Friday, October 16, 2020

సముద్రం మధ్యలో ద్వారక నిర్మాణం, ముచుకుందుడి కథ ..... శ్రీ మహాభాగవత కథ-67 : వనం జ్వాలా నరసింహారావు

 సముద్రం మధ్యలో ద్వారక నిర్మాణం, ముచుకుందుడి కథ   

 శ్రీ మహాభాగవత కథ-67

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

జరాసంధుడిని యుద్ధంలో ఓడించి, విజయులై, మథురా నగరంలో ప్రవేశించిన బలరామకృష్ణులు యుద్ధ విశేషాలను ఉగ్రసేనుడికి వివరించారు. ఇదిలా వుండగా, తన అపజయానికి ఆగ్రహించిన జరాసంధుడు, కొంతకాలం తరువాత, తన అనుకూలురైన దుష్ట స్వభావ రాజులందరినీ కలుపుకుని, పదిహేను అక్షౌహిణుల సైన్యంతో మథురా పట్టణం మీద మళ్లీ దండయాత్ర చేశాడు. అలా పదిహేడు పర్యాయాలు దండెత్తిరావడం, పరాజయం పాలుకావడం జరిగింది. మళ్లీ పద్దెనిమిదో సారి యుద్ధానికి రావడానికి ప్రయత్నించాడు.

ఈ నేపధ్యంలో నారదుడు కాలయవనుడి దగ్గరికి వెళ్లి అతడిని రెచ్చకొడుతూ, యాదవకుల వీరుడైన శ్రీకృష్ణుడి మీదికి పురికొల్పాడు. వెంటనే గర్వం అతిశయించిన కాలయవనుడు, తన బాణాలతో యాదవ వీరుడిని కాల్చి బూడిద చేస్తానని అన్నాడు. ఇలా నారదుడికి చెప్పి మూడు కోట్ల మ్లేచ్చ వీరులతో యుద్ధానికి బయల్దేరి మథురా పట్టణం మీద సైన్యాన్ని దించాడు.

కాలయవనుడు, జరాసంధుడు ఒకేసారి యుద్ధానికి వస్తే ఇరుపక్కలా పోరాడడం భావ్యం కాదని ఆలోచించిన కృష్ణుడు, శత్రు దుర్భేద్యమైన ఒక దుర్గాన్ని ఏర్పరచి అందులో తనవారందరినీ సురక్షితంగా వుంచాలని నిర్ణయించాడు. ఇలా ఆలోచించి, సముద్రుడిని అడిగి, సముద్రం మధ్యలో పన్నెండు యోజనాల పొడవు, అంతే వెడల్పు కల దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. అక్కడ అద్భుతమైన ఒక నగరాన్ని నిర్మించమని దేవశిల్పి అయిన విశ్వకర్మను పురమాయించాడు. వరుణపురం, ఇంద్రనగరం, కుబేరపురి, యదుపురి, బ్రహ్మలోకాల పట్టణాలకంటే గొప్ప పట్టణాన్ని విశ్వకర్మ నిర్మించాడు. పట్టణం మొత్తం సర్వాంగ సుందరంగా, శోభాయమానంగా, అంగరంగ వైభోగంగా, ఉద్యాన వనాలతో, వృక్షాలతో, సరస్సులతో, సకల సౌకర్యాలతో అలరారుతున్నది. విశ్వకర్మ నిర్మితమైన ఆ ద్వారకా పట్టణానికి, మథురా పురంలోని జనులందరినీ తన యోగ ప్రభావంతో చేర్చాడు కృష్ణుడు. ఆ తరువాత కాలయవనుడి మీదికి యుద్ధానికి బయల్దేరాడు.

నిరాయుధుడై వస్తున్న శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు కాలయవనుడు. ఆయుధాలు లేని అతడిని తన సైనికులకు చూపించాడు. ఇన్నాళ్లూ యుద్ధానికి ఎవరూ రాకుండా ఈరోజున ఒక్కడే నిరాయుధుడై వస్తున్నాడేమిటా అని నివ్వెరపోయాడు కాలయవనుడు. కృష్ణుడు అప్పుడు కాలయవనుడికి అభిముఖంగా నడిచాడు. నారద మహాముని తనకు వర్ణించి చెప్పిన యదువీరుడు ఇతడేనని నిర్ధారించుకున్నాడు కాలయవనుడు. తనకెదురుగుగా వస్తున్న కృష్ణుడిని పట్టుకోవాలని కాలయవనుడు అశ్వాన్ని అధిరోహించి కృష్ణుడిని సమీపించాడు. అలా వస్తున్న కాలయవనుడికి చిక్కకుండా కృష్ణుడు పరుగెత్తసాగాడు. కృష్ణుడు ఎక్కడికి పరుగెత్తినా పట్టుకుంటానని వెంటబడ్డాడు కాలయవనుడు.

కాలయవనుడికి చిక్కకుండా పరుగెత్తుతున్న కృష్ణుడు వాడిని ముప్పు తిప్పలు పెట్టాడు. అడవులు, కొండలు దాటిపోయాడు. అలా చాలా దూరం తీసుకునిపోయి ఒక కొండగుహలో ప్రవేశించాడు. కృష్ణుడి వెంట కాలయవనుడు కూడా గుహలోకి పోయాడు. అక్కడ గురకలు పెట్టి నిద్రపోతున్న ఒక మహాపురుషుడిని చూసి అతడే శ్రీకృష్ణుడు అనుకున్నాడు. తన పాదంతో అతడిని తన్నాడు. తక్షణమే మహాపురుషుడు మేల్కొన్నాడు. నాలుగు దిక్కులు చూశాడు. కోపంతో ఎదురుగా వున్న కాలయవనుడిని కాల్చి బూడిద చేశాడు.

కాలయవనుడిని కాల్చి బూడిద చేసిన మహాపురుషుడి పేరు ముచుకుందుడు. పూర్వం అతడో రాజు. అతడలా గుహలోకి వచ్చి పండుకుని నిద్రపోవడానికి పూర్వ వృత్తాంతం కొంత వున్నది. ఇక్ష్వాకు వంశంలోని మాంధాత మహారాజు కొడుకు ముచుకుందుడు. అతడు దేవతలకు ఎప్పుడూ అండగా వున్నందువల్ల, అతడిని ఏదన్నా వరం కోరుకొమ్మని దేవతలు అడగగా, మోక్షం ప్రసాదించమని అన్నాడు. అది తప్ప తక్కినవి ఏవైనా తాము ఇవ్వగలమని, మోక్షం ఇవ్వగలవాడు ఈశ్వరుడైన శ్రీహరి ఒక్కడే అని చెప్పారు దేవతలు. అప్పుడు ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దాంతో పాటు తనకు నిద్రా భంగం కలిగించిన వారిని భస్మం చేయగల శక్తిని కూడా ప్రసాదించమని కోరాడు. దేవతలతడికి ఆ వరాలు ఇవ్వగా పర్వత గుహలోకి వచ్చి నిద్రపోసాగాడు. నిద్రా భంగం చేసిన కాలయవనుడిని భస్మం చేశాడు. చేసి, కృష్ణుడి ముందు నిలిచాడు. అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆయనెవరని కృష్ణుడిని అడిగాడు.

దుష్టులను సంహరించడానికి శ్రీహరినైన తాను వసుదేవుడికి, వాసుదేవుడనే పేరుతో పుట్టాననీ, కంసుడనే రాక్షసుడిని చంపాననీ, ఇంకా చాలా మందిని చంపాలనీ, ఇప్పుడు ఆయన భస్మం చేసింది కాలయవనుడనే రాక్షసుడనీ చెప్పాడు శ్రీకృష్ణుడు. తన ఎదురుగా వున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని గ్రహించి, ఆయన్ను స్తుతించాడు. తనను కాపాడమని, మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. పూర్వజన్మలో ముచుకుందుడు చేసిన పాపకర్మ దోషాలను పోగొట్టుకోవాలని, మరికొంతకాలం రాజ్య పాలన చెయ్యమనీ, మరు జన్మలో బ్రాహ్మణ శ్రేష్టుడిగా పుట్టి తదనంతరం తనను చేరుతాడనీ చెప్పాడు కృష్ణుడు. శ్రీహరి చెప్పినట్లే చేశాడు ముచుకుందుడు. శ్రీమహావిష్ణువు మీదనే మనస్సు నిలిపి, బదరికాశ్రమానికి పోయి, హరిని ఆరాధించాడు. మోక్షాన్ని పొందాడు.

కృష్ణుడు ఆ తరువాత తిరిగి మథురా నగరానికి వచ్చాడు. అప్పుడే 23 అక్షౌహిణుల సైన్యంతో జరాసంధుడు మథురానగరం మీదికి దండెత్తి వచ్చాడు. వ్యూహాత్మకంగా బలరామకృష్ణులు జరాసంధుడి సేనను చూసి పరుగెత్తసాగారు. అది చూసి వారిని పరిహసించాడు జరాసంధుడు. చాలా దూరం పరుగెత్తిన బలరామకృష్ణులు ప్రవర్షణమనే గిరిని అధిరోహించారు. ఆ కొండ చుట్టూ సేనను మొహరించి, కొండకు నిప్పు పెట్టించాడు జరాసంధుడు. బలరామకృష్ణులు జరాసంధుడిని మభ్యపెట్టి, తమ లీలతో ఎవరికీ కనపడకుండా, శత్రుసేనలను మోసపుచ్చి, ద్వారకా పట్టణానికి చేరుకున్నారు. వారిద్దరూ మంటల్లో దగ్ధమైనారని భావించిన జరాసంధుడు తన సేనలతో మగధ దేశానికి వెళ్లిపోయాడు.                             

            (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment