Wednesday, November 6, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు: వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో 
ఛందః ప్రయోగాలు

ఉపోద్ఘాతం

వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందః యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. 

ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము", "పంచ చామరం", "కవిరాజ విరాజితము", "తరలము", "ప్రహరణకలిత", "సుగంధి", "ఉత్సాహం", "మనోహరిణి", "వనమయూరము", "తోటకము", "మానిని", "ఇంద్రవంశము", "లయగ్రాహి", "తోదకము", "మాలిని", "కలితాంతము", "మధురగతిరగడ", "వనమంజరి", "కమల విలసితము", "వసంతమంజరి", "మంజుభాషిణి", "స్రగ్ధర", "వసంతతిలక", "మాలి", "కరిబృంహితము", “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విణి", "మనోరంజని", “హ్లాదిని”, "వంశస్థము", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత", "మణిమంజరి", "మంగళ మహాశ్రీ వృత్తం" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందః యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.

వేదాంగాల్లో పద్య లక్షణాలను తెలియచేసే ఛందస్సు ఒక భాగం. పద్యం ఎలా రాయాలి, ఏ ఏ లక్షణాలతో ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. ఛందస్సు పరమేశ్వరుడి నుండి పరంపరంగా భూలోకానికి వచ్చిందంటారు. పద్యాలతో కవిత్వం చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అనవచ్చు. పద్యం ఒక నియమానుసారం "పాదాలు" గా విభజించబడతాయి. ఆ పాదాలు "గణాల" మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని బట్టి-స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించ బడ్డాయి. గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. భాషలో వున్న అక్షరాల స్వరూప-స్వభావాలను బట్టి ఛందశ్సాస్త్రంలో "గురువు"-"లఘువు" లని వ్యవహరించబడతాయి. గురు-లఘువుల కూడికే గణాలు అంటారు. గురువు-లఘువు ఎలా ఏర్పడతాయో, ఏ ఏ అక్షరాలు గురువు-లఘువులుగా గుర్తించ వచ్చో ఛందస్సుతో కవిత్వం రాసే వారందరికీ తెలుసు. అలానే సూర్య గణాలనీ, ఇంద్ర గణాలనీ, చంద్ర గణాలనీ కూడా వుంటాయి. 

పద్య లక్షణాలలో ముఖ్యమయినవి "యతి-ప్రాస” లు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. దీన్ని ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి, ప్రతిపాదానికి ఏర్పాటుచేయడం జరుగుతుంది. ప్రతిపాదానికి మొదటి అక్షరమైన యతి, తిరిగి ఆయా పద్యాల్లో పేర్కొన్న స్థలాల్లో చెప్పాలని ఛందస్సు శాస్త్రం చెప్తుంది. యతికి పర్యాయ పదాలు కూడా వున్నాయి. పద్యపాదంలో మొదటి అక్షరం యతి అవుతే, రెండవ అక్షరం ప్రాస అవుతుంది. యతి-ప్రాసలకు వున్న నియమాలన్నీ పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. పద్యంలో వున్న మొదటి అక్షరంతో (యతి) సమానమైన అక్షరాన్ని నియమించిన స్థానంలో నిలపడం కుదరనప్పుడు, ప్రాసగా వున్న రెండవ అక్షరాన్ని యతి స్థానం పక్కన వచ్చే విధంగా చేస్తే దాన్ని "ప్రాస యతి" అంటారు. ప్రాస యతిని వాడేటప్పుడు కూడా నియమ-నిబంధనలుంటాయి.


ఇలా గణాలను, యతి-ప్రాసలను, ప్రాస యతులను నియమబద్ధంగా వాడుతూ పద్యకవిత్వం చెపుతారు కవులు. పద్యాల్లో వృత్తాలని, జాతులని, ఉప జాతులని వుంటాయి. ఛందః బధ్దమై, యతి ప్రాసలు కలిగివుండి, సాధారణంగా నాలుగు పాదాలుంటే పద్యమంటారు. అక్షర గణాలతో ఏర్పడేవి వృత్తాలు. మనందరికీ బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వృత్తాలు. తెలియనివీ, విననివీ ఎన్నో వున్నాయి. వృత్తాల్లో కూడా భేదాలున్నాయి. జాతులంటే కందం, ద్విపద, మంజరీ ద్విపద, తరువోజ, ఉత్సాహం, అక్కరలు, రగడలు లాంటివి. ఇందులో అందరికి తెలిసింది కందం. ఉప జాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం లాంటి పద్యాలున్నాయి. విభిన్నమైన వృత్తాలను ఉపయోగించి ప్రప్రధమంగా వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథా వాల్మీకంగా తెనిగించిన వాసు దాసుగారు చేసిన ఛందః ప్రయోగాలు బహుశా తెలుగు పద్య కవిత్వంలో అరుదైన విషయమేమో. విమర్శకులకే వదిలేద్దాం ఆ విషయాన్ని. అందరు కవులకూ అన్ని వృత్తాలలో పద్యాలు రాసే సామర్థ్యం వుండకపోవచ్చు. అలాగే జాతుల్లోనూ, ఉప జాతుల్లోనూ పేర్కొనబడిన వాటన్నిటినీ కవులందరూ వాడాలని లేదు. అవసరం, సామర్థ్యం, సందర్భం వుండాలి. 

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారు, ఏ ఏ సందర్భంలో, ఏ ఏ వృత్తాలలో-జాతులలో-ఉప జాతులలో పద్యాలు రాసారో తెలుసుకుందాం. ఉద్దండ కవి పండుతులు, వాసు దాసుగారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో చేసిన ఛందః ప్రయోగాలమీద, ఒక్కసారి వారి పరిశోధనాత్మక దృష్టిసారించి, ఈ తరం వారికి-భావి తరాలవారికి ఆ మహానుభావుడి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆశతో దీన్ని కూర్చడం జరిగింది. అర్థం చేసుకుంటారనుకుంటాను. 

బాలకాండతో ఆరంభించి, మిగిలిన ఆరు కాండలలో ఈ విధంగా, ఏ సందర్భంలో వాసు దాసు గారు చందః ప్రయోగాలు చేశారో తెలుసుకుందాం.

1 comment: