Saturday, February 2, 2019

శ్రీరాముడితో తను పడ్డ కష్టాలు రావణుడికి చెప్పిన మారీచుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-46: వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడితో తను పడ్డ కష్టాలు రావణుడికి చెప్పిన మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-46
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (03-02-2019) 
         శ్రీరాముడి బలపరాక్రమాలను వివరంగా, విడమర్చి చెప్పిన మారీచుడు, అంతటితో ఆగకుండా, శ్రీరాముడితో తాను పడ్డ పాట్లు చెప్పాడు రావణుడితో ఈ విధంగా.

“దశగ్రీవా! విను. నేను వెయ్యేనుగుల విస్తారమైన బలంతో, పర్వతంలాంటి ఎత్తైన ఆకారంతో, మంచి దేహకాంతితో, అపరంజి బంగారు కుండలాలతో, గదచేతబట్టుకుంటే నన్ను చూసి భూతాలన్నీ భయంతో వ్యాకులపడేవి. అప్పుడు నేను మునుల మాంసం తింటూ భూప్రదేశమంతా తిరుగుతుంటే విశ్వామిత్రుడు భయపడి దశరథ మహారాజు దగ్గరకు పోయాడు. మారీచుడివల్ల తనకు భయం వుందనీ, తన యజ్ఞాన్ని కాపాడడం కోసం రామభద్రుడిని తన వెంట పంపమనీ అడిగాడు. రాముడు పసిబాలుడనీ, పన్నెండేళ్ల వాడనీ, అస్త్రవిద్యల్లో ఇంకా నేర్పరి కాదనీ, కాబట్టి సైన్యంతో వచ్చి ఆ రాక్షసులను తానే చంపి విశ్వామిత్రుడికి సంతోషం కలిగిస్తాననీ దశరథుడు మునికి చెప్పాడు. దశరథుడి మాటలకు జవాబుగా, ఆ రాక్షసుడిని ఎదిరించగలవాడు రాముడు తప్ప మరెవరూ లేరని, శ్రీరాముడిని తీసుకుపోతాననీ విశ్వామిత్రుడు చెప్పాడు. శ్రీరాముడు పిల్లవాడైనా రాక్షసులను చంపడానికి సమర్ధుడనీ, అధికమైన తేజస్సు కలవాడనీ, రామచంద్రుడిని తన వెంట పంపితే దశరథుడికి మేలు జరుగుతుందనీ అంటాడు ముని. ఇలా చెప్పి రామచంద్రమూర్తిని తన వెంట తీసుకుని సంతోషంగా దండక లోని తన ఆశ్రమానికి పోయి, అక్కడ యజ్ఞం చేయసాగాడు”.

“శ్రీరాముడు అప్పుడు బ్రహ్మచారి. ఒంటి వస్త్రం మొలకు చుట్టుకుని, ఉదయం వేళ తామరకొలనులో స్నానమాడి, విశాలమైన రేకుల్లాంటి కళ్ళతో, పులిగోళ్ళ బంగారుతీగ మెడలో వేలాడుతుంటే, మీసకట్టు కూడా లేకుండా, విల్లు మోగిస్తుంటే, అడవి మొత్తం తన దేహకాంతితో శ్యామారుణంగా, సౌమ్యంగా, ఉదయించే బాల చంద్రుడిలాగా ప్రకాశిస్తూ తిరుగుతున్నప్పుడు విసవిసా నేనక్కడికి వచ్చాను. వస్తున్న నన్ను చూసి, కొంచెమైనా తత్తరపాటు లేక విల్లెక్కిపెట్టి నిలిచి వున్నప్పుడు, పసిబాలుడు...వీడితో ఏంపని అని అలక్ష్య భావంతో, విశ్వామిత్రుడు హోమం చేసే వేది దగ్గరకు పోయాను. రాముడు నన్ను ఒకే ఒక్క తీవ్రమైన బాణంతో నూరామడ దూరంలో వున్న సముద్రంలో పడేట్లు చిమ్మాడు. చంపకుండా నన్ను ప్రాణాలతో వదిలిన కారణాన మూర్ఛపోయి, సముద్రంలో పది ఎంతో సేపతికి స్మృతి వస్తే, గర్వం పోయి, లంకకు పోయాను. పసివాడు, అస్త్ర విద్య తెలియనివాడు, ముగ్దుడైన వాడే నన్నిలా బాధించాడు. సైన్యమంతా ధ్వంసం చేసాడు. ఇప్పుడాయన మంచి వయసులో వున్నాడు. నువ్వు కనుక యుద్ధానికి దండెత్తితే కలగబోయే ఫలితం నేను చెప్పాలా? అనుభవించి నువ్వే తెలసుకుంటావు”.
“ఈ కారణం వల్ల రామచంద్రుడిని నువ్వు యుద్ధంలో ఎదిరించడం తగిన పనికాదని భావించి నీ ప్రయత్నానికి అడ్డు తగులుతున్నాను. రామచంద్రుడితో విరోధిస్తే అది వూరికే పోదు. రాక్షస సమూహానికి నువ్వే గొప్ప విపత్తు కలిగించిన వాడివి అవుతావు. నిజం...రావణా! నా మాట నమ్ము. నీ రాక్షసులకు నువ్వే ముప్పు కలిగించవద్దు. బంగారు హర్మ్యాలు, సుందరమైన రాజగృహాలు కల లంకను సీతాదేవికొరకు పాడైపోయే ఆలోచన చేస్తున్నావు. సత్పురుషుడు తానేపాపం చేయకుండా శుద్ధవర్తనుడై వున్నా, పాపులతో సహవాసం చేస్తే, వారి పాపాలకు తానుకూడా చెడిపోతాడు. ఎలా అంటావా? పాములున్న మడుగులో చేపలు ఎవరికీ ఏ ఆపదా కలిగించకుండా ఉన్నప్పటికీ, వాటితో వున్నా కారణాన, వాటిని చంపడానికి వచ్చిన వాళ్ల చేతిలోనో, లేక, గరుత్మంతుడి చేతిలోనో అవీ చస్తాయి. ఆ విధంగా నువ్వు పాపం చేసి, నువ్వు చెడడం కాకుండా, హాయిగా నిర్విచారంగా ఎ దోషం లేకుండా సుఖం అనుభవించే వారిని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు”.

“యుద్ధ ముఖంలో రామచంద్రుడి చేతిలో చావగా మిగిలిన రాక్షసులు తమ భార్యలను తమ వెంట తీసుకునో, లేక, వదిలిపెట్టో, దిక్కుల వెంట రక్షించేవాడు లేక పరుగెడుతుంటే లంకలోని ఇళ్లన్నీ బాణ సమూహాలనే అగ్ని జ్వాలలలో కాలి బూడిదైపోవడం నువ్వే కళ్లారా చూస్తావు. ఇతరుల భార్యలను మోహించడం కంటే గొప్ప పాపం వేరేదైనా వుందా? నువ్వు భార్య లేనివాడివి కాదు. పదివేల మంది వయసులో వున్న వారు నీకు భార్యలుగా వున్నారు. వాళ్లతో నీ ఇష్టం వచ్చినట్లు సుఖపడవచ్చుకదా? ఆపదతో కూడిన సీతా సాంగత్యం ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వే ఆలోచించు. ఈ పని వల్ల నువ్వు ఉభయ లోకాల్లో చెడిపోతావు. నీ భార్యలతో నువ్వు యధేచ్చగా అనుభవించు. నీ వంశాన్ని రక్షించుకో. అందగత్తెలైన నీ భార్యలతో, ప్రేమించే స్నేహితులతో ఇంకా దీర్ఘకాలం సుఖపడాలనే కోరిక వుంటే, రామచంద్రుడికి కీడు తలపెట్టవద్దు. స్పష్టంగా చెప్తున్నా. ఇది రహస్యం కాదు. రావణా! సీతాదేవిని నువ్వు అపహరించవద్దు. నేను ఈ మాట నీ మీద ప్రేమతో, నీ క్షేమం కోరి, చెప్తున్నాను. నా ఆమాట వినకుండా బలాత్కారంగా సీతను అపహరించావా....బంధువులతో, స్నేహితులతో, యుద్ధంలో రాముడి చేతిలో చస్తావు”.

No comments:

Post a Comment