Tuesday, October 13, 2020

కంసుడిని వధించి దేవకీవసుదేవులను చెరనుండి విడిపించిన శ్రీకృష్ణుడు .... శ్రీ మహాభాగవత కథ-64 : వనం జ్వాలా నరసింహారావు

 కంసుడిని వధించి దేవకీవసుదేవులను చెరనుండి విడిపించిన శ్రీకృష్ణుడు

 శ్రీ మహాభాగవత కథ-64

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

తనతో మథురా పట్టణానికి చేరుకున్న శ్రీకృష్ణుడిని తన ఇంటికి రమ్మని, వచ్చి ఆయన పాద ధూళితో తన ఇంటిని పావనం చెయ్యమని అక్రూరుడు వేడుకున్నాడు. ఇద్దరూ కలిసి ఎక్కి వచ్చిన రథాన్ని తీసుకుని పట్టణానికి వెళ్లమని అక్రూరుడికి చెప్పిన కృష్ణుడు, యాదవ వంశానికి శత్రువైన కంసుడిని వధించిన తరువాత ఆయన కోరినట్లు ఇంటికి వస్తానని అన్నాడు. అక్రూరుడు పట్టణానికి వెళ్లి కంసుడిని కలిసి, బలరామకృష్ణులు వచ్చారని చెప్పి మథురా పట్టణంలో ప్రవేశించాడు. ఆయన పుర ప్రవేశం చేస్తుంటే శ్రీకృష్ణుడిని సందర్శించేందుకు పురస్త్రీలంతా ఎక్కడి పని అక్కడే వదిలి బయల్దేరారు. శ్రీకృష్ణుడిని మక్కువతో చూశారు. ఆయన పసివాడుగా చేసిన లీలలను మననం చేసుకున్నారు. కృష్ణుడి రూపాన్ని కన్నులారా చూస్తూ, హృదయ కమలాలలో నిలుపుకుని పూలజల్లులు చల్లారు.

పట్టణంలోని బ్రాహ్మణులు పచ్చటి శుభాక్షతలు కానుకలుగా ఇచ్చి రామకృష్ణులను పూజించారు. పట్టణ ద్వారం నుండి తనకు ఎదురుగా వస్తున్న ఒక ధూర్తుడైన రజకుడిని చూసి శ్రీకృష్ణుడు, తాము రాజు అతిథులమని, తమకు ఆయన మూటలో వున్న చలువ వస్త్రాలను ఇవ్వమని అడిగాడు. ఆ వస్త్రాలు కట్టుకోవడానికి గోపాలురు తగరని, కంసుడి ఇంట్లో కృష్ణుడు రాజసం చూపడం ఏమిటని, హేళనగా జవాబిచ్చాడు రజకుడు. దీనికి కోపం తెచ్చుకున్న కృష్ణుడు వాడిని వధించాడు. వస్త్రాలను తీసుకుని అంతా కట్టుకుని బయ్లదేరారు. కాసేపటికి ఒక సాలెవాడు ఎదురుగా వచ్చి రామకృష్ణులను చూసి, కంటికి ఇంపుగా వున్న వస్త్రాభరణాలను సంతోషంగా ఇచ్చాడు. ప్రతిగా మాధవుడు, తన సారూప్యాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. ఆ తరువాత రామకృష్ణులు సుదాముడు అనే మాలాకారుడిఇంటికి వెళ్లారు. వచ్చిన వారిద్దరికీ సుదాముడు అర్ఘ్యపాద్యాదులు, పరిమళమైన పూల దండలు ఇచ్చాడు భక్తితో. కృష్ణుడు అతడికి బలం, ఆయువు, కీర్తి-సంపదలు సమృద్ధిగా కలిగేట్లు వరం ఇచ్చాడు.

అక్కడి నుండి కృష్ణుడు, బలరాముడు బయల్దేరి రాజవీథిలో సాగిపోయారు. తనకు ఎదురుగా వస్తున్న ఒక కుబ్జను చూశాడు. ఆమెది వంకర కలిగిన మరుగుజ్జు ఆకారం. ఆమె ఎవరిని అడిగాడు కృష్ణుడు. తాను కంసుడి పరిచారికనని, పేరు త్రివిక్ర అని, పరిశుద్ధమైన లేపనాలను కూర్చే విద్య తనకు వచ్చని, తనని మహారాజు చాలా మెచ్చుకుంటూడని, కావాలంటే వారు కూడా లేపనాలను పూసుకోవచ్చని జవాబిచ్చింది. ఇలా అని వాటిని ఇచ్చింది. అవి పూసుకుని ఆమెను కరుణించాడు తన స్పర్శతో. అప్పుడామె కుబ్జ రూపాన్ని వదిలి కోమలమైన దేహంతో చక్కటి రూపాన్ని దాల్చింది. తన ఇంటికి రమ్మని కృష్ణుడి ఉత్తరీయాన్ని పట్టి లాగింది. తను అనుకున్న పని పూర్తైన తరువాత వస్తానని మాటిచ్చాడు. అక్కడి నుండి కృష్ణుడు ధనుశ్శాలకు వెళ్లాడు బలరాముడితో. అక్కడ అసాధ్యమైన వింటిని చూసి, దానిని తాకవద్దని కావలివారు వారిస్తున్నప్పటికీ, కృష్ణుడు దాన్ని అవలీలగా ఎత్తి, అల్లెతాడు ఎక్కించి, అలక్ష్యంగా విరిచేశాడు. ఇలా మథురా పట్టణంలో విహరించి తమ విడిదికి పోయారంతా.

ఆ రాత్రి బలరామకృష్ణులు గొల్లవారితో కలిసి భోజనం చేసి, కంసుడి సంగతి తెలిసినవారు కాబట్టి అప్రమత్తంగా గడిపారు. వీరి విషయమంతా కంసుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నాడు. కంటికి కునుకు లేక కలవరపాటుతో వున్నాడు. దుశ్శకునాలు కనపడసాగాయి. విషం తిన్నట్లుగా, శవాన్ని కౌగలించుకున్నట్లుగా, దిగంబరుడైనట్లుగా, గాడిద మీద ఎక్కినట్లుగా కలగన్నాడు. నిద్ర సరిగ్గా పట్టక ఎప్పుడు తెల్లవారుతుందా అని గడియలు లెక్కపెట్టాడు.

ఇంతలో సూర్యోదయం అయ్యేసరికి చల్లటి గాలి వీచింది. మల్లయుద్ధానికి కంసుడు చెప్పిన విధంగా రంగం సిద్ధమైంది. దాని సమీపంలో ఉన్నతాసనం మీద కంసుడు కూర్చుని, శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడోనని, ఎప్పుడు చంపుతాడోనని భయంతో తపించిపోయాడు. అప్పుడు అక్కడికి వచ్చిన నందుడు మొదలైన గొల్లలు తాము తెచ్చిన కానుకలను రాజైన కంసుడి దగ్గరికి తీసుకునిపోయి, ఇచ్చి, తమకు కేటాయించిన ఆసనాలమీద కూచున్నారు. కాసేపటికి బలరామకృష్ణులు మల్లరంగ స్థల ద్వారం దగ్గరికి ప్రవేశించారు. అక్కడే కువలయాపీడము అనే ఏనుగును చూశారు. దాన్ని వెనక్కు తిప్పి తీసుకుపొమ్మని, లేకపోతే దాన్ని వదిస్తానని మావటి వాడికి చెప్పాడు. వాడు వినకుండా కృష్ణుడి మీదికి పురికొల్పాడు. దాని మీదికి లంఘించిన కృష్ణుడు కాసేపట్లోనే దాని మదాన్ని అణిచాడు. అది అలిసిపోయేట్లు బాధించాడు. అది స్మృతి తప్పి కదలలేక మెదలలేక పడిపోయింది. చివరకు కృష్ణుడు దాని ప్రాణాలను తీసేశాడు.

కువలయాపీడాన్ని కృష్ణుడు చంపడంతో కంసుడు చాలా భయపడ్డాడు. పురజనులంతా బలరామకృష్ణులను పొగడసాగారు. అప్పుడు చాణూరుడు కాసేపు మల్ల యుద్ధం చేద్దామా? అని అడిగాడు కృష్ణుడిని. తాను అతడితో పోరాడుతానని, తన అన్న బలరాముడు ముష్టికుడితో పోరాడుతాడని చెప్పాడు. చాణూరుడు, కృష్ణుడు మధ్య మల్ల యుద్ధం మొదలైంది. మరోవైపు బలరాముడు, ముష్టికుడు మధ్య యుద్ధం మొదలైంది. ఏనుగు ఏనుగును, సింహం సింహాన్ని తలపడ్డట్లు పోరాడారు. చాణూరుడు చివరకు శ్రీకృష్ణుడికి లోబడ్డాడు. నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. కంసుడి మనస్సు మరింత కలత చెందింది. అటు బలరాముడు ముష్టికుడిని వధించాడు. చాణూర, ముష్టికుల బంధువులందరినీ సంహరించారు ఇద్దరు.

ఇదంతా గమనిస్తున్న కంసుడు పిచ్చెత్తిన వాడిలాగా అరుస్తూ, గోపబాలురను నగరం నుండి వెళ్లగొట్టమని, వసుదేవుడిని చంపమని, అరవసాగాడు. కంసుడిని చంపాలనుకున్న కృష్ణుడు అతడున్న మంచె మీదికి ఎగిరాడు. అది చూసి కంసుడు ఖడ్గాన్ని చేతపట్టాడు. శ్రీకృష్ణుడు కంసుడి జుట్టు పట్టుకుని కింద పడదోశాడు. అతడు ఎలాంటి ప్రతిఘటన లేకుండా మరణించాడు. విరోధంతోనైనా ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తుండే కంసుడు తేజోరూపంలో కృష్ణుడిలో ప్రవేశించాడు. ఆ తరువాత ఎదురు తిరిగిన కంసుడి సోదరులను సంహరించాదు కృష్ణుడు. ఏడుస్తున్న కంసుడి భార్యలను ఓదార్చి, చనిపోయినవారికి ఉత్తరక్రియలు చేయించాడు కృష్ణుడు. తల్లిదండ్రులైన దేవకీవసుదేవులను చెర నుండి విడిపించాడు. అన్నతో కలిసి వారికి నమస్కరించాడు.  

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment