సైన్యంతో
శ్రీరాముడిని తాకిన ఖరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-35
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (18-11-2018)
కోపంతో, శత్రు సంహారకుడిలా
కనిపిస్తున్న యుద్ధ సన్నద్ధుడైన కోదండధరుడు శ్రీరామభద్రుడిని చూసిన ఖరుడు తన
సారథితో ఆయన వున్న ప్రదేశానికి తన రథాన్ని పోనివ్వమన్నాడు. ఆయన అలా చెప్పగానే ఆయన
చుట్టూ మూగిన రాక్షసులు సింహనాదాలు చేశారు. ఖరుడు ఆలశ్యం చేయకుండా పదునైన బాణ
పరంపరలను విస్తారంగా రాముడి మీదకు వేశాడు. మిగిలిన రాక్షసులందరూ రాముడిని
చుట్టుముట్టి గుడియలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు ఆయన
మీదికి విసిరారు. శ్రీరాముడు మాత్రం అప్పటిదాకా ఆత్మరక్షణ పరాయణుడై నిలిచాడు.
రామభద్రుడిని చంపడానికి రాక్షసులు బాణాలతో, ఏనుగులతో, రథాలతో, ఒక్కసారిగా
ఆయన మీద పడ్డారు. అందరూ కలిసి రాముడిమీద బాణాల వర్షం కురిపించారు. (దీనర్థం
ప్రధమంగా అపరాధం చేసింది రాక్షసులే). రామభద్రుడు ప్రతిగా, తన బాణ
సమూహాలతో వారందరినీ సర్వాయుధాలు లేకుండా చేశాడు. ఆయన తనకు తగిలిన బాణాల వల్ల
కొంచెం కూడా వేదన పొందలేదు. దేహం నుండి నెత్తురు కారుతుంటే, సాయంకాల
సమయంలోని మేఘాలతో ఆవరించబడిన సూర్యుడిలాగా, అందంగా
ప్రకాశించాడు. క్షుద్ర రాక్షస సమూహం శ్రీరామచంద్రమూర్తిని చుట్టుముట్టి ఆయుధాలతో
బాదిస్తున్నదే అని దేవతలు, ఋషులు, పరితపించారు.
అప్పుడు రామభద్రుడు కోపంతో వింటిని ఆకర్ణాంతం లాగి బాణాలను సంధించాడు.
ఖరుడి
సైన్యాన్ని హతం చేసిన శ్రీరాముడు
అమిత వేగంగా వేసిన సహించనలవి కాని రాముడి
బాణాలు రాక్షస గుంపులను దూరి యమపాశాల లాగా, వారి దేహాలను
చీల్చి, వారి
నెత్తుటి నదుల్లో మునిగి, వెడలి, మండుతున్న
అగ్నిజ్వాలల్లాగా ఆకాశానికి ఎగిరిపోయాయి. రామభద్రుడి బాణాలు శత్రువులను తునాతునకలు
చేశాయి. వారి శరీర భాగాలు తెగనరకబడి కుప్పలు-తెప్పలుగా పడిపోయాయి. విరోధులు
తత్తరపడేట్లు బంగారు సొమ్ములతో అలంకరించబడిన రాక్షసుల గుర్రాలను చంపి, మావటివాళ్ళతో
మదించిన ఏనుగులను తునకలు-తునకలు చేసి, రథికులతో, సారథులతో సహా
రథ సమూహాలను పదునైన బాణాలతో నరికి, భటుల గుంపులను కూర ముక్కల్లాగా కోసి, సూర్యుడిలాగా
ప్రకాశిస్తున్న రాముడిని చూసి రాక్షస సైన్యం దుఃఖించింది. ఆ రాక్షసుల గుంపులో
చాలామంది చావగా, మిగిలిన
కొందరు రామభద్రుడి మీదకు దాడికి దిగగా, ఆయన మరింత పదునైన
బాణాలతో వారి ఆయుధాలను, తలలను ఒకేసారి నరికి వేశాడు. ఇక మిగిలిన
వారంతా దుఃఖపడుతూ ఖరుడి చాటుకు పోయారు భయంతో.
ధైర్యం కోల్పోయి వెనక్కు వచ్చిన
వారందరినీ మళ్లీ ధైర్యం చెప్పి, దూషణుడు రోషంతో రామభద్రుడి మీదకు యుద్ధానికి
పోయాడు. ఆయన వెంట ఇంతకు ముందు మరలి వచ్చిన గుంపు కూడా తమ ఆయుధాలు
ఖండించబడినందువల్ల మద్ది-తాటి చెట్లను
ఆయుధాలుగా ధరించి రాముడి మీదికి పోయారు. వెనుకంజ వేయకుండా, ఒక్క
రాముడిని ఓడించకపొతే అవమానం అంటూ, రాక్షసులు కొంతసేపు యుద్ధం చేశారు. ఈటెలు, కత్తులు, బాణాలు తన
మీద వేస్తుంటే, రామభద్రుడు ధనుష్టంకారం
చేసి వాళ్ల గుండెలు పగులచేసి, సింహనాదం చేసి,
శత్రుసంహారానికి గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. దాని నుండి వెలువడిన అనేక అకారాల
భయంకరాస్త్రసమూహం మూలంగా, ఆకాశం చీకట్లు కమ్మింది. రాక్షస సైన్యం తూలి, వాలి, పడి,
తునకలు-తునుకలై, పేగులు
తెగిపడగా మూర్చపోయి కూలి, పొడి-పొడి అయిపోయి భయంకరంగా నాశనం అయింది.
ఇదంతా ఆకాశం నుండి చూసిన దేవతలు సంతోషించారు.
విరిగిన రథాలను, చచ్చిపడిన
శూరులను, నేలవాలిన
ధ్వజాలను, గొడుగులను, తెరచిన
నోరులను, పరుగిడుతున్న
వీరులను, పడిపోయిన
ఏనుగులను, దొర్లాడు
గుర్రాలను, కోయబడిన
చేతులను, విధం చెడ్డ, సర్వం
నాసనమైన రాక్షస సైన్యాన్ని చూసిన దూషణుడు మరింతమందిని రాముడిమీడకు పంపాడు.
No comments:
Post a Comment