Thursday, November 7, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు బాల కాండ-1: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-1
వనం జ్వాలానరసింహారావు

శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.

శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.



బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.

వేదాధ్యయనంలో సు సంపన్నుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసిన నారదుడు వాల్మీకి దగ్గర కొచ్చి చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించి, ఆయన పోయిన తర్వాత, తమసా నదిలో స్నానం చేయడానికి పోతున్న సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో చక్కటి పద్యాన్ని రాసారు వాసు దాసుగారీవిధంగా:
  
మత్తకోకిలము:      రాజితద్యుతి వాల్మీకర్షియు  రాఁ గ  వెన్కొనిత  న్భర
                ద్వాజుఁ డన్ప్రియశిష్యవర్యుఁ డు  వారి  నాడఁ గ  నేగిపే
                రోజమై  నడిమింట  రాజిల నుగ్రదీధితిచార్వను
                ద్వేజితాంబులఁ  గాంచి  యిట్లనుఁ  బ్రీతుఁ డై నిజశిష్యుతోన్-1

తాత్పర్యం:     బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడు వున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో ఇలా అన్నాడు.


ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

4 comments:

  1. రా జి త -- ర ok
    ద్యు తి వా -- స ok
    ల్మీ క ర్షి (U U | ) -- త (కావలసినది -జ)
    Some thing wrong here?

    ReplyDelete
  2. I just reproduced what the poet wrote!

    ReplyDelete
  3. "రాజిత ద్యుతి వాల్మికర్షియు..." అని కవిగారు రాసి వుంటారు. ముద్రారాక్షసంలో..."ల్మి"..."ల్మీ"గా మారివుండవచ్చు.

    ReplyDelete