Sunday, November 25, 2018

శ్రీరాముడికి కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన హనుమంతుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడికి కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-11-2018)
శ్రీరాముడికోరిక ప్రకారం హనుమంతుడు సీతాదేవి చెప్పిన మాటలన్నీ వినిపించాడు. గుర్తుగా చిత్రకాట పర్వతం మీద జరిగిన వృత్తాంతాన్నీ చెప్పాడిట్లా:

"నీతో నిద్రిస్తున్న సీతాదేవి ముందుగా లేచినప్పుడు తటాలున కాకి ఒకటి ఎగిరొచ్చి, ఆమె స్తనం మధ్యలో తన వాడికొనగోళ్లతో తాకింది, గీకింది. నిద్రిస్తున్న ఆమె మేల్కొనడం గమనించిన నీవు ఆమె తొడపై తలపెట్టి నిదురపోయావు.  ఇలానీవు సుఖనిద్రలో వున్నప్పుడు అదేకాకి మళ్లావచ్చి ఆమెను బాధించడం జరిగింది. ఆ ఉత్తమస్త్రీని, సీతాదేవిని, కాకి పలుమార్లు గాయం పడేవిధంగా ముక్కుతో పొడవడం వల్ల ఆమెనుండి వెలువడిన నెత్తురు సరీగ్గా నీమీదపడింది. సీతాదేవి చెప్పిన ఆ వృత్తాంతాన్ని యధాతధంగా ఆమె చెప్పిన మాటల్లోనే నీకు చెప్తా వినమని" అంటాడు హనుమంతుడు. సీతాదేవి చెప్పిన ఆమాటలు:

"పూర్వం చిత్రకూటంలోని, మందాకినీ తీరం దగ్గర నివసిస్తున్నప్పుడు, ఓనాడో కాకి, నన్ను మాంసమనుకుని, తనముక్కుతో పొడవగా, ఓ మట్టిపెళ్లను ఆ తుంటరి కాకిమీద విసిరాను. అయినా అదిపోకపోతే, కోపంతో దాన్ని తరిమి కొట్టటానికి, నా ఒడ్డాణం తీసాను. అప్పుడు నాచీరె జారిపోవడం, నీవు నవ్వడం, సిగ్గుతో నేను ఆయాసపడడం జరిగింది. కాకిముక్కుతో గీకిందన్న కోపం, నువ్వు నవ్వడంతో కలిగిన సిగ్గుతో, ప్రయాసపడి వొచ్చి నీ ఒళ్లో చేరాను. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు కారుతుంటే, నీవు నన్ను ఓదార్చలేదా? అట్లా అలసిపోయి, నిద్ర రాగా, నీ తొడమీద పడుకున్నాను. ఆ వెంటనే నేను లేవగా, నాతొడపైన తలవుంచి నీవు పడుకున్నావు".

"రామచంద్రమూర్తీ! నీవు నిదురించగానే, ముందు బాధపెట్టిన కాకే, నాదగ్గరకొచ్చి, నా స్తనాలను గీరి, ముక్కుతో నాకు బాధకలిగేటట్లు పొడిచింది. ఆ గాయం నుండి రక్తంకారి, ఆబొట్లు నిదురిస్తున్న నీపైన పడ్డాయి. ఆ పాపపు పక్షిపెట్టే బాధ సహించలేక, సుఖంగా నిద్రిస్తున్న నాధుడిని, శ్రీకాంతుడిని, శత్రుమర్దనుడిని, నిన్ను లేపాను. అప్పుడు నీవు లేచి, నా స్తనములందున్న గాయాన్ని చూసి, కోపంతో, ఈ పాపం చేసినవాడెవ్వడో చెప్పు, వాడినిప్పుడే రూపుమాపెదనన్నావు. రోషంతో బుసలు కొట్టే ఐదు తలల పాముతో ఆడుకుంటానికి సాహసించిన వాడెవరని అంటూ, నాకెదురుగా వున్న కాకిని నెత్తురుతో తడిసిన గోళ్లతో చూసావు. నీవు  చూడగానే, కాకిరూపంలో వున్న ఇంద్రుడి కొడుకు, గాలిలాగా కొండ దిగి పరుగెత్తసాగాడు".

"పరుగెడ్తున్న కాకిని చూసి, కోపంతో, దయను వదిలేసి, దర్భాసనంలోని దర్భను తీసి, దాన్నే బ్రహ్మాస్త్రంగా కాకిమీద వేసాడు. (అస్త్రం అంటే మంత్రించి విసిరివేసే ఆయుధం. శస్త్రం అంటే హింసించడానికో, చికిత్సకో ఉద్దేశించబడింది. నియమ నిష్టలుంటేనే అస్త్రం పనిచేస్తుంది. శస్త్రం ఒక పరికరం లాంటిది) ఆ దర్భపోచ ఆకాశంలో పోతున్న కాకిని వెంటాడింది. ఆ కాకి ముల్లోకాలు తిరిగి, ఎంతోమంది శరణు కోరింది. ఇంద్రుడు, బ్రహ్మాది దేవతలు, గొప్ప మహర్షులు, అందరూ దానిని కాపాడలేమని చెప్పారు. వేరేగతిలేక మళ్లీ తిరిగొచ్చి రాముడినే శరణుకోరింది".

"శరణు-శరణని భూమిపై సాగిలబడిన కాకిని చూసి, అది చంపబడాల్సిందే అయినా, దయతల్చి వదిలేసావు. ప్రపంచంలో, ఏ ఒక్కడైనా కాపాడలేకపోయిన ఆ కాకి నీ శరణుజొస్తే, దాన్ని చూసి నీవు, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాదు, ఏమిస్తావని అడిగావు. అది తన కుడి కంటిని తీసుకొమ్మంది. ఆ భయంకర బాణం దాని కుడికన్ను హరించి వేసింది. కాకేమో చావుతప్పి కన్నులొట్టబోగా, రాముడినీ, దశరథుడినీ తలచుకుంటూ, నమస్కరిస్తూ పోయింది".


"నరేంద్రా! నాకు చిన్న బాధకలిగితేనే, ఆ బాధ కలిగించిన కాకిపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించావే! నిన్ను తిరస్కరించి, ఇంతకాలం, ఇంతబాధపెట్తున్న ఈ క్రూరుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇలా చేస్తే, నీవు నరేంద్రుడవెట్లా అవుతావు? నీనరేంద్రత్వానికి హాని రాదా? జగన్నాధా! నీ బలపరాక్రమ సాహసాలెట్టివో, ఎంతటివో నేనెరుగుదును. తెలియబట్టే నీవు నన్ను తప్పక రక్షిస్తావని నమ్మి వున్నాను. అన్ని గుణాలలో దయాగుణమే శ్రేష్టమని నీవు నాతో చెప్పావుకదా! ఆ దయ బాధపడ్తున్న నామీద ఎందుకు చూపడం లేదు? నిన్ను నాథుడిగాగల నేను అనాధలాగా పడి వున్నానే! ఇలా చేయడం నీకు ధర్మమేనా?"

"హనుమా! సముద్రం లాంటి గాంభీర్యం కలవాడు, ప్రకాశించే పరాక్రమం గలవాడు, శత్రుసంహారంలో సమర్ధుడు, ఇంద్రుడితో సమానమైన రామచంద్ర భూపాలుడు చతుస్సముద్రాలతో నిండిన భూమండలానికి భర్త. ఇలాంటివాడు, అస్త్రవిద్యలో పండితుడు, శ్రేష్టుడు, మంచి బలవంతుడు, మంచి స్వభావం కలవాడూ అయిన రామచంద్రమూర్తికి నామీద కాస్తైనా దయవుంటే, ఎందుకొక్క అస్త్రం సంధించడు? ఉత్తమ దివ్యాస్త్రాలను కలిగి వున్న రాముడు, రాక్షసుల మీద ఎందుకు పదునైన అస్త్రాలు వేయడంలేదు? దేవదానవులు, పన్నగ గంధర్వులు, యుధ్ధభూమిలో ఆయన వంకైనా స్థిరంగా చూడలేరే? ఆట్టివాడు, నామీద ప్రేముంటే, రాక్షసులను చంపడా? దీనికి కారణం ఏమీలేదు....నామీద దయలేకపోవటమే!"

"ఆంజనేయా! రామచంద్రమూర్తి ఉపేక్షచేసినా నన్ను తనతల్లిలాగ చూసుకునే లక్ష్మణుడు, నావలెనే పరతంత్రుడైనా, అన్న అనుమతి తీసుకుని, నన్ను రక్షించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన పగవారిపాలిట యముడే! దోషంకల భార్యలను భర్తలు విడిచిపెట్టవచ్చుగాని, దోషంకలదైనా తల్లిని కొడుకు విడిచి పెట్టవచ్చా? అలాంటిది లక్ష్మణుడు నన్నేల విడిచిపెట్టాడు? అన్నదమ్ములిద్దరూ అగ్ని, వాయువు లాంటివారు. ఎవరూ ఓడించిజాలని సమర్థులు. వారు నన్నుపేక్షించడానికి కొద్దో-గొప్పో నేనుచేసిన దుష్కృతం తప్ప ఇంకే కారణం కనిపించడం లేదు. వాళ్లలో దోషముందని ఎట్లా అనను? వారు సమర్ధులే! నామీద ప్రేమలేనివారు కాదే! కాబట్టి దోషం నాదే! "

 (దివ్యమంగళ విగ్రహడూ, సత్యసంధుడూ, ధర్మజ్ఞుడూ అయిన తన భర్త శ్రీరాముడు, తనను అరణ్యానికి రావద్దని వారిస్తున్న సందర్భంగా ఆయన్ను పురుషకారంలో ఉన్న స్త్రీవి అని సీతమ్మ అనడం భగవదపచారం. వాస్తవానికి భగవదపచారం చిన్నది. ఆ వేళ మాయలేడిని తీసుకురావడానికి వెళ్లిన రాముడు ఎంతకూ తిరిగిరాక, లక్ష్మణా! సీతా! అన్న కేకలు వినిపిస్తున్నప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని తక్షణమే వెళ్లి రాముడిని రక్షించమన్నప్పుడు, లక్ష్మణుడు సీతమ్మను ఒంటరిగా విడిచి వెళ్లడు. అప్పుడు సీతమ్మ విసిగిపోయి లక్ష్మణుడిని దుర్భాషలాడుతుంది. అనరాని మాటలంటుంది. పరమ భాగవతోత్తముడైన లక్ష్మణుడిని అలా నిందించడం భాగవాతపచారం. ఇది భయంకరమైన అపచారం. ఈ రెండు అపచారాలలో రామాపచారం భగవదపచారమే అయినా చిన్నదే. లక్ష్మణాపచారం భాగవతాపచారమైనందున పెద్దది. ఇవి చేసింది సీతమ్మ)

No comments:

Post a Comment