Saturday, February 23, 2019

అడుగడుగున గుడి వుంది (అలనాటి ఖమ్మం తాలూకాలోని ఆధ్యాత్మిక, యాత్రా స్థలాలు) : వనం జ్వాలా నరసింహారావు


అడుగడుగున గుడి వుంది
(అలనాటి ఖమ్మం తాలూకాలోని ఆధ్యాత్మిక, యాత్రా స్థలాలు)  
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-02-2019)
ప్రపంచ ప్రక్యాత వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన జన్మించి చాలాకాలం నివసించిన ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి గ్రామానికి ఫిబ్రవరి, 8, 2019 న వెళ్లాను. ఆ సందర్భంగా ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు, ఆయన ద్వారా నాకు, ఎప్పుడో 1961లో అప్పటి ప్రభుత్వం ముద్రించిన (ఎ చంద్రశేఖర్ ఐఏఎస్ ద్వారా) నాటి ఖమ్మం జిల్లా జనాభా గణనకు సంబంధించిన పుస్తకం జీరాక్స్ కాపీని నాకిచ్చారు. పలు ఆసక్తికరమైన అనేక అంశాలతో పాటు ఆ పుస్తకంలో అలనాటి ఖమ్మం తాలూకాలోని ఉత్సవాలు, పండుగలు, జాతరలు నిర్వహించుకునే గ్రామాల వివరాలు, ఎక్కడెక్కడ ఏఏ దేవాలయాలున్నాయో ఆ వివరాలు కూడా వున్నాయి. ఒకప్పటి ఖమ్మం తాలూకా, నేటి ముదిగొండ మండలంలో నేను పుట్టి పెరిగిన వనంవారి కృష్ణాపురం గ్రామం వుండడాన, ఆసక్తికరంగా ఆ పుస్తకాన్ని చదివాను. ఇప్పటి తరానికి చాలామందికి తెలియని అ ఆవిషయాల సమాహారమే ఈ వ్యాసం.  

ఖమ్మంకి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది విచారిస్తే పట్టణ మధ్యలో ఉన్న నరసింహ స్వామి పేరు మీద స్థంబాద్రిగా వెలసిందిస్తంభాన్ని ఉర్దూలో ఖంబా అంటారుకనుక అందుకనే ఖంబానికి స్థంబాద్రి అనే పేరుతో మనం వ్యవహరిస్తాంప్రముఖ కవికవిత్వం ద్వారా నిప్పులు కురిపించిన దాశరధిఖమ్మం "తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం" అన్నాడు. రంగారెడ్డి, లఖ్నారెడ్డి, వేమారెడ్డి అనే ముగ్గురు సోదరులు ఓరుగల్లు నుండి అపారమైన గుప్తనిధిని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఖమ్మం ఖిల్లాను, లఖ్నవరం చెరువును నిర్మించారని అంటారు. పౌరాణిక గాధల ఆధారంగా, ఏ గుట్టమీద కోట ఉన్నదో దాన్ని, కృతయుగంలో సాలగ్రామాద్రి అని, త్రేతాయుగంలో నరహరిగిరి అని, ద్వాపరయుగంలో స్థంబశిఖరి అని, కలియుగంలో స్తంబాద్రి అని పిలిచేవారట. అందుకే ఖమ్మానికి ఆ పేరొచ్చింది. ఖమ్మం పట్టణాన్ని ఆనుకుని మునేరు ఉపనది ప్రవహిస్తుంటుంది. స్తంబాద్రి మీద తపస్సు చేసిన మౌద్గల్య మహాముని పేరుమీదుగా ఉపనడికి ఆ పేరు వచ్చిందని అంటారు.

          ఒకనాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా వున్న ఖమ్మం, అక్టోబర్ 1, 1953 న కొత్త జిల్లాగా ఏర్పాటైంది. తిరిగి ఇటీవల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాను రెండుగా విడదీసి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంగా రెండి జిల్లాలను చేసింది ప్రభుత్వం. అప్పటి ఖమ్మం తాలూకా రెండు-మూడు మండలాలుగా మారి ఇప్పటికీ ఖమ్మం జిల్లాలోనే వుండిపోయాయి.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికిరాజకీయ చైతన్యానికి-ప్రగతికివిద్యా వ్యాప్తికివ్యాపార-వాణిజ్య-వ్యవసాయ రంగాలకువైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో! ఖమ్మానికి అద్వితీయమైన ప్రాచీన చరిత్ర కూడా వుంది. కొన్నాళ్లు కాకతీయుల వశంలోఆ తరువాత గోల్కొండ సుల్తానుల పాలనలోఆ క్రమంలో ఆసఫ్ జాహీలనిజాంల అధీనంలో వుండేది.

         భారతదేశంలో అనాదిగా పాటిస్తూవస్తున్న అనేక వేడుకల, పండుగల, ఉత్సవాల, సంస్కృతుల, కళల, హస్తకళల, తదితర సంబంధిత గ్రామీణ నైపున్యతా పనితనాల ప్రాముఖ్యత బ్రిటీష్ వారి పాలనాకాలంలో ఒకరకమైన నిరాదరణకు గురైందనాలి. వారనుసరిమ్చిన శిక్షాత్మక ఎగుమతి విధానం, యాంత్రిక వస్తువుల దిగుమతి విధానం కూడా వేడుకల, పండుగల, ఉత్సవాల మీద తీవ్రమైన ప్రభావం చూపాయి. ఒకప్పుడు గ్రామీణ వ్యాపార-వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించిన ఇవి కాలక్రమేనా అంతరించి పోయాయనాలి. ఈ నేపధ్యంలో అలనాటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్న జాతరలు, పండుగలు, ఉత్సవాలమీద ఒక సేవే చేపట్టాలని అప్పటి కేంద్ర రిజిస్త్రార్ జనరల్ అశోక్ మిత్రా సూచించారు. ఆ సర్వ్ ఆధారంగా ప్రతి గ్రామం, నగరం, పట్టణాలలోని ప్రతి జాతర, పండుగ, ఉత్సవం మీద సరైన సమాచార సేకరణకు ఒక ప్రశ్నావళిని రూపొందించారు. సర్వ్ చేసినవారు ప్రాధమికంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు. వాళ్లకు స్థానిక విషయాలమీద అవగాహన వుండడమే దీనికి కారణం.

         ప్రశ్నావళిలో గ్రామం వివరాలు; గ్రామ చారిత్రిక, పౌరాణిక ప్రాముఖ్యత; నివసించే కులాల వివరాలు; వారి జీవనోపాధులు; వారి మతాలు; గ్రామంలో దేవతారాధన, ఉత్సవాలు, పండుగలు, వాటికి సంబంధించిన జాతరలు లేక సంతలు; దేవతలా ఆరాధన ఉత్సవాలు; ఉత్సవం పేరు, సందర్భం, సమయం, జరిగేది ఎంతకాలం?; రకరకాల మొక్కుబడుల వివరాలు; జాతరలు ఏర్పాటు చేసే స్థలాల వివరాలు; ఆ సందర్భంగా పెట్టే అంగళ్ళ వివరాలు; గ్రామంలో వ్యవసాయ పనివాళ్ల పరికరాల వివరాలు; కళల, వృత్తుల, చేనేత వస్తువుల లాంటి వాటి వివరాలు; యాత్రీకుల వివరాలు; తదితర అంశాలున్నాయి. ఈ ప్రశ్నావళి ఆధారంగా ఖమ్మం తాలూకాలో ఇతర వివరాలతో పాటు దేవాలయాల వివరాలు చాలా ఆసక్తిగా, అధ్యయనపరంగా, గత చరిత్ర గుర్తు చేసే విధంగా వున్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక దేవాలయం వుంది. గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, అంకమ్మ, మైసమ్మ గుళ్లు అన్ని గ్రామాల్లో వున్నాయి.


         ఖమ్మం పట్టణంలో స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి గుడి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ స్వామి పేరుమీదే వున్న గుట్ట పైన హనుమంతుడి ఆకారంలో వున్న స్వయంభు రాతి విగ్రహానికి సింహం ఆకారంగల శిరస్సు వుంటుంది. పురాతన కాలంలో ఋషులు స్వామిని అక్కడ ప్రతిష్టించారని నమ్మకం. కిందభాగంలో ఒకటి, పైభాగంలో మరొకటి, రెండు కోనేర్లున్నాయిక్కడ. నరసింహస్వామి ఉగ్రరూపంలో వున్నప్పుడు గట్టిగా గుట్ట మీద ఒక పాదం మోపగా ఏర్పడిందే ఈ కోనేరని ఒక నమ్మకం. వాస్తవానికి మరో పాదం గుర్తు దగ్గరలోనే కనిపిస్తుంది కూడా. గుట్టమీద వున్న స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి దేవాలయంతో పాటు, ఖమ్మం పట్టణంలో, వేంకటేశ్వరస్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి, ముత్యాలమ్మ గుడి, శివ, రామ, గుంటి మల్లేశ్వర స్వామి, యాదగిరిస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా వున్నాయి. స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి కల్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఐదు రోజులు జరుగుతుంది. ఆ సందర్భంగా ఒకప్పుడు జాతర కూడా జరిగేది. హరికథలు, ఆధ్యాత్మిక కచేరీలు, నాటకాలు, నిర్వహించేవారు. మిగతా దేవాలయాలకు సంబంధించి కూడా ఉత్సవాలు జరుగుతాయి.

         ఇక చుట్టుపక్కల తాలూకాలోని గ్రామాల విషయానికొస్తే.....కాకరవాయి గ్రామంలో గోపాలస్వామి, గ్రామ దేవతలైన కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ గుళ్లు వున్నాయి. కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ జాతరలు గ్రామంలో శ్రావణ మాసంలో రెండు రోజులపాటు నిర్వహిస్తారు. విరివిగా కొబ్బరికాయలు కొట్టుతారు. జంతు, పక్షి బలి ఇస్తారు. మేడిదేపల్లి గ్రామంలో ఒక దేశ్ముఖ్ గారి మామిడి తోటలో మూడు అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేస్తారు. సగం విగ్రహం భూమిలో పాతిపెట్టబడి వుంటుంది. విగ్రహానికి దేవాలయం అంటూ ఏదీ లేదు. ఏటేటా ఒకరోజు హనుమాన్ ఆరాధన కార్తీక శుద్ధపూర్ణిమ నాడు జరుపుతారు. అదేవిధంగా గ్రామదేవతలైన గడి మైసమ్మ, ముత్యాలమ్మ, బొడ్డురాయి కూడా వున్నాయి గ్రామంలో. గడి మైసమ్మ పూజ శ్రావణ మాసంలో జరిపి జంతువులను, పక్షులను బలి ఇస్తారు. పూజారులకు వారసత్వ హక్కులుంటాయి. బీరవెల్లి గ్రామంలోని  రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం ఆకారంలో విగ్రహం వుంది. భద్రకాళి, వీరభద్ర విగ్రహాలు కూడా వున్నాయి. ఇవికాక పైకప్పు లేని ఆలయంలో హనుమంతుడి విగ్రహం, వేపచెట్టు నీడలో ఒక ముత్యాలమ్మ గుడి, ఒక చర్చ, ఒక చావిడి కూడా వున్నాయి. కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, ఉప్పలమ్మ, మల్లన్న గుళ్లు కూడా వున్నాయి. రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం చైత్ర శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కొబ్బరి, పులిహోర, పండ్లు స్వామికి అర్పిస్తారు. ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ జాతరలు కూడా జరుగుతాయి. బోనాలు సమర్పించుకుంటారు స్థానికులు. జంతుబలి కూడా వుంటుంది.

         పాతర్లపాడు గ్రామంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం వున్నాయి. స్వామివారి కల్యాణం వైశాఖ సుద్ధ పూర్ణిమనాడు జరుగుతుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ, బొద్దురాయిలను కూడా ఆరాధిస్తారు. జుజ్జాల్రావుపేటలో శివలింగ ఆకారంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం, ముత్యాలమ్మ గుడి, పీర్ల చావిడి వున్నాయి. మాఘబహుల ద్వాదశి నుండి నాలుగు రోజులపాటు కాశీవిశ్వేశ్వరస్వామి కల్యాణం జరుగుతుంది. శ్రావణ-కార్తీక మాసాలలో ముత్యాలమ్మ పూజలు నిర్వహిస్తారు గ్రామస్థులు. పెరికసింగారంలోని వేణుగోపాలస్వామి ఉత్సవాలు పదిరోజులపాటు జరుగుతాయి. ఒకనాటి రామాలయంతో పాటు దరిమిలా రూపుదిద్దుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయాలు జీళ్ళచెరువు గ్రామంలో వున్నాయి. సీతారాముల కల్యాణం చైత్ర సుద్ధ నవమినాడు జరుగుతుంది. గుట్టమీది వెంకటేశ్వర స్వామి దేవాలాయానికి పలువురు యాత్రీకులు వస్తుంటారు. తిరుమలాయపాలెంలో శివకల్యాణాన్ని ఎనిమిది రోజులపాటు జరుపుకుంటారు. ఎదుళ్ళచెర్వు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం, ముత్యాలమ్మ, మారెమ్మ విగ్రహాలు మాత్రమే వున్నాయి. ముత్యాలమ్మ, మారెమ్మ జాతరలు ఒకరోజుపాటు జరుగుతాయి. కార్తీక శుద్ధ పూర్ణిమనాడు ఆంజనేయస్వామికి అభిషేకం జరుగుతుంది.

          తెల్ల శివలింగం, మానవ ఆకారంలో పార్వతి విగ్రహం వున్న రామలింగేశ్వరస్వామి దేవాలయం, అదే కాంపౌండులో రాతి హనుమాన్ విగ్రహంతో ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ, మారెమ్మ గుళ్లు వెంకటాయపాలెం గ్రామంలో వున్నాయి. పదకొండు రోజులపాటు జరిగే రామలింగేశ్వరస్వామి కల్యాణం కార్తీక శుద్ధపూర్ణిమ నాడు మొదలవుతుంది. ముత్యాలమ్మ, మారెమ్మ జాతరలు కూడా జరుగుతాయి గ్రామంలో. ముత్తగూడెంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి ఆరాధన కార్తీక శుద్ధపూర్ణిమ, చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది. ముత్యాలమ్మ కొలుపు శ్రావణ మాసంలో జరుగుతుంది. గొల్లపాడు గ్రామంలో కేవలం ముత్యాలమ్మ దేవతను ఆరాధిస్తారు గ్రామస్థులు. మూడు రోజులపాటు శ్రావణ మాసంలో ముత్యాలమ్మ జాతర నిర్వహిస్తారు. అదే నెలలో ఒక శుక్రవారం నాడు గ్రామస్థులు వనభోజనాలకు వెళ్తారు. తీర్థాల గ్రామంలో సంగమేశ్వరస్వామి దేవాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నాయి. మాఘబహుల త్రయోదశి నుండి ఫాల్గుణ శుద్ధ విదియ వరకు ఐదురోజులపాటు సంగమేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా ఒక జాతర కూడా వుంటుంది. మంచుకొండ గ్రామంలో ఒక చిన్న ముత్యాలమ్మ గుడి, హనుమంతుడి గుడి, ఒక చర్చ్ వున్నాయి. ముత్యాలమ్మ జాతర శ్రావణమాసంలో జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్ళు తాగడం ప్రత్యేకత. శివారు గ్రామం బూడదంపాడులో కూడా ఇలాగే జరుగుతుంది.

         ఇర్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ గుడి వుంది. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. గుదిలేకపోయినా ఒక పటం పెట్టి శ్రీసీతారామ కల్యాణం చైత్ర శుద్ధ నవమినాది జరుపుకుంటారు గ్రామస్థులు. పప్పు, పానకం స్వామికి సమర్పించి భజన చేస్తారు. గుదిమళ్ళ గ్రామంలో శివాలయం, ఆంజనేయుడి గుడి వున్నాయి. గౌరవంగా భావించే జానపద స్త్రీదేవతైన తిరుపతమ్మ గుడి కూడా వుంది గ్రామంలో. తిరుపతమ్మ తిరునాళ్లు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునేవారు. ఆమెను ఆరాధిస్తే కోరినకోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. రాతి విగ్రహం వున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒక గుట్టమీద వుంది ముదిగొండ గ్రామంలో. ఏడు రోజులపాటు జరుపుకునే స్వామి ఉత్సవాలు ఏటేటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు మొదలై బహుళ విదియ వరకు కొనసాగుతాయి. సమీపంలోని ఎడవల్లి గ్రామంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు రెండున్నాయి. ఒకటి గ్రామంలో, మరొకటి గ్రామానికి మైలు దూరంలోని ఒక గుట్టమీద వున్నాయి. స్వామి కల్యాణోత్సవం గుట్టమీద ఏటేటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు మొదలై 11 రోజులపాటు జరుపుకుంటారు. ముత్యాలమ్మ, కాటమయ్య గుళ్లు కూడా వున్నాయి వూళ్ళో. గోకినేపల్లి గ్రామంలో శివాలయం, హనుమంతుడి గుడి వున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ఒక్కరోజు ఉత్సవంలా జరుపుకుంటారు గ్రామస్థులు. ఒకప్పుడు గోవులపల్లెగా పిలిచే గ్రామమే గోకినేపల్లిగా మారిందంటారు.

         చారిత్రిక ప్రసిద్ధికన్న గుర్రాలగూడెం  (గువ్వలగూడెం) గ్రామం పౌరాణిక కాలం నుండీ వుండేదని అంటారు. ఈ గ్రామం దక్షిణ భాగాన యాదవుల రాజ్యం వుండేదట. హనుమంతుడివి, ఇతర గ్రామ దేవతలవి అనేక విగ్రహాలు ఇక్కడ తవ్వకాల్లో లభించినవి. రైతులు భూమిని తవ్వుతుంటే నాణేలు దొరికాయిక్కడ. పాండవులు అజ్ఞాతవాసం చేసిన విరాటనగర ప్రాంతం ఇదేనని కూడా అంటారు. ఈ గ్రామానికి అనతిదూరంలోనే, నేలకొండపల్లి సమీపంలో, ముజ్జిగూడెం దగ్గర విరాటరాజు దిబ్బ, కీచక గుండం వున్నాయి. (విరాటరాజు దిబ్బ ఇప్పుడు పెద్ద బౌద్ధ ఆరామం). గువ్వలగూడెంలో ఒక ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ గుడి వున్నాయి. హనుమంతుడి గుళ్లో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు దీపోత్సవం జరుపుకుంటారు. ఆంజనేయస్వామి గుడి వున్న మరో గ్రామం చెన్నవరంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. వర్తక-వాణిజ్యానికి గ్రామీణ కేంద్రమైన నేలకొండపల్లి గ్రామాన్ని ఒకప్పుడు “భూగిరి” అని పిలిచేవారు. భద్రాచల రామాలయం నిర్మించి, భక్త రామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్న జన్మించిన గ్రామం ఇది. మహాభారతకాలం నాటి ఆనవాళ్లు గ్రామం సమీపంలో అనేకం వున్నాయి. నేలకొండపల్లిలో శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, భీమేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాలు వున్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రాచీనమైనదని చెప్పుకుంటారు. శివరాత్రి, దసరా, కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు ఈ గ్రామంలో.

         పమ్మి గ్రామంలో చేన్నకేశవస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలతోపాటు నాసర్ మస్తాన్, అచ్చయ్య మఠాలున్నాయి. నాసర్, అచ్చయ్యలు ఇస్లాం, హిందూ మతాన్ని బోధించిన స్థానిక సన్న్యాసులు. అందుకే వారి గౌరవ సూచకంగా మఠాలున్నాయి. చేన్నకేశవస్వామి కల్యాణం మూడురోజులపాటు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నుండి మొదలవుతుంది. జాతర కూడా ఆ సందర్భంగా జరుగుతుంది. కార్తీక బహుళ పంచమి నుండి నాలుగు రోజులపాటు నాసర మస్తాన్, అచ్చయ్యల ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపు కూడా తీస్తారు. అపర భద్రాచలంగా పిలవబడే ముత్తారం గ్రామంలో, వామాంక సీత రూపంలో రామ, లక్ష్మణ, సీత స్వయంభు విగ్రహాలున్నాయి. శ్రీరామనవమి ఐదురోజులపాటు చైత్ర శుద్ధ నవమి నుండి ఘనంగా జరుపుకుంటారు. భద్రాచలంలో మధ్యాహ్నం జరుగుతే ఇక్కడ రాత్రి జరుగుతుంది కల్యాణం. ఇప్పటికీ భద్రాచలం నుండి, అక్కడ కల్యాణం అయిన తరువాత, అక్కడి తలంబ్రాలు ఇక్కడికి తేవడం ఆనవాయితీగా వస్తున్నది.

         లచ్చగూడెంలో రాతి విగ్రహంతో నరసింహస్వామి దేవాలయం, హనుమంతుడి గుడి వున్నాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు, కార్తీక శుద్ధ పూర్ణిమనాడు నరసింహస్వామి ఉత్సవాలు స్థానిక హంగులతో జరుగుతాయి. మరో గ్రామం పాతర్లపాడులో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఒక చర్చ్ వున్నాయి. ఆంజనేయస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఐదురోజులపాటు పుష్య బహుళ ఏకాదశి నుండి జరుపుకుని, భజనలు చేస్తారు. శివకల్యాణం చైత్ర శుద్ధ పూర్ణిమనాడు జరుపుకుంటారు. చింతకాని గ్రామంలో శంఖచక్రాలు ధరించిన విష్ణు విగ్రహం, ఇరుపక్కలా శ్రీదేవి, భూదేవి విగ్రహాలున్న చెన్నకేశవస్వామి ఆలయం వుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుండి బహుళ పంచమి వరకు ఆరు రోజులపాటు స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ. ఇక నాగులవంచ గ్రామం విషయానికొస్తే, అక్కడ రామ, సీత, లక్ష్మణ రాతివిగ్రహాలున్న కోదండరామస్వామి దేవాలయం వుంది. మూడురోజులపాటు, చైత్ర శుద్ధ నవమి నుండి ఏకాదశి వరకు, శ్రీసీతారామ కల్యాణం ఘనంగా జరుపుకుంటారిక్కడ. ఆ సందర్భంగా జాతర కూడా జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో సుమారు ఎనిమిది గజాల వ్యాసంతో ఒక పెద్ద 150 సంవత్సరాలనాటి (అప్పటికి) వేగు చెట్టు వుంది.

         తిమ్మినేనిపాలెం గ్రామంలో మల్లేశ్వరస్వామి (శివ), హనుమంతుడు, ముత్యాలమ్మ, అంకమ్మ గుడులున్నాయి.  గ్రామానికి రెండు మైళ్ల దూరంలో గుట్టమీద పానకాల (గజగిరి) నరసింహస్వామి దేవాలయం కూడా వుంది. మల్లేశ్వరస్వామి గుడి గురించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో వుంది. 400 సంవత్సరాల క్రితం ఒక గ్రామస్తుడు సమీపంలోని మునేరు నదిలో కొట్టుకొచ్చిన ఇటుకలను తన ఇంటి ముంది పేర్చగా అదే శివాలయంగా కాలక్రేమేణా రూపుదిద్దుకుంది. పానకాల నరసింహస్వామి స్వయంభు-వెలిసిన విగ్రహం. ఇక్కడి పానకాల స్వామి నోట్లో భక్తులు ఎంత పానకం పోసినా, సగం మింగి మిగతా సగం బయటకు తీస్తాడు. మల్లేశ్వరస్వామి ఉత్సవాలు (శివరాత్రి) మూడురోజులపాటు మాఘ బహుళ త్రయోదశి నుండి అమావాస్య దాకా జరుగుతాయిక్కడ. సమీపంలోని మునేరులో భక్తులు స్నానాలు చేసి దేవుడిని పూజిస్తారు. అలాగే గజగిరి (పానకాల) నరసింహస్వామి కల్యాణం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుండి ఐదురోజులపాటు జరుగుతుంది. వల్లాపురం కొండపల్లె గ్రామంలో శివకళ్యాణం మాఘ బహుళ చతుర్దశి నాడు జరుగుతుంది. కమలాపురం గ్రామంలో రామలింగేశ్వరస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలున్నాయి. మహాలక్ష్మమ్మ గుడి కూడా వుంది. ఐదురోజులపాటు అంకమ్మ తిరునాళ్లు జరుపుకోవడం నాదిగా వస్తున్న ఆచారం ఇక్కడ. ఆ సందర్భంగా జాతర కూడా జరుగుతుంది.    

No comments:

Post a Comment