Sunday, November 4, 2018

మధు వనంలో చొరబడి చెలరేగిన కపులు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


మధు వనంలో చొరబడి చెలరేగిన కపులు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (05-11-2018)
జాంబవంతుడి సలహా బాగున్నదని అంగదుడు, హనుమంతుడు, తక్కినవారందరూ అంగీకరించి, హనుమంతుడు ముందుండగా మహేంద్ర పర్వతాన్ని విడిచి బయల్దేరారు. మేరు, మందర పర్వతాలంత ఎత్తు, పెద్ద ఏనుగుల బలమూ వున్న వానరులు కిష్కింధకు పోయే మార్గంలో ఆకాశాన్నే మరుగుపరుస్తున్నట్లు వ్యాపించిపోయారు. ఆంజనేయుడిని తమచూపులతోనే మోస్తున్నారా అనేవిధంగా, కళ్లురెప్పలార్చకుండా ఆయన్నే చూసుకుంటూ, పొగుడుకుంటూ, స్వామికార్యం నెరవేర్చామని ప్రియమైన మాటలు చెప్పుకుంటూ పోతున్నారు వారందరూ.

(ఈ హనుమంతుడు ఎంతటి ఘనకార్యం చేసాడు! ఎంతటి నిరుపమ భాగ్యశీలి! ఆహా! సీతమ్మను చూసి, కుశలాదులు విచారించి, చక్కగా వచ్చి మన ప్రాణాలను నిల్పిన ఈతడు ఎంతటి మహనీయుడు! స్తవనీయుడు! ధన్యుడు! అని వానరులు ప్రేమ, ఆప్యాయతలు నిండిన మనస్సులలోని అభినందన భావ పరంపర వారి కళ్లల్లో ప్రతిబింబించిందేమోనని అనిపిస్తోంది).

యుద్ధం చేయాలన్న ఆసక్తితో, దానిమీదే మనస్సుంచి, ఉత్సాహంతో రామచంద్రమూర్తికి ఎప్పుడు సహాయం చేద్దామా అన్న కోరికతో, ఆకాశ మార్గాన పోతున్న వారికంటికి అందమైన మధువనం కనిపించింది.

(మహేంద్ర పర్వతం నుండి సముద్రాన్ని దాటి లంకకుపోయే దూరం కంటే, మహేంద్ర పర్వతం నుండి కిష్కింధకున్న దూరమే ఎక్కువ)

ఇంద్రుడి నందనవనంతో సమానమై, చెట్ల వరుసలతో, అందమైన తీగల గుంపులతో, ప్రకాశిస్తూ, సంతోషాన్నిచ్చే ఈ మధువనం పటిష్టమైన కాపలాలో భద్రంగా కాపాడబడుతున్నది. సుగ్రీవుడి మేనమామ "దధిముఖుడు" దాంట్లోనే కాపురముంటూ, కాపలావారికి నాయకుడిగా వున్నాడు. ఆ వనాన్ని చూస్తూనే వానరులంతా, అక్కడున్న తేనె తాగాలన్న కోరికతో యువరాజైన అంగదుడి అంగీకారమడిగారు. జాంబవంతుడు, ఇతర వానర ప్రముఖులు, సరేననడంతో వారందులోకి దూరారు.

లోపలికి పొమ్మని అంగదుడు అనుమతి ఇవ్వగానే, వానరులందరూ నాట్యం చేస్తూ, సంతోషంతో గెంతులేస్తూ, వళ్లు తెలియకుండా ఆటలాడుతూ, పాటలు పాడుతూ, మీసాలు తిప్పుకుంటూ, వేడుకలాడుకుంటూ, ఊగుతూ, తూలుతూ, మధు వనంలోకి దూరారు. యధేఛ్చగా తిరుగుతూ, తృప్తితీరా తేనెతాగారు. దానితో బాగా మత్తెక్కింది వానరులందరికీ. వనాన్నంతా కలియబెట్టి, చెట్లకున్న పళ్ళన్నీ నేలరాలకొట్టి, చిందరవందర చేసారా మధువనాన్ని.

చెలరేగి వనాన్ని పాడుచేస్తున్న వానరులను వారించి, నయానా-భయానా చెప్పిచూసాడు దధిముఖుడు. తనమాటలు వాళ్ల చెవికెక్కక పోవడంతో, బలవంతంగానన్నా వాళ్లను నివారించి వనాన్ని రక్షించాలనుకున్నాడు. కొందర్ని తిట్టాడు, కొందర్ని మెడపట్టుకుని తోటబయటకు విసిరాడు, పెద్దవారికి నీతులు చెప్పాడు, కొందర్ని చేత్తో కొట్టాడు, కొంద పిడికిలితో బాదాడు. వానరులు కూడా వూరుకోలేదు. కొందరు వాడిని కొరికారు, కొందరు గోళ్లతో గీకారు, కొందరు ఈడ్చారు, కొందరు మీదపడి మర్దన చేసారు, కొందరు దూషించారు, కొందరు కోపంతో ఆ వనాన్ని మరింత పాడుచేయసాగారు.

దధిముఖుడు వానరులకు అడ్డం తగలడంతో, వారిరువురికీ, కొట్లాటలోనే కాలం వృధా అయిపోతుందని గమనించాడు హనుమంతుడు. వానర ముఖ్యులు కలహంతోనే కాలం గడపకుండా, తేనెతాగడంలోనే నిమగ్నంకమ్మనీ, దధిముఖుడి సంగతి తాను చూసుకుంటాననీ వారికి చెప్పాడు. స్వామికార్యం నెరవేర్చిన హనుమంతుడు, చెప్పరాని పని చెప్పినా సమ్మతమేననీ, వాళ్ల ఆశతీరేదాకా తేనెతాగమనీ వానరులకు చెప్తాడు అంగదుడు. భళి-భళీ అనుకుంటూ, అంతకుముందు దధిముఖుడి మాటలకు తోటబయటకు పోయినవారుకూడా వనంలోకి చొరబడ్డారు మళ్లీ. కావలివాళ్లను కొట్టారు, కిందపడేసారు. తూములకొద్దీ తేనెతాగి, తేనెతెట్టెలను నేలమీద పడేసి పగలగొట్టారు. స్వభావసిధ్ధమైన బలంవల్లా, సీతాదేవిని చూసిన వార్త వినడంవల్లా, అంగదుడు అనుమతి ఇచ్చాడన్న ఉత్సాహం వల్లా, తృప్తి తీరేదాకా తేనెతాగారు. కొంత తేనె పారబోసారు, మైనపు వుండలతో ఆడుకున్నారు, కోతికొమ్మంచులాడారు,   తోసుకున్నారు, నిద్రించారు, అరిచారు. నానా హడావిడీ చేసారు. ఏమిటేమిటో చేసారు వానరులు. కోతుల గుంపుల చేష్టలు చూసిన కావలివాళ్లు, దధిముఖుడి సైన్యం వెంటరాగా, కోపంతో వీళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, వానరులు వాళ్లను మోకాళ్లతో కుమ్మారు, పిడికిళ్లతో గుద్దారు, కొట్టారు, ముడ్డిచూపించారు. వాళ్లు భయపడి, తమ ప్రభువు వద్దకు పరిగెత్తారు. హనుమంతుడి సహాయంతో కోతులు వనమంతా పాడుచేసి తమను కొట్టారని దధిముఖుడికి పిర్యాదు చేసారు. కోతులను కొడదాం రమ్మని సైనికులకు చెప్పగా, వాళ్లు చేతికి దొరికిన ఆయుధాలను పట్టుకుని బయల్దేరారు. దధిముఖుడు ఒక చెట్టు పీకి దానితో వానరులను దండించడానికి వెళ్లాడు.

ఇలావచ్చిన దధిముఖుడు, అతని సైనికులు, వానరులమీద పడి వారిని తోటనుండి తరిమేస్తున్నారని తెలుసుకున్న హనుమంతుడు, ఇతరవానర ప్రముఖులు, అక్కడకు చేరుకున్నారు. అలావచ్చిన వారిలో వున్న అంగదుడు, తనకు వరుసకు తాతైనప్పటికీ, (మాతామహుడు) గౌరవించాల్సిన వాడైనప్పటికీ, తేనెతాగిన మత్తులో, దధిముఖుడిపైన పడి గుద్దులుగుద్ది వదిలిపెట్టాడు. వాడు వెలవెలబోయి, మూర్ఛపోయి, లేచి ఇతర వానరులను అడ్డగించాడు.

అంగదుడే ముందుండి మధువనాన్ని పాడుచేసాడని సుగ్రీవుడికి చెప్పాలనుకుంటాడు దధిముఖుడు. అలాచెప్తే సుగ్రీవుడు వీళ్లను తప్పక దండిస్తాడని భావిస్తాడు. రాజాజ్ఞ మీరి సంచరిస్తున్న వీరందరినీ చంపించాలనీ, అలాచేస్తే వీరికి బుద్ధి వస్తుందనీ, పొగరణుగుతుందనీ తలుస్తాడు, పగతీరుతుందనుకుంటాడు. తనవెంట ఇతర వనపాలకులు వస్తుంటే, నిమిషంలో సుగ్రీవుడి దగ్గరకు అకాశ మార్గాన వెళ్లాడు దధిముఖుడు. అక్కడున్న రామలక్ష్మణ సుగ్రీవులను చూసి, ఏడ్చుకుంటూ అల్లుడైన సుగ్రీవుడికి నమస్కరిస్తాడు.

1 comment: