అమెరికా-హ్యూస్టన్ నగరంలోని షుగర్ లాండ్ లో, మా అమ్మాయి కట్టుకున్న ఇంట్లో గృహ ప్రవేశానికి అర్థరాత్రి వచ్చిన వారిలో చాలామంది, హడావిడిగా వెళ్లడానికి సిద్ధమౌతుంటే, కారణమేంటని అడిగాను కొందరిని. అప్పటికే ఆలశ్యమైందని అంటూ, మరికొన్ని గంటల్లో "బ్లాక్ ఫ్రైడే" అమ్మకాలు మొదలైతాయనీ, వీలైనంత త్వరగా మాల్స్ దగ్గరికెళ్లి క్యూలో నిలబడాలనీ వెళ్లిపోయారు వాళ్లు. ఆ తర్వాత మా అమ్మాయి చెప్పింది-బహుశా గృహప్రవేశంతో బిజీగా లేనట్లైతే, తనుకూడా, వెళ్లేదానినేమోనని.
అమెరికా దేశమంతా అత్యంత ఆహ్లాదంగా-ఆడంబరంగా ప్రతిఏటా జరుపుకునే "కృతజ్ఞతలు తెలుపుకునే రోజు"-థేంక్స్ గివింగ్ డే, ఈ సంవత్సరం, గురువారం (నవంబర్ 26, 2009) నాడు, జన్మతః అమెరికన్లతో సహా, ప్రవాస భారతీయులు-ఆంధ్రులు కూడా జల్సాగా జరుపుకున్నారు. వారిలో కొందరైతే అమెరికన్ల సాంప్రదాయ వంటకమైన "టర్కీ" ని కూడా తయారు చేసుకొని, భందు మిత్రులతో కలిసి భోంచేశారు. ఇంకొందరు సహచర అమెరికన్ మిత్రులతో గడిపారు. థేంక్స్ గివింగ్ డే ఒక పండగైతే, మరుసటి రోజు వచ్చే బ్లాక్ ఫ్రైడే ను మరింత ఆర్భాటంగా ఎంజాయి చేస్తారు అమెరికన్లు-అమెరికాలో స్థిరపడ్డ అమెరికనేతరులు. వాస్తవానికి ఈ రెండు రోజులకొరకు అమెరికాలో వున్న వారంతా ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తుంటారు. ఉద్యోగస్థులకు-విద్యార్థులకు పెద్ద ఆట విడుపిది. లాంగ్ హాలీడే గా, అయిదారు రోజుల ముందునుంచే శెలవు వాతావరణం సర్వత్రా నెలకొని వుంటుంది. పిల్లలను కదిలించి, ఏదైనా పని చేయమన్నా-చదువుకోమన్నా, వచ్చే సమాధానం, "థేంక్స్ గివింగ్ బ్రేక్" లో ఏ పనీ చెప్పొద్దని.
గురువారమంతా భందు మిత్రులతో గడిపి, రాత్రి పొద్దు పోయే దాకా నిద్రపోకుండా వుండి, బ్లాక్ ఫ్రైడే డిస్కౌంట్ కొనుగోళ్ల కొరకు దుకాణాల ముందర, మాల్స్ ముందర క్యూ కట్తారు. వ్యాపార సంస్థలన్నీ, వారం-పది రోజుల ముందునుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు తగ్గింపు ధరల ప్రకటనలను పత్రికల్లో గుప్పిస్తారు. వార్తాపత్రికలను చదవడం మాటేమోకాని, వాటిల్లో వచ్చే "డిస్కౌంట్ కూపన్ల"ను మాత్రం వదలకుండా భద్రపరుచుకుంటారందరు. "సేల్స్" అన్న పదం ఆ వారం-పది రోజులు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే ఒక ఊత పదం అనొచ్చు. ఆదాయ వ్యత్యాసాలకు అతీతంగా కూపన్లను సేకరిస్తుంటారు ప్రతిఒక్కరు. చేతుల్లో కూపన్లనుంచుకొని, దుకాణాల ముందర ధనిక-బీద-మధ్యతరగతి అన్న తారతమ్యం లేకుండా, అమెరికన్లు-అమెరికనేతరులు, ఒకరిపై ఇంకొకరు పోటీపడి, ఎంత ముందు వీలవుతే అంత ముందు గంటల తరబడి కాచుకుని నిలబడతారు. మాల్స్ లో ముందుగా అడుగుపెట్టినవారికి కొన్ని పూర్తి ఉచితంగా, ఆ తర్వాత అడుగుపెట్టినవారికి ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తాయి కొన్ని వ్యాపార సంస్థలు. ఏ అవకాశమూ వదులుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఆలోచనతోనే వుంటారందరు.
ఏడాది కింద ప్రపంచాన్ని-ముఖ్యంగా అమెరికా దేశాన్ని, ఉగ్రవాదుల దాడులకంటే భయంకరంగా గడగడలాడించిన ఆర్థిక మాంద్యంతో ఉలిక్కిపడి షాక్ కు గురైన వినియోగదారులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాకపోతే వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడి ధోరణిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది సర్వత్రా. శుక్రవారం వందల మంది మాల్స్ ముందర క్యూ కట్టినా, ఆశించిన మేర పతాకస్థాయిలో అమ్మకాలు జరగకపోగా, కొనదల్చుకున్న ప్రతివస్తువునూ, సేల్స్-డిస్కౌంట్ ధరలతో నిమిత్తం లేకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా, కొనుగోలుదారులు బేరసారాలు చేశారని వ్యాపార సంస్థల యజమానులంటున్నారు. గుడ్డిలో మెల్లగా, గత సంవత్సరంతో పోల్చిచూస్తే అమ్మకాలు పెరిగాయనే అంటున్నారు వారు. భందుమిత్రులకిచ్చే బహుమానాల విషయంలో ఆచితూచి వ్యవహరించిన వినియోగదారుడు, తమ అవసరాలకు కావాల్సిన వస్తువుల విషయంలో ఎంతమాత్రం వెనుకాడలేదని కూడా వారన్నారు. ఆన్ లైన్ అమ్మకాల సమాచార ప్రాతిపదికగా, ముందుగానే తమకు కావాల్సిన వస్తువులను ఎంపికచేసుకుని-ధరలు బేరీజు వేసుకుని, వ్యూహాత్మకంగా కొనుగోళ్లు చేశారు. అమెరికా చరిత్రలో ఇంత వ్యూహాత్మకంగా వినియోగదారులు వ్యవహరించడం ఇదే మొదటి సారని అనుభవజ్ఞులైన మాల్స్ యజమానులు అంటున్నారు. కొనదల్చుకున్న ప్రతి వస్తువును, తగ్గింపు ధరల ఆధారంగా-నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, డిస్కౌంట్ వుందికదానని, గతంలో మాదిరిగా, ఏది పడితే అది కొనలేదు ఎవరూ. ఇక డిస్కౌంట్ లేని వస్తువువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆరోజున. క్రెడిట్ కార్డ్ వుంది కదా-ఇష్టం వచ్చినట్లు కొందామన్న ధోరణిలో మార్పొచ్చింది చాలామందిలో.
అమ్మకాలెక్కువగా జరిగిన వస్తువుల్లో చెప్పుకోవాల్సింది, టీవీలు-లాప్ టాప్ లు- వింటర్ కోట్లు-వాషింగ్ మిషన్లు-ఫర్నీచర్ లాంటివి వున్నాయి. తెల్లవారి జామునుంచే క్యూలో నిల్చుని అసహనంతో వుండే వినియోగదారులవల్ల గతంలో సంభవించిన చేదు అనుభవాలను దృష్టిలో వుంచుకుని, చాలా మాల్స్ ముందర ఘర్షణలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వినియోగదారులను ఆకర్షించుకునేందుకు, మాల్స్ లోపల ఆహ్లాదకరమైన నాట్యాలు, సంగీతం ఏర్పాటుచేశారు కొందరు. వాల్ మార్ట్, టార్గెట్, మేసీస్, గ్రేట్ మాల్, టాయ్స్ ఆర్ అజ్ లాంటి వ్యాపార సంస్థలు గణనీయమైన అమ్మకాలు చేశాయి. ఆర్థిక మాంద్యం ఒక వైపు, తీవ్రతరమవుతున్న నిరుద్యోగ సమస్య మరొక వైపు, చేస్తున్న ఉద్యోగాలు కోల్పోయి మరొకటి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇంకోవైపు అమెరికాను కుదిపేస్తున్నప్పటికీ-న్యూయార్క్ లాంటి రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా దశకు చేరుకున్న వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నప్పటికీ, వినియోగదారులు వ్యాపారస్తులను అసంతృప్తికి గురి చేయలేదనే అనాలి. కాకపోతే గత ఏడాదికంటే అమ్మకాలు మించక పోవచ్చని అనుకుంటున్నారు. "ట్విట్టర్" తరహా సమాచార విప్లవ నేపధ్యంలో, ఏ దుకాణంలో ఏం దొరుకుతుందో ముందుగానే తెలుసుకోవడంతో పాటు, ట్రాఫిక్ జామ్ లకు అనువుగా మాల్స్ ను-చిన్న దుకాణాలను ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులు మొగ్గుచూపడంతో, బడా వ్యాపారసంస్థలు చిన్న సంస్థల నుంచి ఎదురైన పోటీని తట్టుకోవడం కష్టమైందని పరిశీలకులంటున్నారు.
మాల్స్ లో-పెద్ద బహిరంగ మార్కెట్లలో బ్లాక్ శుక్రవారం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే కొద్ది గానే పెరిగాయని, కేవలం ఒక శాతం వ్యాపారం మాత్రమే చేసే చిన్న దుకాణాల వారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం, ఏబైవేల దుకాణాల అమ్మకాలపై చేసిన సర్వే ప్రకారం, మాల్స్ అమ్మకాలు 0.5 శాతం, చిన్న దుకాణాల-వెబ్ మార్కెటింగ్ అమ్మకాలు 35 శాతం పెరిగాయని తేలింది.
అమెరికాలో ఆరంభమయిన థేంక్స్ గివింగ్ డే, ప్రతిసంవత్సరం నవంబర్ నెలలో వచ్చే నాలుగో గురువారం నాడు జరుపుకుంటారు. ఇతర దేశాల్లో కూడా ఇటీవల కాలంలో కొద్దిపాటి తేడాతో ఇలాంటి పండుగనే జరుపుకుంటున్నారు. భగవంతుడు తమ పట్ల చూపిస్తున్న వాత్సల్యానికి-దయకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆరంభమయిందీ పండుగ. భారతదేశంలో జనవరి నెలలో జరుపుకునే సంక్రాంతి పండుగలాగానే, ఇది కూడా ఒకరకంగా పంటలు చేతికొచ్చే సమయంలో జరుపుకునే పండుగ ఇది. కాకపోతే ఒక్కో దేశంలో, ఒక్కో విధంగా, వారివారి సాంప్రదాయాలకనుగుణంగా జరుపుకుంటారు ఇలాంటి పండుగలను. బైశాఖి, లోహ్రి, ఓనమ్ పండుగలు కూడా ఈ తరహావే. కెనడాలో అక్టోబర్ నెలలో జరుపుకోగా, చైనా-మలేసియా-కొరియా లాంటి దేశాల్లో మరో సమయంలో జరుపుకుంటారు. థేంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే బ్లాక్ ఫ్రైడే నాటి అమ్మకాల లాభాలను ఏడాదిపొడుగూతా వచ్చే లాభనష్టాల సరసన కాకుండా "నలుపు" రంగు సిరాతో ప్రత్యేకంగా రాసి-పేర్కొంటూ, విడిగా చూపిస్తారు అమెరికాలో.
భందుమితృలతో సాంప్రదాయికంగా కలసిమెలసి "టర్కీ వంటకం" చేసుకుని ఉమ్మడిగా సహ పంక్తి భోజనం చేస్తారు. టర్కీ వంటకంలో, ప్రత్యేకంగా టర్కీ కోడితో పాటు, గుమ్మడికాయ, మొక్కజొన్నలు, ఉప్పు, పంచదార, లవంగాలు, వేలకులు, మిరియాల పొడి లాంటివి కలిపి వండుతారు. కేవలం దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మాత్రమే కాకుండా స్నేహితులకు, భందువులకు కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా వుద్దేశించిందీ పండుగ. మతసామరస్యానికి కూడా థేంక్స్ గివింగ్ డే ఒక ప్రతీకగా భావిస్తారు అమెరికన్లు. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా వున్నప్పుడు తొలిసారిగా "థేంక్స్ గివింగ్ పరేడ్" ఆరంభమై, అధికారికంగా శెలవు దినంగా ప్రకటించబడింది. థేంక్స్ గివింగ్ డే పరేడ్ లో, అమెరికా దేశం సైన్య సామర్థ్యాన్ని-క్రమశిక్షణను, ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం జరుగుతుంది.
అమెరికాలో ఆవిర్భవించిన పండుగే అయినప్పటికీ, థేంక్స్ గివింగ్ డేకు, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది 1997 నవంబర్ లో. ప్రపంచప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిస్తూ, శతాబ్ది సంవత్సరమైన 2000ను "అంతర్జాతీయ థేంక్స్ గివింగ్ డే" గా నిర్ణయించింది ఆ ఏడాది. ప్రప్రధమంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, ఒక ఆద్యాత్మికపరమైన ప్రతిపాదనకు ఏకగ్రీవంగా అమోదం తెలిపిందా విధంగా. శాంతి-సౌభ్రాతృత్వం ప్రపంచమంతటా వ్యాపింపచేసేందుకు ఐక్యరాజ్యసమితి ఆ విధంగా నిర్ణయం చేసింది.
సాంప్రదాయానికి భిన్నంగా, గతంలో అమెరికా అధ్యక్షుడు సీనియర్ బుష్ చేసిన విధంగానే, బరాక్ ఒబామా, టర్కీ జాతీయ సమాఖ్య వారు శ్వేతసౌధంలో తనకిచ్చిన "టర్కీ కోడికి" క్షమాభిక్షను ప్రసాదించాడు. థేంక్స్ గివింగ్ డే సందర్భంగా 1947 నుండి, ఆచారంగా వారిస్తున్న కోడిని కోసి టర్కీ వంటకాన్ని తయారుచేయడం ఆనవాయితీ. అయితే కూతుళ్ల సలహా మేరకు, ఒబామా క్షమాభిక్షకు నోచుకున్న కోడి బ్రతికి పోయింది. సలహా ఇచ్చిన ఒబామా కూతుళ్లకు ఎనిమల్ రైట్స్ గ్రూప్ గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చారు.
ఇదిలావుంటే, థేంక్స్ గివింగ్ డే కు కొద్దిరోజుల ముందు నుంచి, ఆరోగ్య సంస్కరణల చట్టం నేపధ్యంలో, అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న, పట్టు-విడుపులు లేని ధోరణికి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. చట్టసభల్లో గతకాలం నాటి రాజకీయ రాజీ ధోరణులు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్తితులొస్తున్నాయని-ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు చేటు చేయవచ్చని భావిస్తున్నారు. అమెరికన్ ప్రజల అవసరాలకనుగుణంగా, సామాజిక మార్పులకొరకు-అభివృద్ధికొరకు, చట్టసభల అమోదంపొందే సమయంలో, గతంలో నెల కొన్న రాజీ ధోరణులు, ఒబామా హయాంలో మచ్చుకైనా కనిపించటంలేదంటున్నారు. విధానాల్లో-అభిప్రాయాల్లో తీవ్రంగా విభేదించినప్పటికీ, అలనాడు రొనాల్డ్ రీగన్-నాటి స్పీకర్ థామస్ "టిప్" ఒనీల్ ఒక బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా చోటుచేసుకున్న సంభాషణను గుర్తుచేసుకుంటున్నారు పలువురు. వాటర్ గేట్ ఉదంతం నేపధ్యంలో, అధ్యక్షుడుగా వున్న గెరాల్డ్ ఫోర్డ్, చట్టసభల్లో తనకున్న అపార అనుభవాన్ని ఆచరణలోపెట్టి, వ్యతిరేకంగా వున్న చట్టసభను తనకనుకూలంగా మలచుకున్న సంగతినీ గుర్తుచేసుకుంటున్నారు. ఇంతెందుకు: లిండన్ జాన్సన్ అధ్యక్షుడిగా వున్నప్పుడు, సెనేట్ రిపబ్లికన్ల మద్దతు సంపాదించి, అభివృద్ధి దిశగా అమెరికా పయనించడానికి-చరిత్రాత్మక "పౌర హక్కుల చట్టం" సభ ఆమోదం పొందడానికి అవలంబించిన రాజకీయ రాజీ ధోరణిని ఒబామా ఎందుకు ఆచరించలేక పోతున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. థేంక్స్ గివింగ్ డే సందర్భంగా ఒకరికొకరు రాజకీయాలకతీతంగా కృతజ్ఞతలు ఇచ్చి పుచ్చుకుని, రాజీ ధోరణితో సంస్కరణలను అమలుచేయాలి గాని విభిన్న మార్గాల్లో పోకూడదని వీరి భావన.
కొసమెరుపు: తగ్గింపు ధరలకు ఏదైనా కొందామని మా అమ్మయితో సాయింత్రం మాల్స్ కు వెళ్లిన మాకు నిరాశే మిగిలింది-కారణం మధ్యాహ్నంతో డిస్కౌంట్ అమ్మకాలు అయిపోవడమే కాకుండా రెట్టింపు ధరలను కూడా వస్తువులపై చూపించారు.
ప్రజాస్వామ్యం అంటే ...- భండారు శ్రీనివాసరావు
10 hours ago
చాలా చాలా బాగుంది. ఎంత బాగా రాసారో జ్వాలా నరసింహారావుగారు.
ReplyDelete