Tuesday, November 12, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు...బాల కాండ-5: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-5
వనం జ్వాలానరసింహారావు

రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.

ఆ  మొదటి పద్యం:

సీ: భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
            డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు
           శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
           సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు
తే:     లేను, కాండంబులారుగ  జానుమీర,
          వెండియునుబల్కె  బదపడి కాండమొండు
                  పావనంబై న రఘురాము భావికథను,
                     సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.

ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. అయోధ్యకు పోయి, ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.


అయోధ్య వీధుల్లో రామాయణ గానం చేస్తున్న కుశలవులను శ్రీరాముడు తన వద్దకు పిలిపించుకుంటాడు. మన్మధాకారంతో ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకే రకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు. కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు.

ఈ సందర్భంలో వాసు దాసు గారు రాసిన ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ఛందస్సు గురించి ఆయనే స్వయంగా కొన్ని వ్యాకరణ విషయాలను ప్రామాణికంగా ఉదహరిస్తారు. ఆయన రాసిన ఆపద్యం:

ఉత్పలమాల: సోదరులార  వింటిరె ర సోదయకారణ మై విచిత్ర శ
        బ్దాదరణీయ మై  విమల  మై  చెలువారెడుకావ్య మిందిరా
        సోదరమూర్తు  లీతపసి  సూనులు  గాన మొనర్ప నద్ధిరా
        మాదిరి  మీరె  నంచు  బహు మానపురస్కృతవాక్కు  లాడినన్


ఛందస్సు: మూడోపాదంలో "అఖండయతి" వాడబడింది. ఈ యతి విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయని కవి అంటూ, "అఖండ యతి" ని అంగీకరించిన వారి పక్షాన తానున్నానని స్పష్టం చేశారు. అఖండ యతి సిద్ధాంతాన్ని నిరాకరించిన వారు లక్షణ-లక్ష్యాలను శోధించలేదని, భారాతాన్నైనా పూర్తిగా చదవలేదని ఆక్షేపించారు కవి. పూర్వ గ్రంథాలనుండి కొన్ని ఉదాహరణలిస్తూ, భీమకవి పేర్కొన్న పది యతులలో అఖండ యతి కూడా వుందని అంటారు. అప్పకవికి పూర్వులు, భీమకవికి ముందున్న కవులు ఎలా అఖండ యతిని ఆదరించారో సోదాహరణంగా పేర్కొన్నారు వాసు దాసుగారు. 

2 comments:

  1. జ్వాలాగారూ,
    మంచి వ్యాసం అందించారు,

    సోదరులార వింటిరె పద్యం గురించి వ్రాస్తూ మీరు మూడోపాదంలో "అఖండయతి" వాడబడిందని ప్రస్తావించారు.

    పొరబడ్దారండీ. నిజానికు సోదరులార పద్యంలో మొదటిపాదంలో మాత్రమే అఖండయతి కనిపిస్తోంది.

    మొదటి పాదం

    సోదరులార వింటిరె ర సోదయకారణ మై విచిత్ర శ

    అని ఉంది కదా, ఇక్కడ రసోదయ అన్న సమాసంలోని సో అనే అక్షరానికి పాదాదిలోని సో అనే అక్షరానికి యతిమైత్రి కూర్చటం జరిగింది. రసోదయ అన్నది రస + ఉదయ అన్న రెండు మాటల సంయోగం. అందుచేత రసోదయ పదంలోని సో అనేది సంధికార్యం వల్ల ఏర్పడిన అక్షరమే కాని తదన్యం కాదు. ఈ సో అనే అక్షరంలోని ఉ కారం మాత్రమే యతిస్థానంలో ఉన్నట్లుగా భావిస్తారు సంప్రదాయజ్ఞులు. దానిని కాదని ఈ 'సో'ని అఖండంగా స్వీకరించి యతిమైత్రి చేయటం వల్ల ఇక్కడ దాసుగారు అఖండయతిని ఉంచారు. ఇది వారికి సమ్మతమైనదే కదా.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్ర వాల్మీకి రామాయణం పూర్తిగా చదివిన తరువాత, అందులోని రెండు కాండలను (సుందర, బాల) శిష్ట వ్యావహారిక భాషలో తిరగ రాసిన పిదప (పుస్తక రూపంలో కూడా వచ్చాయి) నాదృష్టి వాసుదాసుగారి ఛందః ప్రయోగాలపై పడింది. నాకైతే తెలుగు భాషలో "ప్రవేశం" మాత్రమే కాని ప్రావీణ్యం లేదు. చిన్నప్పుడు చదివిన చంపక, ఉత్పల...లు తప్ప ఛందస్సు మీద అంతగా అవగాహన లేదు. ఐనా...సాహసించాను. వాసుదాసుగారి మాటల్లోనే ఆయన ప్రయోగాలపై విషయం సేకరించాను. ఆయన రాసిందానిని యథాతధంగా పాఠకుల ముందు వుంచడం తప్ప, నాకు ఏ మాత్రం ఆ యతులు, ప్రాసలు (విఅనడమే తప్ప) తెలియవు. క్షమించగలరు... చేసిన తప్పేమైనా వుంటే!....జ్వాలా

      Delete