శ్రీరామాయ నమః
‘రామో విగ్రహవాన్ ధర్మః’
డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు
శ్రీ రామాయణం
ఆదికావ్యం. వాల్మీకి మహర్షి ఆదికవి. ఆర్ష వాజ్ఞయానికి సంబంధించి సంస్కృత సాహిత్యమే
ప్రామాణికం. వ్యాస,
వాల్మీకులే అందుకు ప్రాతఃస్మరణీయులు కదా! “వ్యాసాయ
విష్ణురూపాయ”,
“వ్యాసోనారాయణోహరిః”, అని తలవంచి ప్రణమిల్లారే కానీ, “కవి” అనలేదు. ‘కవి’ అంటే వాల్మీకి
మహర్షి. ‘కావ్యం’ అంటే శ్రీరామాయణం...వాల్మీకం. ‘ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం
వేదైశ్చ సమ్మితమ్’ అని తీర్పు. వాల్మీకి రామాయణం
భారత జాతికి ఉచ్చ్వాస నిశ్వాసాలు! ధర్మశాస్త్ర సంపుటం. భారతీయులకు ఆజీవన పారాయణ వేదం. నిత్య ప్రత్యూషంలో కోట్ల
గృహాంగణాలలో,
దేవాలయాలలో, శ్రీరామ మందిరాలలో
వినిపించే భద్రమంగళ గీతిక! మానవ మనుగడకు
నడవడిని నేర్పిన మహాపదేశశీల సంహిత సత్సంగాలకు హత్తిన వరవడి.
ఎందరెందరో
మహానుభావులు వాల్మీకి రామాయణాన్ని వారివారి భాషలలో, వారివారి దివ్య భావనలలలో, సంప్రదాయాలలో, కవితారీతులలో శ్రీ సీతారాములనూ, భరత, లక్ష్మణ,
హనుమ, విభీషణ, సుగ్రీవాదులను విలక్షణంగా ప్రస్తుతించారు.
శ్రీ రామాయణం అసంఖ్యాకులకు ‘కల్పవృక్షం’,
అల్పసంఖ్యాకులకు ‘విషవృక్షం’, పారాయణ పరాయణులకు ‘పీయూషం’ ‘యద్భావం తద్భవతి’ అస్తు!
‘ఆంధ్ర వాల్మీకి’
గా శతాబ్ధం క్రితమే లబ్ధ ప్రతిష్టులైన వావిలికొలను సబ్బారావు గారు ‘వాసుదాసు’ గా
తెలగునేల నాలుగు చెరగులూ ప్రాచుర్యం పొందిన మహాభాగవతోత్తములు. చతుర్వింశతి సాహస్రశ్లోక సంభరితమైన వాల్మీకి రామాయణానికి
సమసంఖ్యలో పద్యరూపంలో యధాతథంగా ఆంధ్ర అనువాద గంగావతరణం చేసిన అపర ఆంధ్ర భాషా
భగీరథులు వారు. రాబోయే కాలంలో ‘పద్యవిద్య’
దురవగాహనమౌతుందని భావించిన ‘ఆంధ్రవాల్మీకి’ తామే ‘మందరం’ అను పేరుతో అన్ని
పద్యాలకు అర్థ తాత్పర్య విశేషాలతో బాటు ‘గోవిందరాజీయా’న్ని ప్రామాణికంగా
స్వీకరించి వూహతీత ప్రభావ సంపన్నంగా వ్యాఖ్యానాన్ని అందించారు. వందేళ్లు
గడిచిపోయాయి. నాకూ శ్రీరామాయణమే ఆజీవన జీవికగా, ఆలంబనగా,
హృద్యమైన శ్రీరామ నైవేద్యంగా మారింది. తత్ఫలితంగానే శ్రీమాన్ వనం జ్వాలానరసింహరావు
గారితో మైత్రిబంధం కుదిరింది. వారు పితృవరంగా
పొందిన వారసత్వం శ్రీ సీతారామానుశీలనతత్త్వం! ఆపాతమధురనిష్యంది వారి సమాలోచన
పరిధి. అద్భుతమైన వక్త,
రచయిత. ఆంధ్ర శ్రీరామాయణానికి ‘వాసుదాస’ స్వామి వారి
అనువక్త. ‘మందర’కృతి వాచవి.
శ్రీరామానుగ్రహం
వల్ల మేమిద్ధరం ‘మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ’ హైదరాబాదులో
నాలుగైదేండ్లు సహాద్యోగులం. సహవాసులం అంటే
ఇరుగుపొరుగులం. పరస్పర ప్రేమాదరాలతోనూ, సత్సంగ సౌమనస్యాలతోనూ ఉభయ కుటుంబాలు స్నేహలతలను పల్లవిస్తూ విస్తరించాయి.
శ్రీమాన్ వనం
జ్వాలానంసింహరావు గారు ‘మందరాన్న’ ఔపోసన పట్టారు.
వారు ఏకసంథాగ్రాహి. విలక్షణమైన
చదువరి. భావగ్రాహి. ‘రామ ప్రభావదాశ్చర్యం’
అంటారు వాల్మీకి మహర్షి. ‘రామభూతం
జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి’ అంటారు.
శ్రీరామానుగ్రహ ప్రభావం ‘అప్రమేయ’ మట. ఇంగితాలకు, అవయవాలకు,
ఇంద్రియాలకు అందే విషయం కాదు. అయోధ్యావాసులకు ‘రామభూతం’ పట్టిందట. అలాంటివేవో మా ‘జ్వాలా’
గారిని ఆవహించింది. అమ్మాయిని (కూతరు) చూసివద్ధామని అమెరికా వెళ్లి, అక్కడే అంతర్జాలాన్నీ,
ఆంధ్ర లిపినీ
ఒంటబట్టించుకుని ‘ఆంధ్రవాల్మీకి కృత’ ‘సుందరాకాండ’ ను సంక్షిప్త సుందరంగా
వుల్లేఖించారు. అద్భుతమైన ప్రాచుర్యాన్ని పొందింది. వెంటనే బాల, అయోధ్యాకాండలను ‘మందర’
పథంలో అనునయిస్తూ రచించారు. ప్రస్తుతం
‘అరణ్యకాండ’ను అందిస్తున్నారు.
‘అరణ్యకాండ’
అనుష్టాన కాండ. అద్భుతమైన ధర్మమర్మాలను నిష్కర్షించిన మహర్షి మహాపదేశం. శ్రీ సీతారామలక్ష్మణులు వనప్రవేశంతో ఈ కాండ
ప్రారంభమౌవుతుంది.
శ్లో!! ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్!
దదర్మరామో దుర్థర్షః తాపసాశ్రమమండలమ్ !
అలాగే పంపా సరోవర
దర్శనంతో సమాప్తమై ‘కిష్కంధకాండ’కు నడిపిస్తుంది.
శ్లో!! తలో మహద్వర్త్మసుదూర సంక్రమః క్రమేణగత్వా
ప్రతికూల ధన్వనమ్ !
దదర్మపంపాం శుభ దర్మకాననాం అనేక నానవిధపక్షిజాలకామ్ !
అరణ్యకాండలో శరభంగ, సుతీక్షణ,
మాండకర్ణి, అగస్త్య, మతంగాది మహర్షులూ,
జటాయువూ, శబరీ దర్శనమిస్తారు.
‘ఆచార్యవైభవా’న్ని శబరి స్మరింప చేస్తుంది.
పంచవటిలో శూర్పణఖ ప్రవేశం. ఆమెకు ‘శృంగభంగం’. శ్రీరాములవారి
ధనుర్విద్యావైశారద్యం,
శ్రీరామలక్ష్మణుల సౌందర్యవర్ణనం, సీతాపహరణం,
జటాయు వీరమరణం, శ్రమణి, ధర్మనిపుణ శబరి వృత్తాంతం అరణ్యకాండలో ఆవిష్కరించబడిన ఆలోచనామృతాలు! ‘గురువందనం’
ఆచార్య ప్రస్తుతి ప్రాశస్త్వాన్ని శ్రీరామాయణం ఇందులోనే అందగిస్తుంది.
అరణ్యకాండలో అనేక
ధర్మాలు ప్రవచిస్తాయి. జ్వాలా గారు ‘వాచవి’
గా వీటిని ఎంతో హృద్యంగా వివరించారు. వారి
వచనం, సరళసుందరం. సీతమ్మ రామయ్యతో అంటుంది
శ్లో!!క్వచ శస్త్రం క్వచవనం, క్వచక్షాత్రం తసః క్వచ !
వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతామ్!
“మనం వనానికి
వచ్చాం. ఈ వనమెక్కడ! క్షత్రియ ధర్మం
ఎక్కడ! ఆయుధాలెక్కడ! ఋష్యాశ్రమం ఎక్కడ! ఇవి పరస్పర వ్యతిరిక్తాలు కద! ఈ ఋషివాటికలలో ఋషిధర్మాన్ని పాటించాలి. ఈ
ఆతుధాలు, హింసాత్మకాలుకదా! మనకెందుకు !
అని! అంటూనే సవినయంగా మీరూ, మీ తమ్ముడూ చక్కగా ఆలోచించి ఏది మంచిదో అలా చెయ్యండి” - అంటుంది మన సీతమ్మ
తల్లి. శ్రీరామయ్య తండ్రి అంటాడు.
శ్లో ! ! అప్యహం
జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణామ్!
నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభో విశేషతః !
- ధర్మవ్రతుడు, ధర్మమూర్తి,
ధర్మసంధాయకుడు, ధర్మనాయకుడు శ్రీరాముడు
కద! ‘‘సీతా! నేను ప్రాతాన్నైనా వదులుతాను. లక్ష్మణుడినైనా వదులుతాను. నిన్ను అయినా
విడిచిపెడతాను.. కానీ చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడిచి పెట్టేదిలేదు. అందునా
విశేషించి బ్రాహ్మణులకు (ఋషులకు) ఇచ్చిన మాటను తప్పేది అసలు లేదు”.
అన్నదమ్ముల
అనుబంధానికి మరో చక్కని సందర్భం మనస్సును రంజిల్ల చేస్తుంది. లక్ష్మణ స్వామి తన అన్నా వదినెలకు హాయిగా వుండేలా
ఆశ్రమం నిర్మించాడు. వాస్తు పూజలు చక్కగా చేసాడు.
శ్రీరాముల వారికి చూపించాడు.
శ్రీరాములవారు పరమానందభరితుడై ‘సుసంహృష్టః
పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా’ - లక్ష్మణుడ్ని గట్టిగా
కౌగిలించుకున్నాడు. ఎంతో
అభినందించాడు. ఆయన అంటాడు. ఏమని!
శ్లో! భావజ్ఞేన
కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ!
త్వయా నాథేన ధర్మాత్మాన సంవృతః పితామహ!
“తమ్ముడా నీవు
ఎదుటి వారి మనస్సును గ్రహిస్తావు. ధర్మం తెలిసినవాడివి. కార్యశీలుడవు. నీవు తోడుగా వున్నందున
ధర్మాత్ముడైన నాన్నగారులేని లోటు తెలియడం లేదు”. అంటాడు. ఇలా అన్నదమ్ములు
ఉండగలిగితే కుటుంబాలు మల్లెల వుద్యానాలు కావా!
విష్ణ్వాలయాలలో
శ్రీ సీతారాములకు వింజామరవీస్తూ చెప్పే శ్లోకాలు మనం వింటూ వుంటాం. అవి తనను అవమానించి బాధించిన దివ్యమజ్గల
విగ్రహుడైన శ్రీరామచంద్రమూర్తిని గురించి
శూర్పణఖ తన అన్నలైన ఖరదూషణాదులతో చెప్పిన విశేషాలు అవి.
శ్లో! తరుణా రూప సంపన్నౌ - సుకుమారౌ మహాబలౌ !
పుండీక
విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ!
శ్లో! ఫలమూలాశనౌ దాన్తౌ తాపసౌ ధర్మచారిణౌ!
పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ!
అపాకృత దివ్యసుందరమూర్తులైన
శ్రీరామలక్ష్మణుల దర్శన తీరుతెన్నులివి.
అర్థం స్పష్టం.
శ్లో! తం దృష్ట్వా శత్రుహంతారం
మహార్షీణాం సుఖావహమ్!
బ భూనహృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!
శ్రీరాముడు 72 నిమిషాలలో ఖరదూషణాదులతో సహా 14వేల మంది రాక్షసులను
సంహరించడాడు. అనంతరం ఈ సన్నివేశాన్ని గుహలోనుంచే చూసిన సీతమ్మ
ఆనందాన్ని తమాయించుకోలేక భర్తను గట్టిగా కౌగిలించుకున్నదట! నవరస భరితమైన
శ్రీరామాయణ మహాకావ్యంలో ఇలాంటి సన్నివేశాలు అసంఖ్యాకాలు. వీటిని నాటకీయంగా, కథాకథనంగా,
అమృతమథనంగా, కాంతా సమ్మితంగా అను‘వదించిన’ మా జ్వాలానరసింహారావుగారిని
శ్రీ సీతారామ శ్రీచరణ కమల స్మరణ పురస్సరంగా సంభావిస్తున్నాను. మిగిలిన కిష్కింధా, యుద్ధ కాండలను కూడా ఇలాగే రసరమ్యంగా, భవ్యరంజనంగా, శ్రీఘ్రంగా
రచించి, శ్రీరామ పట్టాభిషేక
(సామ్రాజ్య) మహోత్సవాన్నీ జరిపించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రచురణ సంస్థ ‘దర్శనమ్’ పత్రిక, అధిపతి బ్రహ్మశ్రీ మరుమాముల వేంకటరమణ శర్మనూ హార్ధంగా అభినందిస్తున్నాను.
శ్లో! చతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే!
నమస్సీతాసమేతాయ రామాయ గృహమేధినే!!
శ్రీరామ -రామానుజ - దాసానదాసుడు
డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు
చీఫ్ కన్సల్టెంట్,
SEEDAP,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి
మాకు ఎంతో ఆప్తులూ , విద్వద్వరేణ్యులూ అయిన శ్రీ రాఘవాచార్యులు గారిచే కొనియాడబడటం పూర్వ జన్మ సుకృతం...మహా కావ్యమైన శ్రీ రామాయణాన్ని చక్కగా సుందరమైన భాషలో అనువదిస్తున్న మీరు ఎంతో అభినందనీయులు సర్ ...
ReplyDelete