యుద్ధంలో మరణించిన దూషణుడు, సేనాపతులు, త్రిశిరుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-36
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (25-11-2018)
ఐదువేలమంది
కఠినదేహాలు, మనస్సు కల
రాక్షసులను రామభాద్రుడిని చంపడానికి పంపాడు దూషణుడు. వాళ్ళు వజ్రసమానమైన శూలాలను, ఖడ్గాలను, బాణాలను
వర్షంలాగా కురిపిస్తూ రాముడి మీదకు వస్తుంటే, ఆయన
పరాక్రమించి తన బాణాలతో వారి ఆయుదాలన్నింటినీ ఖండించాడు. దూషణుడితో సహా
సైన్యాన్నంతా దుఃఖ దశకు తీసుకొచ్చాడు. బాణ వర్షంతో వారందరినీ స్నానం చేయించాడు
రాముడు. శత్రుసమూహాలను నాశనం చేయగల దూషణుడు కోపగించి వజ్రసమానమైన బాణాలను తనపై
ప్రయోగించగా రామభద్రుడు అంతకంటే ఎక్కువ కోపగించాడు. పదునైన కత్తిలాంటి బాణంతో
దూషణుడి విల్లు తుంచి, మరో నాలుగు పదునైన బాణాలతో నాలుగు గుర్రాలను చంపి, తరువాత సారథి
కంఠాన్ని అర్థ చంద్ర బాణంతో నరికి, మూడు బాణాలు దూషణుడి రొమ్ములో నాటేట్లు
రామభద్రుడు చేయగా రాక్షసుడు కూడా ఆయన మీద పడడానికి వచ్చాడు. వస్తున్న వాడి రెండు
చేతులను తటాలున రెండు బాణాలతో నరికాడు. రెండు చేతులూ తెగడంతో దూషణుడు కొమ్ములు
పెరికిన ఏనుగులాగా చచ్చాడు. చనిపోయిన వాడిని చూసి భూతాలన్నీ మేలు-మేలని
శ్రీరామచంద్రుడిని పోగిడాయి.
ఇంతలో
కొందరు రాక్షస వీరులు కోపంతో దేహం తెలియకుండా రామభద్రుడి మీదకు వచ్చారు.
స్థూలాక్షుడు పట్టిసాన్ని, మహాకపాలుడు శూలాన్ని, ప్రమాథి
భయంకరమైన గండ్ర గొడ్డలిని తీసుకుని చేతులతో తిప్పుకుంటూ రాముదిమీదకు వస్తుంటే, రామభద్రుడు
మొదలు పదునైన బాణాలతో మహాకపాలుడి తల నరికాడు. మరో గొప్ప బాణంతో ప్రమాథిని చంపాడు.
స్థూలాక్షుడి కళ్లల్లో బాణాలను చొప్పించి, ఐదువేల
రాక్షసులను ఒక్కసారే ఐదువేల బాణాలతో ఖండించాడు. ఇది చూసి ఖరుడు, క్షుద్ర
మనుష్యులతో దూషణుడు చచ్చాడు కాబట్టి మీరంతా పోయి రామభద్రుడిని చంపమని యోధులను
ఆజ్ఞాపించి తానె స్వయంగా యుద్ధానికి దిగాడు.
కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, దుర్జయుడు, యజ్ఞశత్రుడు, విహంగముడు, రుధిరాశనుడు, సర్పాస్యుడు, పృధుగ్రీవుడు, శ్యేనగామి, కరవీరాక్షుడు, పరుషుడు అనే
పన్నెండు మంది సేనానాయకులు ఒక్కసారిగా రామభద్రుడిని ఎదుర్కొని బానవర్షం
కురిపించారు. రాముడు వారి బాణాలను ఖండించి వజ్రంతో సమానమైన బానవర్షాలను కురిపించి, వాళ్లను
నరికి భూదేవికి బాలి ఇచ్చాడు. ఆ తరువాత నూరు బాణాలతో వందమందిని, వేయి బాణాలతో
మరో వేయి మందిని చంపాడు. యుద్ధ భూమి నెత్తుటితో తడిసినట్లు కనిపించింది. మరణించిన
దుష్ట రాక్షస సమూహం వెంట్రుకలతో భూమి దర్భల వేదికలాగా కనపడింది. మొత్తం మీద, పద్నాలుగువేల
రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన భుజబలంతో చంపాడు. ఇక ఇరు పక్షాలలో మిగిలింది, ఖరుడు, త్రిశిరుడు, రామభద్రుడు
మాత్రమే!
సైన్యమంతా
నాశనమైపోవడం చూసిన ఖరుడు రాముడికి అభిముఖంగా పోవడానికి ప్రయత్నించగా, సేనానాయకుడైన
త్రిశిరుడు తానుండగా ఇంద్రుడిని గెలిచిన ఖరుడు శత్రువు మీదకు పోవడం మర్యాదా అని
ప్రశ్నించాడు. ఇలాంటి ఆలోచన ఖరుడు చేయకూడదనీ, తుచ్చుడైన
రాముడిని పట్టుకొని తన బాణాలతో నిమిషంలో నరికి వేస్తానంటాడు. ఈ మాటలు తన విల్లు
మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటాడు. “రాముడు నన్నో, నేను
రాముడినో చంపడం నిజం. దీన్ని నువ్వు నిలుచుని చూస్తుండు. రాముడు చస్తే నువ్వు
సంతోషంగా ఇంటికి వెళ్లు. నేను చస్తే నువ్వు రాముడి మీదకు యుద్ధానికి పోయి అతడి
గర్వం అణచు” అని త్రిశిరుడు చెప్పగా ఖరుడు అలానే చేయమని అంటాడు.
త్రిశిరుడు
మూడు శిఖరాల కొండలాగా రథమెక్కి పోయి రామభద్రుడి మీద జోరున వర్షంలాగా బాణాలు
కురిపించి,
నీళ్లలో
తడిసిన నగారా ధ్వనిలాగా సింహనాదం చేశాడు. రామభద్రుడు కూడా రా-రమ్మంటూ తన విల్లు
గిర-గిర తిప్పుతూ కఠిన బాణాలు ధరించి త్రిశిరుడి మీద వేశాడు. వాడు కోపంతో
విజృంభించాడు. వారిరువురి మధ్య అద్భుతమైన యుద్ధం సింహానికి, ఏనుగుకూ మధ్య
జరిగినట్లు జరిగింది. త్రిశిరుడు మూడు బాణాలను రాముడిపైకి వేశాడు. రాముడు జవాబుగా
పద్నాలుగు బాణాలను వాడి రొమ్ముకు గురిచూసి వేశాడు. నాలుగు బాణాలతో గుర్రాలను, ఎనిమిది
బాణాలతో సారథిని, ఒక్క దెబ్బతో తెక్కాన్ని తుంచి, భూమి మీదకు
దుమకడానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడి వక్షాన్ని చీల్చేట్లు తీవ్ర బాణాలను వేయగా
వాడు చేష్టలుడిగి ఖండించబడిన శిరస్సుతో నేలకూలాడు.
త్రిశిరుడు పడిపోవడం చూసిన ఖరుడిని
ఆశ్రయించిన సేవకులు, ఇతర రాక్షసులు, రామభద్రుడు ఇక తమల్ని
కూడా చంపుతాడనే మహా భయంతో పెద్ద పులిని చూసిన లేళ్ళలాగా నాలుగు దిక్కులా
పరుగెత్తారు. తానుండగా వాళ్లకు ఎలాంటి ప్రాణభయం లేదని వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్లందర్నీ పిలుచుకొని వచ్చి నిండు కోపంతో
చంద్రుడి మీదకు రాహువు పోయినట్లు రాముడి మీదకు పోయాడు యుద్ధానికి.
No comments:
Post a Comment