగా, గత దశాబ్ది కాలంలో పద్య కవితలోని "వస్తు వైవిధ్యాన్ని" అత్యంత "రమణీయం “గా-"కమనీయం" గా, విజ్ఞుల-రసజ్ఞుల మన్ననలను పొందే రీతిలో ఆవిష్కరించారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి కె.వి. రమణాచారి. తన పరిశోధనను ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు సిద్ధాంత గ్రంథంగా సమర్పించి, డాక్టరేట్ బిరుదు పొందారాయన. రసాయన శాస్త్రంలో "తుమ్మి పూల" మీద పరిశోధనను చేపట్టి మూడున్నర దశాబ్దాల క్రితమే పీ.హెచ్.డి పొందాల్సిన రమణగారికి, ఇన్నాళ్ల తర్వాత తెలుగు సాహిత్యంలో రావడం అభినందించాల్సిన విషయమే.
రమణ గారు ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీ.హెచ్.డి. కావాలనుకున్నవారు, ఎవరో ఒక ప్రముఖ కవి రచనలపై పరిశోధన చేస్తారు. అలా చేయడం ఒక విధంగా చాలా తేలికైన విషయం. విషయ సేకరణ కష్టం కాదు. ఈయన చేసిందలాంటిదికాదు. రమణ గారికి బాల్యంనుండే, కుటుంబ నేపధ్యంలో, సంస్కృతీ-సాహిత్యాల పట్ల అభిరుచి. అది నూరిపోసింది సాక్షాత్తు ఆయన తండ్రి గారైన శ్ర్తీ మాన్ రాఘవాచార్యులుగారే. ఆయన శ్రీ వైష్ణవ సంబంధమైన పలు గ్రంథ వ్యాఖ్యాతలు. ఆ నేపధ్యంలో చిన్నతనం నుండే రమణగారు పద్యం మీద మక్కువ పెంచుకున్నారు. పద్యం మూలాలు చాలా గొప్పవనీ, పద్యం ద్వారా రచయిత సృజించని అంశం లేదనీ ఆయన నమ్మకం. పద్యం అవిఛ్చిన్న భారతీయ సాంస్కృతిక జీవ ధారకు ప్రతీక అని భావించిన రమణ, ఆధ్యాత్మిక-పౌరాణిక-చారిత్రక-సామాజిక అంశాలపై చేసిన పద్య ప్రయోగాల ప్రాతిపదికగా విషయ సేకరణ చేసి, స్థూల వర్గీకరణ చేసుకొని, గత దశాబ్ది కాలంలో వెలువడిన నాలుగు వందల గ్రంథాలను, తన పరిశోధనకొరకు అధ్యయనం చేశారు. రమణగారి సిద్ధాంత గ్రంథం చదివినవారికి, పద్యం ద్వారా సృజించని-సృజించలేని సామాజిక అంశం లేనేలేదని, భావుకతలున్న ఎందరో మహానుభావులు సామాజిక విషయాలను ఎంచుకొని, సుబోధకరంగా-సరళ సుందరంగా-అర్థవంతంగా-సమర్థంగా రచనలు చేశారని స్పష్టంగా బోధపడుతుంది. అలానే ఆధ్యాత్మిక, పౌరాణిక సంబంధమైన అంశాల్లో కూడా కనపడుతుంది.
ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక లేదా సామాజిక అంశాన్ని వస్తువుగా తీసుకొని అనేకానేక పద్యాలు రాసినవారెందరో వున్నారు తెలుగు కవుల్లో. రమణ పరిశోధనలో ఇలాంటివెన్నో పేర్కొన్నారు. డాక్టర్ అనుమాండ్ల భూమయ్య రామ కథను కౌసల్య పరంగా దర్శించి, బహు భార్యాత్వం వస్తువుగా రచించిన "జ్వలిత కౌసల్య" అనే అర్థవంతమైన ఎనిమిది అధ్యాయాల లఘు కావ్యాన్ని ఉదహరించారు. అందులో ప్రధానంగా కౌసల్య ఎదుర్కొన్న సవతుల సమస్యను, చిన్న రాణి పట్ల దశరథుడు చూపించిన ఆదరణను, పట్టాభిషిక్తుడు కాకుండా తన కొడుకు శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు కౌసల్య పడ్డ ఆవేదనను హృద్యంగా మలిచారు భూమయ్య గారు. ఇలాంటిదే, "రాస పూర్ణిమ" కావ్యం. భాగవతం దశమ స్కంధంలోని ఆరు శ్లోకాల అర్థాన్ని ఉత్పల వారు రెండు వందల పద్య-గద్యాలుగా రచించి, ఆ రస కృతిని తెలుగు పాఠకలోకానికి అందించిన విషయాన్ని పేర్కొన్నారు రమణ. సంస్కృత-ఆంగ్ల-ఆంధ్ర భాషల్లో నిష్ణాతుడైన శ్రీ పెరుంబుదూరు లక్ష్మణ మూర్తి "గోపికా వల్లభా" అనే పద్య శతకం రూపొందించి, భగవంతుడి ఆదేశంతో తనది ఎలా రాశాడో చెపుతాడు.
తెలుగునాట పల్నాడులో జరిగిన ఇతివృత్తం ఆధారంగా డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డి రచించిన "పల్నాటి భారతం" గురించి ప్రస్తావించారు రమణ. శిశు వైద్య నిపుణుడిగా వుంటూ, క్షణం తీరికలేని ప్రభాకర రెడ్డి గారు చారిత్రక ప్రామాణ్యం పాటిస్తూ ఇలాంటి గొప్ప గ్రంథం రచించడం విశేష మంటారు రమణ. పద్దెనిమిది పర్వాల భారతం లాగానే, ఇందులో పద్దెనిమిది ఖండాలున్నాయి. కావ్యమంతా "ఏక ఛ్చందంగా" 1063 తేటగీతులతో రచించడానికి ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందట. ఉప క్రమంలో జొన్న చేనును వర్ణిస్తూ, "పసిడి కంకులు బంగరు వన్నె నింప .. .. " అంటూ అద్భుతమైన పద్యం రాశారు కోడూరు వారు. వృత్తి రీత్యా ఖగోళ శాస్త్ర వేత్తగా కెనడాలో స్థిరపడ్డ తిరుమల కృష్ణ దేశికాచార్యులు రచించిన పద్య ప్రభంద ప్రౌఢ కావ్యం "మహా శిల్పి జక్కన" మరో కలికితురాయిగా పేర్కొన్నారు రమణ తన పరిశోధనలో. అపూర్వ ఛందో వైవిధ్యం ఈ కావ్యంలోనే ప్రదర్శితం కావడం ప్రధాన విశేషం. ఉద్దండ పండితుల్లో అగ్రగణ్యుడిగా పేర్కొనదగిన మొవ్వ వృషాద్రిపతి గారిది మరో వినూత్నమైన శైలిగా పేర్కొన్నారు రమణ. సంవత్సరాలను, అంకెలను అందంగా ఛందోగతిలో కూర్చడంలో నిపుణుడైన మొవ్వగారు మాజీ భారత ప్రధాన మంత్రి స్వర్గీయ పీ.వీ. నరసింహారావును కావ్యనాయకుడిగా పరిచయం చేస్తూ "భారత జ్యోతి పీవీ" పేరుతో చారిత్రక పద్య కావ్యం రచించారు.
"కాదేదీ కవితకనర్హం" అన్నట్లు, ద్వంద్వ ప్రవృత్తి, హాస్యం, వ్యంగం, సహృదాయాభి వందనం, సంఘటనలు లాంటి ఎలాంటి అంశం మీదైనా పద్యం రాయ వచ్చంటారు రమణ. ఒక కవి సాటి మరో కవిని ప్రస్తుతిస్తూ పద్యం చెప్పడం ఇంకో విశేషం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శతజయంతి ఉత్సవాల్లో దిగ్దంతులైన కవులెందరో ఆయనను ప్రస్తుతిస్తూ చెప్పిన పద్యాలు ఆ కోవకు చెందినవే. సంఘటనల మీద ఎన్నో కావ్యాలున్నాయి. "వై టు కే" పై గరికపాటివారి పద్యాలు, ఘోరంగా హత్యకు గురైన "నైనా సాహ్ని" ఉదంతంపై బులుసు వెంకటేశ్వర్లు పద్యాలు, "కాకతీయ రైలు బోగీల దహనం" పై కసి రెడ్డిగారి అభిశంసన పద్యాలు, "లంచగొండి తనం", "మాతృ వాత్సల్యం", "దళిత స్పృహ", "ఈశ్వర సంప్రశ్నం" లాంటి అంశాలపై వెలువడ్డ రచనలను పేర్కొన్నారు రమణ తన సిద్ధాంత గ్రంథంలో.
తెలుగు భాషా సంబంధమైన విషయంపై పరిశోధన చేసేవారికి, తెలుగు సాహితీ ప్రపంచంతో సన్నిహిత సమగ్ర సంబంధముండాలి. తాను చెప్పదల్చుకున్న విషయం సాహితీ ప్రపంచం అవగాహనకు లోబడి వుండాలని కూడా పరిశోధకులు భావించాలి. పరిశోధకులకు తన అంశంపైనే కాకుండా సంబంధిత ఇతర అంశాలపై కూడా వలసినంత భాషా పాండిత్యం వుండి తీరాలి. పాఠ శాలల్లో, కళాశాలల్లో, విశ్వ విద్యాలయాల్లో ఉద్యోగం చేస్తున్న తెలుగు పండితులకు (కనీసం కొందరికైనా) పాండిత్యం లేకపోయినా ఈ రోజుల్లో చెల్లుబాటవుతుందేమోగాని, పరిశోధకుల విషయంలో అలా కాదు. పాండిత్యం లేనివారు, సాహితీ ప్రపంచ వ్యవహారాన్ని, తాను ఎంపిక చేసుకున్న విషయ పరిధిలో అభిలాష వున్న ఇతరులకు చెప్పే వీలు కలగదు. కేవలం డాక్టరేట్ ను మాత్రమే దృష్టిలో వుంచుకొని, విశ్వ విద్యాలయం మార్గదర్శిక-నిర్దేశాల కనుగుణంగా పరిశోధనా గ్రంథం తయారుచేస్తే, ఆ పరిశోధనకు పీ.హెచ్.డి వస్తుందేమోగాని, కలకాలం నిలిచిపోయే సాహితీ ప్రపంచం గుర్తింపు మాత్రం రాదు. ఈ కోణం నుండి విశ్లేషిస్తే, "పద్యకవిత్వం-వస్తు వైవిధ్యం" అన్న రమణ సిద్ధాంతగ్రంథం, ఏ విధంగా పరిశీలించినా అందరికీ ఆమోద యోగ్యమైనది గానే దర్శనమిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కేవలం పది సంవత్సరాల పద్య కవిత్వ మాధుర్యాన్ని మాత్రమే మనకిచ్చి, సాహిత్యోన్మత్తులను చేయగలిగితే, వెయ్యేళ్లదివ్వగలిగితే సాహితీ ప్రపంచానికి నిజంగా పిచ్చెత్తుతుందేమో !
ఆయన పరిశోధనలో ఛందో ప్రయోగాల మీద ప్రయోగ వైవిధ్యం గురించి కూడా పేర్కొన్నారు. కొందరు కవుల రచనల్లోని పద్యాలు, అందరూ రాసే వృత్తాల్లో కాకుండా విభిన్న రీతిలో వుండే విషయాన్ని ప్రస్తావించారు. బూర్గుల రంగనాథరావు గారు వాడిన మత్తకోకిలము గురించి, తిరుమల కృష్ణదేశికాచార్యులు గారి వసంతకోకిల-పరభృతము-నయాగరా-మనోరమా-ప్రభావతి వృత్తాల గురించి వివరించారు రమణగారు. కందతుల్య, సీసతుల్య, భాస్కరవిలసితం, సర్వలఘుసీసం లాంటి వృత్తాలను ఉటంకిస్తూ తాటిమాను నారాయణరెడ్డి శేషప్రభ కావ్యం గురించి ప్రస్తావించారు. వీ.ఎల్.ఎస్ భీమశంకరం గారు తన ప్రభందంలో సాక్షాత్కరించిన ఛందో విశ్వరూప ప్రదర్శనం మరి ఏ సమకాలిక తెలుగు కావ్యంలో కనిపించలేదని కూడా రమణ గారు రాశారు తన పరిశోధనలో. ఉదాహరణలుగా విలాసిని, కైవల్యం, సుగతి, విభావరి, ద్విపదతుల్య లను పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన రసస్రువు కావ్యంలోని అరుదైన ఛందస్సులైన వంశస్థ వృత్తం, అశ్వగతి, మేధిని, విజయమంగళ, భ్రమర లను కూడా రమణగారు ఉదహరించారు. రాళ్లబండి కవితా ప్రసాద్ రచనల్లోని విశ్వనాథ వృత్తం, భ్రమరకూజితం గురించిన ప్రస్తావన కూడా వుంది.
"శ్రీమద్రామాయణ కల్పవృక్షము"లో విశ్వనాధ సత్యనారాయణగారు ఉపయోగించిన వృత్తాల్లో అరుదుగా వాడే ఛందో ప్రక్రియలు ధారాళంగా వాడారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే: అంతరాక్కఱ, అజిత ప్రతాపము, అపరాజితము, అల్పాక్కఱ, అశ్వలలితము, అశ్వవిలసితము, కవిరాజ విరాజితము, ఉత్సాహము, ఇంద్రవంశము, ఇంద్రవజ్రము, అసంబాధ, అష్టమూర్తి, సుగంధి, వసంత తిలకము, లయగ్రాహి, మాలిని, మానిని, మత్తకోకిల, మంజుభాషిణి, మంగళమహాశ్రీ, భుజంగప్రయాతము, భాస్కరవిలసితము, ప్రహరణకలిత, పద్మనాభము, పంచచామరము, ద్విపద, దృతవిలంబితము, తోదకము, తోటకము, తరలము, చిత్రపదము లాంటివెన్నో వున్నాయి.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలెన్నింటినో, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము" , "పంచ చామరం" , "కవిరాజ విరాజితము" , "తరలము" , "ప్రహరణకలిత" , "సుగంధి" , "ఉత్సాహం" , "మనోహరిణి" , "వనమయూరము" , "తోటకము" , "మానిని" , "ఇంద్రవంశము" , "లయగ్రాహి" , "తోదకము" , "మాలిని", "కలితాంతము" , "మధురగతిరగడ" , "వనమంజరి" , "కమలవిలసితము" , "వసంతమంజరి" , "మంజుభాషిణి" ,"స్రగ్ధర", "వసంతతిలక" , "మాలి" , "కరిబృంహితము" , “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత", "మణిమంజరి", "మంగళ మహాశ్రీ వృత్తం" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.
సమయమంటూ వుంటే, మరింత సాహిత్య సేవ చేసి మరికొంత మందిని సాహిత్యోన్మత్తులను చేయదల్చు కుంటే, రమణ లాంటి వారు-సిలికానాంధ్ర పాఠక, రచయితలలోని సాహిత్యాభిలాషులు, వాసు దాసుగారి ఛందో ప్రయోగాలపై పరిశోధన చేసినా-చేయడానికి ఇతరులను ప్రోత్సహించినా, అంతకంటే మించిన పుణ్యం లేదేమో !
ముగించే ముందొక మాట చెప్పాలి. పాత తరం ప్రముఖ పాత్రికేయుడు స్వర్గీయ జి. కృష్ణ గారు (నాకు బాగా సన్నిహితుడు) ఒక పర్యాయం దూపాటి వెంకట రమణాచార్యులు గారితో వరంగల్ కోటను దర్శించడానికి వెళ్లారు. కృష్ణ గారు ఒక విజ్ఞాన సర్వస్వం. తెలియని విషయం లేదాయనకు. ఇక ఆచార్యుల గారికి ఇతిహాసంలో తెలియని విషయం లేదు. తెలంగాణ శాసనాలమీద, ప్రతికృతులమీద క్షుణ్ణంగా అధ్యయనం చేశారాయన. వరంగల్ కోటలోని విషయాలను ఆయన వర్ణిస్తుంటే, అవాక్కైన కృష్ణగారు, అవి వినికుంటూ, దిక్కులు చూస్తూ సమయం గడిపారు చాలా సేపు. ఆచార్యులు గారు చెప్పడం ఆపినప్పుడు, కొడాలి సుబ్బారావు గారు రాసిన "హంపీ క్షేత్రం" లోని "శిలలు ద్రవించి ఏడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్ర లోపల.. .. .. .. విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" అన్న పద్యాన్ని కృష్ణగారు చదివి వినిపించారు. అది విన్న ఆచార్యుల వారు, అమాంతం, తల్లి పాలకోసం ఏడ్చే పసివాడిలా ఏడువసాగాడు. వీళ్లిద్దరినీ అక్కడికి కారులో తీసుకెళ్లిన డ్రైవర్ తెలుగు భాషా జ్ఞానం వున్న వ్యక్తి. అక్కడున్న వాడుకూడా చలించి పోయాడట ఆ పద్యంలోని అర్థానికి. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ, కృష్ణగారు తన "విలేఖరి లోకం" పుస్తకంలో, "ఒక రమణీయ శబ్దాన్ని, ఒక మనోజ్ఞ భావాన్ని విన్నప్పుడు ఆనందంలో కన్నీరు కార్చిన సౌభాగ్యం వారిది" అని రాశారు.
అదీ తెలుగు పద్యానికున్న గొప్ప. సాహిత్యోన్మత్తులను చేయగలిగింది పద్యమొక్కటే. అలాంటి పద్య కవిత్వ వస్తు వైవిధ్యాన్ని సిద్ధాంత గ్రంథ రూపంలో సాహితీ ప్రియులకు అందించిన రమణ అభినందనీయుడు.
ప్రజాస్వామ్యం అంటే ...- భండారు శ్రీనివాసరావు
10 hours ago
No comments:
Post a Comment