Wednesday, October 28, 2020

తీర్థయాత్రలకు వెళ్లిన బలరాముడు ..... శ్రీ మహాభాగవత కథ-79 : వనం జ్వాలా నరసింహారావు

 తీర్థయాత్రలకు వెళ్లిన బలరాముడు

శ్రీ మహాభాగవత కథ-79

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

కౌరవ, పాండవులకు మధ్య ఘోర సంగ్రామం జరగబోతోందన్న విషయాన్ని గ్రహించిన బలరాముడు, వారిద్దరూ ఆయనకు సమాన బంధువులే కాబట్టి, ఎవరి పక్షం వహించకుండా వుండడానికి, తీర్థయాత్రలకు బయల్దేరాడు. ముందుగా ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అక్కడి పవిత్ర జలాలలో స్నానం చేశాడు. ఆ తరువాత వరుసగా, సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాల, సరయూ, యమునా, గంగానది మొదలైన పుణ్య తీర్థాలను దర్శించాడు. తదనంతరం నైమిశారణ్యం చేరాడు. అక్కడ మునులు ‘దీర్ఘసత్త్రమ’ నే యజ్ఞాన్ని చేస్తున్నారు. బలరాముడు అక్కడికి వెళ్లినప్పుడు ఒక్క సూతుడు తప్ప, మిగతా మునులంతా లేచి గౌరవపూర్వకంగా ఆయనకు నమస్కరించారు.

సూతుడి చర్య బలదేవుడికి ఆగ్రహం తెప్పించింది. తన చేతిలో వున్న దర్భతో పొడిచి సూతుడిని చంపాడు. అది చూసిన మహర్షులంతా హాహాకారాలు చేస్తూ, బలరాముడితో, సూతుడు లేవకపోవడానికి కారణం చెప్పారు. దీర్ఘ సత్త్రయాగంలో మునులమంతా సూతుడికి ‘బ్రహ్మాసనం ఇచ్చి సత్కరించామని, ఆ కారణాన బలరాముడు వచ్చినప్పటికీ సూతుడు ఉన్నతాసనం దిగలేదని, భగవత్స్వరూపుడైన బలరాముడికి ఇది తెలియని విషయమా? అని అన్నారు. బలరాముడు తెలిసీతెలియక పూనుకున్న బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిదన్నారు. తన అజ్ఞానం వల్లే ఇలా జరిగిందని, దీనికి ప్రత్యామ్నాయంగా తన యోగమాయా ప్రభావంతో సూతుడిని మళ్లీ బతికిస్తానని అంటూ, సూతుడిని బతికిస్తాడు.

తానింకా ఏమన్నా చేయాల్నా అని మునులను అడిగాడు. ఇల్వలుడనే రాక్షసుడి కుమారుడైన పల్వలుడు తాము చేస్తున్న పుణ్యకార్యాలను అడ్డుకుని విధ్వంసం చేస్తున్నాడని, వాడిని సంహరించమని కోరారు మునులు. ఆ తరువాత, భారతదేశంలోని సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే సమస్త పాపాలు వైదొలగి పోతాయని చెప్పారు మునులు బలరాముడికి. ఇంతలో పర్వదినం రావడం, మహర్షులంతా యజ్ఞం చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. వెంటనే రాక్షసుడు రంగంలోకి దిగి యజ్ఞవాటికలో రక్తమాంసాలను, మలమూత్రాలను కురిపించాడు. పెద్ద-పెద్ద రాళ్లను ఆకాశం నుండి పడేశాడు. భయంకరంగా కనిపిస్తున్న పల్వాసురుడిని బలరాముడు చూశాడు.

పల్వలుడు కూడా బలరాముడిని చూసి, తన చేతిలోని గదను గిరగిరా తిప్పుతూ ఆయనమీదికి వచ్చాడు. వెంటనే తన హలాయుధాన్ని, రోకలిని తనవద్దకు రమ్మని బలరాముడు తలచుకున్నాడు. నాగలితో బలారాముడు పల్వలుడి కంఠాన్ని బిగించి, రోకలితో వాడి నెత్తిమీద బలంగా బాదాడు. తక్షణమే పల్వాసురుడు మరణించాడు. మునులంతా బలరాముడిని స్తుతించారు. మునులంతా ఆ తరువాత బలరాముడికి వీడ్కోలు పలికారు. అక్కడినుండి కౌశికి అనే నది దగ్గరికి చేరాడు బలరాముడు. అక్కడ స్నానం చేసి, సరయూ నదికి చేరాడు. తరువాత ప్రయాగకు వెళ్లి, త్రివేణీసంగమంలో మునిగి పితృదేవతలకు తర్పణలు ఇచ్చాడు. తరువాత పులస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. గోమతీనదిని చూసి, గండకీనదిని దాటి, విపాశ నదిలో, శోణా నదిలో స్నానం చేశాడు. అక్కడి నుండి గయకు వెళ్లాడు. గయలోని ఫల్గుణీ నదిలో స్నానం చేసి, కొంచెం దూరం ప్రయాణం చేసి గంగాసాగర సంగమాన్ని దర్శించాడు. తరువాత మహేంద్రగిరికి వెళ్లాడు.

మహేంద్రగిరిపైన వున్న పరశురాముడిని సందర్శించాడు. అక్కడి నుండి బయల్దేరి సప్త గోదావరిలో స్నానం చేసి, కృష్ణా నదిని, పంపా సరస్సును సందర్శించాడు. తరువాత భీమానదికి వెళ్లి, అక్కడ కుమారస్వామికి మొక్కాడు. తరువాత శ్రీశైలం వెళ్లాడు. వేంకటాచలమైన తిరుమలను దర్శించాడు. కామాక్షీదేవిని సందర్శించాడు. కాంచీపురం చూశాడు. కావేరీనదీ దగ్గరికి పోయాడు. అక్కడ స్నానం చేసి, నది మధ్యలో వేంచేసి వున్న శ్రీరంగనాథుడిని సేవించాడు. శ్రీరంగం నుండి బయల్దేరి, వృషభాద్రినెక్కి విష్ణు సందర్శనం చేసుకున్నాడు. తరువాత మథురకు వెళ్లాడు. అక్కడి నుండి సేతుబంధనం వున్న రామేశ్వరం చేరాడు. రామేశ్వరుడిని పూజించి తామ్రపర్ణీ నదికి వెళ్లాడు. మలయాచలమెక్కి అగస్త్యుడిని చూసి మొక్కాడు. అక్కడి నుండి దక్షిణ సముద్రం దాకా వెళ్లాడు. కన్యాకుమారికి వెళ్లి దుర్గాదేవిని అర్చించాడు. పంచాప్సర తీర్థంలో స్నానం చేశాడు. గోకర్ణంలోని మహేశ్వరుడిని దర్శించాడు.

ద్వీపవతిలో బలరాముడు కామదేవిని, తాపిలో వున్న పయోష్ణిని సందర్శించాడు. తరువాత వింధ్య పర్వతం దాటాడు. దండకావనంలో తిరిగాడు. మాహిష్మతీ పురంలో వున్నాడు కొంతకాలం. తరువాత మను తీర్థంలో స్నానం చేశాడు. మళ్లీ తిరిగి ప్రభాస తీర్తానికి వచ్చాడు.

అక్కడున్న మునులు, కౌరవపాండవ సంగ్రామంలో, రాజులంతా పరలోక గతులయ్యారని చెప్పారు. ఆ సమయంలో భీమ దుర్యోధన గదా యుద్ధం జరగబోతున్నదని చెప్పారు. ఆ యుద్ధం ఆపుచేద్దామని వెళ్లి యుద్ధ కాంక్షతో గదలను చేతపట్టుకున్న భీమదుర్యోధనులను చూశాడు. యుద్ధం ఆపడం ఉభయులకూ శ్రేయస్కరమని చెప్పాడు. ఆయన మాటలు వారు వినలేదు. ఇరువురూ యుద్ధం చేయడం మానలేదు. ఇక అక్కడ వుండడం అనవసరమనుకుని ద్వారకానగారానికి పోయి కొంతకాలం పాటు అక్కడే వున్నాడు.

బలరాముడు తిరిగి నైమిశారణ్యం వెళ్లాడు.  అక్కడి మహర్షుల అంగీకారంతో చక్కటి యజ్ఞం చేశాడు. ఆ తరువాత ద్వారకానగరానికి వెళ్లి సుఖంగా వున్నాడు.             

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment