Thursday, February 14, 2019

సమున్నత లక్ష్యాల శిక్షణ : వనం జ్వాలా నరసింహారావు


సమున్నత లక్ష్యాల శిక్షణ
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (15-02-2019)
కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఫిబ్రవరి 15 నుంచి అన్ని జిల్లాల్లో అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం కల్పించిన పలు రకాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేలా ఈ శిక్షణా కార్యక్రమం రూపొందింది. ఈ శిక్షణ ఆవశ్యకతను విశ్లేషించడం మొదలు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంవరకు ఒక పద్ధతి ప్రకారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల కార్యాచరణ అభినందనీయం.

వయోజన విద్యా బోధన సూత్రాల వెలుగులో ఈ మొత్తం కార్యక్రమం రూపొందింది. ఒక్కో సెషన్‌లో ఒక్కో తరహా భాగస్వామ్య శిక్షణా పద్ధతులు ఈ కార్యక్రమంలో కనిపిస్తాయి. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శులకు వారివారి ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమ షెడ్యూలును రూపొందించడంతో విధిగా వారు ఉత్సాహంగా పాల్గొనే తీరులో రూపొందించబడింది. పరస్పర చర్చ, సమిష్టి అధ్యయనం, నిర్దిష్ట కార్యాచరణ, కేస్ స్టడీ, వివరణాత్మక క్విజ్, సామూహిక చర్చ, ప్రసంగాలు, నిర్వహణాపరమైన గేమ్స్, ప్రదర్శనలు.. ఇలా పలు అంశాల్లో వీరిని భాగస్వాములను చేసేలా రూపొందించిన శిక్షణా పద్ధతులు ఈ కార్యక్రమంలో ప్రధానమైనవి. ఒక ప్రత్యేకమైన సహజ పద్ధతిలో శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ భావించింది. జిల్లా శిక్షణా కేంద్రాల్లో గణనీయమైన సంఖ్యలో శిక్షకులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడినందున రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ సుశిక్షితులైన రిసోర్స్ పర్సన్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడంలో రిసోర్స్ పర్సన్ల బాధ్యత కీలకమేకాక చాలా ప్రధానమైనది.

ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో స్వయంగా రిసోర్స్ పర్సన్లు సంభాషించడం, అక్కడ అనేక విషయాలను తెలుసుకోవడం వారికి బాగా ఉపయోగపడింది. శిక్షణ ఇవ్వడం పూర్తయిన తర్వాత కూడా ఈ రిసోర్స్ పర్సన్లు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శులతో కూడిన ఒక చిన్న సమూహానికి మార్గదర్శకులుగా, సహాయకులుగా ఉండడం నిరంతరంగా, ఇకపైన కూడా దీర్ఘకాలం పాటు కొనసాగే ఒక ప్రక్రియగా ఉంటుంది. ప్రభుత్వం నూతన చట్టం ద్వారా ఆశిస్తున్న ఫలితాలను సాధించేంత వరకు ఇది కొనసాగుతుంది.

ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ బ్యూరోక్రాట్ల ద్వారా కూడా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.


ప్రభుత్వం రూపొందించే పథకాలను అమలుచేయడం గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ఉంటుంది. చట్టంలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని తు.చ. తప్పకుండా సంపూర్ణంగా అమలు చేయడం కూడా వీరి బాధ్యత. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆమూలాగ్రం అమలు చేసే బాధ్యతను నెరవేరుస్తారనే ప్రభుత్వం ఆశిస్తోంది. గ్రామ పంచాయతీ నిర్వహణ బాధ్యతలను భుజాలపై వేసుకుని మెరుగైన పాలన అందిస్తారని భావిస్తోంది.చాలా మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తొలిసారి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యత, వారికి అప్పగించిన అధికారం సమర్ధవంతంగా నిర్వహించడంలో వారు అవగాహన పొందాల్సిన అవసరం ఉంది. అందుకోసం వారికి శిక్షణ అనివార్యమవుతోంది. వారి సహజ నైపుణ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వారికి చట్టం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో భాగంగా కొన్ని పద్ధతులను నేర్చుకోవడంతో పాటు వ్యవహారిక శైలిని కూడా అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలోని అంశాలపై, బాధ్యతలపై, విధుల నిర్వహణపై ఎంత అవగాహన పెరిగితే వారిలో ఆత్మవిశ్వాసం, ప్రావీణ్యం అంతగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన పోటీ తత్వం, వ్యవహార శైలిని మార్చుకోవడం ద్వారా వారిలో నిబద్ధత పెరుగుతుంది.

ఒక వ్యక్తి వృత్తి పనితీరుకు ఇది దోహదపడినా పడకపోయినా నేర్చుకోవడం అనేది సహజంగానే జరిగే ఒక ప్రక్రియ. పద్ధతి ప్రకారం శిక్షణ కల్పించడం మౌళికంగా నేర్చుకునే అనుభవానికి వీలు కల్పిస్తుంది. శిక్షణ అనేది శాస్త్రీయ పద్ధతిలో జరిగే ప్రక్రియ. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, త్వరితగతిన, సమర్ధవంతంగా నేర్చుకోడానికి ఇలాంటి శిక్షణలు అవసరం. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోడానికి, జ్ఞానాన్ని ఆర్జించడానికి, వ్యవహార శైలిని తీర్చిదిద్దుకోడానికి, నైపుణ్యాన్ని పెంచుకోడానికి వీలుగా ఈ శిక్షణా కార్యక్రమం రూపొందించబడింది. వివిధ రకాల పనులను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన మౌళిక అంశాలు ఈ శిక్షణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు.

సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ తరహా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనే ఉంది. వారు ఈ శిక్షణలో నేర్చుకున్న అనుభవంతో ఎక్కడైనా, ఏ తరహా పనులనైనా చక్కదిద్దడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఒక నమ్మకంతోనో, నిర్దిష్టంగా ఒక్క విధానానికి మాత్రమే పరిమితం చేసే తీరులో ఈ శిక్షణ ఉండదు. ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం, ప్రజలకు వీలైనంత ఎక్కువగా నాణ్యమైన సేవలందించడం, వనరులను సమర్ధవంతమైన తీరులో వినియోగించడం, తప్పులను చేయడానికి అవకాశం లేకుండా చూసుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించుకోవడం.. ఇలా అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనికి తోడు శిక్షణ పొందుతున్న క్రమంలో ఒక మార్పును కోరుకోవడం, దానికి అనుగుణంగా పనితీరును చక్కదిద్దుకోవడం కూడా గమనించాల్సిన మరో అంశం.

సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నూతన పంచాయతీరాజ్ చట్టం రూపంలో విధులు, బాధ్యతలు అప్పగించబడ్డాయి. అయితే బాధ్యతాయుతమైన స్థానాల్లోకి వచ్చినందున వారిలో మార్పు చోటుచేసుకునే క్రమంలో పనితీరుకు సంబంధించి కొన్ని సమస్యలూ ఉత్పన్నం కావచ్చు. సర్పంచ్‌లుగా వారు పోషించాల్సిన పాత్రకు అనుగుణమైన వ్యవహారిక సామర్థం వారికి ఉండకపోవచ్చు. అయితే ఈ శిక్షణ అనంతరం వారు రోజువారీ విధి నిర్వహణలో భాగంగా ఏ మేరకు సమర్ధవంతమైన పనితీరును ప్రదర్శించగలుగుతారో ఆ మేరకు నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు విజయవంతమైనట్లే. ఇప్పుడు వారికి శిక్షణ కల్పిస్తున్న రిసోర్సు పర్సన్లు ఏ మేరకు విజయవంతమయ్యారనేది లేదా ఆ శిక్షణా కార్యక్రమం ఏ మేరకు ఉపయోగపడిందనేది రానున్న కాలంలో సర్పంచ్‌ల పనితీరు, సాధించిన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

శాస్త్రీయ పద్ధతిలో డిజైన్ చేసిన సిస్టమాటిక్ ట్రెయినింగ్ అప్రోచ్ప్రధానంగా నాలుగు అంశాలపై ఉంటుంది. శిక్షణా అవసరాలను గుర్తించడం, దానికి తగిన ప్రణాళికను రూపొందించడం, అమలుకు అణువైన విధానాలను రూపొందించడం, దాని ఫలితాలను అంచనా వేయడం అనేవి ఈ నాలుగు అంశాలు. పనితీరును ఏ మేరకు మెరుగుపర్చుకున్నారనే అంశాన్ని విశ్లేషించుకోవడం కూడా ఈ మొత్తం శిక్షణా కార్యక్రమంలో ఒక భాగంగా ఉంది. శిక్షణ పొందడం ద్వారా అది పనితీరుపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది, శిక్షణ లేనప్పుడు ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని గుర్తించడానికి కూడా ఈ విశ్లేషణ దోహపడుతుంది. జాబ్ అనాలిసిస్, టాస్క్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. శిక్షణ సక్రమంగా అందలేదనే కారణంగానే పనితీరు సమస్యలు వచ్చాయనే చర్చకు ఆస్కారం ఉండొద్దు. పనితీరు అనేది మూడు అంశాలతో ముడిపడి ఉంటుంది. సరైన అవగాహన లేదా నైపుణ్యం లేనప్పుడు శిక్షణ అనివార్యం కావడం; సంస్థాగతమైన సహకారం లేనప్పుడు ఎంత శిక్షణ పొందినా వారి పనితీరు సమర్ధవంతంగా లేదని తేలిపోవడం; సరైన పనితీరు కనబర్చకపోయినప్పుడు తగిన ప్రోత్సాహం లభించకపోవడం లేదా తక్కువ పనితీరుతో ఉన్నారనే పేరుతో శిక్షించే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు. ఈ మూడు అంశాలను చక్కదిద్దాలంటే పటిష్టమైన శిక్షణ అవసరం.

ఎలాంటి శిక్షణ అవసరమో గుర్తించే క్రమంలోనే శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన జరిగింది. ఏ తరహా శిక్షణ కల్పించాలి, దానికి తగిన రూపాలు ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా ప్రణాళికగా మర్చాలి, ఎలా అమలుచేయాలి తదితరాలన్నీ నిర్దిష్టంగా ఆ ఆలోచనలోంచి పుట్టినవే. శిక్షణా అవసరాల విశ్లేషణ ఎంత సమగ్రంగా ఉంటే అంత నిర్దిష్టంగా, మెరుగ్గా శిక్షణ అందించడం వీలవుతుంది. ఎంత మందికి శిక్షణ కల్పించాలి, ఎంతమందిని కలిపి ఒక గ్రూపుగా విభజించాలి, వారి ప్రాంతం, వెచ్చించాల్సిన సమయం, నిధుల అవసరాలు, రిసోర్సు పర్సన్ల లభ్యత.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షణా కార్యక్రమం రూపొందింది. ఇందుకోసం అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, పుస్తకాలను ముద్రించడం, వివరాలతో కూడిన బుక్‌లెట్‌లను రూపొందించడం, దృశ్యాల ద్వారా వివరించే ఉపకరణాలను సమకూర్చుకోవడం, కేస్ స్టడీకి అవసరమైన సమాచారాన్ని సేకరించడం, వీడియోల సమీకరణ, కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవడం తదితర అంశాలన్నీ ఈ శిక్షణా కార్యక్రమంలో భాగం. ఒక వ్యక్తిని శిక్షణ ద్వారా సమర్ధవంతంగా తీర్చిదిద్దడం అనేది ఒక విలువైన ఫలితమే. ఒకేసారి గణనీయమైన సంఖ్యలో శిక్షణ కల్పించడం ఒక సమర్ధవంతమైన పనిగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడినందున వారిని నిర్దిష్ట సంఖ్యలో గ్రూపులవారీగా విభజించడం అవసరం. పెద్ద మొత్తంలో డబ్బును ఇందుకోసం ఖర్చు చేస్తున్నందువల్ల ఈ శిక్షణ తగిన ప్రయోజనాలను, ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. శిక్షణ సమయంలోనే దీన్ని లోతుగా ఆలోచించాలి. అయితే ఈ శిక్షణ ఫలితాలు ఇచ్చిందా లేదా అనేదాన్ని నిర్ధారించడానికి, ఒక అంచనాకు రావడానికి అనేక అంశాలపై విశ్లేషణ అవసరం.

ఈ మొత్తం శిక్షణా కార్యక్రమానికి నిర్దిష్టమైన లక్ష్యం, ఎజెండా, ప్రయోజనం ఉంది. ముఖ్యంగా ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం; తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం; ప్రజలకు నాయకత్వానికి మధ్య తలెత్తే వైరుధ్యాన్ని తగ్గించడం; ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థ పనిచేయడానికి ఉండాల్సిన నిర్మాణం, విధులు, బాధ్యతలు; స్టాండింగ్ కమిటీ పోషించాల్సిన పాత్రపై అవగాహన; సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు; ఆర్థిక నిర్వహణ, వనరుల సమీకరణ, అభివృద్ధి పనులకు చేయాల్సిన ఖర్చు; ‘తెలంగాణకు హరితహారంకార్యక్రమం అమలు; గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు; కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జీవనోపాధి మిషన్ పర్యవేక్షణ; ఆర్థికాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర; సేంద్రియ వ్యవసాయ విధానాలపై అవగాహన, స్వయం సహాయక మహిళా బృందాల వ్యవస్థపై అవగాహన.. ఇలా అనేక అంశాలు ఈ మొత్తం శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మాత్రమే కాక ఎజెండాలోనే పెట్టుకుని లోతుగా అర్థం చేయించేలా రూపొందించుకున్న ప్రణాళిక.

No comments:

Post a Comment