Saturday, November 23, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు...బాల కాండ-12: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 

రామాయణంలో ఛందః ప్రయోగాలు

బాల కాండ-12

వనం జ్వాలానరసింహారావు
విశాలదేశ వృత్తాంతాన్ని, గౌతమి ఆశ్రమ వృత్తాంతాన్ని, అహల్యని-ఇంద్రుడిని గౌతముడు శపించాల్సిన కారణాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు ముందు నడవగా, గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగిన అహల్య, పూర్వరూపంలో లోకానికి కనపడింది. ఆ తర్వాత అంద్రౌ కలిసి మిథిలానగరం చేరుకుంటారు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. శతానందుడు, శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికి, విశ్వామిత్రుడి చరిత్రను-ఆయన గొప్పదనాన్ని వివరించాడు. వశిష్టుడు విశ్వామిత్రుడి విందు ఇవ్వడం, కామధేనువు గురించి ఇద్దరి మధ్య యుద్ధంజరగడం చెప్పాడు. 


విశ్వామిత్రుడు అడిగినప్పుడు కామధేనువును ఇవ్వనని వశిష్టుడు చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా కామధేనువు-శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. దీన్ని "సుగంధి" వృత్తంలో పద్యంగా రాసారు కవి ఇలా:

సుగంధి: ఇట్టు లామునీంద్రుఁ  డాడి యీయ నన్న థేనువున్
బట్టి  కట్టి  కొంచుఁ  బోవ బార్థివుండు  బల్మి మైఁ
దొట్టఁ గన్  దురంతచింత  దుఃఖితాత్మ యౌచు న
న్నిట్టు  వాయఁగా  మునీంద్రుఁ డేమి  తప్పు చేసితిన్-15

ఛందస్సు: సుగంధి వృత్తానికి  ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.

No comments:

Post a Comment