Monday, November 18, 2013

ఎర్ర గులాబీ ఎలా తిరిగి వచ్చింది: వనం జ్వాలా నరసింహారావు

(నవంబర్ 19, 2013 న ఇందిరా గాంధి 97 వ జయంతి) 
ఎర్ర గులాబీ ఎలా తిరిగి వచ్చింది
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (19-11-2013)

నవ భారత నిర్మాత, ప్ర ప్రధమ భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యానికి గురైన నేపధ్యంలో, ఆయన "తక్షణ వారసత్వం" ఎవరికి సంక్రమించబోతున్నదనే వాదనలు అలనాడు సర్వత్రా వినిపించాయి. నెహ్రూ తన వారసుడిగా ఎవరినీ ఎదగనివ్వలేదనే విమర్శలు కూడా వినిపించాయి. నెహ్రూ ప్రధాని పదవిని అలంకరించడంతోనే, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికీ ఏకైక నాయకుడిగా తనకంటూ ఎవరూ పోటీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. నెహ్రూ అనారోగ్యానికి పాలై, భువనేశ్వర్ లో గుండె జబ్బుకు గురికావడంతో, లాల్ బహదూర్ శాస్త్రిని కేంద్ర మంత్రివర్గంలో పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఈ చర్య ద్వారా, ఆయనే నెహ్రూ వారసుడనేది దాదాపు స్పష్టమైంది. ఇదిలా వుండగా, నెహ్రూ తన వారసురాలిగా, స్వయానా తన కూతురు ఇందిరనే తీర్చిదిద్దు తున్నాడనే వార్త కూడా ప్రచారంలో వుండేదప్పుడు. మరో పక్కన "నంబర్ టు" స్థానంలో హోం మినిస్టర్ గా వున్న గుల్ జారీ లాల్ నందా నెహ్రూ వారసత్వం తనకే లభిస్తుందన్న నమ్మకంతో వుండేవాడు. ఇక మొరార్జీ దేశాయ్ సంగతి సరేసరి. కాకపోతే, ఆపాటికే "కామరాజ్ ప్రణాళిక" కింద ఆయన కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోల్పోయి పార్టీ పనిలో నిమగ్నమై వున్నాడు.  అయితే, మొరార్జీ కి "మొండి వాడు" అన్న పేరున్నప్పటికీ, పాలనానుభవం విషయంలో, నిజాయితీ విషయంలో, తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మాటకొస్తే లాల్ బహదూర్ శాస్త్రికి తన వాళ్లంటూ ఎవరూ ఆయన వెంట పెద్దగా లేరు. అలనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ మద్దతు సంపూర్ణంగా శాస్త్రికే వుండడం విశేషం. కామరాజ్ మాత్రమే కాకుండా పార్టీ అధిష్ఠానంలోని పలువురు మద్దతు కూడా శాస్త్రికే వుండేది. దానికి కారణం, ఆయన్నైతే సులభంగా తమ చెప్పు చేతల్లో వుంచుకో వచ్చన్న ప్రగాఢ నమ్మకం కూడా అధిష్ఠానం పెద్దలకుండేది. దేశాయ్ తమ మాట వినడన్న అనుమానం శాస్త్రివైపు మొగ్గు చూపడానికి కారణమైంది. 

ఇందిరా గాంధీ విషయానికొస్తే, తండ్రి మరణంతో సంతాపంలో మునిగి పోయి వుంది. గుల్ జారీ లాల్ నందాకు పెద్దగా ఎవరి మద్దతు లేదు. నంబర్ టు స్థానంలో వున్న ఆయనను తాత్కాలిక ప్రధానిగా నియమించడం వరకు మాత్రం జరిగింది. శాస్త్రి మరణించిన తరువాత కూడా మరో మారు ఆయన తాత్కాలిక ప్రధాని అయ్యారు. అంతే! అంతకు మించి ఎదగనివ్వలేదాయనను. నెహ్రూ వారసుడిని నియమించడానికి, కామరాజ్ నాడార్ తన పేక ముక్కలను అతి జాగ్రత్తగా కలిపాడు. "ఏకాభిప్రాయం ప్రకారం ఎంపిక జరగాలి" అన్న సూత్రాన్ని తన మద్దతు దారులతో కలిసి రూపొందించాడు. ఆ సూత్రం ప్రకారం, పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని సేకరించి, ఎవరికి అధికంగా మద్దతు వుందో కనిపెట్టి, ఆ అభ్యర్థినే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఆ బాధ్యత ఆయన తనపైనే వేసుకున్నాడు. కాంగ్రెస్ కార్యవర్గంలోను, ముఖ్యమంత్రుల సమావేశంలోను, ఈ పథకం చర్చకు వచ్చినప్పుడు, మొరార్జీ దేశాయ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే ఆయన మాట చెల్లుబాటు కాలేదు. పథకం ప్రకారం అభిప్రాయ సేకరణ జరగడం, శాస్త్రిని ఏకగ్రీవ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయింది. నిర్ణయాన్ని సవాలు చేయమని స్నేహితులు మొరార్జీ కి సలహా ఇచ్చారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్-గాంధేయ వాదిగా, మొరార్జీ మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అంగీకరించి, పార్టీ చీలిపోకుండా సహకరించాడు. శాస్త్రి ప్రధానిగా, నెహ్రూ వారసుడిగా, బాధ్యతలు చేపట్టాడు. శాస్త్రికి ఒక అనుమానం వుండేదని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు భావించే వారు...ఇందిరా గాంధి నందాకు అనుకూలంగా, శాస్త్రికి వ్యతిరేకంగా వుండేదని అనుకునేవారు. అయితే, నందా, తాత్కాలిక ప్రధానిగా మరికొంత కాలం వుంటే మంచిదని అనుకున్నదే కాని, ఆయన పూర్తి స్థాయి ప్రధాని కావాలని ఇందిర భావించలేదంటారు. ఇందిరా గాంధీని తన మంత్రివర్గంలో చేర్చుకునేందుకు, లాల్ బహదూర్ శాస్త్రి, జకీర్ హుస్సేన్ సలహా తీసుకున్నాడని అంటారు. కాకపోతే, ప్రచార ప్రాముఖ్యతగల, సమాచార ప్రసార శాఖను తనకు కేటాయించాలని ఇందిర కోరడం, శాస్త్రి అయిష్టంగానే అంగీకరించడం జరిగింది. దాదాపు నెహ్రూ మంత్రి మండలినే ఆయన కొద్ది మార్పులతో కొనసాగించాడు. శాస్త్రి మంత్రివర్గంలో చేరడంతో, భవిష్యత్ లో ఇందిర ప్రధాని కావడానికి మార్గం సుగమమైంది.


భారత-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరగడం, శాస్త్రి చాకచక్యంగా మొత్తం వ్యవహారంలో నాయకత్వ పటిమ చూపడం, సోవియట్ యూనియన్ నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభం కావడం, దరిమిలా తాష్కెంట్ ఒప్పందం కుదరడం, అదే రోజున మాస్కోలో ప్రధాని హోదాలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం చకచకా జరిగిపోయాయి. శాస్త్రి మరణం జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. "పొట్టివాడు బల్ గట్టి వాడు" అనిపించుకుని యావత్ భారతీయుల ఆదరాభిమానాలను చూరగొన్నాడు శాస్త్రి. మళ్లీ తాత్కాలిక ప్రధానిగా కొన్నాళ్లు గుల్ జారీ లాల నందా, ఆ తరువాత పూర్తి స్థాయిలో ఇందిరా గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ప్రధాని కావడం అంత సులభంగా జరగలేదు. ఇందిర ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన పేరును "ఇందిరా నెహ్రూ గాంధీ" అని చెప్పుకున్నారు. వాస్తవానికి ఆమేమీ తప్పు చెప్పలేదు. ఓటర్ల జాబితాలో ఆమె పేరు అలానే వుంది. కాకపోతే, ప్రపంచానికి తద్వారా అందిన సందేశం మరోలా వుందనాలి. ఆమెకా పదవి లభించడం కేవలం జవహర్లాల్ నెహ్రూ కూతురు కావడం వల్లనే అన్న అభిప్రాయానికి ప్రజలొచ్చారు అప్పట్లో. 1950 వ దశకం చివర వరకు ఇందిరా గాంధీ రాజకీయంగా పెద్దగా పదవులను అలంకరించలేదు. 1957 లో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు యు. ఎన్. ధేబర్ ఇందిరను కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా నియమించాడు. బహుశా, అది జరిగినందువల్ల, అందరికంటే ఎక్కువ సంతోషించిన వాడు నెహ్రూనే. ఎవరు అవునన్నా...కాదన్నా.. ఇందిరను తన వారసురాలిగా నెహ్రూ ఏనాటి నుంచో తీర్చి దిద్దుతున్నాడు. 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా నియామకం జరగడంతో రాజకీయంగా ఇందిర ఎదుగుదల ఆరంభమైంది. దానికి తండ్రి ప్రోత్సాహం పూర్తిగా లభించింది. దానికి చక్కటి సాక్ష్యం నాగ్ పూర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలలో ఇందిరను హఠాత్తుగా పార్టీ అధ్యక్షురాలిని చేయడం. వాస్తవానికి కర్నాటకకు చెందిన నిజలింగప్పను అధ్యక్షుడిని చేయబోతున్నట్లు నిర్ణయం జరగడం, ఆ విషయం ఆయనకు చెప్పడం కూడా జరిగింది. అంతలోనే పథకం మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చేసిన ఘన కార్యాలలో చెప్పుకో దగ్గది, ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూలగొట్టించడం. అదే విధంగా కాంపోజిట్ బాంబేని రెండుగా చీల్చి, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయించడం. ఇందిరను తన వారసురాలిగా చేయడానికి నెహ్రూ ఇంతకంటే ఎక్కువే చేశాడనాలి. చైనా దురాక్రమణ తదనంతర పరిణామాల నేపధ్యంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని ఆయన అధిగమిస్తున్న తరుణంలో, కేంద్ర మంత్రులను, రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తనకు చెప్పదల్చుకున్న విషయాలను ఇందిర ద్వారా తెలియచేయమని సలహా ఇచ్చాడు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో నెహ్రూను బహిరంగంగానే విమర్శించారు కూడా. కష్ట నష్టాలకోర్చి తాము ఒక స్థాయికొస్తే, ఏమీ లేకుండా ఇందిర పెత్తనం చేయడాన్ని కొందరి వ్యతిరేకించారు. నెహ్రూ మాత్రం తాను చేయదల్చుకుంది చేసుకుంటూ పోయాడు.

లాల్ బహదూర్ శాస్త్రి ఇతర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించేవాడని అనేవారు. తాను నెహ్రూకి చెప్పదల్చుకుంది విధిగా ఇందిర ద్వారానే చేసేవాడు. ఇందిరకు ఆ విధంగా ఆయనంటే ఒక సదభిప్రాయం కలిగింది. బహుశా ఆమె సలహా మేరకే శాస్త్రిని తన వారసుడిగా చేసేందుకు ఆయనను కాబినెట్ లోకి తీసుకుని వుండాలి. ఇందిరా గాంధీని, తన జీవిత కాలంలోనే, పూర్తి స్థాయిలో తన వారసురాలిగా చేయలేకపోయానన్న అభిప్రాయం నెహ్రూకి వుండేది. అందుకే ఆ పని పూర్తి చేయడానికి తనకు నమ్మకస్తుడైన శాస్త్రిని ఎంపిక చేసుకున్నాడు. ఇందిర వ్యతిరేకులు కావచ్చుననుకున్న బడా నాయకులను, అతి జాగ్రత్తగా "కామరాజ్ పథకం" కింద ప్రధాని పదవికి చేరుకోకుండా జాగ్రత్త పడ్డాడు నెహ్రూ. శాస్త్రి కూడా ప్రధాని అయిన తరువాత ఇందిరను దూరంగా పెట్టాడంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకటి-రెండు సందర్భాలలో ప్రధానిని కలవడానికి వెళ్లిన ఇందిరకు శాస్త్రి దర్శనం లభించలేదని అప్పట్లో వార్తలు కూడా పొక్కాయి. ఆమెను బ్రిటన్ కు హై కమీషనర్ చేద్దామన్న అభిప్రాయం కూడా శాస్త్రికి కలిగిందంటారు.

శాస్త్రి హఠాన్మరణంతో ఆయన స్థానంలోకి ఎవరిని తేవాలన్న విషయంలో, అలనాటి కామరాజ్ "ఏకాభిప్రాయ సాధన" పథకం పని చేయలేదు. ప్రధాని కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్న మొరార్జీ ఈ సారి పట్టుదలతో ముందుకు సాగాడు. తాను ప్రధాని రేసులో వున్నానని, పోటీ అనివార్యమైతే, అక్కడే తేల్చుకుంటానని బాహాటంగా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ ఇందిరా గాంధీని ప్రధానిని చేయాలన్న తలంపుతో, మద్రాస్ నుంచి ఢిల్లీకి చేరాడు. శాస్త్రిని ఏ కారణంతో ప్రధానిని చేశాడో, అదే కారణంతో ఇప్పుడు ఇందిరను చేయాలన్న తలంపు అధిష్టానానికి కలిగింది. మొరార్జీ దేశాయ్ తమ మాట వినడని, తమ చెప్పు చేతల్లో వుండడని వారి అభిప్రాయం. ఇందిరనైతే ఏదో విధంగా తమ మాట వినేట్లు చేయవచ్చని నమ్మకం. తొలుత విముఖత చూపినప్పటికీ, పోటీలో వుండడానికే నిశ్చయించుకుంది ఇందిరా గాంధి. ఆమెను వ్యతిరేకించిన వారు కూడా క్రమేపీ ఆమెకు అనుకూలంగా మారారు. కామరాజ్ తో సహా, పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రుల మద్దతు ఆమెకు లభించడంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడి ఎన్నిక కేవలం లోక్ సభ, రాజ్య సభ కాంగ్రెస్ సభ్యుల ద్వారానే జరగాలన్న నిబంధన వున్నప్పటికీ, సభ్యులుకాని ముఖ్యమంత్రులు కూడా ప్రచారంలోకి దిగారు. వారే కనుక ప్రచారంలో దిగకపోతే, బహుశా మొరార్జీ కి కొంత లాభం కలిగేదేమో నని అనుకున్నారు కొందరు. కామరాజ్, చవన్, మిశ్రా లాంటి నాయకుల అండదండలతో ఇందిర ఎన్నిక సులభమైంది. తానే ప్రధానిని కావాలని కోరుకున్న జగ్జీవన్ రాం కొంత ఊగిసలాటకు గురైనప్పటికీ, చివరకు ఇందిరకే మద్దతిచ్చాడు. 355 పార్లమెంట్ సభ్యుల ఓట్లను సంపాదించుకున్న ఇందిరా గాంధి, 169 ఓట్లను మాత్రమే పొందిన మొరార్జీని ఓడించి ప్రధాని పీఠం అలంకరించింది. పోటీలో నెగ్గి అలా ఇందిరా గాంధీ ప్రధాని కాగలిగింది.

ఇక ఆ తరువాత రెండు విడతలుగా ప్రధాని బాధ్యతలు నిర్వహించి, మకుటంలేని మహారాణిగా పేరు తెచ్చుకుని, ప్రజాస్వామ్య నియంతగా వ్యవహరించి, తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన మహామనిషి ఇందిరా గాంధి. బహుశా ఆమె లాంటి వారు "న భూతో న భవిష్యత్" అనవచ్చేమో!

No comments:

Post a Comment