Saturday, February 16, 2019

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో నూతనాధ్యాయానికి నాంది పలకాలి : వనం జ్వాలా నరసింహారావు


కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో నూతనాధ్యాయానికి నాంది పలకాలి
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (16-02-2019)
కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఒక నూతనాధ్యాయానికి నాందిపలకడం అవశ్యం జరగాలి. యావత్భారతదేశం ఆధ్యతన భవిష్యత్ లో సుదీర్ఘంగా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, ఒక నిర్ణయానికి రావాల్సిన అంశమిది అనాలి. కేంద్రప్రభుత్వం సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోకుండా, రాష్ట్రాలకు వికేంద్రీకరించి, సుపరిపాలనకు మార్గం సుగమం చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది.

    ఈ నేపథ్యంలో ఒక విషయం మననం చేసుకోవడం అవసరమేమో! నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో, 2012 గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్న విషయంగా పరిగణించాలి. "భారత సమాఖ్య నిర్మాణంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి" ఆందోళన కలిగిస్తున్నదని ఆనాడాయన అన్నట్లు వార్తలొచ్చాయి.  "రాష్ట్రాలకు న్యాయబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వాటికి దక్కేట్లు చేయడం వల్ల కేంద్రం బలహీనపడిపోదు. రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ-సహకారాలను అందించాలే కాని, కేంద్రానికి అణగి-మణగి వుండాల్సిన అవసరం లేదు. సహకార సమాఖ్య పద్ధతి వుండాలే కాని, బలాత్కార సమాఖ్య పద్ధతి వుండరాదు" అనే భావనని మోడీ ఆనాడు స్పష్టంగా వ్యక్త పరిచారు.

    బహుశా అంతకన్నా ఇనుమడించిన గుండె ధైర్యంతో, సాహసంతో, ఉత్సాహంతో, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ముస్లిం మైనారిటీలకు బిసి ఇ కేటగిరీ కింద, అదే విధంగా షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన పద్ధతి. ఆనాటి సీఎం వ్యాఖ్యలు కుండ బద్దలు కొట్టినట్లుగా తేట తెల్లంగా వున్నాయనాలి. ‘‘నేను కేంద్రాన్ని అర్థించడం లేదు. పోరాటం చేయబోతున్నాను. నీతి అయోగ్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావిస్తాను. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను" అని ముఖ్యమంత్రి స్పష్టంగా, అరమరికలు లేకుండా చెప్పడం గమనించాల్సిన విషయం.

శాసనసభలో వివిధ సందర్భాలలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్, "రిజర్వేషన్ల లాంటి కొన్ని కొన్ని విధాన పరమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి, రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన, తదితర ప్రాధాన్యతాంశాల క్షేత్రస్థాయి వాస్థవాల ఆధారంగా, నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకే వుండాలి. వాటిని రాష్ట్రాలకే కేంద్రం వదిలేయాలి. పరిణితి చెందిన, సచేతనమైన మన దేశంలాంటి ప్రజాస్వామ్యంలో, రాష్ట్రాల అవసరాలకనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన సౌలభ్యం కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి స్థితిగతులు, పరిస్థితులు నేడు లేవు. 70 సంవత్సరాలకు పూర్వం మనం మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఇప్పుడు జనాభా పెరిగింది-పెరుగుతున్నది. ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున పెరిగింది. అందుకు తగ్గ అవకాశాలు కల్పించాల్సిన  సమయం ఆసన్నమయింది. ప్రజలు తమతమ అవసరాలకు అనునుగుణంగా కొత్త కోరికలు కోరటం జరుగుతున్నది. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగి పోవడానికి, పరుగులు తీయడానికి, ముందంజ వేయడానికి, రిజర్వేషన్ల అంశాన్ని ఆయా రాష్ట్రాల నిర్ణయానికి వదిలిపెట్టేయాల్సిన తరుణం ఆసన్నమయింది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి, వివక్షకు, వ్యతిరేకంగా మేం పోరాటం చేసినప్పుడు మాకు లభించిన, అందించిన సహకారం, కలిసి వచ్చిన నేపథ్యం ఇప్పుడు కూడా కావాలి. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం...మన నైజం..అదే మనకు ప్రాతిపదిక. లేని పక్షంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగి ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది" అన్నారు.

కాబట్టే ఇలాంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు, సౌలభ్యం, అధికారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  వుండాల్సిందే అని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, ఆలోచనలను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్రంలో పార్టీలు మారవచ్చునేమో కానీ పఠిష్టమైన కేంద్ర వ్యవస్థ కొనసాగుతూనే వుంటుందని, అదో నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. 


ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావద్భారత దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు, జాతీయ స్థాయిలో  విస్తృత స్థాయి చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. ఆశించిన విధంగా, అనుకున్నవిధంగా, అభాగ్యులను ఆదుకోవాలనే ఆశయ సాధన వున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అలా చేస్తే అవాంతరాలు ఉండవన్నది ముఖ్యమంత్రి బలమైన నమ్మకం.  సమాజంలోని వెనుకబడిన వర్గాలను ప్రగతిపధాన నడిపించడానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నిర్విఘ్నంగా ముందుకు సాగగలదు ఆయన నమ్మకం.

మూడేళ్ళ క్రితం చైనాలో జరిగిన ప్రపంచ ఆర్ధిక సమావేశంలో మాట్లాడిన సీఎం భారత సమాఖ్య వ్యవస్థను గట్టిగా సమర్థించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నందున దాన్ని గుర్తించిన కేంద్రం రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు, అధికారాలు ఇవ్వనున్నట్లు ఆ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ప్రణాలికా సంఘం స్థానంలో నీతీ ఆయోగ్ ఏర్పాటైందనీ, అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సభ్యులనీ, ప్రధానమంత్రి దాని అధ్యక్షుడనీ, దాన్నే “టీం ఇండియా” గా పిలుస్తారనీ సీఎం చెప్పారు. ఇలా ఏర్పాటైన నీతీ ఆయోగ్ దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన ప్రణాలికా రచన చేస్తుంది. దీనర్థం సమాఖ్య స్ఫూర్తితో పనిచేసే భారత దేశంలో రాష్ట్రాలకు గణనీయమైన పాత్ర వుందని.    

రాష్ట్ర శాసనసభ సమావేశాలలో కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు సీఎం. రాష్ట్రాలకు అధికారాల బదిలీ విషయం పునరుద్ఘాటిస్తూ, 70 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం, కేంద్ర-రాష్ట్రాల అదికారాలను  కూలంకషంగా సమీక్షించి, దేశాన్ని సమీకృతంగా ముందుకు తీసుకుపోవడానికి చాలా విషయాలలో అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలని అన్నారు. అధికారాలు కేంద్రీకృతం కాకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాల సోషల్ కాంపోజిషన్ మారుతున్నదనీ, స్వతంత్రం వచ్చినప్పుడున్న పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ తేడా వున్నదనీ, ప్రజల ఆశలు, డిమాండ్లు పెరుగుతున్నాయనీ, తదనుగుణంగా అధికార వికేంద్రీకరణ జరగాలని నొక్కిచెప్పారు.

భారతదేశంలో సహకార సమాఖ్య ఆవిర్భావం, పరిణామక్రమం, క్రమేణా పరిస్థితులు మారిపోయి ఆకారణలో తిరోగమనానికి దారితీయడం, ఏక కేంద్రక ప్రభుత్వం దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలమీద విశ్లేషణ జరగడం అవసరమేమో! అవసరాల అనుగుణంగా, నెలకొన్న పరిస్థితుల ఆధారంగా, సమాఖ్య పద్దతిగానైనా, ఏక కేంద్రక పద్దతిగా నైనా, పనిచేసే విధంగా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి భారతరాజ్యాంగం వీలుకలిగించింది. కాలక్రమేణా, భిన్నమైన రాజకీయ పోకడల కారణంగా, ఉదాత్తమైన సహకార సమాఖ్య దిశగా కాకుండా, పటిష్టమైన ఏక కేంద్ర పోకడల దిశగా కేంద్ర ప్రభుత్వం పయనించడం గమనార్హం. నీతీఆయోగ్ ఏర్పడినప్పటికీ, ఈ విషయంలో పెద్దగా మార్పు కనపడిన దాఖలాలు అంతగా లేవు. రాష్ట్రాలను ఆదుకునే విషయంలో కానీ, ఉదారంగా నిధులు విడుదల చేసే విషయంలో కానీ, అధికారాలను వికేంద్రీకరించే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నట్లు కనిపించడం లేదు.

ఉదాహరణకు, నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్నే తీసుకుందాం. దీనికి అనుకున్న ప్రోత్సాహం కేంద్రం నుంచి రావడం లేదు. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న రెండు పడక గదుల పథకానికి ఉదారంగా రావాల్సిన నిధుల జాడ లేదు. మంచినీటి పథకానికి తెలంగాణ విరివిగా ఖర్చు చేస్తున్నది...సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపున్నది...అనేక సంక్షేమ కార్యక్రమాలను, దేశంలో ఎక్కడా అమలుకాని విధంగా తెలంగాణాలో అమలవుతున్నాయి. వీటన్నిటికీ అందాల్సిన మోతాదులో, అందునా సహకార సమాఖ్య అని చెప్పుకుంటున్న నేపధ్యంలో,  కేంద్ర సహాయం అందడం లేదనేది అక్షర సత్యం.

సహకార సమాఖ్యకు చారిత్రాత్మక నేపధ్యం వుంది. రాచరిక వ్యవస్థ వేళ్లూనుకున్న రోజుల్లోనే సమాఖ్య స్ఫూర్తితో, స్థానిక స్వపరిపాలనలో రాజులు-చక్రవర్తుల జోక్యం చేసుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాల్లో నాటి ఆంగ్లేయ ప్రభుత్వం క్రమబద్ధీకరణ-నియంత్రణ విధానాన్నే పాటించింది కాని నిరంతరం జోక్యం చేసుకోలేదు. భారత ప్రభుత్వ 1919 చట్టం కూడా “డైఆర్ఖీ” పేరుతో సమాఖ్య భారత దేశాన్ని పేర్కొన్నది. రాష్ట్రాలతో “సహకారం, సంప్రదింపులు” అనే సిద్ధాంతాన్నే జవహర్లాల్ నెహ్రూ చెపుతుండేవారు. సంస్తానాలన్నీ భారత యూనియన్ లో అంతర్భాగం కావడం సహకార సమాఖ్య స్ఫూర్తితోనే!

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు రెండు దశాబ్దాలు ఏకచ్చత్రాదిపత్యంగా, అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోను, భారత జాతీయ కాంగ్రెస్ పాలన వుండేది. దరిమిలా కాంగ్రెసేతర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో ఏర్పడడంతో సమాఖ్య వైపు కొంత మళ్లడం జరిగింది. మరికొంత కాలానికి కాంగ్రెసేతర ప్రభుత్వాలే కాకుండా, అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ, సంయుక్త-సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడంతో మరికొంత మార్పు సమాఖ్య దిశగా కనిపించినా, అదే స్ఫూర్తితో, అది ఎంతో కాలం కొనసాగలేదు. రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వ జాబితా అంశాలు, ఉమ్మడి జాబితాలోని అంశాలు, ఇంకా ఇప్పటికీ భారత రాజ్యపాలన విధానాన్ని శాసిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ జాబితా అంశాలు వెనుకంజలోనే వున్నాయి. ఈ పధ్ధతి మారకపోతే, సరిదిద్దుడు చర్యలు చేపట్టకపోతే, సహకార సమాఖ్య కాస్తా ప్రతిఘటన వ్యవస్థగా రూపాంతరం చెంది, రాష్ట్రాలు మరిన్ని వికేంద్రీకరనాధికారాలు కావాలని దిమాడు చేయడం తప్పదు.

రాజ్యాంగంలో మూడు రకాల ప్రభుత్వ జాబితాలున్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా. వాస్తవానికి అవశేష అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే వుంటాయి. కేంద్ర ప్రభుత్వ జాబితాలో వున్న 100 అంశాలు రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ లో వుంటాయి. వీటికి సంబంధించి చట్టం చేసే అధికారం సంపూర్ణంగా పార్లమెంటుది మాత్రమే. వీటిలో మిగతావాటితో పాటు, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు లాంటి వాటితో పాటు రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో చేర్చని అన్ని అంశాలు వుంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో 61 అంశాలున్నాయి. అయినప్పటికీ వీటికి సంబంధించిన ఎలాంటి చట్టం రాష్ట్ర చట్ట సభల్లో చేయాలన్నా, వాటి చట్టబద్ధత మాత్రం పార్లమెంట్ సర్వసత్తాక అధికారానికి లోబడే వుంటుంది ఒక విధంగా. కాకపోతే, ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే దానికి చట్టబద్ధత వుంటుంది. రాష్ట్ర జాబితాలో పోలీసు, జైళ్ళు, స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్యం, విద్యుత్ లాంటివి వున్నాయి. అదే విధంగా ఉమ్మడి జాబితాలో 52 అంశాలున్నాయి. 

భారత రాజ్యాంగంలో ఎక్కడాకూడా “సమాఖ్య” అన్న పదం లేదు. కాకపోతే, సమాఖ్యకు వుండాల్సిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; అధికారాల పంపకం; వ్రాతపూర్వక రాజ్యాంగం; రాజ్యాంగానికుండాల్సిన సంపూర్ణ ఆధిపత్యం; దృఢమైన రాజ్యాంగం; స్వతంత్ర న్యాయవ్యవస్థలు; ఉభయ సభల శాసన నిర్మాణ వ్యవస్థ. ఇన్ని ఉన్నప్పటికీ, సమాఖ్య తరహా, ఏక కేంద్రక స్ఫూర్తి వున్న భారత దేశాన్ని “రాష్ట్రాల సంయోగ వ్యవస్థ” (Union of States) అనే సంబోధిస్తారు.

కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు కావాల్సిన అనేక పథకాల నిధుల ఉపయోగం విషయంలో పూర్తి అధికారం రాష్ట్రాలకే బదలాయిస్తే సమాఖ్య స్ఫూరికి అర్థం వుంటుంది. అలా చేస్తే ఆ పథకాల అమలు శాస్త్రీయంగా, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా జరిగే వీలుంది. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అసలు-సిసలైన సహకార సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తేనే రాష్ట్రాల భివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుంది.

No comments:

Post a Comment