సుగ్రీవుడి దగ్గరకు వెళ్లిన అంగదాదులు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-11-2018)
తనకు నమస్కరించి కాళ్లమీద పడిన దధిముఖుడిని
చూసి, సుగ్రీవుడు, భయపడకుండా, జరిగిందేంటో చెప్పమని అడుగుతాడు. సమాధానంగా, సుగ్రీవుడి తరంలోగానీ, ఆయన అన్న తరంలోగానీ, తండ్రి తరంలోగానీ, మధువనంవైపు కూడా రాని వానరులు, ఇప్పుడు దక్షిణ దిక్కునుండి తిరిగి వస్తూ ఆ వనాన్ని
పాడుచేసారని పిర్యాదు చేసాడు. వారక్కడ తేనెతాగారనీ, పళ్ళన్నీ తిన్నారనీ, తాగగా మిగిలిన తేనెను
పారపోసారనీ, ఇదేమిటని అడ్డంపోయిన కావలివారిని వెక్కిరించి
కొట్టారనీ, చెప్పాడు. వనపాలకులు వెళ్లి బలవంతంగా వానరులను వెళ్లగొట్టే
ప్రయత్నం చేస్తే, వాళ్లు కోపంతో పిడికిళ్లతో గుద్దారనీ, కాళ్లతో కుమ్మారనీ,
ముడ్లు చూపారనీ, సుగ్రీవుడు రాజన్న సంగతికూడా మరిచిపోయి
ప్రవర్తించారనీ, అన్నాడు. ఇలా ఆయన విన్నవిస్తున్న సమయంలోనే, ఆమాటలువిన్న లక్ష్మణుడు, సుగ్రీవుడితో, వనపాలకుడు ఏమంటున్నాడనీ, ఎందుకు దుఃఖిస్తున్నాడనీ ప్రశ్నిస్తాడు.
జరిగిన సంగతినీ, దధిముఖుడి పిర్యాదునీ, నేర్పుగా
లక్ష్మణుడికి వివరిస్తాడు సుగ్రీవుడు. మధువనంలో హనుమంతుడి అండతో, అంగదుడి ప్రోత్సాహంతో, కపులు చేసినపనిని గురించి తనదైన మాటల్లో నేర్పుగా చెప్పాడు.
దక్షిణ దిక్కుగా పోయిన వానరసేనకు, ఆలోచన చెప్పేవాడు జాంబవంతుడైనప్పుడు, హనుమంతుడు రక్షకుడైనప్పుడు, ప్రభువేమో అసమానబలుడైన అంగదుడే అయినప్పుడు, వారికప్పచెప్పిన పని సఫలమయిమడనడంలో ఆశ్చర్యం లేదనుకుంటాడు.
ఆ విషయమే చెప్పాడు లక్ష్మణుడితో సుగ్రీవుడు. అంగదుడు మొదలయినవారు, ఇతర వానర ప్రముఖులు, మధువనాన్ని
కుప్పచేసారనీ, వద్దని అడ్డంపోయిన దధిముఖుడినీ, వనపాలకులనూ కొట్టారని కూడా చెప్పాడు సుగ్రీవుడు. వానరులు
సీతాదేవిని చూడకపోయినట్లైతే, బ్రహ్మదత్తమైన మధువనాన్ని కళ్లతో చూసే
ధైర్యమైనా వుంటుందా? ఈ మాటలు విన్న రామలక్ష్మణులు సంతోషంతో గగుర్పాటుపడ్డారు.
రామలక్ష్మణులకు ఇలా చెప్పిన సుగ్రీవుడు, దధిముఖుడితో వానరులు మధువనంలో స్వేచ్ఛావిహారం చేసారంటే, వారుమంచి కార్యం సాధించి వుంటారనీ, కాబట్టి వాళ్లను క్షమించాలనీ, క్షమించాననీ అంటాడు. హనుమంతుడు, ఇతరులు ప్రవర్తించిన విధం, సీతాదేవిని చూసేందుకు వారుచేసిన ప్రయత్నం, రామలక్ష్మణుల సన్నిధిలోనే తాను వినదల్చుకున్నానని
వానరులందరికీ చెప్పి, వాళ్లను త్వరగా రమ్మని కబురుచేస్తాడు సుగ్రీవుడు. ఇలా
చెప్పిన తర్వాత, సంతోషంతో,
వికసించిన కళ్లతో, పులకరించిన దేహంతో, కనిపించిన రామలక్ష్మణులను చూసి, సీతాన్వేషణ కార్యం సఫలమయిందికదా అని ఆనందించాడు సుగ్రీవుడు.
రామలక్ష్మణులకు, సుగ్రీవుడికి
నమస్కరించిన దధిముఖుడు, పరిచారకులతో ఆకశానికెగిరి, ఎంతవేగంగా
వచ్చాడో, అంతేవేగంగా వెళ్లిపోయాడు. మధువనంలో తేనెను నీళ్లతో
కలుపుకుని తాగిన వానరులకు, మూత్రం విడిచినందున, అప్పటికి
మత్తువదిలింది. ఆ వానరులలో అంగదుడిని గమనించి, అతడి
వద్దకువెళ్లి, చేతులు జోడించి నమస్కరించాడు దధిముఖుడు. తాను చేసిన
అపరాధాన్ని మన్నించమని వేడుకుంటాడు. వనపాలకులు తెలివితక్కువతనం వల్ల వానరులను
అడ్డగించారనీ, ఆ ఉద్యానవనానికి రాజకుమారుడూ, యువరాజూ అయిన అంగదుడే ప్రభువనీ, ఆయన సొమ్ము ఆయన వాడుకుంటే అడ్డగించే
అధికారం వీరికెవరికీ లేదని అంటాడు. అజ్ఞానంతో చేసిన తప్పులు క్షమించమని, వాళ్లు ఈ వనంలోకి వచ్చిన వార్తను పిన తండ్రి సుగ్రీవుడికి
తెలిపి వచ్చాననీ అంటాడు. తాను సుగ్రీవుడితో వానరులు తప్పుచేసారని చెప్తే, కోపగించుకునేబదులు, సంతోషించి, వాళ్లను త్వరగా రమ్మని కబురంపాడని కూడా చెప్పాడు దధిముఖుడు.
దధిముఖుడు చెప్పిన మాటలు విన్న అంగదుడు
వానరులతో, ఈ విషయాలన్నీ రామలక్ష్మణులకు కూడా తెలిసే వుంటాయనీ, ఎట్లాగూ తేనెతాగి అలసట తీర్చుకున్నాం కనుక, ఇక్కడ చేయాల్సిన పనికూడా ఏమీలేదుకనుక, పిన తండ్రిని చూట్టానికి పోదామా అని అడుగుతాడు. "మీ
అందరూ ఏది చెప్తే అదే చేద్దాం. పనులు చేయడం విషయంలో నేను మీ అధీనంలో వుంటాను.
నేనుమీకు యువరాజునైతే అవ్వొచ్చు. ఆ అధికారం వుందికదానని మీకిష్టం లేని పని చేయమని
నేను ఆజ్ఞాపించను. కార్యసాధకులైన మిమ్మల్ని వ్యర్ధమైన ఆజ్ఞలతో పీడించను" అన్న
అంగదుడి మాటలకు వానరులంతా సంతోషపడ్డారు. రాజైన ప్రతివాడూ, తానే సర్వం చేస్తాననీ, చేయగలవాడిననీ, మతిచెడ్డవాడిలాగా గర్వపడుతాడుకాని, ప్రభువనేవాడెవ్వడూ, ఈవిధంగా, వినయంగా మాట్లాడడని అనుకుంటారు.
ఇలాంటివాళ్లు అరుదుగా వుంటారనీ, ఇతని వినయమే భవిష్యత్తులో
గొప్పమేలు చేస్తుందని భావిస్తారు.
అంగదుడి ఆజ్ఞ లేక అడుగెయ్యమనీ, ఏపనైనా ఆయన చెప్పినట్లే చేస్తామనీ, ఆయన చెప్పినట్లే సుగ్రీవుడిని చూడటానికి పోదామనీ వానరులందరూ అంటారు.
"సరే" పోదామని అంగదుడనగానే, వానరులు
ఆకాశమార్గాన, వేగంగా,
యంత్రాలతో చిమ్మిన కొండల్లాగా, గర్జించే మేఘాల్లాగా, సుగ్రీవుడుండే ప్రదేశానికి చేరుకున్నారు. ఇంతలో సీతాదేవి
వార్త తెలియరానందున, రామచంద్రమూర్తి సంతాప పడుతుంటాడక్కడ.
సంతాపపడుతున్న శ్రీరామచంద్రుడిని చూసిన
సుగ్రీవుడు, ఆయనతో, ఓదార్పు మాటలతోనూ, ధైర్యవచనాలతోనూ, మాట్లాడాడు. "కమలాక్షా! ఊరడిల్లు. వానరులు
నిస్సందేహంగా సీతను చూసొచ్చారు. గడువుదాటి కార్యం సాధిన్చకుండా, నా ఎదుటకు వచ్చే ధైర్యం వాళ్లకు లేదు. వెళ్లినపని చేయక
వెనక్కువచ్చే పనికిమాలినవాడు కాదు అంగదుడు. కార్యసాధకులు కాకపోతే, తాతతండ్రులు రక్షించుకుంటూ వస్తున్న ఉద్యానవనంలోకి
ప్రవేశించడానికి ఎన్ని గుండెలున్డాలి? రఘువరా, కౌసల్యా తనయా! సీతాదేవి వార్త తెలిసింది.
ఈకార్యం సాధించగలవాడు హనుమంతుడొక్కడే. ఇతరులకిది దుస్సాధ్యం. ఆ సూర్యుడిలో స్థిరమైన తేజం
ఎలా వుంటుందో ఈవానర శ్రేష్టుడిలో, శక్తి, బలం, జ్ఞానం, స్థిరంగా వుంటాయి" అంటాడు సుగ్రీవుడు.
nice blog...
ReplyDeletetrendingandhra