Monday, December 28, 2009

హామీలకే పరిమితం గిరిజన సంక్షేమం

(సూర్య దినపత్రికలో జూన్-జులై 2009లో ప్రచురించబడింది)

గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా బృహత్తర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నందున, తదనుగుణంగా చేపట్టనున్న కార్యక్రమాల విషయంలో శ్రద్ధ వహించాలని గిరిజన ఎమ్మెల్యేలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కోరినట్లు వార్తలు వచ్చాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, గిరిజన శాఖకు కొత్తగా మంత్రిని నియమించినప్పుడు ఇలాంటి వార్తలు రావడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఆరంభంలో ఉన్న హడావిడి, క్రమేపీ తగ్గిపోవడం కూడా తెలిసినదే.

మన్యంలో మలేరియా మరణాల నివారణకు కాని, షెడ్యూల్డ్ తెగల విద్యా వ్యాప్తికి కాని, వ్యవసాయాభివృద్ధికి గాని, ఏజన్సీ ప్రాంతాల్లో భూబదలాయింపు నియంత్రణ చట్టం పటిష్ఠంగా అమలవడానికి త్రికరణశుద్ధిగా ప్రభుత్వం, గిరిజనశాఖ మంత్రి కృషిచేస్తే అభినందించని వారుండరు. అయితే గత అనుభవం పరిగణలోకి తీసుకుంటే, అటు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కాని, ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు కాని ఆ దిశగా గట్టి కృషిచేయలేదనే అనాలి. గిరిజన హక్కుల పరిరక్షణ తమ బాధ్యత అని చెప్పుకుంటున్న ప్రభుత్వ మరో తప్పిదం, విశాఖ ఏజన్సీలో ‘జిందాల్‌’ అనే ప్రైవేట్‌ సంస్థకు అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు అనుమతినిచ్చే ప్రయత్నం. గిరిజనుల హక్కులను పరిరక్షించే "వన్‌ ఆఫ్‌ సెవెంటీ" చట్టాన్ని ఎన్నివిధాల అధిగమించాలో అన్నివిధాలా ప్రయత్నాలు జరిగాయి- జరుగుతూనే ఉన్నాయి.

1970 ఆంధ్రప్రదేశ్‌షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నియంత్రణ-1చట్టం ఏజన్సీ గిరిజన ప్రాంతాల్లోని భూమికి హక్కుదారులు షెడ్యూల్డ్ తెగలవారు తప్ప మరెవరూ కాదనీ, భూ బదలాయింపులు జరిగితే షెడ్యూల్డ్ తెగలకు చెందిన మరో వ్యక్తికి గానీ, షెడ్యూల్డ్ తెగల వారితో ఏర్పాటైన సహకార సంఘాలకుగానీ జరగాలని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునో, కొనుగోలుచేసి సేకరించో, దాని పూర్వపు స్వంతదారుడైన గిరిజనుడికి ఇవ్వాలని చట్టం చెప్తోంది. గిరిజనుల హక్కుల పరిరక్షణకు బ్రిటిష్‌ప్రభుత్వం 1917లో శ్రీకారంచుట్టిన చట్టం కోస్తా లోని ఏజన్సీ ప్రాంతాల్లో స్థిరాస్తుల బదలాయింపులను నిషేధించింది. బదలాయించాల్సిన స్థిరాస్తి ఇంకో గిరిజన తెగవారికో, ప్రభుత్వ ‘ఏజంట్‌’ లేక ప్రభుత్వం నియమించే ‘నిర్దిష్ఠ’ అధికారి ముందుస్తు అనుమతితో ఇతరులకో జరగాలని ఆ చట్టంలో ఉంది.

ఈ చట్టానికి కొన్ని మార్పులు-చేర్పులు చేసి, 1959 షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు చట్టాన్ని తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. స్థిరాస్తి నిర్వచనం, రాజ్యాంగంలోని 342 ప్రకరణ కనుగుణంగా రాష్టప్రతి నోటిఫై చేసిన విధంగా ‘షెడ్యూల్డ్ తెగ’ అనే పదాన్ని ప్రవేశ పెట్టడం ఈ మార్పుల్లో ప్రధానమైనవి. ఆస్తుల బదలాయింపును నియంత్రిస్తూనే, మినహాయింపును కూడా చట్టం ఇచ్చింది. అది ఎన్నో సడలింపులకు, ఆస్తులను అనుభవిస్తున్న గిరిజనేతరులను తొలగించడంలో అవరోధాలకు దారి తీసింది. లొసుగులను అధిగమించడానికి ‘1970 ఆంధ్రప్రదేశ్‌షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నియంత్రణ-1 చట్టం’ అమల్లోకి వచ్చింది.

గిరిజనులు తమ హక్కుభుక్తంలో ఉన్న భూమిని తాకట్టుపెట్టి సహకారకార సంఘాల నుండి కానీ, ఆర్థిక సహాయ సంస్థల నుండి కానీ రుణ సదుపాయం పొందడానికి అనువుగా 1970లో చేసిన చట్టానికి 1971లో ప్రభుత్వం ఒక సవరణచేసింది. చట్టాన్ని అతిక్రమించి, గిరిజనేతరులకు ఏజన్సీప్రాంతాల్లోని భూములను ఎవరన్నా రిజిస్టర్‌ చేస్తే, వారికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2000 జరిమానా విధించడానికి వీలుకల్పిస్తూ 1978లో మరో సవరణ తెచ్చింది. ఐదెకరాల మాగాణికి గాని, పదెకరాల మెట్ట భూమికి గాని మాత్రమే స్వంతదారులైన చిన్న సన్నకారు రైతులకు 1970 చట్టం-1 నియంత్రణ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం 1979లో ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వు చెల్లదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్ 1983లో తీర్పునిచ్చింది. 1970 చట్టం-1 నియంత్రణ రాజ్యాంగ సమ్మతం కాదని, గిరిజనేతరులు కొందరు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ చట్టానికి ఎలాంటి సవరణలొద్దని న్యాయస్థానాలు స్పష్ఠం చేసాయి. ఎన్టీఆర్‌ప్రభుత్వం 1989లో చేసిన సవరణ ప్రయత్నాలు-ప్రతిఘటనలు, అభ్యంతరాలు రావడంతో ముందుకు సాగలేదు. అన్ని రాజకీయ పార్టీలు అవసరార్థమో, స్వప్రయోజనాలకోసమో, తమ పరిధిలో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చట్టాన్ని అతిక్రమించడంలో భాగస్వాములే.

1979లో కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వుల విషయంలో గానీ, 1989లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సవరణ ప్రయత్నాల విషయంలో గానీ, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఏక మయ్యాయి. అప్పటి ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌(ఐ), జనతాపార్టీలు సవరణలకు ఒప్పుకున్నాయి. ఒక గోండ్‌గిరిజనుడు 1989లో, గిరిజన శాఖ మంత్రి హోదాలో ‘గిరిజన సలహామండలి’ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ సవరణలు తేవడానికి మండలి ఆమోద ముద్రపడింది. చివరకు సవరణ ప్రయత్నాలకు గండి పడింది. సవరణల ఆలోచనలు ప్రభుత్వాలకు రానంతకాలం, దాదాపు 1979 వరకు చట్టం వల్ల చాలా మంది గిరిజనులు తాము కోల్పోయిన భూమిని తిరిగి పొందగలిగారు.

భూ బదలాయింపు నియంత్రణ చట్టం నియమనిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గనుల త్రవ్యకానికనో, ఖనిజసంపద వెలికితీయడానికనో, కర్మాగారాలు నెలకొల్పడానికనో, గిరిజనేతరులకు ప్రభుత్వం అనుమతులివ్వడం జూలై 1997కి పూర్వం సర్వసాధారణం. ఆ రకమైన దోపిడీకి గిరిజనులు గురికాకుండేందుకు సుప్రీంకోర్టు 1997 జూలై 11న ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ప్రభుత్వాలు అనుమతులు మంజూరుచేయడంలో వెనక్కుతగ్గాయి. అయితే కొంత వెనుకడుగువేసి, తిరిగి యథావిధిగా అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంటున్నదనడానికి నిదర్శనమే జిందాల్‌లాంటి సంస్థలను రంగంలోకి దింపడం. శ్రీకాకుళం ఏజన్సీలో లభ్యమయ్యే ఒక ఖనిజాన్ని వెలికి తీయడానికి, ఆ ఖనిజం ముడిసరకు అవసరమయ్యే యజమానికి, ఆ ప్రాంతంలో కొంత ప్రభుత్వ భూమిని 1990లో కేటాయించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. త్రిసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పులో షెడ్యూల్డ్ తెగల-గిరిజనుల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను పేర్కొంది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన గిరిజనులకు భూమే సర్వస్వమనీ, ఆ భూమి నుంచే శాశ్వతంగా నిర్వాసితులను చేస్తే, వారు భవన నిర్మాణ కూలీ లాంటి పనిచేయడానికి వలస పోవాల్సిన పరిస్థితులొస్తాయన్నారు.

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు గిరిజనుల భూములే కాదు, ప్రభుత్వ భూమిని కేటాయించినా రాజ్యాంగసమ్మతం కాదని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు జరపాల్సిన ‘శాంతి- సుపరిపాలన’ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయమూర్తులు స్పష్ఠం చేసారు. గిరిజనేతరుల ద్వారా ఖనిజ సంపదను వెలికి తీసేందుకు అనుమతులిచ్చి, గిరిజనులను మరింత దోపిడీకి గురిచేసే బదులు, అడవులకు- పర్వావరణానికి భంగంకలగని రీతిలో ప్రభుత్వం హేతుబద్ధమైన ప్రణాళికను రూపొందించి, ఆర్థిక సంస్థల ఆసరాతో గిరిజనులతోనే ఏజన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను వెలికి తీయిస్తే, గిరిజనులు సామాజికంగా- ఆర్థికంగాఎదిగి, సమాజంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి వీలుం టుందన్నారు. గిరిజన హక్కులు, ప్రభుత్వ హక్కులు ఒకదానిపై మరోటి పోటీ పడకుండా సర్దుకుపోవాలనే రాజ్యాంగ ఆదేశం- శాసనాధికారం- షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపు పై పూర్తి నిషేధం అమలు కావాలని న్యాయమూర్తులన్నారు.

షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఖనిజ సంపద నిరుపయోగం కాకుండా ఉండేందుకు, అవి వెలికితీసే హక్కున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు గానీ, గిరిజన సహకార సంస్థలకు గానీ ఆ పని అప్పగించాలనీ, అవి పొందే నికర లాభాల్లో 20 శాతంతో గిరిజనప్రాంతాల్లో నీటివనరుల- ఆసుపత్రుల, పారిశుద్ధ్య నిర్వహణకు, రవాణాసౌకర్యాలకు ‘శాశ్వతనిధి’ ఏర్పాటు చేయాలనే తీర్పిచ్చారు. గిరిజనుల ప్రయోజనాలు కాపాడడానికి చట్టాలు తేవడంలో, అమలు పరచడంలో వ్యత్యాసం కనబడుతున్న సంగతి గిరిజనాభివృద్ధిపై జరిగిన పలు సర్వేల్లో బయట పడింది. జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ సమస్య పరిష్కారానికి, పార్లమెంట్‌ శాశనం చేయాల్సిన అవసరముంది. రాష్ట్ర ప్రభుత్వం గనుల త్రవ్వకం అనుమతులు మంజూరు చేసేముందు కేంద్ర ప్రభుత్వ సమ్మతి పొందడం అనివార్యమని అంటూ, అలాంటి సమ్మతి నిచ్చేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రులతో ఉపసంఘాన్ని నియమించాలని కోర్టు అదేశించింది. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రు లు, పర్యావరణ- అటవీ శాఖ మంత్రులు, సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి సమావేశమై, గిరిజనుల భూములు -ఖనిజ సంపదను వెలికితీసే విషయాలలో దేశానికంతటికీ ఒకే చట్టాన్ని రూపొందించాలని కూడా ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పిచ్చి పన్నెండు సంవత్సరాలు దాటింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా ఉపసంఘం ఏర్పాటయిందీ- లేనిదీ తెలియదు. ముఖ్యమంత్రుల సమావేశం ఈ విషయంలో జరిగిన దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజుల్లోనే అప్పటి భారత రాష్టప్రతి గవర్నర్ల సమావేశంలో షెడ్యూల్డ్ కులాల-తెగల వారి అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల అమలులోని లోటుపాట్లపై దృష్టి సారించడానికి ‘గవర్నర్ల కమిటీ’ని ఏర్పాటు చేస్తామన్నారు. అది జరిగిన దాఖలా లూలేవు. అసలీ రాష్ట్రంలో ‘గిరిజన సలహామండలి’ ఉనికేలేదు. అల్యూమినియం కర్మాగారం గురించి వారికైనా తెలుసో లేదో?ఈ నేపథ్యంలో, నూతన గిరిజన సంక్షేమశాఖ మంత్రి గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశమై, గిరిజనులకు పట్టాలు పంపిణీచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రకటించడం అభినందనీయం. కాకపోతే హామీలు కార్యరూపం దాల్చాలి.

No comments:

Post a Comment