Thursday, December 31, 2009

సేవా తత్పరుడు, స్నేహశీలి (డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి)

సేవాతత్పరుడు, స్నేహశీలి

(Published on 6th September, 2009 in Andhra Jyothi Daily)

డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో-అమలులోనే కాకుండా రాజకీయపరంగా కూడా ఊహ కందని శూన్యం ఏర్పడనుందా అన్న సందేహం కలగడం సహజం. ఎప్పుడో-ఏనాడో, పిన్న వయస్సులోనే, బహూశా తప్పని పరిస్థితుల్లో-కుటుంబ రాజకీయాల నేపధ్యంలో, వైద్య వృత్తిని వదిలి, రాజకీయ రంగప్రవేశం చేసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి స్థాయికెదగడానికి ఆయన సొంత-స్వయం కృషే ప్రధాన కారణమనాలి. రాజకీయాల్లో ప్రవేశించినప్పటినుంచీ అపజయమనేది లేకపోయినా, అసలు-సిసలైన విజయం సాధించడానికి మాత్రం 2004 సంవత్సరం వరకూ ఓపిగ్గా వేచి చూడాల్సి వచ్చింది. తన పార్టీ వారితోనూ-ఇతర పార్టీలవారితోనూ నిరంతరం పోరాటం చేస్తూ-"నిత్య అసమ్మతి వాది" గా పేరు తెచ్చుకుంటూనే, తన లక్ష్యం-ధ్యేయం నెరవేర్చుకున్న థీశాలి రాజశేఖర రెడ్డి.

2004 ఎన్నికల్లోనూ, అంతకు ముందు చేసిన పాదయాత్రలోనూ, ఆయన చేసిన వాగ్దానాల అమలు దిశగా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ, మనందరికీ అందనంత ఎత్తుకెదిగి, చివరకు కనిపించని లోకాలకు చేరుకున్నారాయన. 2004 ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాలకు అదనంగా 2009 ఎన్నికల్లో చేసినవి రెండే రెండు వాగ్దానాలు. లోగడ చేసిన వాగ్దానాలనే పటిష్ఠంగా అమలుచేసి-మరింత ముందుకు తీసుకెళ్లడమే తాను చేస్తున్న ఇతర వాగ్దానాలని 2009 ఎన్నికల్లో చెప్పేవారు రాజశేఖరరెడ్డి. ఆయన అధికారంలో వున్న అయిదేళ్ల-నాలుగునెలల కాలంలో చేసిన వాగ్దానాల అమలుకొరకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాలకు స్వయంగా రూపకల్పన చేయడమే కాకుండా, వాటి అమలు విషయంలో నిరంతరం శ్రద్ధ కనపరిచేవారాయన.

అది, నిరంతరం పేద ప్రజలకు కడుపునిండా రెండు పూటలా అన్నం పెట్టడానికి ఉద్దేశించిన "ఆహార హామీ పథకమే" కావచ్చు, బడుగు-బలహీన వర్గాల అభ్యున్నతికి రూపొందించిన "ఉపాది హామీ పథకాలే" కావచ్చు, హృద్రోగంతో బాధపడుతుండే చిన్నారులను ఆదుకునేందుకుద్దేశించిన "ఉచిత శస్త్ర చికిత్సా పథకమే" కావచ్చు, లక్షలాది ఎకరాలకు సాగునీరందించే "జల యజ్ఞం పథకమే" కావచ్చు, స్వయం సహాయక-డ్వాక్రా మహిళలకుద్దేశించిన "పావలా వడ్డీకే ఋణ సౌకర్యం పథకమే" కావచ్చు, "ఇందిర ప్రభ" పేరుతో రూపుదిద్దుకున్న సమగ్ర భూ పంపిణీ అభివృద్ధి ప్రణాళికలే కావచ్చు, గ్రామీణ స్థితిగతులను స్వయంగా పరిశీలన-అధ్యయనం చేసేందుకు చేపట్టిన "పల్లె బాట" కార్యక్రమమే కావచ్చు, త్రికరణ శుద్ధిగా అమలు పరచదల్చుకున్న "మైనార్టీల సంక్షేమ పథకమే" కావచ్చు, "ఆరోగ్య భీమా పథకమే" కావచ్చు, "108-104 అత్యవసర-సాధారణ వైద్య-ఆరోగ్య సహాయ సేవలే" కావచ్చు ... ... ... ఇలా ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పనకు-అమలుకు యావద్భారత దేశానికే రాజశేఖరరెడ్డి తన ముందు చూపు ఆలోచనలతో "మార్గదర్శి" అయ్యాడనాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూమికున్న ప్రాధాన్యతను, భూమితో పేదలకున్న అనుబంధాన్ని-అవసరాన్ని గుర్తించిన రాజశేఖరరెడ్డి, నిరుపేదలకు స్వావలంబన చేకూర్చే దిశగా లక్షలాది ఎకరాల భూపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, చిత్తశుద్ధితో అమలుపర్చారు. మహాత్మాగాంధి ఆశయాలకనుగుణంగా, ఇందిరాగాంధి ఆలోచనలకు ప్రతిరూపంగా తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమలు జరుపుతున్నా అనేవారాయన. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అన్నివిధాలా కృషిచేసి, నిరంతరం బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేసేవారాయన. రాష్ట్రంలో కరవును శాశ్వతంగా పారద్రోలే దిశగా, వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని బయటపడవేసేందుకుద్దేశించిన సేద్యపు నీటిపారుదల ప్రాజెక్టులను ఒక యజ్ఞంగా చేపట్టాడు రాజశేఖరరెడ్డి. బంజరుభూములన్నీ సాగులోకి తేవాలన్నదే తన ధ్యేయంగా చెప్పేవారాయన.

అటవీ హక్కుల రక్షణ చట్టం కింద పన్నెండు లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమిపై ఆదివాసీలకు హక్కు కలిగించారాయన. "ఇందిర ప్రభ" పేరుతో బడుగులకు వెలుగులిచ్చిందీ, "సమగ్ర గ్రామీణ సంక్షేమానికి" చర్యలు చేపట్టిందీ, పేదలకు వరమైన "పనికి ఆహార పథకం" ప్రవేశ పెట్టిందీ, "భూ పంపిణీ" కి భూరి సన్నాహం చేసిందీ, "సునామీ బాధితులకు బాసటగా" నిల్చిందీ, "సమాచార స్రవంతి" కి శ్రీకారం చుట్టిందీ, "పల్లె బాట" స్ఫూర్తితో "నగర బాట" చేపట్టిందీ, రైతుల మేరుకోరి "ఉచిత విద్యుత్ పథకం" అమలు పర్చిందీ-కాలానుగుణంగా మార్పులు చేసిందీ, ఏటేటా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ కు రూపకల్పన చేసిందీ, ఉపాధికి ఊతమిచ్చిన "యువ శక్తి" పథకాన్ని అమలు పర్చిందీ, కరవుపై కదన భేరి మోగించిందీ, రైతు చైతన్యానికి "పొలం బాట" పట్టిందీ.. ... ... వీటన్నిటి ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం "దశ" మార్చే "దిశ" గా ప్రస్థానం చేసిందీ, స్వర్గీయ రాజశేఖరరెడ్డే.

2009 ఎన్నికలకు కొన్ని రోజుల ముందర మిత్రుడు భండారు శ్రీనివాస రావుతో కలిసి నేను, ప్రస్తుత ఛీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క కలిసి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మార్క్సిస్ట్ కంచుకోటలైన గ్రామాల్లో పర్యటించినప్పుడు, పార్టీలకతీతంగా రాజశేఖరరెడ్డి పథకాలవల్ల లబ్ది పొందామని వందలాది మంది గ్రామస్తులు చెప్పారు.

రాజశేఖరరెడ్డికి అన్నింటికన్నా మించింది "స్నేహ ధర్మం" అని ఆయన శత్రువులు కూడా ఒప్పుకుంటారు-ఎప్పుడూ అంటుంటారు. ఆ స్నేహ ధర్మమే ఆయనకు 1999 ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసిందన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. స్నేహ ధర్మానికి విరుద్ధంగా ఆయనే కనుక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో 1999 ఎన్నికలలో ఒప్పందం కుదుర్చుకున్నట్లైతే, ఆయన సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెల్చుకొని, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వాడే. అయితే ఖమ్మం శాసనసభ స్థానం కొరకు పట్టుబట్టిన కమ్యూనిస్టులు, దానికీ-రాష్ట్రంలోని ఇతర స్థానాలలో ఒప్పందానికీ ముడివేసి లింకు పెట్టారు. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ టికెట్ ను తన స్నేహితుడికిచ్చేందుకు వాగ్దానం చేసిన రాజశేఖరరెడ్డి, మాట నిలబెట్టుకునేందుకు, కమ్యూనిస్టులతో ఎన్నికల ఒప్పందం వద్దనుకున్నాడు. ఆయన అంచనా మేరకు ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే గెలిచాడు. కాకపోతే రాష్ట్రంలో మెజారిటీ సీట్లను పొందడానికి ఆ సీటు అడ్డొచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి కావడానికి మరో ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది.

రాజకీయంగా పరిణితి చెందిన రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో కమ్యూనిస్టులతోనూ-టీ.ఆర్.ఎస్ తోనూ సీట్ల ఒప్పందం కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నిలిపారు. ఆయన చిరకాల ఆశయం నెరవేరింది. మిత్రుడు భండారు శ్రీనివాస రావుకు రాజశేఖరరెడ్డితో వున్న సాన్నిహిత్యం నాకు లేకపోయినా, ఆయన ద్వారా పరిచయమైన రాజశేఖరరెడ్డిని, అడపాదడపా, ఏదో ఒక సందర్భంలో, గత పాతికేళ్లకు పైగా కలుస్తుండేవాడిని. మరీ గత నాలుగైదు ఏళ్లుగా, ఇ.ఎమ్.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల సంస్థలో "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం" అమలు పరిచే విభాగానికి సలహా దారుడి హోదాలో పనిచేయడం వల్ల, ఉద్యోగ రీత్యా చాలా సార్లు కలుసుకునే అవకాశం కలిగింది.

అయితే, ఇక్కడో విషయం ప్రస్తావించాలి. 1989-1990 మధ్య కాలంలో నేను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేసాను. అప్పటి వరకూ శ్రీనివాస రావు, నేను చాలా సార్లు రాజశేఖరరెడ్డిని కలుసుకుంటుండె వాళ్లం. చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో జరిగిన ఒక చిరు సంఘటనతో, రాజశేఖరరెడ్డిని, చాలాకాలం వరకు కలిసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు విషయానికొస్తే: 1990 లో రాజశేఖరరెడ్డి గారు ఒక పర్యాయం న్యూ ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు వెళ్లినప్పుడు, తనకు జరిగిన అమర్యాదకు కోపగించిన ఆయన సీరియస్ కావడం, అమర్యాదకు కారణమైన వారిని మందలించడం జరిగింది. ముఖ్యమంత్రిగా వున్న చెన్నారెడ్డి గారు, ఆ విషయం తెలుసుకొని, ఆ సంఘటనను తనకు ప్రత్యర్థిగా పనిచేస్తున్నాడని భావించిన రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా పత్రికల్లో వచ్చే విధంగా నన్నొక పత్రికా ప్రకటన విడుదల చేయమని నాకు సూచించారు. అలా చేస్తే రాజశేఖరరెడ్డికి నాపై కోపమొస్తుందని నా జర్నలిస్ట్ మిత్రులు చెప్పినా పట్టించుకోకుండా, పౌర సంబంధాల ఉద్యోగిగా నా భాద్యత నెరవేర్చాను. అది జరిగిన తర్వాత ఏపీ భవన్ పై కోపగించిన రాజశేఖరరెడ్డి, నాకు తెలిసినంతవరకు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే దాకా అక్కడికి వెళ్లలేదు. శ్రీనివాసరావుతో కలిసి రాజశేఖరరెడ్డిని ఒక పర్యాయం కలిసినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది. పెద్ద మనస్సుతో ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి నేను ఆయన దగ్గరకు వెళ్లడం ప్రారంభించాను. ఆయనకు అసలు నాపై కోపముందో లేదో కాని, వుందని నేను భావించాను.

రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. ఆ క్రితం రోజున ఇ.ఎమ్.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో సమీక్షించారు. ఆ సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య ఖర్చులనూ తప్పదనుకుంటే సమకూరుస్తానని హామీ ఇచ్చారాయన.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత చేసిన మొదటిది. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎమ్.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎమ్.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎమ్.ఆర్.ఐ గా మార్పుచెందడం జరిగింది. అలాంటి మహనీయమైన వ్యక్తి ఇక మనమధ్యన లేరు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి.

No comments:

Post a Comment