Sunday, February 10, 2019

నడుస్తున్న చరిత్రకు మేలుకొలుపు ..... జ్వాలా "ఇదీ సుపరిపాలన" పుస్తకం : మారంరాజు సత్యనారాయణ

నడుస్తున్న చరిత్రకు మేలుకొలుపు 
జ్వాలా "ఇదీ సుపరిపాలన" పుస్తకం 
మారంరాజు సత్యనారాయణ 
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-02-2019) 
నిన్న జరిగిన వాస్తవాలు ఈ రోజు చరిత్ర అవుతుంది. చరిత్ర ఎవరో సృష్టించింది కాదు. మానవ వ్యక్తిత్వ వికాసమే చరిత్ర గమనానికి మూలం. చరిత్రను ఎవ్వరూ సృష్టించరు. మానవ సామాజిక జీవనంలో జరిగిన పరివర్తనలే చరిత్ర.

         తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక సంపాదకుడుగా ఒక ప్రత్యేక సంచిక వేయ సంకల్పించారు. అందులో ఎవరు రాయాలన్న చర్చ వచ్చినప్పుడు, ఆంధ్ర ప్రాంయానికి చెందిన మేధావి ఒకరు, తెలంగాణలో కవులు శూన్యం అన్నారు. దీనికి ప్రతి సవాలుగా, తెలంగాణలోని  కవులందర్నీ మేల్కోల్పి "గోలకొండ కవుల సంచిక" గా ప్రచురించారు. ఇది చరిత్రలో ఒక భాగం. వర్తమాన, నడుస్తున్న, చరిత్రను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు వ్యాసాలు రాసి ప్రజలను మేల్కొలిపేవారు మన దేశంలో అంతగా లేరు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ నాయకుడు కూడా స్వీయ జీవిత చరిత్ర రాయలేదు. 

జ్వాలా ఒక జ్వాలే. నిరంతరం జ్వలించటం జ్వాలాకు గల ఒక ప్రత్యేక లక్షణం.  ఒకరు రాయమంటే రాసేవాడు కాదు. నడుస్తున్న చరిత్రను పరిశీలించి, పరిశోధించి, విశ్లేషణాత్మకంగా ప్రజల ముందుంచడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. 

మన ముందు ఉన్న ఈ పుస్తకం ఒక విధంగా నూతన ఒరవడిని సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వారానికి ప్రారంభమైన జ్వాలా వ్యాసాలు నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు వివిధ విషయాలపై కొనసాగాయి. ఆ వ్యాసాల సంపుటమే ఈ పుస్తకం. ఇందులో చాలా వ్యాసాలు వున్నాయి. వీటిలో రెండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారివి. ఒకటి-రెండు సేకరించినవి. కాగా, మిగిలినవన్నీ జ్వాలా వివిధ సందర్భాలలో, వివిధ దిన పత్రికలలో ప్రచురించిన వ్యాస సంకలనం. ఇవన్నీ ఇదివరకే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరాయి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి. మిగతావి  రాజకీయ నేపధ్యంలో, పరిపాలనా విషయ నేపధ్యంలో రాసిన విశ్లేషణాత్మక, విమర్శనాత్మక రచనలు. సమకాలీన రాజకీయ సామాజిక  రంగంలో  రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లకు సమాధానంగా, విమర్శతో పాటూ విశ్లేషణ జోడించి, ఆచరించాల్సిన దృక్పథం గురించి  రాశారు. ఇవన్నీ ఒక విధంగా భవిష్యత్తులో చరిత్ర అవగాహన చేసుకోవటానికి ఉపకరిస్తాయి.  విషయం  ఆధారిత  వ్యాసాలుగా కాక 51 నెలల్లో జ్వాలా స్పందించిన విషయాల దొంతర ఇది. అందువల్ల  పుస్తకం చదవటం మొదలెడ్తే, నడుస్తున్న చరిత్రను మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా వుంటుంది. ఇది ఒక నూతన  ఒరవడి. చరిత్రను విశ్లేషించే వారున్నారు. చరిత్రను గ్రంథస్థం  చేసే వారున్నారు.  జ్వాలా ఎంచుకున్న మార్గం విమర్శ, విశ్లేషణ, వివరణ, విషయ పరిశీలనకు అతి దగ్గరగా ఉంది.  


         వ్యాసాల రచనలో ఎక్కడా స్కోత్కర్ష ప్రసక్తి లేదు. స్తుతి శూన్యం. మనం చూస్తున్న విషయాలను యధాతథంగా తన శైలిలో  పొందు పరిచారు.  ఇందుకు అభినందనీయుడే. 

ఆ పుస్తకంలో ఏం ఉంది... అని చులకన భావం వ్యక్తీకరించే వారికి, సమాధానంగా సుమారు నాలుగున్నన్నరేళ్ల రాజకీయ, సామాజిక పరిస్తితులను నిష్కర్షగా మన ముందు ఉంచారు జ్వాలా. చాలా మందితో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధ పడేవారే గాని, ఆ సారాంశాన్ని గ్రంథస్థం చేయ సాహసించరు. కూత గాళ్లే గాని రాత గాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇది కించ పరచడం కాదు. వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ప్రతివారు  తన భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడే గాని ప్రజల ముందు చరిత్ర కారునిగా నిలుచునే ధైర్యం తక్కువ మందికి వుంది.   

ఈ వ్యాస సంకలనం చదువుతుంటే మనమే రాశామా? అన్న సందేహం రాకపోదు. ఎంచుకున్న శైలి మామూలు మాటల్లో పత్రికలు చదివే అలవాటు ఉన్న ప్రతివాడికి తానే రాశానేమో అన్న భ్రమ కలుగుతుంది.  

విషయాలను వర్గీకరించి రాయలేదు. కేవలం కాలక్రమంలో ప్రాధాన్యత పొందిన విషయాలను మాత్రమే విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఏదో ఒక పత్రికలో ప్రచురించినవి కావు. వ్యాసాలు  దాదాపు  రాజధాని నుండి వెలువడుతున్న దినపత్రికలన్నింటిలోనూ ప్రచురితమైనాయి.  పత్రికలు చదివే అలవాటు వున్న వారందరికీ ఈ వ్యాసాలు సుపరిచతమే. 

వివిధ అంశాలపైన జ్వాలా స్పందన నిర్వివాదాంశం. ఎందుకంటే ఏనాటి విషయానికి ఆనాడే స్పందించటం పత్రికల ద్వారా ప్రజలముందుకు వెళ్లటం చాలా సాహోసోపేతమైన విషయం. రెండున్నర సంవత్సరాల రాజకీయ సామాజిక రంగాలను మనకు త్రీడి పిక్చరుగా చూపించారు. విషయ వివరణ ప్రతి వాడిని అలవోకగా  ఆకర్షింప చేసి చూపించింది. కొందరనవచ్చు...గత కాలపు విషయాల పునః ప్రస్తావన ఎందుకని? కాని, ఈ వ్యాస సంకలనం చరిత్రకు ఆధారం. ఇందులో రచయిత స్పృశించని విషయం లేదు. పుష్కరాల ప్రస్తావన, యాగాల వివరణ, ఎంతో విజ్ఞానాన్ని సమకూర్చాయి. చదువరి తను ప్రత్యక్షంగా వీక్షీంచానన్న సంతృప్తి కలుగుతుంది. రోజు రోజుకి రాతగాళ్లు తక్కువైన ఈ  రోజుల్లో  విషయ వివరణను గ్రంథస్థం చేయ సంకల్పించటం సాహసోపేతమైన  కార్యక్రమం. ఇందుకు రెండు దశాబ్దాలకు పైగా అధికార యంత్రాంగ  కేంద్రానికి  దగ్గరగా  ఉండి గమనించటం వల్ల, మనకు, మంచి చారిత్రక,  సామాజిక విషయాలను చెప్పగలిగారు.  ఆయన అనుభవం ఈ వ్యాస పరంపరలో మనకు కన్పిస్తుంది. 

ఒక సందర్భంలో న్యాయస్థానాల తీర్పులను మనకు అర్థమయ్యేలాగా వివరించారు. చరిత్ర తెలుసుకోకుండా వ్యాఖ్యలు రాసిన సామాజిక శాస్త్రవేత్త తప్పును చాలా సున్నితంగా ఎత్తి చూపారు.  యాగాల విషయాన్ని మనకు తెలిసేలా చెప్పటం ఒక కొత్త ప్రయోగంగా నేను భావిస్తున్నాను. పార్టీ ఫిరాయింపుల గురించి  విపులంగా వివరణ ప్రత్యేకత. బ్రిటన్ లోని రాజ్య పత్రాలన్నే బ్రిటిష్ రాణిగారి సంతకాలతో అధికారితను సంతరించుకుంటాయి. ఉరిశిక్షకు సంబంధించిన కాగితం పార్లమెంటు అంగీకరించి, బ్రిటిష్ రాణికి ప్రధానమంత్రి  సమర్పిస్తే, ఆమె సంతకం చేయననే సాంప్రదాయం లేదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా ఎందుకు తీర్చిదిద్దాలో చాలా సున్నితంగా వివరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలులో డేరాల నగరంలో కాలక్షేపం చేసి హైదరాబాద్ నగరం తరలివెళ్లే   ప్రయత్నం చేశారు.  అప్పుడే ఒక సంవత్సరం తిరగక మందే గుంటూరులో హైకోర్టు పెట్టుకున్నారు. శాసనసభ సమావేశాలను గుంటూరు, విశాఖ పట్టణాల్లో నిర్వహించారు. ఇప్పుడేమో తాము ఏదో పొగొట్టుకున్నట్లు పదేండ్లు  హైదరాబాద్ నగరం వుండాలని పట్టు పట్టారు.  ఇది మన సహోదరుల వాదనకు ఉదాహరణ. 1952 ఎన్నికల్లో ఓడిపోయినా కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కడ్తామన్నారు. కాని నందికొండ వారికి ఆనక మీద కరకుగా కన్పించింది.  ఆ నందికొండ మీదే వారు ఆశలు పెంచారని తెలంగాణ వారికి ద్రోహం చేయడం  రచయిత పేర్కొనటం మంచి ఉదాహరణ.

ఈ విధంగా నాలుగున్నరేళ్ల చరిత్ర కథనంలో రచయిత మనకు తెలియని విషయాలను సేకరించి గ్రంథస్థం చేశారు. జిల్లా పాలనా వ్యవస్థ అధికారికమైనదే కాని  రాజ్యాంగబద్దమైన విషయం కాదు. అందకు జిల్లాల పునర్విభజన చేపట్టటాన్ని, దాన్ని విమర్శించిన వారిని తిప్పికొట్టగలిగారు. ఇది  చరిత్ర పుటల డైరీ కాదు. చరిత్రే. ఇందులోని విషయాలు తాత్కాలిక సమాచారం కాదు. ముందు తరాల వారికి తెలియజేసేది. ఇది చేపట్టి పుస్తకంలాగా తేవటం జ్వాలా జర్నలిజంలో ఒక ముఖ్య ఘట్టం. అభినందనీయం.

-ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు
98488 79357

1 comment:

  1. నిన్నటి ఉద్యమ జ్వాల మొదలు రేపటి ఉజ్వల భవితవ్యం వరకు సాగిన పరంపర. నిజంగా జ్వాలా ఒక జ్వాలే.

    Thank you sir.

    ReplyDelete