Sunday, November 17, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు..బాల కాండ-9: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-9
వనం జ్వాలానరసింహారావు


చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్ఛస్తానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది.

శ్రీరాముడితో సహా నలుగురు రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. తన నలుగురు కుమారులకు వివాహం చేయాలని దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన సంకల్పబలానికి అనుగుణంగానే, జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని దీక్ష పూనానని, దాన్ని విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని, వారినుండి కాపాడేందుకు శ్రీరాముడిని తనవేంట అడవులకు పంపమని కోరాడు విశ్వామిత్రుడు. తనకిష్ఠం లేకున్నా, వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు ఒప్పుకుంటాడు. బల-అతిబల విద్యలను నేర్చుకుంటారు రామలక్ష్మణులు. 

తాటక వధానంతరం యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను శ్రీరాముడికిచ్చి అవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్పుతాడు (తనవెంట అడవుల్లో తీసుకెళ్తున్న) విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడు సంతోషంతో వాటిని స్వీకరించి, విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న సందేహాలను ఆయన్నడిగి తీర్చుకుంటాడు. తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా చెప్పమని శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. తదుపరి, విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు.

విశ్వామిత్రుడి యాగరక్షణచేసిన రామలక్ష్మణులను మిథిలానగారనికి తీసుకొని పోతుంటాడు. రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. ఆ సందర్భంలో "వనమయూరము" లో రాసారీ పద్యాన్ని:

వనమయూరము: మాణవకరత్నములు  మౌనివరున్ వెంటన్
రాణమెయిఁ  బోవునెడ  రాముఁ డు  మృదుశ్రీ
వాణి నిటు  పల్కె  ఋషి వర్య !  గిరిచెంతన్
బొణిమి  నెసంగెఁ  దరుపుంజ మది  గంటే ? -12

ఛందస్సు: వనమయూరము నకు  భ-జ-న-స-గగ లు గణాలు.  తొమ్మిదింట యతి.

4 comments:

 1. జ్వాలాగారూ! మీరు చేస్తున్నది అసామాన్య యజ్ఞం. వాసుదాస రామాయణ ఛందో విశేషాల్ని గూర్చి విశ్లేషింప బూనిన మీ సాహసం శ్లాఘనీయం. మీ వ్యాస సంపుటి చాలా బాగుంది. అభినందనలు. అయితే ఎక్కడో ఒక చోట చిన్న దొసగు దొర్లడం సహజం. మీరు ఉదాహరించిన వనమయూరంలో మొదటి పాదం చివర "మౌనివరున్ వెంటన్" అనేచోట "మౌనివరు వెంటన్" అనీ, నాల్గవపాదం మొదట "బొణిమి నెసంగెఁ" అనేచోట "బోణిమి నెసంగెఁ" అని ఉండాలి. అన్యథా భావింపక, సవరించగలరు. స్వస్తి.
  ధన్యవాదములతో,
  భవదీయ మిత్రుడు,
  గుండు మధుసూదన్
  ratnaalaveena.blogspot.in
  madhurakavanam.blogspot.in
  (వీలుంటే పై బ్లాగులు చూసి, తమ అభిప్రాయం తెలుపగలరు)

  ReplyDelete
 2. మధుసూదన్ గారు, నమస్కారం. మీ బ్లాగులు రెండు చూశాను. చాలా బాగున్నాయి. మీది ఛంధస్సులో ప్రావీణ్యం...నాది కేవలం ప్రవేశం మాత్రమే! ఇక పోతే... నేను వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని ఆయన పద్యాలను యధాతథంగా రాసుకుంటూ పోయాను. ఆయన వివరించిన ఛంధస్సునే నేను తెలియ చేసాను. వాస్తవానికి ఏ అక్షరం ఎక్కడ వుండాలో తెలిసి రాసిన వాడిని కాను. మీరు సూచించిన సవరణలు నిజమే ననుకుంటా. దయచేసి...ఒక్క సారి వాసుదాసుగారి రామాయణం చూడకూడదా? జ్వాలా

  ReplyDelete
  Replies
  1. జ్వాలా గారూ! మీరన్నది నిజమే. నేను వాసుదాసుగారి రామాయణం చూశాను. అందులోనే ముద్రారాక్షసములున్నాయి. సవరింప వలసిన అవసరమున్నది.
   వనమయూరము నడక...
   రామునకు-రామునకు-రామునకు-రామా... అని ఉండాలి. పద్యపాదం...
   మాణవక-రత్నములు-మౌనివరు-వెంటన్...అని ఉండాలి.
   మౌనివరున్...అంటే...గణభంగం అవుతుంది.
   నాల్గవ పాదంలో...
   బోణిమినె-సంగెఁ దరు-పుంజమది-గంటే..అని ఉండాలి.
   బొణిమినె...అంటే...గణభంగం అవుతుంది.
   పాదాదిలో గురువుండాలి. కాని లఘువు పడింది.
   సవరించిన పద్యం...
   మాణవక రత్నములు మౌనివరు వెంటన్
   రాణమెయిఁ బోవునెడ రాముఁ డు మృదుశ్రీ
   వాణి నిటు పల్కె ఋషి వర్య! గిరిచెంతన్
   బోణిమి నెసంగెఁ దరుపుంజ మది గంటే ?

   ఇది ప్రమాద పతితము. తమరు అన్యథా భావింపవలదని మనవి.

   భవదీయుడు,
   గుండు మధుసూదన్

   Delete
  2. దయచేసి మీ కాంటాక్ట్ నంబర్లిస్తే మిమ్ములను సంప్రదించి, నేను తయారు చేసిన పుస్తకాన్ని మీకు పంపుతాను. లేదా...సాఫ్ట్ కాపీ మెయిల్ చేస్తాను. మీరు చేయాల్సిన సవరణలు చేసి ఇస్తే అప్పుడే ప్రచురిస్తాను. ప్రస్తుతానికి...రాళ్లబండ కవితా ప్రసాద్ (డైరెక్టర్ కల్చురల్ అఫెయిర్స్) దాన్ని చూస్తున్నారు...జ్వాలా

   Delete