Thursday, October 8, 2020

గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు .... శ్రీ మహాభాగవత కథ-59 : వనం జ్వాలా నరసింహారావు

 గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు

 శ్రీ మహాభాగవత కథ-59

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

గోపికా వస్త్రాపహరణం అనంతరం, వారు వచ్చి అడిగిన తరువాత వారి వస్త్రాలను వారికిచ్చి, గోపికలను అనుగ్రహించి, వ్రేపల్లెకు పంపించి, కృష్ణుడు ఆవులను తోలుకుని బృందావనానికి దూరంగా పోయి మేపసాగాడు. ఎండాకాలం కావడంతో గోప బాలురంతా, గొడుగుల్లాగా నీడనిస్తున్న వృక్షాలను ఆసరా చేసుకుని వాటి కింద నిలుచున్నారు.  అక్కడి నుండి అంతా కలిసి యమునానదికి వెళ్లారు. అక్కడ పెద్ద మడుగులో గోవులకు నీరు తాగించి, వారూ తాగి, నదీ తీరంలో పశువులను మేపారు. తమకు ఆకలిగా వుందని బాలకులంతా బలరామకృష్ణులకు చెప్పారు.

సమీపంలో, అదే వనంలో, వేదవేద్యులైన బ్రాహ్మణులు కొందరు స్వర్గానికి పోవాలని అంగిరసం అనే యజ్ఞం చేస్తున్నారని, వారి దగ్గరికి పోయి తమ పేరు చెప్పి అన్నం అడుగుతే పెట్తారని చెప్పాడు కృష్ణుడు. ఆయన చెప్పినట్లే వారు పోయి, బ్రాహ్మణులకు నమస్కారం చేసి, బలరామకృష్ణులు పంపగా వచ్చామని, తమకు ఆకలిగా వుంది అన్నం పెట్టమని కోరారు. తాము ఎవరికొరకైతే యజ్ఞం చేస్తున్నామో ఆ సర్వేశ్వరుడే వారిని పంపాడని ఊహించలేక, అజ్ఞానంతో ఆ బ్రాహ్మణులు, గోపబాలకులకు అన్నం లేదు పొమ్మని కఠినంగా చెప్పారు. వారంతా నిరాశతో తిరిగొచ్చి విషయాన్ని చెప్పారు కృష్ణుడికి. మళ్లీ పోయి, ఈ సారి బ్రాహ్మణుల భార్యలను తన పేరు చెప్పి అడగమని అన్నాడు కృష్ణుడు. వారు ఆయన చెప్పినట్లే బ్రాహ్మణుల భార్యలను అన్నం అడిగారు. వెంటనే బ్రాహ్మణ స్త్రీలు తొందర-తొందరగా ఆహారాన్ని పాత్రలలో నింపుకుని, భర్తలు అడ్డుపడుతున్నా వినకుండా, శ్రీకృష్ణుడి దగ్గరకు బయల్దేరారు.    

వెళ్లి నందనందనుడిని దర్శించుకున్నారు. భువనమోహనమైన వేషంలో వున్న శ్రీకృష్ణుడిని బ్రాహ్మణ కాంతలు కన్నుల కరవు తీరా చూశారు. హృదయంలోనే ఆ మహానుభావుడిని ఆలింగనం చేసుకున్నారు. వారిని చూసి నవ్వుతూ శ్రీకృష్ణుడు, కుశల ప్రశ్నలు వేశాడు. గృహస్తులైన వారి భర్తలు, భార్యలతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేయాల్సి ఉన్నందున, వారిని వెంటనే యజ్ఞశాలకు పొమ్మన్నాడు. అక్కడికి పోతే తమ భర్తలు శిక్షిస్తారని, తమను ఇక్కడే కృష్ణుడి దాసజనులుగా భావించి రక్షించమని వేడుకున్నారు బ్రాహ్మణ స్త్రీలు. వారి భర్తలు తన అనుగ్రహం వల్ల ఏమీ అనరని, పైగా మెచ్చుకుంటారని, దేవతలు కూడా వారిని మెచ్చుకుంటారని, తనను ధ్యానించినందున కర్మభంధకుములైన దేహాలను విడిచి తనలో ఐక్యం అవుతారని చెప్పి వారిని సమాధాన పరచాడు కృష్ణుడు.

ఇలా కృష్ణుడికి అన్నం తీసుకుని పోయి పెట్టి కృతార్థులైన తమ భార్యల సంగతి తెలుసుకుని బ్రాహ్మణులు తమ చంచలత్వానికి బాధపడ్డారు. తమలాగా హోమం, అధ్యయనం, తపం, జపం, వ్రతాలు చేయకపోయినా తమ భార్యలు హరి కృపకు పాత్రులయ్యారు కదా అనుకున్నారు. ఇలా అనుకుని, పశ్చాత్తాపంతో, శ్రీకృష్ణుడికి వారున్న చోటునుంచే మొక్కారు. కంసుడి భయం వల్ల కృష్ణ సందర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయారు.

ఇంతలో యమునా నదీతీరంలో వున్న కృష్ణుడి దగ్గరికి ఇంద్రయాగం చెయ్యాలని చెప్పడానికి నందుడు మొదలైన వారొచ్చారు. యాగం చెయ్యడానికి కారణం, దాని ఉద్దేశం ఏమిటో చెప్పమని వారిని అడిగాడు కృష్ణుడు. వర్షాదిపతైన ఇంద్రుడికి ప్రీతి కలిగించడానికి అందరూ చేస్తున్నట్లే మనంకూడా చేస్తే, ఇంద్రుడు సంతోషిస్తాడని, దానివల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, భూమిలో కసవు పెరిగి, వాటిని ఆవులు మేసి, పాడి-పంట పెరుగుతుందని వారన్నారు. జవాబుగా శ్రీకృష్ణుడు, సృష్టి-స్థితి-లయలు రజస్సు, సత్వం, తమస్సు అనే మూడు గుణాల వల్ల అవుతుందని, వాటిలో రజోగుణం వల్ల జగత్తు జన్మించి మేఘాలు వర్షిస్తాయని, ఆ వాన వల్ల ప్రజలు వర్దిల్లుతారని, ఇందులో ఇంద్రుడి ప్రమేయం ఏమీలేదని చెప్పాడు. ఇంద్రయాగం బదులు ఆవులకు, కొండలకు, బ్రాహ్మణులకు ప్రీతిగా యజ్ఞం చెయ్యడం మంచిదని అన్నాడు. ఆయన మాటలకు అంతా ఒప్పుకున్నారు. ఆయన చెప్పినట్లే చేశారు.

గొల్లలంతా కూడి గోవర్ధనగిరికి పూజానైవేద్యాలు సమర్పించారు. ఆటపాటలతో, ఆవులతో సహా గిరికి ప్రదక్షిణ చేశారు. అక్కడినుండి అంతా వ్రేపల్లెకు చేరారు. ఇదంతా తెలుసుకున్న ఇంద్రుడికి కోపం వచ్చింది. నవ మేఘాలను పిలిచాడు. కృష్ణుడి మాటలు మన్నించి గొల్లలు తనను వదిలేశారని, తన యాగం చెయ్యలేదని, కాబట్టి గొల్లలంతా మృత్యువును పొందే విధంగా రాళ్లవాన కురిపించాలని చెప్పాడు. వెంటనే దట్టంగా కారుచీకటి ఆక్రమించింది. వడగండ్ల, పిడుగుల సమూహంతో కురుస్తున్న వానవల్ల, ప్రళయ కాలంలోలాగా భూమంతా నీటితో నిండిపోయింది. కురుస్తున్న రాళ్లవానకు గోకులవాసులంతా పీడించబడ్డారు. తమను కాపాడమని అంతా కృష్ణుడికి మొరపెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఉరుముల, మెరుపుల, పిడుగుల, చప్పుళ్ల జలధారలు ఎరుగమన్నారు. ఇంద్రుడి గర్వం అణచాలని నిశ్చయించుకున్నాడు కృష్ణుడు.

కరుణార్ద్ర హృదయుడైన కృష్ణుడు విలాసంగా, అవలీలగా, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. దాన్ని ఒక గొడుగులాగా పట్టుకున్నాడు. అందరినీ, వారి ఆవుల గుంపుతో సహా, ఆ గొడుగు కిందికి రమ్మన్నాడు. ఆయన చెప్పినట్లే అంతా ఆ కొండ కిందికి చేరి, వినోదంగా గడిపారు. ఇదిలా వుండగా, ఇంద్రుడి ఆజ్ఞానుసారం, మేఘాలు ఏడు రాత్రులు, ఏడు పగళ్లు ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపించాయి. ఆ వానలో ఏమాత్రం తడవకుండా గొల్లలంతా గోవర్ధన పర్వతం కింద హాయిగా వున్నారు. ఇంద్రుడు విసిగిపోయాడు. మేఘాలను మళ్లించుకుని తన లోకానికి వెళ్లిపోయాడు. గోవర్ధన పర్వతం కింద వున్న వారందరినీ బయటకు రమ్మని చెప్పాడు కృష్ణుడు. వారంతా అలాగే చేశారు. అంతా కృష్ణుడిని మనసారా దీవించారు. తరువాత వ్రేపల్లెకు అందరితో కలిసి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు.

అహంకారాన్ని వీడిన ఇంద్రుడు కామదేనువును వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడిని సందర్శించాడు. ఆయన పాదాలమీద సాష్టాంగపడ్డాడు. ఆయనకు నమస్కరిస్తూ స్తోత్రం చేశాడు. తప్పు చేసిన తనను కరుణతో వీక్షించమని ప్రార్థించాడు. దానికి స్పందించిన కృష్ణుడు, ఇంద్రుడిని తన ఆజ్ఞానుసారం నడచుకోమని, కర్తవ్యపాలన చేయమని, గర్వం వద్దని చెప్పాడు. ఆ తరువాత దేవేంద్రుడు కృష్ణుడిని కామధేనువు పాలతో, దేవగంగ జలాలతో అభిషేకం చేసి, ‘గోవిందుడు’ అని పేరు పెట్టాడు.

ఆ తరువాత, ఒక ఏకాదశి నాడు నందుడు ఉపవాసం చేసి, ద్వాదశి పారణ కోసం అర్ధరాత్రి యమునా నదిలో స్నానం చేస్తుంటే, వరుణుడి దూత ఆయన్ను వరుణ పట్టణానికి ఎత్తుకు పోయాడు. ఆయన్ను తీసుకురావడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్లాడు. ఆయన్ను చూసిన వరుణుడు, తన భటుడు పొరపాటున నందుడిని తీసుకువచ్చాడని, తన అపరాధాన్ని సహించమని, మన్నించమని వేడుకున్నాడు. నందుడిని మర్యాదగా అప్పగించాడు. ఆయన్ను తీసుకుని శ్రీకృష్ణుడు వ్రేపల్లెకు తిరిగి వచ్చాడు.               

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment