Saturday, November 10, 2018

సీతాలక్ష్మణులను గుహలో పొమ్మని యుద్ధానికి సిద్ధమైన శ్రీరాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-34 : వనం జ్వాలా నరసింహారావు


సీతాలక్ష్మణులను గుహలో పొమ్మని యుద్ధానికి సిద్ధమైన శ్రీరాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-34
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (11-11-2018)
            లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు శ్రీరాముడు ఇలా: “సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్ళు కీడు కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ వుండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు ఆమెను పిల్చుకొని, విల్లు-బాణాలు ధరించి దట్టంగా వున్నా చెట్ల గుంపులుకల కొండగుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా వుండు. ప్రయాణం కండి తొందరగా. లేలే. నేనొకపని, నువ్వొకపని చేయాల్సి వుంది. రెండూ ముఖ్యమైనవే కదా?

(వీటినే ఇప్పుడు “సీతమ్మ గుట్టలు” అని అంటారు. రాక్షస సైన్యం తూర్పు ముఖంగా వచ్చింది. సీతాలక్ష్మణులు ఎటి ఒద్దు వెంట ఉత్తర ముఖంగా పోయారు). 

శ్రీరాముడు ఇంకా ఇలా అన్నాడు లక్ష్మణుడితో. “నేను చెప్పిన మాటలకు బదులు చెప్తే నా పాదాలమీద ఒట్టు. యుద్ధ ప్రియా! నువ్వు బలహీనుడవనీ, వీళ్లతో యుద్ధం చేసి గెలవలేవనీ, నిన్నీపనికి ఏర్పాటు చేయలేదు. నువ్వు బలవంతుడివి. శూరుడివి. వీళ్లందరినీ జయించవచ్చు. ఇందులో సందేహంలేదు. అయినా ఈ రాక్షసులను నేనే స్వయంగా చంపాలనుకుంటున్నాను. అంటే తప్ప మరే కారణం లేదు. వాళ్లు రాకముందే బయల్దేరి వెళ్లు. మునులకు వాగ్దానం చేసిన వాడిని నేను. కాబట్టి ప్రథమ ప్రయత్నంగా నేనే యుద్ధానికి పోవడం యశస్కరం. అలా కాకుండా నిన్ను యుద్ధానికి పంపించి నేను చాటుగా వుంటే, రాముడు మాట్లాడేవాడే కాని సమయం వచ్చేసరికి ముఖం తప్పించి, తానూ, తన పెళ్లాం గుహలో దాక్కొని చిన్నవాడిని ముందుకు తోసాడని అంటారు. నువ్వు నన్ను ఇలాంటి అపకీర్తి పాలు చేయవచ్చా? కాబట్టి నేనే యుద్ధానికి పోతాను”.

రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు, బాణాలు ధరించి సీతాదేవితో వెళ్ళిపోయాడు. ఇక సీత విచారం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఆ సంతోషంతో యుద్ధ ప్రయత్నం చేశాడు. మండుతున్న అగ్నితో సమానమైన గొప్ప కవచాన్ని తొడుక్కొని, పదునైన బాణాల విల్లు చేత బట్టుకొని, అల్లెతాటి ధ్వనితో దిక్కులు భేదిల్లేట్లు రామచంద్రమూర్తి ఉత్సాహంగా విజృంభించి నిలిచాడు. ఇలా ఉత్సాహంతో యుద్ధ సన్నద్ధుడై నిలిచిన రామభద్రుడిని చూసిన గంధర్వులు, దేవతలు, చారణులు మొదలైన వారు యుద్ధం చూసే కోరికతో ఆకాశంలో నిలుచున్నారు. వారిలో వున్న ఋషులు తమలో తాము మాట్లాడుకుంటూ, మూడులోకాలకు మేలుజరగాలని కోరుకునే గోబ్రాహ్మణులకు శుభం కలగాలని అంటారు. అలానే, చక్రపాణి అయిన విష్ణుమూర్తి దైత్యశ్రేష్టులందరినీ ఎలా జయించాడో, అదే విధంగా, పులస్త్యవంశంలో పుట్టిన భయంకర రాక్షసులందరినీ యుద్ధంలో జయించాలి అని దీవించారు. ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే అనీ, అధర్మవర్తులైన దుష్ట రాక్షసులు పద్నాలుగు వేలమందనీ, యుద్ధం ఎలా జరగనుందోననీ, ధర్మమే జయిస్తుందో, అధర్మమే జయిస్తుమ్దో చూడాలనీ వారంతా ఆశపడ్డారు. కోపాతిశయంతో జగత్సంహార కార్యోన్ముఖుడైన పినాకహస్తుడు రుద్రుడి ఆకారంతో సమానమైన ఆకారాన్ని వహించి భూతాలకు భీతికలిగించే రామభద్రుడి రూపాన్ని చూసి లోకాలు బాధపడ్డాయి. 

రాముడిని చూసిన ఖరుడి సైన్యం
         అప్పుడు గంభీరధ్వనితో, భయంకరమైన కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు కల రాక్షససేనలోని భటుల హుమ్మనే కంఠధ్వనులు, విల్లంబుల, అల్లెతాటుల టంటమ్మనే ధ్వనులు, నగారాల భాంభాం అనే ధ్వనులు, రథికుల ధిక్కారాల ధ్వనులు, వాళ్ళు నడిచేటప్పుడు వారి కాళ్ల దభదభ చప్పుళ్లు, అన్నీ కలిసి పెద్ద సంకులమయింది. ఆ ధ్వనికి అడవుల్లోని మృగసమూహం భయపడి నాలుగు దిక్కులా పరుగెత్తి, పరుగెత్తి, ఆ చప్పుడు వినబడని స్థలం చేరి అప్పుడు తిరిగి చూశాయి. అప్పుడు రాక్షస సైన్యం రాముడిని సమీపించగా, యుద్ధపండితుడైన రామభద్రుడు వారందరినీ తేరిపార చూశాడు. రాముడప్పుడు అల్లెతాటిలోని బాణాన్ని సంధించి ప్రయోగానికి సిద్ధంగా వుంచాడు. ప్రళయకాలంలోని అగ్నిహోత్రుడిలాగా మండుతూ దక్షాధ్వరధ్వంసం నాటి శివుడిలాగా చూసేవారికి భయంకర ఆకారంతో కనిపించాడు రాముడు. భయంకరమైన రామభద్రుడి ఆకారం చిఇసి భూతాలు పెద్ద ధ్వనితో సంతోషం చెడి అధికభయంతో తొక్కిసలాడుతూ పరుగెత్తాయి. ధ్వజాలు, విల్లులు, ఆభరణ సమూహం, మండుతున్న అగ్నిలాంటి కవచాలుకల రాక్షససేన సూర్యోదయ సమయంలోని మేఘాల లాగా కనిపించాయి.

         (ఇక్కడ రామచంద్రుడిని ప్రళయకాలవహ్ని అని, దక్షాధ్వరధ్వంసకుడు అని శివుడి ఉపమానాలు చెప్పడమంటే శత్రుసంహారం తధ్యమని చెప్పడమే. రాక్షసులను సూర్యోదయ మేఘాలతో పోల్చడమంటే వారికి అపజయం తధ్యమని కూడాఅర్థం).

No comments:

Post a Comment